09 మార్చి 2015

నువ్వే ఇన్ని అయ్యావని..

నీ ప్రాణం కన్నా ఎక్కువని దు:ఖపడే స్త్రీ కూడా
నీ బలమైన ఊహ తప్ప నువ్వు కాలేవు
 
సాలెపురుగు తనలోంచి సృజించిన గూడులా 
ఆమె చుట్టూ నీలోంచి ఒక ఊహ అల్లుతావు 
నీ ఊహలా ఉండాలని ఆమెని నిర్బంధించటం మినహా
నీ ఊహపై మేనువాల్చి విశ్రాంతి కోరుకోవటం మినహా 
నీకు నిజంగా ప్రేమంటే తెలియదు 

శ్వాసల కెరటాల్లో పడిలేస్తూ జీవించే నువ్వు
కాస్త విశ్రాంతి కోరుకోవటం సహజమే కానీ
దానికోసం అలలనుండి ఉప్పెనల్లోకి దూకటమే ఆలోచించాలి

ఒకనాడు ప్రాణం కన్నా ఎక్కువైన ఊహలన్నీ
కొన్ని సూర్యాస్తమయాల తరువాత నీ ప్రాణానికి దూరంగా చరిస్తాయి 
ఒక కొత్త సూర్యోదయంలో మరలా నీకు నువ్వే మిగులుతావు 

గుర్తుందా.. రాత్రులు నల్లనిక్షేత్రంలో చల్లిన కాంతిబీజాలూ 
దినాంతాన సూర్యహస్తాలు ఆకాశపుకొనల అల్లిన స్వర్ణకాంతీ
ఓ సీతాకోక రెక్కల నిశ్శబ్దమూ, చిన్నిపూవుపై నీరెండ మునివ్రేళ్ళ సవ్వడీ
ఇలానే నీ ప్రాణాన్ని తమలోకి ఒంపుకొని నిన్ను ఖాళీ చెయ్యాలని చూసాయి 

కానీ, ఉద్వేగాలు సృజించిన ఊహలన్నీ 
నేలవాలిన ఆకాశంవంటి పొగమంచై కరిగిపోయాక
పూలరేకులపై నీటిబిందువుల చారికలా నీకు నువ్వే మిగిలావు

పోయేవన్నీపోగా మిగిలేదేమిటనే గణితం సరిగా అర్థమైనపుడు
అంకెలన్నీ సున్నాలోకి మరలిపోయినట్లు 
పోగొట్టుకొన్న ప్రాణాలన్నీ నీలోకే తిరిగి చేరతాయి 

నువ్వే ఇన్ని అయ్యావని, 
అయినా నువ్వు నువ్వుగానే మిగిలావనీ స్పష్టంగా తెలిసినపుడు
నువ్వు నీలోనే వాలుతావు.
నిర్మల స్ఫటికంవంటి విశ్రాంతి పొందుతావు


___________________________
ప్రచురణ: ఆంధ్రజ్యోతి వివిధ  9.3.2015

2 కామెంట్‌లు:

  1. Wow.."నీ బలమైన ఊహ తప్ప మరేమీ కాదు" అన్న చోటే చిక్కుపడిపోయానండీ...ఎన్ని ఆలోచనలు కలిగిస్తాయో మీ కవితలు..
    Thank you

    రిప్లయితొలగించండి