03 ఆగస్టు 2012

దినచర్య


ఉదయం తూర్పుగుమ్మం తలుపులు తెరవగానే
అప్పటివరకూ గుమ్మంతెరపై ఆడుకొంటున్న కాంతిదేవతలగుంపు 
గదిలోకి ప్రవేశిస్తుంది
ఈ వెలుతురు ఉత్తవెలుతురు కాదనుకొంటాను
ఇది గదిలోని చీకటితోపాటు, నా లోపలి దిగులునీ మాయం చేస్తుంది

పసినవ్వులాంటి స్వచ్ఛమైన వెలుతురు
నక్షత్రాల కాంతివంటి లోతైన వెలుతురు
చొరవగల స్నేహితుడిలా
నాలోంచి నన్ను బయటికిలాగి ప్రపంచంలోకి తోసేస్తుంది

అప్పుడు ప్రపంచంనిండా పరుచుకొన్న జీవితోత్సవానికి
నా కళ్ళు విశాలంగా తెరుచుకొంటాయి
నవ్వుతానో, గాయపడతానో, నవ్విస్తానో, గాయపరుస్తానో
నా పాత్ర నేను పోషిస్తాను

నా నమ్మకాలూ, ఉద్వేగాలూ
పగలంతా నన్నొక తొలుబొమ్మను చేసి ఆడిస్తాయి

దినాంతాన
ముఖంమీద పరుచుకొన్న ప్రియురాలి వస్త్రంలాంటి వెలుతురు
ఏ గాలీ వీయకుండానే ఎటో ఎగిరిపోతుంది

దిగులులాంటి చీకటి 
తన విశాలబాహువులు చాపి నన్ను తన హృదయానికి హత్తుకొంటుంది
అనాదికాలంలో పాతుకుపోయిన జీవితేచ్ఛ ఏదో 
నన్ను ఊహల కొమ్మలతో నిండిన వృక్షంలా నిలబెడుతుంది

ఇవాళ సంపాదించుకొన్న సుఖదు:ఖాలు
వలస పక్షులలా నాలోపల చేరి కాసేపు రణగొణధ్వని చేస్తాయి
నాలోపలి పక్షుల సందడి ప్రాచీన నిశ్శబ్దంలో కరిగిపోయాక
రేపు మళ్ళీ కొత్తగా వచ్చేందుకు, ఈ రాత్రిలోకి మాయమౌతాను