25 జూన్ 2014

సంకెళ్ళు

ఈ సంకెళ్ళని తెంచుకోవాలని ప్రయత్నించావు చాలాసార్లు

కుదురుగా బ్రతికితే వదులౌతాయని చూసావు
అవి కూడా కుదురుగా వున్నాయి కాని, వదులుకాలేదు

మర్యాదల సరిహద్దులు దాటి విదిలించుకొని చూసావు
చర్మం చిట్లింది కాని, వీలు కాలేదు

దయగల స్త్రీ ఎవరైనా మృదువుగా తొలగిస్తుందనుకొన్నావు
ఇనుపసంకెళ్ళు లతలయ్యాయి కాని, వీడిపోలేదు

కవుల లోకాల్లోకి చేతులుచాపి మాయం చేయాలనుకొన్నావు
ఊహల మంచు విడిపోగానే అవి మరింత మెరిసాయి

జ్ఞానుల స్వేచ్చాగీతాలని అనుసరించి సంకెళ్ళే లేవని ధ్యానించావు
ధ్యానం లోంచి భూమ్మీదికి రాగానే అవి మరింత బరువయ్యాయి

సంకెళ్ళున్నాయి. తెంచుకొనే వేదన వుంది
బహుశా, వాటిని భరిస్తున్న నువ్వెవరో తెలుసుకొని తీరాలి

ఎదురుచూడని సమయంలో
ఊహకందని వైపు నుండి విచ్చుకొనే కిరణమేదో
ఉండీ, లేని  బహిరంగ రహస్యంలోకి నిన్ను తెరవాలి

____________________
ప్రచురణ: తెలుగు వన్ 24.6.14

22 జూన్ 2014

వానలోకం

ఊహించనిరోజున ప్రియమైనవ్యక్తి ఎవరో నీ గుమ్మంలో నిలబడినట్టు
ఈ వేసవి ఉదయం లేచేసరికి నీ ఇంటిచుట్టూ వానపంజరం

చెట్ల ఆకులమీద వాన, కొమ్మలమీద వాన, 
వాన నీటిమీద వాన, నీటిలోని ప్రతిబింబాలమీద వాన

వాననెమలి నీ ఇంటిచుట్టూ పురివిప్పి తిరుగుతున్నపుడు
నీ ఇల్లు అరణ్యంలో వున్నట్లూ
సరిహద్దులులేని మరోలోకంలోకి నువ్వు ప్రవాసం వెళ్ళినట్లూ వుంటుంది 

మూగవెలుతురులో మునిగిన ప్రపంచం ఇప్పుడు
ఆటలన్నీ కట్టిపెట్టి వానధ్యానంలోకి తనని కోల్పోతుంది కాసేపు 

జీవితమంటే నీ మనోలోకాల గోల కాదని
వెళ్ళిపోతున్న ఆకాశాన్ని కన్నార్పక చూడమనీ 
చెప్పీ, చెప్పీ విసుగు పుట్టినట్టు 
చల్లని చినుకై చరిచి నీకంటిన నల్లని కాలాన్ని కడుగుతుంది వాన

నువ్వు మనిషిలా రాకపోయి వుంటే వానవై పుట్టేవాడివనుకొంటాను
బహుశా, లోకపు ఏ కొలతలోనో నువ్వొక వానవయ్యే వుంటావు
లేకుంటే వాన కురిసినపుడల్లా 
నీకు దిగులు ముసురుకొన్న చల్లని సంతోషం ఎందుకు కలుగుతోంది 

__________________________ 

21 జూన్ 2014

తాకినపుడు

మాటలసందడిలో తటాలున ఆమెతో అంటావు
నీ నవ్వు కొండల్లో పరుగులుతీసే పలుచనిగాలిలా వుంటుందని
పలుచనిగాలీ, మాటల సెలయేరూ ఉన్నట్లుండి
చిత్రపటంలోని దృశ్యంలా ఆగిపోతాయి

కవీ, ఏం మనిషివి నువ్వు
ప్రపంచాన్ని మొరటుగా వర్ణించడం మాని
రహస్యంగా, రహస్యమంత సున్నితంగా ప్రేమించటం
ఎప్పటికి నేర్చుకొంటావని నిన్ను నువ్వు నిందించుకొంటావు

తాకితేనే కాని, పదాల్లోకి ఒంపితేనే కాని
నీ చుట్టూ వున్న అందాన్నీ, ఆనందాన్నీ
అనుభవించాననిపించదు నీకు

నిజానికి, వాటిని తాకకముందటి
వివశత్వ క్షణాల్లో మాత్రమే నువు జీవించి వుంటావు
తాకుతున్నపుడల్లా నిన్ను మరికాస్త కోల్పోతావు

పసిబిడ్డల పాలనవ్వులకన్నా సరళంగా
జీవితం తననితాను ప్రకటించుకొంటూనే వుంటుంది ప్రతిక్షణం

నీకో ముఖం వుందని అద్దంచెబితే తప్ప తెలుసుకోలేని నువ్వు
లోకంలోని ప్రతిబింబాల వెంట పరుగుపెడుతూ
జీవితాన్ని తెలుసుకోవాలని చూస్తావు

ఆమె కోల్పోయిన నవ్వుని మళ్ళీ ఆమెకి ఇవ్వగలవా

___________________
ప్రచురణ: సారంగ 12.6.2014

09 జూన్ 2014

ఇందుకేనా

1
నాలుగుగోడల మధ్య విసిరేసిన బంతిలా
ఇక్కడిక్కడే తిరుగుతాయి నీ ఊహలు
అదే ఉదయంలోకి మేలుకొంటూ, అదే రాత్రిలోకి నిద్రపోతూ
ఒక్కరోజునే వందేళ్ళు బ్రతికి వెళ్ళిపోతావు

ఇందుకేనా పుట్టింది, జీవితం ఇంత ఇరుకా అని
అడుగుతుంటావు కనబడ్డవాళ్ళందరినీ
ఒక్క మనిషిలాంటి వేలమనుషులు
ఒక్క జవాబైనా ఇవ్వకుండానే వెళ్ళిపోతుంటారు

ఈమాత్రానికి చీమైపుట్టినా సరిపోయేదికదా
పూవైపుట్టినా మరింత బావుండేదికదా అని
నిన్నునువ్వే నిలదీసుకొంటావు

2
రాలిపోతుంటాయి ఉదయాలూ, అస్తమయాలూ
రాలిపోతుంటాయి వెన్నెలలూ, నక్షత్రాలూ
రాలిపోతుంటాయి వానచినుకుల్లానో, ఎండుటాకుల్లానో
రుతువులూ, కోరికలూ, బాంధవ్యాలూ

జారిపోతున్న దిగులుదుప్పటిని ముఖమ్మీదికి లాక్కొంటూ
ఇందుకేనా పుట్టిందని
ఎవరిలోంచో ఎవరిలోకో అడుగుతూ వుంటావు నువ్వు

కాస్త శాంతీ, చిరునవ్వూ మినహా మరేమీ వద్దని
కాస్త ఊరటా, ధైర్యం కాక ఇంకేం కావాలని
ఊరికే సుడి తిరినట్టు నీలోనువ్వే తిరుగుతుంటావు

3
చీకటి ఆకాశంలో నల్లని మేఘంలా దు:ఖం చిక్కబడినపుడు
నీటిలోని సుడిగుండం లోతుల్లో నీరేమీ మిగలనపుడు
పీడకలలాంటి వెలితిలోకి నీ ప్రశ్న నిన్ను విసిరేసినపుడు
తటాలున ఉలికిపడి మేలుకొంటావు
జవాబు దొరకదు కానీ, ప్రశ్న మాయమౌతుంది

ఉదయాస్తమయాలూ, వెన్నెలలూ, రుతువులూ
దిగుళ్ళూ, ఊహలూ,  ప్రశ్నలూ అన్నిటికీ అర్థంవుందని,
అర్థాలకి అందని ఖాళీ ఆనందాన్ని
అవి ప్రకటిస్తూ, మాయమౌతూ వున్నాయని
నీలోపల మేలుకొన్న సిద్ధార్ధుడు చెప్పగా వింటావు 

__________________________
ప్రచురణ: ఆంధ్రజ్యోతి వివిధ 9.6.2014

07 జూన్ 2014

జీవితార్థం

అర్థం కావటం ఏమంత అవసరం 
అర్థం తెలియని ఆకాశానికీ
అర్థం తెలియని నీకూ మధ్య
కురిసీ కురవని మేఘాల్లా ఎగురుతుంటాయి
పదాలూ, వాటి అర్థాలూ

జీవితమంటే ఏమిటని 
నువు ప్రశ్నించుకొన్న ప్రతిసారీ
దిగులుమేఘాలమీద ఒక కొత్త జవాబు
ఇంద్రధనువులా మెరుస్తూనే వుంటుంది

కానీ, ఇదిగో దొరికిందని
ఇంద్రధనువుని తాకబోయే ప్రతిసారీ
నిరాశవంటి నీటితుంపరులు మినహా
ఏ రంగులూ నీ చేతికి అంటుకోవు

జీవితమంటే ఏమిటైతే ఏమిటి 
ఊరికే జీవించు 
నీ కళ్ళముందు ప్రవహిస్తున్న నదిలా
నీ కళ్ళముందు ఎదుగుతున్న చెట్టులా 
నీ కళ్ళముందు ఎగురుతున్న
ఉదయాల్లా, అస్తమయాల్లా, నక్షత్రాల్లా 

ఊరికే జీవిస్తూ వుండు
నెమ్మదిగా, మరికాస్త నెమ్మదిగా 
అర్థాల లోతుల్లోని నిశ్శబ్దమంత మృదువుగా
ఊరికే..

___________________
ప్రచురణ: వాకిలి జూన్ 2014