04 ఆగస్టు 2014

చూస్తున్నామా

సముద్రతీరంలోని ఇసుకలా  వజ్రాలు దొరుకుతుంటే
భూమి అరుదుగా కాసిని పూలని మాత్రం స్వప్నిస్తూ వుంటే
మనుషుల్లోని రసాత్మకత మరొకలా వ్యక్తమయేది

ఏడాదికి ఒకసారే సూర్యకమలం వికసిస్తే
జన్మకి ఒకరాత్రే ఆకాశం నక్షత్రఖచితమై మెరిస్తే
మానవహృదయాలు అరుదుగానైనా సౌందర్యంతో భాసిల్లేవి

జీవితానికి దయవుంది గనుకనే
నీ చుట్టూ ఇంత అందం, ఆనందం పరిచి
చిరునవ్వుతో నిన్ను సృజించి విడిచింది ఈ సృష్టిలో

దయగలతల్లికి పుట్టిన యోగ్యతలేని బిడ్డలా
నీ ఆట కోసం చుట్టుకొన్న ఊహల వృత్తాలలో చిక్కి
విప్పారే ఆకాశంకింద నిలిచి కూడా ఊపిరాడట్లేదని దు:ఖిస్తావు  

పొందవలసిందేమీలేదు, పోవలసిందెంతో వుందని
కవి పాటపాడుతూ వెళ్ళిపోతాడు
కొందరికి వలయాలు చిట్లి తేలికపడతారు
మరికొందరు మరిన్ని ప్రశ్నల్లోకి దిగులుపడతారు

అప్పుడు, గాలిదేహంతో తల్లి వాళ్ళని కౌగలించుకొని
నుదుటిపైన ముద్దుపెట్టుకొన్నట్టు నిద్రపుచ్చుతుంది

_____________________
ప్రచురణ: కవితా మే-జూన్ 2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి