10 డిసెంబర్ 2011

నేను చదివిన 'నేను తిరిగిన దారులు'


శ్రీ చినవీరభద్రుడు గారికి

నమస్తే

'నేను తిరిగిన దారులు' చదవటం పూర్తి చేసాను. ఇటీవలి చాలా సంవత్సరాలలో నేను విడవకుండా చదివిన పుస్తకం ఇది.

ఈ పుస్తకం అట్లా చదవటానికి గల కారణాలలో ముఖ్యమైనవి ఆయా ప్రదేశాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఒకటైతే, జీవితం పట్ల శ్రద్ధా, విస్తృతమైన అధ్యయనం, ఆర్ద్రత కోల్పోని వ్యక్తిత్వం, విశాల దృక్పధం గల ఒక వ్యక్తి ఆయా స్థల, కాలాలకు ఎట్లా స్పందించారో తెలుసుకోవాలనుకోవటం ఒకటి. ఈ రెండు ఆసక్తులనీ పుస్తకం తృప్తిపరిచింది.

పుస్తకం అంతటా నేపధ్యం గా పరుచుకొన్న మీ వ్యక్తిత్వమే, ఈ పుస్తకానికి ఎక్కువ విలువనిచ్చింది. పుస్తకం పొడవునా మీరు నడిచిన దారిలో ఒక విశ్వమానవుడిని దర్శించటం ఒక ప్రశాంతమైన సంతోషాన్ని కలిగించింది. మీ వాక్యాలలోని సంయమనం, నా వంటి పాఠకులకు, ఆలోచనలలో అట్లాంటి సంయమనాన్ని అలవరచుకోవటానికి ప్రేరణగా నిలుస్తుంది.

ఏ విశ్వాసాలనుండి సాహిత్య సృజన, కళా సృజన చేసినా అది చివరికి పాఠకుడికి మరింత ఉన్నత స్వభావం కలిగి ఉండటం వైపుగా ప్రేరణ కలిగించేది అయి ఉండాలని, నేను పూర్తిగా నమ్ముతాను. అటువంటి స్పష్టమైన నిబద్ధత గలవారు అరుదైన రోజులు మానవ ఇతిహాసం లో నిద్రాణ దినాలుగా భావిస్తాను.

సకల కళా రూపాలూ, ఆ మాటకు వస్తే నిత్య వ్యవహారాలతో సహా సకల మానవ అభివ్యక్తీ, మరింత ఉన్నతమైన మానవవిలువల సాధనా క్షేత్రంగా మనుషులు భావించగలిగితే, జయాపజయాలకన్నా, కీర్తికన్నా, సదా జ్వాలామయమయ్యే ఇంద్రియవాంఛల తృప్తి కన్నా, ఇట్లాంటి విలువలు మాత్రమే మానవులకు సదా పథనిర్దేశం చేసేవిగా ఉంటే జీవితానుభవం స్వర్గతుల్యమౌతుంది కదా అనిపిస్తుంది.
సకలాభివ్యక్తీ ఒకరి జ్ఞానాన్నీ, బలాన్నీ, బుద్ధికౌశల్యాన్నీ, ఉద్వేగపటిమనూ, ఊహాశక్తినీ వ్యక్తీకరించేది మాత్రమే కాకుండా, వాటి నేపధ్యం లో నిర్మల అంతఃకరణ సంగీతాన్ని, సజీవ హృదయస్పందననీ వినిపించేది కావాలని సదా కలగంటాను.

మనిషి, తనకు దేహాత్మ బుద్ధి వలన ఉత్పన్నమయ్యే అహంకారాన్ని ఉపేక్షించి, అతనికి అంతర్వాణి రూపంలో దృశ్యాతీత సత్యం వినిపించే పిలుపుని సదా అనుసరించగలిగితే జీవితానుభవం తేజోమయమౌతుంది గదా అనుకొంటూ ఉంటాను.

మరికొన్ని లక్షల సంవత్సరాలకు ఈ మానవ జీవన బీజం సంపూర్ణంగా వికసిస్తుందనుకొంటాను. ప్రాచీనులు అలాంటి కాలాన్నే సత్యయుగం అని ఉంటారు.

మరీ గాఢంగా మాట్లాడాను. మీ పుస్తకం ఏ భావాల నేపధ్యం నుండి చదివానో, ఆనందించానో మీతో పంచుకోవాలని ఈ మాటలు.

ప్రేమతో, గౌరవంతో

మీ
బివివి ప్రసాద్