29 మార్చి 2024

కవిత : పూల లోకి

1

పూవుల గురించి మాట్లాడుకొంటూ

నడుస్తున్నారు ఆ వృద్ద దంపతులు

కనిపించే మొక్కల పేర్లు

వాటి పూల కబుర్లు చెప్పుకొంటూ

గాలిపటాల్లా తేలుతున్నారు

ఈ లోకం గొడవ పట్టనట్టు

పూల రంగుల్లోకి, ఆకుపచ్చని సారంలోకి

మునకలేస్తూ వెళ్లిపోతున్నారు


2

ఎన్ని చూసి వుంటారు

కడగండ్లు పడి వుంటారు

ఎన్నిసార్లు ఓడి ఉంటారు 

ఒదిగి ఒదిగి చీకట్లు దాటి వుంటారు

చివరికిట్లా యుద్దాలు శమించిన ఒక ఉదయం

పూలలోకి కాసేపు తేలుతున్నారు 

బ్రతకటాన్ని తమకంగా హత్తుకొంటున్నారు


3

ఏ పసిదనాల్లో 

బడికెళుతూ పలకరించారో దారి పక్క పూలని

ఎన్ని ముళ్ళ తీగల మీదుగా

కాపాడుకొంటూ వచ్చారో వాటి జ్ఞాపకాలని

ఇన్నాళ్లకు చేరుకుంటున్నారు మళ్లీ

భార రహిత బాల్యాలలోకి

పచ్చని జీవితేచ్చలోకి

తమవైన ఏకాంత లోకాల్లోకి

సాంద్రమైన నిట్టూర్పు ల్లోకి..


8.9.23 4.26 PM

ప్రచురణ : ఉదయిని సాహిత్య పత్రిక 

25 మార్చి 2024

కవిత : అక్కడికి వెళుతూ..


1

ఎన్నో దుఃఖాలు ఈది, భయాలు దాటి

ఏళ్ళకి ఏళ్ళు నడిచి

ఈ ప్రశాంతమైన ఉదయానికి చేరుకున్నావు

ఈ క్షణం స్వచ్ఛ స్ఫటికంలా

నిలిచిపోతే బావుండును అనిపిస్తుందా

ఇక మెల్లగా మంచులా చెదురుతుంది ప్రశాంతత

2

ఈ బస్సు పైన ఆకాశం

అలసట లేక హాయిగా ఎగురుతూవుంది

కొండలు ఎప్పటిలా దయలోకి ముడుచుకొని

బంగారు ఎండ కాగుతున్నాయి

వాటి ముందు కదిలిన కలలన్నిటిలానే

నువూ మాయమౌతావు

3

నీ జ్ఞాపకాలు 

ఈ గాలిలోకి ఇంకా ఆవిరికాకుండా 

మిగిలిన అనుభవాల మేఘమాలలు

వాటిని వదిలేస్తే చాలు 

జీవితంలో మునిగిపోతావు

కానీ, జీవితమంటే ప్రేమా, కాదా

ఇప్పటికీ తేల్చుకోలేదు కదా

4

తెలీనిభాషలో మాటలు నీ ప్రక్కన

పిట్టల కూతల్లానే కేవలం శబ్దాలు

అర్థం తెలీని మాటలు

అర్థాల నుండి విముక్తినిస్తాయి కాసేపు

అర్థం లేకపోవటంలోకి ఎగరలేక కదా

ఇదంతా ఇంత బరువు

5

ఆ కొండని చూస్తే దేవుడిని చూసినట్టు

తిరిగితే తండ్రి చుట్టూ ఆడుకొంటున్నట్టు

సృజించుకొన్న బంధమో, ఉద్వేగమో కావచ్చు

కొండంత అద్దంలో నువ్వే కనబడటమూ కావచ్చు

ఏ కారణమూ లేదనుకున్నా 

దయలోకి కరిగిపోవటం కంటే ఏదీ అనుభవం

6

కారణాల్ని కూడా దాటాలి

ఈ బస్సు చెట్లనీ, కొండల్నీ దాటుతూ 

కనబడని మలుపులోకి పదేపదే మాయమైనట్టు

కనబడని ఆనందం లోకి 

తిరిగి రాకుండా తప్పిపోవాలి


(అరుణాచలం దారిలో..)

11.8.23 7.13 ఉదయం 

ప్రచురణ : 'వివిధ' ఆంధ్రజ్యోతి దినపత్రిక 12.2.2024