18 ఆగస్టు 2011

పిల్లల లోకం

ఏ లోకం నుంచి వస్తారో ఈ పిల్లలు
ఈ కొత్త ప్రపంచాన్ని తేరిపార చూస్తారు

అక్కడ వాళ్ళు సంగీతంలో సంభాషిస్తారేమో
మన ఎదగని భాషని వాళ్ళ సంగీతంలోకి అనువదించుకొంటారు

వాళ్ళ లోకంలో జీవించటమంటే నర్తించటమేమో
ఇక్కడకూడా అల్లరి లయబద్దంగా చేస్తారు

మొక్కలూ, పిల్లలూ కలిసి ఆడుకొనే లోకమేమో అది
ఇక్కడ నవ్వుతారా, నిద్రిస్తారా, ఏడుస్తారా
అన్నీ పూలు పూస్తున్నట్టో, రాలుతున్నట్టో ఉంటాయి
తాము చేసేవి తమకు తెలీదు మొక్కలకు లాగే

ఏ లోకమో ఈ పిల్లలది
అక్కడ కాలం వుండివుండదు
ఆనందం తరువాత ఆనందమే కాని క్షణాల లెక్క తెలీదు

వాళ్ళ కలలూ, జ్ఞాపకాలూ
నీటి మీది బుడగలలా  ఎటో కొట్టుకుపోయినా పట్టించుకోరు

పిల్లలకి పుట్టామని తెలీదు, చనిపోతారని తెలీదు
అవి లేని లోకం నుండి వచ్చారేమో, అవి వాళ్లకి అర్ధం కావు

శరీరాలు అక్కర్లేని ఏ లోకం నుండి వచ్చారో ఇక్కడ దోబూచి ఆడతారు
అదృశ్యమయ్యే  లోకాలు మనకు అందవు కదా
కళ్ళు తెరిచి ఫకాలున నవ్వుతారు

పిల్లలకి చీకటి భయం, నిశ్శబ్దం భయం
అవి లేని కాంతి నించి వచ్చి ఉంటారు, శబ్దం నించి వచ్చి ఉంటారు

పిల్లలు తపతపా అడుగులేస్తూ మన లోకం లోకి నడుస్తూ ఉంటారు
వాళ్ళ అడుగులలో చివరిసారి ప్రతిఫలిస్తూ ఆ లోకపు సౌందర్యం అదృశ్యమౌతుంది

వాళ్ళ చేతులు పట్టుకొని నడక నేర్పుతామా
ఎపుడైనా వాళ్లిటు రావటం మాని
మననే అటు తీసుకుపొతే బాగుండునని ఎదురుచూస్తాము

1 కామెంట్‌:

  1. నా కవిత్వం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు నాయుడు గారూ, జగతి గారూ, మల్లి గారూ, మధురవాణి గారూ, విరిబోణి గారూ, జాన్ గారూ.

    రిప్లయితొలగించండి