15 ఆగస్టు 2013

జ్ఞానం అకస్మాత్తుగా సంభవిస్తుంది

' There can be progress in the preparation (sadhana). Realization is sudden. The fruit ripens slowly, but falls suddenly and without return. ' ~ Sri Nisargadatta Maharaj
' సాధనలో పరిణామక్రమం ఉండవచ్చును కాని, జ్ఞానం (మెలకువ) అకస్మాత్తుగా సంభవిస్తుంది. ఫలం నెమ్మదిగా పక్వమవుతుంది, కానీ, రాలిపోవటం ఒకేసారి జరుగుతుంది..' ~ శ్రీ నిసర్గదత్త 

జె. కృష్ణమూర్తి వంటి ఆధునిక తాత్వికులు 'సత్యం దారి లేనిది' (Truth is pathless) అంటారు. ఆయన సత్యాన్ని గురించి వివరించే మాటలన్నీ ఇట్లాగే ఉంటాయి. దానిని 'ప్రయత్నం లేని మెలకువ' (Effortless awareness) అంటారు మరొకసారి. సాంప్రదాయకమైన అన్వేషణను కొత్త మాటలలో, మరింత సూటి అయిన మాటలలో పరిచయం చేసిన రమణమహర్షి, నిసర్గదత్త వంటివారు సాధన అవసరమే అని చెబుతారు. ఈ రెండు వాదాలకూ సమన్వయం పై మాటలలో కనిపిస్తుంది. 

సత్యాన్ని మేధ (intellect) సరాసరి తెలుసుకోలేదు. కానీ, కలని ఉపమానంగా తీసుకొంటే, దానిని అర్థం చేసుకోవటం కొంత తేలిక అవుతుంది. కలలోని వ్యక్తితో 'ఇది కల, మెలకువ అనే వేరొక స్థితి ఉంది' ఎంతగా చెప్పినా, అతను 'ఆ మెలకువని' కలలో భాగంగానే తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు కాని, అది కలకి అతీతమైన వేరొక స్థితి (plane) అనీ, జీవితంలో అది వేరొక కోణం (another dimension of life) అనీ తెలుసుకోలేడు. అట్లాగే, కృష్ణమూర్తి బోధించిన సరాసరి మార్గం (లేదా మార్గం కాని మార్గం) కూడా మానసిక జాగృతి లేనివారికి గందరగోళం గానే తోస్తుంది. 

అన్వేషకుల మానసికస్థితి పట్ల అవగాహన ఉన్న జ్ఞానులు, వాళ్ళని ముందుగా మనస్సు శుభ్రం చేసుకొమ్మని చెబుతారు. దయ, నిజాయితీ, నిరంతర సత్యాసత్య వివేచనల వలన మనస్సు రాగద్వేషాల నుండి క్రమంగా విముక్తి పొందినపుడు, ఆ మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. అట్లాంటి లోతైన, గాఢమైన ప్రశాంతత పొందిన మనస్సు విషయాలను స్పష్టంగా చూడగలుతుంది. ఆ చూపుతో 'ఇది కలా, నిజమా' అని పరిశీలిస్తే అకస్మాత్తుగా మెలకువ కలిగి, అంతకు పూర్వపు అనుభవమంతా కలగా అర్థమవుతుంది.

నా చుట్టూ ఉన్న ప్రపంచం ఇంత దు:ఖంలో ఉంటే, నేను మేలుకొనే ప్రయత్నం చేయటం అనవసరం, అన్యాయం అని సాధారణంగా చాలామంది తలపోస్తారు. కానీ, నిజమైన అనుకంపన ఉన్నవారు, పరిష్కారాన్ని అన్వేషిస్తారు కాని, దు:ఖితులతో పాటు తామూ కూర్చుని దు:ఖించరు. రోగి బాధపడుతున్నపుడు, వైద్యుడు దాని నివారణ గురించి శ్రద్ధగా పరిశీలిస్తాడు కాని, రోగితోపాటే తానూ ఆందోళన పడుతూ కూర్చోడు. కుటుంబం కష్టాలలో ఉంటే బాధ్యత కల యువకుడు ప్రశాంతచిత్తాన్ని సాధించి విద్యాభ్యాసం చేసి, ఉత్తీర్ణుడై తన కుటుంబానికి ఆర్ధికమైన ఆసరాగా మారతాడు కాని, వాళ్ళతో పాటే తానూ ఆందోళన చెందుతూ కూర్చోడు. అట్లాగే లోకంలోని దు:ఖం పట్ల నిజమైన అనుకంపన ఉన్నవారు, దాని నివారణ గురించి లోతుగా, తీవ్రంగా ఆలోచిస్తారు కాని, లోకంలోని దు:ఖితులతో తామూ దు:ఖిస్తూ కూర్చోరు. బుద్ధుడు కానీ, జీసస్ కానీ, అనేకమంది ఋషులూ, జ్ఞానులూ కాని లోకంలోని దు:ఖం పట్ల ఎంత అనుకంపన లేకుంటే, వాళ్ళు తీవ్రమైన సాధన చేసి దాని నివారణోపాయాలని కనుగొని, బోధించారు. 

ఒక జ్ఞాని ఉండటమే ప్రపంచానికి దీవెన అని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ ప్రపంచం మాత్రమే తెలిసిన సాధారణ విజ్ఞాని, సాధారణ నాయకుడూ ఈ ప్రపంచానికి ఎంతో చేయగలిగినప్పుడు, ఈ సృష్టి వలయాన్ని దాటిన జ్ఞాని వలన ఎంత మేలు జరుగుతుంది. అతని శక్తి వలన, ఎన్ని దు:ఖాలు మన అనుభవంలోకి రాకుండానే మాయమవుతున్నాయో ఊహకి అందదు.

మూఢత్వం కేవలం తర్క రహితమైన నమ్మకాలలో మాత్రమే ఉండదు. తర్కాన్ని మాత్రమే నమ్మటంలోనూ ఉంటుంది. ఉత్త నమ్మకాలకీ, ఉత్త తర్కానికీ అతీతంగా మనలో మరింత సున్నితమైన జీవ రసాయన చర్యలు ఎన్నో ఉన్నాయి. అవి సరాసరి హృదయం నుండి పనిచేస్తాయి. హృదయం అనేది సమాచారాన్ని సేకరించి, ఉపయోగించుకొనే మెదడు కన్నా, రాగద్వేషాలతో చలించే మనస్సు కన్నా లోతైనది. మనిషిలో నిజమైన, స్వచ్చమైన సంవేదన మొదలయ్యే చోటు. 'నేను ఉన్నాను' అనే స్మృతి నిర్మలంగా, నిరంతరంగా వెలిగేచోటు. (దీనినే బైబిల్ లో I am that I am అని చెబుతారని రమణమహర్షి అంటారు) అక్కడినుండి చూసినపుడు అంతకుముందు ఎరుకలేని అనేక విషయాలు వెలుగుచూస్తాయి. దానిలోకి మనం ప్రవేశించినపుడు, దానిని మనలో వికసించనిచ్చినపుడు, ఇప్పటికన్నా అనేక రెట్లు వివేకంగా, నాగరికంగా, దయగా మానవ జాతి రూపు దిద్దుకొంటుంది.

1 కామెంట్‌: