17 జులై 2014

పిల్లలూ క్షమించండి..

పిల్లలూ మమ్మల్ని క్షమించండి

భూమి నుండి వేర్లని వేరు చేసి
మొక్కని మహావృక్షం కమ్మని శాసించినట్టు
జీవనానందం నుండి మీ చూపు తప్పించి
మిమ్మల్ని గొప్పవ్యక్తులు కమ్మని దీవిస్తాం

జీవితమంటే
హృదయం నుండి హృదయానికి
ఆశ్చర్యం నుండి ఆశ్చర్యానికి
కాలం నుండి కాలంలేని చోటుకి వెళ్ళటమని
ఎవరో చెబితే ఇక్కడికి వచ్చారు కాని

జీవితమంటే
అందరికన్నా ముందుండటమనే అగ్నిలోకి దూకటమని
చనిపోయే వరకూ రేపటిలోనే బ్రతకటమని
మాయావస్తుసముదాయాల మధ్య దారితప్పి తిరగటమని
మీ కోమల హృదయాల్లో జీవరసం ఎండిపోయే వరకూ నేర్పి
మీ చూపుల్ని కాగితాలకి ఊడిరాకుండా అతికించి మరీ
యోగ్యతాపత్రాలు బహూకరిస్తాము

పిల్లలూ మమ్మల్ని క్షమించండి

చదువంటే చూడటమనీ, ప్రశ్నించటమనీ, ఊహించటమనీ
చదువంటే ఆటలనీ, పాటలనీ,
పంచుకోవటంలోని పరమానందాన్ని తెలుసుకోవటనీ  
చదువంటే తల్లి మెడను కౌగలించుకొన్నట్టు
జీవితాన్ని కౌగలించుకోవటమెలానో నేర్చుకోవటమనీ
మీలోలోపలి జీవితేచ్చ మీతో గుసగుసలాడి వుండొచ్చుకానీ

చదువంటే తడినేలని ఎడారి చేసి విత్తనాలు నాటడమని,
బెరడై కలకాలం  బతకాలి కాని,
పూలై, పళ్ళై రసమయలోకాల్లోకి పరుగుపెట్టకూడదని
మీకు పట్టిన సంతోషాన్ని మార్కులతో వదిలించి మరీ నేర్పుతాము

పిల్లలూ మమ్మల్ని క్షమించకండి

మీలోంచి దయా, తృప్తీ, రసమూ వడకట్టి
మిమ్మల్ని ఘనపదార్ధంగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతగా 

మీరు డబ్బు యంత్రాలు కండి 
బహుళజాతి విపణివీధుల బానిసలై తరించండి
కాఠిన్యం నిండిన ప్రేమలతో కాలం గడపండి
మమ్మల్ని వృద్దాశ్రమాలకి కానుక చేసి వదిలించుకోండి