13 ఆగస్టు 2011

పాప ఇచ్చిన ఆకాశం

గదిలో నేను ఎప్పటి నాతోనే కాలం గడుపుతున్నపుడు
గుమ్మంలోంచి మా అమ్మాయి మబ్బుతునకలా లోనికి వచ్చి
'నాన్నా, ఆకాశం వెళ్ళిపోతోంది చూడు' అంది.

బైటికి వచ్చి చూస్తే
సూర్యకాంతిలో స్వచ్ఛనీలంగా మెరుస్తున్న ఆకాశంలో
తేలికపాటి మబ్బు తునకలు
బడి వదిలిన పిల్లల్లా వేగంగా వెళిపోతున్నాయి

ఇన్ని సంవత్సరాలుగా
నా లోపల కదలకుండా ఉన్న ఆకాశాన్ని
కొన్ని క్షణాలు చలింపచేసి
నాకు ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది మా అమ్మాయి

ఏదీ నిలబడకపోవటం వెనుక ఎంత సంతోషం దాగి వుందీ

'ఆకాశం ఎక్కడికీ వెళ్ళదమ్మా, మబ్బులు వెళతాయి' అని
పాపతో చెప్పాలనుకొన్నాను
కానీ కదిలే ఆకాశాన్ని నాకు ఇచ్చిన ఆమెకి
కదలని ఆకాశాన్ని ఎలా ఇవ్వను

నిజంగా ఆకాశం ఎప్పుడూ వెళ్లిపోతూనే ఉందేమో
నాకు మాత్రం ఏం తెలుసు