17 ఆగస్టు 2013

ఆ చిరునవ్వు ఒక ఆశ్చర్యం..

I was kissed from inside and that totally devastated me in the most beautiful way. I couldn't carry on with my life the way it was before. It just started to change and it is still changing, but something inside remains unchanging. I found what is not changing and also what is changing therefore, I can enjoy now. This is what causes a smile to happen that is not just with my lips. It happens with my whole being. Joy is that smile. ~ Mooji

ఎవరో.. నన్ను నాలోపలి నుండి ముద్దుపెట్టుకొన్నారు. అది నన్ను ఎంతో అందమైన పద్దతిలో పూర్తిగా నశింపచేసింది. ఇక, నేను మునుపు గడిపినట్లు జీవితాన్ని గడపలేకపోయాను. ఆ ముద్దు నాలో ఒక మార్పుని ప్రారంభించింది, ఇంకా మార్చుతూనే ఉంది. కానీ, లోలోపల ఒకటి ఏ మార్పూ లేకుండా నిలిచివుంది. మార్పు చెందుతున్నదానినీ, మార్పు లేనిదానినీ కూడా నేను కనుగొన్నాను, ఆనందిస్తున్నాను. అదే ఈ చిరునవ్వుకి కారణం. ఈ చిరునవ్వు కేవలం పెదవులనుండి  కాదు, నా మొత్తం ఉనికి నుండి.. ~ మూజీ

నిజంగా అలాంటి స్థితి ఒకటి ఉందా. ఉంటే అంతకుమించి సాధించవలసింది లేదా పొందవలసింది, పొంది పంచిపెట్టవలసింది ఇక ఏమైనా ఉంటుందా. పసిపిల్లలలో కనిపించే కారణంలేని ఆనందం, వాళ్ళ ఉనికి మొత్తం నుండి పొంగిపొరలే జీవశక్తి, ఉత్సాహం.. గతంలేదన్నట్టు, భవితలేదన్నట్టు, ఈ క్షణమే ఎప్పటికీ ఉన్నట్టు.. చరిత్రల్నీ, కలల్నీ చిరునవ్వుతో విసిరేసి.. ఇదిగో ఇప్పుడే, ఇక్కడే కావలసినంత కాంతిని పట్టుకువెళ్ళు.. చీకటా ఏం చీకటి.. స్మృతులా, గాయాలా, వెలితా, దిగులా, భయమా, కోపమా.. ఏమిటవన్నీ.. ఎందుకు మోస్తావు.. ఏమీ లేవు, ఏమీ లేవు.. ఈ క్షణంలో సూర్యుడు వెలుగుతున్నట్టు, దినాంతాన చీకటి వెలుగుతున్నట్టు, ఒకటే వెలుగు.. ఒకటే సంతోషం, ఒకటే శ్వాస, ఒకటే నిట్టూర్పు.. ఒకటే మార్పు.. మార్పుల్లో కూరుకుపోయి బాధపడటం కాదు, మార్పే ఒక ఆనందంగా తేలిపోవటం.. మారని ఆనందాన్నుండి మార్పుని చూడటం.. రుతువులుమారే భూమిని కాంతి మారని సూర్యుడు చూస్తూ ఉన్నట్టు.. ఇంతాచేసి దేశాలని జయించాలా, జ్ఞానమో, సంపదో పోగుచెయ్యాలా, ఎవరికో నిన్ను రుజువు చేసుకోవాలా.. కీర్తిని యాచించే దుర్బలుడివై బేలమొహంతో సంచరించాలా.. ఒక అతిపదునైన ఎరుకలోకి, ఒక అతిసున్నితమైన స్పర్శ లోకి కాస్త జాగ్రత్తగా వెళ్ళగలిగితే చాలు.. జ్ఞానులు చెప్పినట్టు.. పసిపిల్లలు కాగలిగితే చాలు.. స్వర్గం తెరుచుకొంటుంది.. కానీ.. అనేకవేల.. కానీ.. లకి.. ఇవతలే మనం.. వాళ్ళని అనుమానంగా చూస్తూనో.. చూసి ఆశ్చర్యపోతూనో..

4 కామెంట్‌లు:

  1. (మునుపు = మునపటిలా అనొచ్చు అనుకుంటాను) జ్ఞానులు చెప్పినట్టు.. పసిపిల్లలు కాగలిగితే చాలు.. స్వర్గం తెరుచుకొంటుంది.. కానీ.. అనేకవేల.. కానీ.. లకి.. ఇవతలే మనం.. వాళ్ళని అనుమానంగా చూస్తూనో.. చూసి ఆశ్చర్యపోతూనో........బాగుంది నేను ఫేస్ బుక్ లో షేర్ కూడ చేసుకుంటున్నాను. ప్రసాద్ జీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాసేటపుడు మా ప్రాంతపు వ్యావహారిక పదాలు చొరబడకుండా ఎరుకతోనే ఉంటాను(అలా రాయటం తప్పని కాదు, చదివేటపుడు ఇతరప్రాంతాలవారికి ఇబ్బంది కలుగుతుందని), కాని,ఈ పదాన్ని గమనించుకోలేదు. :) వ్యాసం మీకు నచ్చినందుకూ, పంచుకొన్నందుకూ ధన్యవాదాలు రామ్ కుమార్ జీ!

      తొలగించండి