29 మే 2015

నివాళి

నువ్వు వచ్చావని గుర్తుపట్టినట్టు తలవూపింది ఆమె
ఈ లోకంలో చివరి నిముషాలలో చివరి విశ్రాంతిలో వుంది
ఏయే నవ్వుల వెనుక ఏయే విషాదాల్ని దాచవచ్చో
ఆమె ముఖంలో పలుమార్లు దర్శించావు జీవితం పొడవునా

ఆమె ఎంత అమాయకురాలో
ఆమెని గాయపరిచిన ఎవరెవరు ఎంత అమాయకులో
అందరినీ గాయపరుస్తున్న జీవితమెంత అమాయకమో
కాలం కన్నీటినదిపై నీ పడవప్రయాణంలో తెలుసుకొంటూనే వున్నావు  

రాత్రి ఒక నిశ్శబ్ద, ఏకాంత సమయంవెంట ఆమె స్వేచ్ఛపొందింది
పెళుసుబారిన జీవితాన్ని చిట్లించుకొని పక్షిలా ఎగిరిపోయింది

ఏమమ్మా, జీవితమంటే ఏమిటి, మృత్యువంటే ఏమిటి
జలజలా రాలుతున్న ఈ కన్నీళ్ళకి అర్థమేమిటి

(ఒక సమీపబంధువు స్మృతిలో)

5.10.2012

28 మే 2015

ఇతను

మానుషప్రపంచం మరీ అంత భయావహమైంది కాదని 
నీ కలలోని భూతమే నిన్ను మ్రింగబోయినట్లు
నువ్వు విలువిస్తే బ్రతికే సమూహం నిన్ను కమ్ముకొంటుందని 
సమూహాన్ని చెరిపేస్తూ నిన్ను గుర్తుచేయాలనే ఇతను మాట్లాడుతున్నాడు

నీదైన ఆకాశం కిందికి, సూర్యకాంతిలోకి, నీవైన గాలితెరల్లోకి, శ్వాసల్లోకి,
నీ చుట్టూ వాలుతూ, మాయమౌతున్న వెలుగునీడల రహస్యలిపుల్లోకి
నీవి కాని రణగొణధ్వనుల్లోంచి రహస్యంగా పిలుస్తున్న నీవైన నిశ్శబ్దాల్లోకి
నీ చూపు మళ్ళించాలని కొన్ని మాటలు ఎంచుకొని 
వాటిని సుతారంగా చెరుపుతూ నీ మౌనాన్ని నీకు పరిచయం చేస్తున్నాడు

ఏదో ఉందని తెలియటానికి నీలో ముందుగా మరేదో ఉండాల్సినట్లే
ఏదీ లేదని తెలియటానికి నీలో కాస్త ఖాళీ ఉంటే చాలునని
ఖాళీ ఉన్నచోటల్లా నదినిండినట్టు జీవితం నిండుతుందని

ఎప్పుడూ పాతదైన నిద్రలోంచి, ఎప్పటికీ కొత్తదైన మెలకువలోకి
మెలకువలాంటి పూలలోకి, గాలిలోకి, మౌనంలోకి, కాంతిలోకి
జీవితం పంపిన దూతలా పిలుస్తున్నాడు

22 మే 2015

కిటికీలోంచి చెట్లు

పనులన్నీ ప్రోగుపడి ఏంచేయాలో తోచని ఉక్కపోతలో 
ఉన్నట్లుండి, ఎన్నడూ తెరవని కిటికీ తెరిస్తే 
ఆకుపచ్చని చెట్లగుంపు బడిపిల్లల్లా కుదురుగా కళ్ళముందు వాలింది 

ఏమంత తొందర లోకమంతా తిరగాలని 
ఉత్సాహం చూసిందంతా అనుభవించాలని
ప్రతిక్షణమూ పవిత్రంగా వెలుగుతోందని
ప్రతిస్థలమూ స్వంత ఇల్లై పిలుస్తోందని గ్రహిస్తే 
ఇలా అల్లల్లాడవని, వెళ్ళే ప్రతి గాలికెరటాన్నీ 
ఆకుల అరచేతుల్తో లాలనగా నిమురుతూ చెబుతున్నాయి చెట్లు   

చెట్లని చూసినపుడల్లా నెమ్మది, మరికాస్త నెమ్మది అని 
నీతో కూడా చెబుతున్నట్లనిపిస్తుంది 
మీలా ఉండే వీలులేదు, చాలా పనివుంది మరి అనుకొంటూ
వడివడిగా నడుస్తావు జీవితమంతా 

కడపటి క్షణాల్లో చేయగలిగిందింకేమీ కానరాక 
మూసివున్న కిటికీ మరోమారు తెరిచినపుడు 
ఆకుపచ్చని జీవనగీతాన్ని అతిశాంతంగా ఆలపిస్తూ కనిపిస్తాయి

జీవితమంతా చేసిన పనులన్నీ కలిపి 
ఒక్క ఆకుపచ్చని ఆనందమైనా కాలేదనీ
మాటలన్నీ ఓ పసుపుపచ్చని పూవుగానైనా వికసించలేదనీ గ్రహిస్తావు 

అప్పుడా చెట్లు, 
నిదురనుండి మెలకువలోకి జారినంత సుతారంగా వీచే 
చిరుగాలి కెరటమొకటి విసురుతూ 
స్నేహితుడా, ఇపుడైనా కాస్త నెమ్మది
వెళ్ళిపోయేటపుడైనా ఈ పూవులా రాలగలవేమో చూడు అంటాయి


19.10.2014 మధ్యాహ్నం 12.04