22 ఆగస్టు 2013

జీవితాన్ని ప్రేమించినపుడు..

'నచ్చినట్లు జీవించాలంటే జీవితం పట్ల అపారమైన ప్రేమ ఉండాలి..' పేస్ బుక్ మిత్రులు వనజ తాతినేని గారు రాసిన ఈ మాటలు చదవగానే చాలా సంతోషం కలిగింది. ఎందుకనీ సంతోషం అని పరిశీలించుకొంటే జీవితం అనేమాట తలచగానే స్పురించే జీవితపు విశాలత్వమూ, లోతూ, ఆ పదం సూచించే సంపూర్ణత్వమూ మనస్సుని వికసింపచెయ్యటం ఒక కారణమైతే, జీవితం పట్ల అపారమైన ప్రేమ ఉన్నపుడు మాత్రమే మనం unconditional గా, బంధనరహితంగా, నచ్చినట్లుగా ఉండగలం అనే ఎరుక కలగటం మరొక కారణం. ఏమరుపాటున చదివితే ఒక మామూలు కోట్ లా కనిపించే ఈ వాక్యాన్ని గురించి నిదానించి ఆలోచిస్తే, అనేక విషయాలు తడుతున్నాయి.

మనం జీవితం లోపల జీవిస్తున్నాం కాని, జీవితాన్ని జీవిస్తున్నామా అనిపిస్తుంది. జీవితం లోపలి  అనేక విషయాలు అంటే వస్తువులు, పదార్ధాలు, అనుభవాలు, సమాచారం, వాటి పరిమాణం, పరిణామాలు., వాటిచుట్టూ మనస్సు అల్లిన ఇష్టాలు, అయిష్టాలు, భయాలు., ఆ మౌలిక స్పందనలు నిర్మించిన సిద్దాంతాలు, వ్యూహాలు, చిక్కుముడులు ఇవే కదా ప్రతి ఉదయమూ, ప్రతి రాత్రీ మనని ఆవరించుకొని ఉండేది. వీటన్నిటినీ దాటి, లేదా వీటన్నిటినీ ఒకటిగానే చూస్తూ జీవితం అనే విశాల అనుభవం ఒకటి ప్రవహించిపోతూ ఉంటుందని మనకు స్పృహ ఉందా.  మరణం తరువాత ఏ జీవితానుభవం ఉండదని ఊహిస్తామో, ఆ మొత్తం జీవితం పట్లమనం ఎరుకతో ఉంటున్నామా అనిపిస్తోంది. 

ఏ సాయంవేళలలోనో, ఏ సన్నిహితుల దగ్గరో హృదయాన్ని తెరిచి లోలోపలి వ్యాకులతల్ని పంచుకొని, భారరహితమయ్యే సమయాల్లో కలిగే ఈ ఎరుకకు, వత్తిడి నిండిన పనులతో, పరుగులతో, అపనమ్మకాలు నిండిన మానవ సంబంధాలతో తెలియకుండానే అందరమూ దూరమవుతూ ఉన్నాము ఇప్పుడు. 

మన విద్యా విధానమూ, విద్య పేరిట మనం నేర్చుకొనే సాంకేతిక నైపుణ్యమూ కూడా మనకు జీవితావసరాల గురించీ, అవసరాలు పెంచుకోవటం గురించీ బోధిస్తున్నాయే కాని జీవితాన్ని జీవితంగా నిసర్గంగా అనుభవించడం గురించి ఏమీ నేర్పడంలేదు కదా అని విచారం కలుగుతోంది.

మేలుకొన్నాక, గదిలోంచి బయటకు వచ్చి తలయెత్తి చూస్తే కనిపించే విశాలమైన ఆకాశమూ, దాని నిండా పొర్లిపోతున్న సూర్యకాంతీ, తీరికగా సంచరించే చల్లనిగాలులూ, భూమిమీది సమస్తాన్నీ సరికొత్తగా మళ్ళీ కొలిచి చూస్తున్న లేతకిరణాలూ, కిరణాలతో వెచ్చదనం నింపుకొంటున్న భూమీ, దానిమీది ప్రాణులూ, మానవుల కలలూ వీటన్నిటినీ గమనిస్తూ, మరొకరోజు జీవితాన్ని గడిపే అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా, సృష్టి పట్ల ప్రార్ధనతో, మనస్సు నిండా చైతన్యం నింపుకొని కార్యోన్ముఖులం కాగలుగుతున్నామా, లేదా నిన్నటి బరువునీ, చిక్కుల్నీ మళ్ళీ తలకెత్తుకొంటూ, అణిచిపెట్టుకొన్న విసుగుతోనే జీవననదీ ప్రవేశం చేస్తున్నామా. గాయాలతో, వెలితితో  నిండిన మన జీవితాలని చూసినప్పుడల్లా జీవితం ఒక విశాలమైన అనుభవం కాకపోవటానికి కారణాలేమిటని దు:ఖం కలుగుతూ ఉంటుంది.

ఎందరో ఆలోచనాపరులు చెప్పిన, చెబుతున్న కారణాలన్నీ ఒకవైపు  ఉంటే, నిజంగా మనకంటూ జీవితం పట్ల అవ్యాజమైన ప్రేమ లేకపోవటం మరొకవైపు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని చూసే మన చూపు మరికాస్త విశాలమైతే, ప్రపంచాన్ని తాకే మన చేతులు మరికాస్త మృదువుగా ఉంటే, మరికాస్త లోతులోకి మన జీవితానుభవమూ, మరికాస్త వివేకంలోకి మన ఆలోచనా ప్రయాణిస్తే.. జీవితాల్లోని దు:ఖాన్ని మరింత వేగంగా నివారించుకోగలమేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది.

19 ఆగస్టు 2013

ఏకాంతం ద్వారా ప్రేమలోకి..

'ఏకాంతంగా ఉండటాన్ని నేర్చుకోవాలి, ఇష్టపడాలి. తన సాహచర్యాన్ని తానే ఇష్టపడటం కన్నా స్వేచ్చనిచ్చేదీ, శక్తినిచ్చేదీ ఏమీలేదు'  ~ మాండీ హేల్

ఏకాంతంగా ఉండటం. నేర్చుకోనంతవరకూ ఇంతకన్నా కష్టమైన పని వేరొకటి ఉంటుందా అనిపిస్తుంది. మనకి ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఎవరో ఒక మనిషితో ఉండటమో, ఏదో ఒక పనితో ఉండటమో కుదరకపోతే, లోపలినుండి భారమైన వస్తువేదో మనని అణచివేస్తూ ఉంటుంది. బోర్ కొడుతుంది, దిగులు ముసురుకొంటుంది, నిరుత్సాహంగా, బద్దకంగా ఉంటుంది. లోపల కందిరీగల్లా ఊహలూ, ఆలోచనలూ ముసురుకొంటాయి. భయాలూ, బెంగలూ మేలుకొంటాయి. కాలం సుడిగుండంలా కనిపిస్తుంది, తనలోనికి లాగేసుకొంటుంది. ఏ క్షణమూ ఊపిరాడనివ్వదు. నిస్పృహ కమ్ముకొంటుంది.

చుట్టూ ఉన్న జీవితోత్సవం నుండి వేరుపడిపోయినట్టు ఉంటుంది. తన లోపలి భయానకమైన వెలితి లోకి తొంగి చూడవలసిన అగత్యం కలుగుతుంది. ఇంతకన్నా ఏం చేసినా నయమే, నలుగురిమధ్యనా ఉండి వాళ్ళతో మాటలు పడ్డా నయమే, వాళ్ళవల్ల మోసపోయినా నయమే. చాతనైనదో, కానిదో ఏదో ఒక పని, మంచి చేసేదో, చెడు చేసేదో ఏదో ఒక పని చేయటం చాలా సులువు, ఈ లోపలి వెలితిని, భారాన్ని, అర్థంకానితనాన్ని మోయటంకన్నా, నువ్వు ఏమిటనే ప్రశ్నని ఎదుర్కోవటం కన్నా, నిద్రాణ, ఉన్మాద ప్రపంచంలో ఏదో ఒకలా తలదూర్చడం చాలా హాయి.

అరుదుగా, నిజంగా, ఒక మిణుగురులా, తటిల్లతలా నిజమైన సౌందర్యమో, ప్రేమో, తాదాత్మ్యతో సంభవించిన సందర్భాలు మినహా, కరుణ మనని నిలువెల్లా ముంచెత్తిన సమయాలు మినహా.. మనం సజీవంగా ఉండేదెక్కడ. మనం ఒక సాహసిలానో, సృజనాత్మకంగానో, పసివాళ్ళ లాగానో జీవిస్తున్నదెక్కడ. తమ నుండి తాము నిరంతరం పరుగుపెట్టే మనకి, మనలాగే తమనుండి తాము పారిపోయే మనుషులు కనబడ్డప్పుడల్లా చాలా ఊరటగా ఉంటుంది, ఒకరి సమక్షంలో ఒకరు తమ పిరికితనాలనీ, వెలితినీ దాచుకొంటూ, దాచుకోవటం వెనుక కనిపెట్టుకొంటూ కాలం ఒక వరద ప్రవాహంలా గడిపేసి వెళ్ళిపోవటం ఒక పరిచిన దారి. యుగాలుగా మానవ సంస్కృతుల వెనుక, చరిత్రల వెనుక దాగిన అనేక రహస్యాలలో ఒక ముఖ్యమైన రహస్యం ఈ బోర్ డం, ఈ వెలితి, తన నుండి తాను తప్పించుకోవటం.

ఈ ప్రపంచరహస్యాన్ని పూర్తిగా తెరుచుకొన్న కన్నులతో గ్రహించిన వాళ్ళు కొందరున్నారు, వాళ్ళు అంటారు.. నిన్ను నువ్వు ఎదుర్కో, నీతో నువ్వు స్నేహం చెయ్యి, నీ లోపలికి నువ్వు ప్రవేశించు. నిన్ను నువ్వు సంపూర్ణంగా ప్రేమించు. అప్పుడు ఒక అద్భుతం సంభవిస్తుంది.

నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీ స్వరూపం మాత్రమే అని తెలుస్తుంది. నీ తలమీద వాలిన సూర్యకాంతీ, నీ తలమీద ఆకాశాన్ని సృజిస్తూ ఎగిరేపిట్టా, నీ చుట్టూ ఉన్న మనుషులూ, వాళ్ళ దిగుళ్ళూ, భయాలూ, సంతోషాలూ, కలలూ అన్నీ నీవే అని అర్థమవుతుంది. అన్నిటినుండీ వ్యక్తమవుతున్నది నీ స్వరూపమే అని, అద్దంలో కనిపిస్తున్న మొహం అంత స్పష్టంగా తెలియవస్తుంది. అప్పుడు నీలోపల నిజమైన ప్రేమ ఉదయిస్తుంది. నేనూ, నువ్వులకీ, ఇవ్వటమూ, తీసుకోవటాలకీ అతీతంగా ఉన్న ప్రేమ.. వెన్నెలలా, నదిలా, వర్షంలా ప్రవహించిపోతూ ఉంటుంది. అప్పుడు.. కాలం ఒక నైరూప్య వస్తువుకాదు, అది ఓ ప్రేమగానం అని స్పటికస్వచ్చమైన అవగాహన తటాలున మేలుకొంటుంది.

17 ఆగస్టు 2013

ఆ చిరునవ్వు ఒక ఆశ్చర్యం..

I was kissed from inside and that totally devastated me in the most beautiful way. I couldn't carry on with my life the way it was before. It just started to change and it is still changing, but something inside remains unchanging. I found what is not changing and also what is changing therefore, I can enjoy now. This is what causes a smile to happen that is not just with my lips. It happens with my whole being. Joy is that smile. ~ Mooji

ఎవరో.. నన్ను నాలోపలి నుండి ముద్దుపెట్టుకొన్నారు. అది నన్ను ఎంతో అందమైన పద్దతిలో పూర్తిగా నశింపచేసింది. ఇక, నేను మునుపు గడిపినట్లు జీవితాన్ని గడపలేకపోయాను. ఆ ముద్దు నాలో ఒక మార్పుని ప్రారంభించింది, ఇంకా మార్చుతూనే ఉంది. కానీ, లోలోపల ఒకటి ఏ మార్పూ లేకుండా నిలిచివుంది. మార్పు చెందుతున్నదానినీ, మార్పు లేనిదానినీ కూడా నేను కనుగొన్నాను, ఆనందిస్తున్నాను. అదే ఈ చిరునవ్వుకి కారణం. ఈ చిరునవ్వు కేవలం పెదవులనుండి  కాదు, నా మొత్తం ఉనికి నుండి.. ~ మూజీ

నిజంగా అలాంటి స్థితి ఒకటి ఉందా. ఉంటే అంతకుమించి సాధించవలసింది లేదా పొందవలసింది, పొంది పంచిపెట్టవలసింది ఇక ఏమైనా ఉంటుందా. పసిపిల్లలలో కనిపించే కారణంలేని ఆనందం, వాళ్ళ ఉనికి మొత్తం నుండి పొంగిపొరలే జీవశక్తి, ఉత్సాహం.. గతంలేదన్నట్టు, భవితలేదన్నట్టు, ఈ క్షణమే ఎప్పటికీ ఉన్నట్టు.. చరిత్రల్నీ, కలల్నీ చిరునవ్వుతో విసిరేసి.. ఇదిగో ఇప్పుడే, ఇక్కడే కావలసినంత కాంతిని పట్టుకువెళ్ళు.. చీకటా ఏం చీకటి.. స్మృతులా, గాయాలా, వెలితా, దిగులా, భయమా, కోపమా.. ఏమిటవన్నీ.. ఎందుకు మోస్తావు.. ఏమీ లేవు, ఏమీ లేవు.. ఈ క్షణంలో సూర్యుడు వెలుగుతున్నట్టు, దినాంతాన చీకటి వెలుగుతున్నట్టు, ఒకటే వెలుగు.. ఒకటే సంతోషం, ఒకటే శ్వాస, ఒకటే నిట్టూర్పు.. ఒకటే మార్పు.. మార్పుల్లో కూరుకుపోయి బాధపడటం కాదు, మార్పే ఒక ఆనందంగా తేలిపోవటం.. మారని ఆనందాన్నుండి మార్పుని చూడటం.. రుతువులుమారే భూమిని కాంతి మారని సూర్యుడు చూస్తూ ఉన్నట్టు.. ఇంతాచేసి దేశాలని జయించాలా, జ్ఞానమో, సంపదో పోగుచెయ్యాలా, ఎవరికో నిన్ను రుజువు చేసుకోవాలా.. కీర్తిని యాచించే దుర్బలుడివై బేలమొహంతో సంచరించాలా.. ఒక అతిపదునైన ఎరుకలోకి, ఒక అతిసున్నితమైన స్పర్శ లోకి కాస్త జాగ్రత్తగా వెళ్ళగలిగితే చాలు.. జ్ఞానులు చెప్పినట్టు.. పసిపిల్లలు కాగలిగితే చాలు.. స్వర్గం తెరుచుకొంటుంది.. కానీ.. అనేకవేల.. కానీ.. లకి.. ఇవతలే మనం.. వాళ్ళని అనుమానంగా చూస్తూనో.. చూసి ఆశ్చర్యపోతూనో..

15 ఆగస్టు 2013

జ్ఞానం అకస్మాత్తుగా సంభవిస్తుంది

' There can be progress in the preparation (sadhana). Realization is sudden. The fruit ripens slowly, but falls suddenly and without return. ' ~ Sri Nisargadatta Maharaj
' సాధనలో పరిణామక్రమం ఉండవచ్చును కాని, జ్ఞానం (మెలకువ) అకస్మాత్తుగా సంభవిస్తుంది. ఫలం నెమ్మదిగా పక్వమవుతుంది, కానీ, రాలిపోవటం ఒకేసారి జరుగుతుంది..' ~ శ్రీ నిసర్గదత్త 

జె. కృష్ణమూర్తి వంటి ఆధునిక తాత్వికులు 'సత్యం దారి లేనిది' (Truth is pathless) అంటారు. ఆయన సత్యాన్ని గురించి వివరించే మాటలన్నీ ఇట్లాగే ఉంటాయి. దానిని 'ప్రయత్నం లేని మెలకువ' (Effortless awareness) అంటారు మరొకసారి. సాంప్రదాయకమైన అన్వేషణను కొత్త మాటలలో, మరింత సూటి అయిన మాటలలో పరిచయం చేసిన రమణమహర్షి, నిసర్గదత్త వంటివారు సాధన అవసరమే అని చెబుతారు. ఈ రెండు వాదాలకూ సమన్వయం పై మాటలలో కనిపిస్తుంది. 

సత్యాన్ని మేధ (intellect) సరాసరి తెలుసుకోలేదు. కానీ, కలని ఉపమానంగా తీసుకొంటే, దానిని అర్థం చేసుకోవటం కొంత తేలిక అవుతుంది. కలలోని వ్యక్తితో 'ఇది కల, మెలకువ అనే వేరొక స్థితి ఉంది' ఎంతగా చెప్పినా, అతను 'ఆ మెలకువని' కలలో భాగంగానే తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు కాని, అది కలకి అతీతమైన వేరొక స్థితి (plane) అనీ, జీవితంలో అది వేరొక కోణం (another dimension of life) అనీ తెలుసుకోలేడు. అట్లాగే, కృష్ణమూర్తి బోధించిన సరాసరి మార్గం (లేదా మార్గం కాని మార్గం) కూడా మానసిక జాగృతి లేనివారికి గందరగోళం గానే తోస్తుంది. 

అన్వేషకుల మానసికస్థితి పట్ల అవగాహన ఉన్న జ్ఞానులు, వాళ్ళని ముందుగా మనస్సు శుభ్రం చేసుకొమ్మని చెబుతారు. దయ, నిజాయితీ, నిరంతర సత్యాసత్య వివేచనల వలన మనస్సు రాగద్వేషాల నుండి క్రమంగా విముక్తి పొందినపుడు, ఆ మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. అట్లాంటి లోతైన, గాఢమైన ప్రశాంతత పొందిన మనస్సు విషయాలను స్పష్టంగా చూడగలుతుంది. ఆ చూపుతో 'ఇది కలా, నిజమా' అని పరిశీలిస్తే అకస్మాత్తుగా మెలకువ కలిగి, అంతకు పూర్వపు అనుభవమంతా కలగా అర్థమవుతుంది.

నా చుట్టూ ఉన్న ప్రపంచం ఇంత దు:ఖంలో ఉంటే, నేను మేలుకొనే ప్రయత్నం చేయటం అనవసరం, అన్యాయం అని సాధారణంగా చాలామంది తలపోస్తారు. కానీ, నిజమైన అనుకంపన ఉన్నవారు, పరిష్కారాన్ని అన్వేషిస్తారు కాని, దు:ఖితులతో పాటు తామూ కూర్చుని దు:ఖించరు. రోగి బాధపడుతున్నపుడు, వైద్యుడు దాని నివారణ గురించి శ్రద్ధగా పరిశీలిస్తాడు కాని, రోగితోపాటే తానూ ఆందోళన పడుతూ కూర్చోడు. కుటుంబం కష్టాలలో ఉంటే బాధ్యత కల యువకుడు ప్రశాంతచిత్తాన్ని సాధించి విద్యాభ్యాసం చేసి, ఉత్తీర్ణుడై తన కుటుంబానికి ఆర్ధికమైన ఆసరాగా మారతాడు కాని, వాళ్ళతో పాటే తానూ ఆందోళన చెందుతూ కూర్చోడు. అట్లాగే లోకంలోని దు:ఖం పట్ల నిజమైన అనుకంపన ఉన్నవారు, దాని నివారణ గురించి లోతుగా, తీవ్రంగా ఆలోచిస్తారు కాని, లోకంలోని దు:ఖితులతో తామూ దు:ఖిస్తూ కూర్చోరు. బుద్ధుడు కానీ, జీసస్ కానీ, అనేకమంది ఋషులూ, జ్ఞానులూ కాని లోకంలోని దు:ఖం పట్ల ఎంత అనుకంపన లేకుంటే, వాళ్ళు తీవ్రమైన సాధన చేసి దాని నివారణోపాయాలని కనుగొని, బోధించారు. 

ఒక జ్ఞాని ఉండటమే ప్రపంచానికి దీవెన అని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ ప్రపంచం మాత్రమే తెలిసిన సాధారణ విజ్ఞాని, సాధారణ నాయకుడూ ఈ ప్రపంచానికి ఎంతో చేయగలిగినప్పుడు, ఈ సృష్టి వలయాన్ని దాటిన జ్ఞాని వలన ఎంత మేలు జరుగుతుంది. అతని శక్తి వలన, ఎన్ని దు:ఖాలు మన అనుభవంలోకి రాకుండానే మాయమవుతున్నాయో ఊహకి అందదు.

మూఢత్వం కేవలం తర్క రహితమైన నమ్మకాలలో మాత్రమే ఉండదు. తర్కాన్ని మాత్రమే నమ్మటంలోనూ ఉంటుంది. ఉత్త నమ్మకాలకీ, ఉత్త తర్కానికీ అతీతంగా మనలో మరింత సున్నితమైన జీవ రసాయన చర్యలు ఎన్నో ఉన్నాయి. అవి సరాసరి హృదయం నుండి పనిచేస్తాయి. హృదయం అనేది సమాచారాన్ని సేకరించి, ఉపయోగించుకొనే మెదడు కన్నా, రాగద్వేషాలతో చలించే మనస్సు కన్నా లోతైనది. మనిషిలో నిజమైన, స్వచ్చమైన సంవేదన మొదలయ్యే చోటు. 'నేను ఉన్నాను' అనే స్మృతి నిర్మలంగా, నిరంతరంగా వెలిగేచోటు. (దీనినే బైబిల్ లో I am that I am అని చెబుతారని రమణమహర్షి అంటారు) అక్కడినుండి చూసినపుడు అంతకుముందు ఎరుకలేని అనేక విషయాలు వెలుగుచూస్తాయి. దానిలోకి మనం ప్రవేశించినపుడు, దానిని మనలో వికసించనిచ్చినపుడు, ఇప్పటికన్నా అనేక రెట్లు వివేకంగా, నాగరికంగా, దయగా మానవ జాతి రూపు దిద్దుకొంటుంది.

14 ఆగస్టు 2013

జననమరణాల నడుమ..

'What is birth and death but the beginning and ending
of a stream of events in Consciousness.' ~Nisargadatta

' పుట్టటం, చనిపోవటం అంటే ఏమిటి., చైతన్యంలో ఒక సంఘటనల ప్రవాహం మొదలుకావటం, ముగిసిపోవటం మినహా.. ' ~ నిసర్గదత్త

మనిషి అహంకారం ('నేను ప్రత్యేకం' అనే భావన) అతనిని ఒక చిత్రమైన భ్రమలో నిరంతరం ఉంచుతుంది. తాను ఎప్పుడూ ఉన్నట్టూ, ఎప్పటికీ ఉండబోతున్నట్టూ, కనిపించే ప్రపంచం ఇలాగే ఎప్పటికీ ఉంటుందన్నట్టూ అతనిని నమ్మిస్తుంది. చుట్టూ జననాలని, మరణాలని చూస్తున్నా, నేనూ ఒకనాడు పుట్టాను, మరొకనాడు మరణిస్తాను అని క్షణమాత్రంగా స్పురిస్తూవున్నా, అది కేవలం కోట్లాది ఆలోచనలలో ఒకటిగానే మిగిలిపోతుంది. నిత్య జీవితంలో ప్రతిక్షణమూ మాత్రం తాను శాశ్వతుడినైనట్టే అతని లోపల ఒక భావన నేపధ్యసంగీతంలా మోగుతూనే ఉంటుంది. అందుకే, తెలిసినవారు ఎవరైనా చనిపోయారని విన్నపుడు వాళ్ళు పోవటం, తమకో, తమ కుటుంబానికో, తమ సమూహానికో తీరనిలోటని చెబుతూ ఉంటారు. తానూ, తన కుటుంబమూ, తన సమూహమూ కూడా ఒకనాడు నీటిమీది గీతలా మాయమయ్యేవేనని మరిచిపోయి. జీవితానికి శాశ్వత చిరునామాగా తమనితాము భ్రమించుకొనే అతి ఉత్సాహవంతులైతే మృత్యువు తమని మోసం చేసిందనో, తమ మనిషి మృత్యువు ముందు ఓడిపోయాడనో వీలైనంత తెలివితక్కువగా మాట్లాడతారు. (తెలివి అంటే మన చదువులు నేర్పే జిత్తులమారితనం కాదు, తన ఉనికిపట్లా, చుట్టూ ఉన్న ఉనికిపట్లా సరైన స్పృహ కలిగి ఉండటం) లేదూ, కాస్త తెలివైన వాళ్ళైతే అతను చనిపోలేదనీ, అతని కీర్తీ, సేవా, సంకల్పమూ ఇత్యాదులు శాశ్వతమని మధ్యేమార్గంగా తమని సమాధానపరుచుకొంటారు.

కానీ, మనం శాశ్వతం కాదు, బహుశా, మనం శాశ్వతమనుకొనే మన భ్రమ కూడా శాశ్వతం కాదు. మరికాస్త నిజాయితీ, నిజాన్ని చూసేందుకు మరికాస్త అమాయకత్వం లాంటి ధైర్యం మనిషికి చాతనైనపుడు తన జననమూ, తన మరణమూ కోట్లాది ఘటనలతో నిండిన ఒక మహా ఘటనలో, ఒకే చైతన్యపు ముద్దలో ఒక అనివార్య సంభవం మాత్రమే అనీ, తను పుట్టటానికి ముందు జరిగిన కోట్ల ఘటనల పలితమే తాననీ, తన జీవితం, తన మరణం కూడా కోట్లాది ఘటనలతో పాటు అనివార్యమనీ, ఒక పెద్ద గుంపు మధ్యలో నడుస్తున్న మనిషికి తన నడకపైన స్వతంత్రం లేనట్లు, తనకీ స్వాతంత్ర్యం లేదనీ గుర్తించినపుడు, ఒక కొత్త వెలుతురు అతని జీవితంలో ప్రవేశిస్తుంది. ఒక కొత్త అవగాహన అతనిలో మేలుకొంటుంది. దానినే పూర్వులు జ్ఞానం అన్నారు.

అది నిజానికి వెలుతురు ప్రవేశించటమూ కాదు, వెలుతురుపైన పలుచని మంచుతెరలా పరుచుకొన్నమనసనే మసకచీకటి తొలగిపోవటం. అప్పుడు మనిషి - సినిమా తెరమీది దృశ్యమూ, రంగూ తాకలేని తెల్లని సినిమాతెరలాగా, తెల్లని ఎరుకలాగా ఉంటాడని జ్ఞానులు చెబుతారు. అది జీవితానుభావాలకి భిన్నమైన మరొక అనుభవమూ కాదు, తెలిసిన సమాచారాలకి భిన్నమైన మరొక సమాచారమూ కాదు. ఒక తాత్విక అన్వేషి 'జ్ఞానం ఎట్లా తెలుస్తుంది లేదా కలుగుతుంది' అని అడిగితే, ఒక జ్ఞాని 'అది స్పురిస్తుంది' అంటారు. అంటే మరిచిపోయిన వస్తువొకటి జ్ఞాపకం వచ్చినట్లూ, కలనుండి మేలుకోగానే అంతకు పూర్వపు అనుభవం కల అని తెలిసినట్లూ అనుకొంటాను.

రెండు అంచులుంటాయి. ఒకటి. అంతా ఒకటే చైతన్యం, నేనూ దానిలో భాగం అనుకోవటం. అప్పుడు, ఒక మనిషికి ప్రత్యేక చైతన్యం ఉంటుందనేది అర్థం లేనిది. రెండు. నేను చైతన్యాన్ని కూడా కాదు, దానిని తెలుసుకొంటున్న స్వచ్చమైన ఎరుకని, స్పురణని అనుకోవటం. అప్పుడూ మనిషికి చైతన్యంలో ప్రత్యెక ప్రమేయం ఉండటం అర్థంలేనిది అవుతుంది. కానీ, ఉందో, లేదో ఎప్పటికీ, ఎవరికీ తెలియని మాయ, మనస్సు పేరుతో ఉండటానికీ, లేకుండటానికీ మధ్య పుట్టి ఇంత వినోదభరితమైన విషాదంతో జీవితాన్ని నింపుతూ ఉంది.

03 ఆగస్టు 2013

పావురాలు


పిల్లలెవరో తెల్లకాగితంపై రంగులు చల్లుతున్నట్టు

ఆటలో విరామంలాంటి కాంతినిండిన ప్రశాంతతలోకి
ఏవో మృదువైన స్పందనలు వచ్చివాలతాయి 

పావురాలు గింజల్ని నోటకరుస్తున్నట్టు
దయగల ఊహలు నా క్షణాల్ని నోటకరుస్తాయి 

అలా చూస్తూ ఉంటాను పావురాల కువకువలని 

ఈ పావురాలు ఎగిరేందుకు పుట్టినవికావు 
ఇవి వాలేందుకే ఈ లోకంలోకి వచ్చాయి 

కాస్తనీడా, కాస్తశాంతీ ఉన్నచోట వాలి 
నీడలాంటి శాంతిలోకి వృత్తంలా మరలి 
నీడకి రూపం వచ్చినట్టూ, 
శాంతికి ప్రాణం పోసినట్టూ కాస్త సందడి చేస్తాయి

ఈ పావురాలు అందుకే వస్తాయి
ఇవి నిశ్శబ్దం పొట్లాన్ని విప్పి శబ్దాలు వెదజల్లవు
శబ్దం పొట్లాన్ని విప్పి నిశ్శబ్దాన్ని పంచిపెడతాయి

____________________
ప్రచురణ: ఈ మాట జులై 2013