22 ఆగస్టు 2013

జీవితాన్ని ప్రేమించినపుడు..

'నచ్చినట్లు జీవించాలంటే జీవితం పట్ల అపారమైన ప్రేమ ఉండాలి..' పేస్ బుక్ మిత్రులు వనజ తాతినేని గారు రాసిన ఈ మాటలు చదవగానే చాలా సంతోషం కలిగింది. ఎందుకనీ సంతోషం అని పరిశీలించుకొంటే జీవితం అనేమాట తలచగానే స్పురించే జీవితపు విశాలత్వమూ, లోతూ, ఆ పదం సూచించే సంపూర్ణత్వమూ మనస్సుని వికసింపచెయ్యటం ఒక కారణమైతే, జీవితం పట్ల అపారమైన ప్రేమ ఉన్నపుడు మాత్రమే మనం unconditional గా, బంధనరహితంగా, నచ్చినట్లుగా ఉండగలం అనే ఎరుక కలగటం మరొక కారణం. ఏమరుపాటున చదివితే ఒక మామూలు కోట్ లా కనిపించే ఈ వాక్యాన్ని గురించి నిదానించి ఆలోచిస్తే, అనేక విషయాలు తడుతున్నాయి.

మనం జీవితం లోపల జీవిస్తున్నాం కాని, జీవితాన్ని జీవిస్తున్నామా అనిపిస్తుంది. జీవితం లోపలి  అనేక విషయాలు అంటే వస్తువులు, పదార్ధాలు, అనుభవాలు, సమాచారం, వాటి పరిమాణం, పరిణామాలు., వాటిచుట్టూ మనస్సు అల్లిన ఇష్టాలు, అయిష్టాలు, భయాలు., ఆ మౌలిక స్పందనలు నిర్మించిన సిద్దాంతాలు, వ్యూహాలు, చిక్కుముడులు ఇవే కదా ప్రతి ఉదయమూ, ప్రతి రాత్రీ మనని ఆవరించుకొని ఉండేది. వీటన్నిటినీ దాటి, లేదా వీటన్నిటినీ ఒకటిగానే చూస్తూ జీవితం అనే విశాల అనుభవం ఒకటి ప్రవహించిపోతూ ఉంటుందని మనకు స్పృహ ఉందా.  మరణం తరువాత ఏ జీవితానుభవం ఉండదని ఊహిస్తామో, ఆ మొత్తం జీవితం పట్లమనం ఎరుకతో ఉంటున్నామా అనిపిస్తోంది. 

ఏ సాయంవేళలలోనో, ఏ సన్నిహితుల దగ్గరో హృదయాన్ని తెరిచి లోలోపలి వ్యాకులతల్ని పంచుకొని, భారరహితమయ్యే సమయాల్లో కలిగే ఈ ఎరుకకు, వత్తిడి నిండిన పనులతో, పరుగులతో, అపనమ్మకాలు నిండిన మానవ సంబంధాలతో తెలియకుండానే అందరమూ దూరమవుతూ ఉన్నాము ఇప్పుడు. 

మన విద్యా విధానమూ, విద్య పేరిట మనం నేర్చుకొనే సాంకేతిక నైపుణ్యమూ కూడా మనకు జీవితావసరాల గురించీ, అవసరాలు పెంచుకోవటం గురించీ బోధిస్తున్నాయే కాని జీవితాన్ని జీవితంగా నిసర్గంగా అనుభవించడం గురించి ఏమీ నేర్పడంలేదు కదా అని విచారం కలుగుతోంది.

మేలుకొన్నాక, గదిలోంచి బయటకు వచ్చి తలయెత్తి చూస్తే కనిపించే విశాలమైన ఆకాశమూ, దాని నిండా పొర్లిపోతున్న సూర్యకాంతీ, తీరికగా సంచరించే చల్లనిగాలులూ, భూమిమీది సమస్తాన్నీ సరికొత్తగా మళ్ళీ కొలిచి చూస్తున్న లేతకిరణాలూ, కిరణాలతో వెచ్చదనం నింపుకొంటున్న భూమీ, దానిమీది ప్రాణులూ, మానవుల కలలూ వీటన్నిటినీ గమనిస్తూ, మరొకరోజు జీవితాన్ని గడిపే అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా, సృష్టి పట్ల ప్రార్ధనతో, మనస్సు నిండా చైతన్యం నింపుకొని కార్యోన్ముఖులం కాగలుగుతున్నామా, లేదా నిన్నటి బరువునీ, చిక్కుల్నీ మళ్ళీ తలకెత్తుకొంటూ, అణిచిపెట్టుకొన్న విసుగుతోనే జీవననదీ ప్రవేశం చేస్తున్నామా. గాయాలతో, వెలితితో  నిండిన మన జీవితాలని చూసినప్పుడల్లా జీవితం ఒక విశాలమైన అనుభవం కాకపోవటానికి కారణాలేమిటని దు:ఖం కలుగుతూ ఉంటుంది.

ఎందరో ఆలోచనాపరులు చెప్పిన, చెబుతున్న కారణాలన్నీ ఒకవైపు  ఉంటే, నిజంగా మనకంటూ జీవితం పట్ల అవ్యాజమైన ప్రేమ లేకపోవటం మరొకవైపు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని చూసే మన చూపు మరికాస్త విశాలమైతే, ప్రపంచాన్ని తాకే మన చేతులు మరికాస్త మృదువుగా ఉంటే, మరికాస్త లోతులోకి మన జీవితానుభవమూ, మరికాస్త వివేకంలోకి మన ఆలోచనా ప్రయాణిస్తే.. జీవితాల్లోని దు:ఖాన్ని మరింత వేగంగా నివారించుకోగలమేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది.

4 కామెంట్‌లు:

  1. 'నచ్చినట్లు' అనే మాట ఆమోదయోగ్యం అవ్వడానికి ఎన్నో పరిమితులకి లోబడింది

    ఉదాహరణకి : నాకు నచ్చింది వేరొకరికి ఇబ్బంది కలిగించకూడదు అన్నది ఒక పరిమితి, అది తెలిసుండడం ఒక పరిణతి ... ఇలా ఆలోచించే కొద్ది పరిమితుల జాబితా పెరుగుతుంది

    అందుకే పరిమితులకి లొంగిన ఈ అనుభూతి అయినా వ్యతిరేకతని జనియింప చేస్తుంది కాకపోతే పెర్సెంటేజ్లు తేడా అన్నది నా అభిప్రాయం ...

    మీరు విసదీకరించిన విధానం చాల బాగుంది ....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సాగర్ గారూ.. మీరన్నది నిజమే. ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. ఇతరులవల్ల ఇబ్బందిపడుతూ కూడా ఆగిపోకూడదు. ఈ సున్నితమైన సమస్య ఎప్పుడూ ఎదురౌతూనే ఉంటుంది. ఇక్కడ 'నచ్చినట్లు' అన్నపుడు, ఆ పదం సూచించే పాజిటివ్ సైడ్ గురించే ఆలోచించాను. మీ స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. "గాయాలతో, వెలితితో నిండిన మన జీవితాలని చూసినప్పుడల్లా జీవితం ఒక విశాలమైన అనుభవం కాకపోవటానికి కారణాలేమిటని దు:ఖం కలుగుతూ ఉంటుంది"
    ఇది నిజం. మీ అంతర్లోచనతో హృద్యంగా అక్షర రూపంలోకి మారిన ఈ పోస్ట్ చాలా చాలా నచ్చింది

    అవును, మన చూపు విశాలం కావాలి ఇంకా సున్నితత్వం పెంచుకోవాలి,మరింత లోతుగా ఆలోచించుకుంటూ వివేకంతో మెలగాలి అప్పుడే జీవితపుటంచులలో జీవం తొణికిసలాడుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు వనజగారూ..

      తొలగించండి