21 జూన్ 2016

నువ్వు ప్రత్యేకం..

నిన్ను గౌరవించు, ప్రేమించు.
కారణం,
నీ వంటి మనిషి ఇంతకుముందు లేడు, ఇకముందు రాడు.

~ ఓషో

ప్రతిమనిషీ ఈ చైతన్యంలో తనదైన ప్రత్యేకతతో వ్యక్తమైనవాడే. ఈ విశ్వచైతన్యపు ప్రత్యేక అభివ్యక్తిగా వచ్చినవాడే. ఆ మాటకి వస్తే, ఈ చేతనావరణమంతా నిత్యనూతనమే, ఎప్పటికపుడు ప్రత్యేకమే.

తానెంత ప్రత్యేకమో గుర్తించటం అంటే, మిగిలిన మనుషులూ, చైతన్యమూ ప్రత్యేకం కాదని అనుకోవటంకాదు. అట్లా అనుకోవటం, తనని కూడా ప్రత్యేకం కాదనుకోవటమే.

వాళ్ళూ, అవీ, అన్నీ తనలాగే, తమదైన ప్రత్యేకతతో వెలుగుతున్నాయని గుర్తించినపుడే, మన ప్రత్యేకత పట్లకూడా మనకొక సహజమైన, సజీవమైన ఎరుక కలుగుతుంది.

జీవితంలోని, చైతన్యంలోని ఈ వైవిధ్యాన్నంతా ఎప్పటికప్పుడు గుర్తించటం అంటే, ఎప్పుడూ తాజాచూపుతో తాజాగా జీవించటం.

మన పదాలూ, భావజాలాలూ, బంధాలూ, వ్యవస్థలూ మనల్ని మూసగా మిగిలే నిర్జీవ ప్రపంచంలోకి నెడుతూనే ఉంటాయి. ఈ మూసలో మనమొక ప్రత్యేకమైన మూసగా నిలవడానికి తపన పడుతుంటాము.

మనకు కూడా ఎరుక లేకుండా, మనలో జరిగే నిజమైన ఘర్షణ అదేనేమో. మన లోపలి జీవితానికీ, మృత్యువుకీ; మనలోని మెలకువకీ, నిద్రకీ; ప్రేమకీ, భయానికీ; ఆశ్చర్యానికీ, అలవాటుకీ నడుమ జరిగే ఘర్షణనే మన నిజమైన యుద్ధక్షేత్రం అనుకొంటాను.

మనమొక వీరుడిగా నిలబడవలసిన స్థలం మన అంతరంగమే అయి ఉంటుంది. మెక్సికన్ జ్ఞాని డాన్ జువాన్ అందుకనే వారియర్ అనే మాట ఉపయోగిస్తూ ఉండేవారు.

అక్కడ కన్ను తెరిస్తే ఎంత అందం, కన్నుమూస్తే ఎంత దుఃఖం!

~ బివివి ప్రసాద్

20 జూన్ 2016

అష్టావక్రగీత కథ

అష్టావక్రగీత కథ

అమెరికాలో కెరీర్ లో మంచిస్థితిలో ఉన్న మిత్రుడొకరు నిన్న ఫోన్ చేసి ఈ భగవద్గీతా, ఉపనిషత్తులూ ఒకసారి చదవాలనుకొంటున్నాను, తెలుగులో ఎక్కడ దొరుకుతాయి అన్నపుడు, కాస్త నవ్వూ, విచారమూ కలిగాయి.

కొన్ని చదవటం అంటే ఊరికే సరదా కాదు. కొన్ని వృధా చర్చల కోసం సమాచారం ప్రోవు చేసుకోవటంకాదు. నాకు ఎంత తెలుసో చూడు అని చెప్పుకోవటానికీ, నీ నమ్మకాలనీ, వాటి వెనుక ఉన్న నీ ఇగో నీ ఇతర్లపై బలవంతంగా రుద్దటానికీ కాదు.

కొన్ని చదవటం అంటే, ఇప్పటి వరకూ నువ్వు అనుకొంటున్న నిన్ను వదులుకోవటానికి సిద్ధపడటం, మరణించి మళ్ళీ కొత్తగా పుట్టటానికి సాహసించటం. అలా చదవగలిగినపుడే కొన్ని చదవాలి. లేదంటే రాళ్ళని తాకే సెలయేటి పరుగులా, అవి ఏ మంత్రమయలోకాలకీ తీసుకుపోకుండానే, నిన్ను విడిచివెళ్ళిపోతాయి. అందుకే కొన్ని ప్రాచీన గ్రంధాలు 'ఇప్పుడు' అని మొదలుపెడతారు. అంటే, నువ్వు సిద్ధపడి ఉన్నావు గనుక, ఇప్పుడు మాట్లాడుకొందాం అని.

నిజంగా, అలా చదవగలిగితే, 'ఇప్పటికైనా నువ్వు ఏమిటో, నీ జీవితం ఎందుకో తెలుసుకోవాలన్న జ్వరం కనుక పుడితే, మరింత సూటిగా నిన్ను తాకే వేరే గ్రంధాలు కూడా ఉన్నాయి' అని చెప్పాలనిపించింది కాని, అందరిలానే ఆ మిత్రుడూ కేవలం పైపైన బ్రతకటానికే ప్రాధాన్యత ఇస్తాడని తెలుసు గనుక, నాకు తెలిసిన సమాచారం ఏదో చెప్పి ఊరుకొన్నాను.

అట్లా అత్యంత శక్తివంతంగా, నువ్వు అనుకొంటున్న నిన్ను దగ్ధం చేసి, నిజమైన జీవితానుభవంలోకి, నిరపేక్షసత్యంలోకి మేల్కొలిపే గ్రంధాలని స్వరూపవర్ణన గ్రంధాలుగా చెబుతారు. స్వరూపవర్ణన అంటే 'ఆత్మ' లేదా 'తాను' లేదా 'నేను' అంటే ఏమిటో, దానిని ఎలా తెలుసుకోవాలో తెలియచేసే గ్రంధాలు.

వాటిలో నేను చూసినవి ( చదివినవనీ, అధ్యయనం చేసినవనీ అనటంలేదు) అష్టావక్రగీత, ఋభుగీత, అవధూతగీత, యోగవాసిష్టం, త్రిపురారహస్యం ఇత్యాదులు. వీటిలో చాలా వరకూ గురు,శిష్య సంవాద రూపంలో ఉంటాయి. శ్రీ రమణమహర్షి తరచూ వీటిని ప్రస్తావించేవారు. అంతేకాక వాటికి సంబంధించిన కథలు కూడా చెప్పేవారు.

వాటిలోకి ప్రవేశించటానికి యోగ్యత ఎలా, ఎంతగా ఉండాలో ఆ కథలు చెబుతాయి. వాటిలో ఈ రచయితకి అత్యంత ప్రేమాస్పదమైన ఒక కథ ఇక్కడ చెబుతున్నాడు.

ఒకానొక జనకుడి కొలువులో వేదాంతసభ జరుగుతూ వుంటుంది. చర్చలో భాగంగా ఒకరు ప్రాచీనులు చెప్పిన శాస్త్రవాక్యం ఒకటి చెబుతారు. 'ఆత్మజ్ఞానం పొందటానికి ఏమంత సమయంపట్టదు. గుర్రపు రికాబులో ఒక కాలు ఉంచి, రెండవ ప్రక్క రెండవ కాలు వేసేలోగా ఆ జ్ఞానం పొందవచ్చును' అని ఆ వాక్యానికి అర్థం.

అప్పుడా జనకుడు ఈ శాస్త్రవాక్యం నిజమేనా అని అడుగుతాడు. వాళ్ళు నిజమే అంటే, నిరూపించగలరా అంటాడు. మేము అంత శక్తిగలవాళ్ళం కాదంటారు. జనకుడు దండోరావేయిస్తాడు, ఈ శాస్త్రవాక్యం నిజమని నిరూపించగలవారికి తగిన బహుమానం ఇస్తానని. ఆ మాట, అరణ్యంలో ఉన్న అష్టావక్రమహర్షిని చేరుతుంది. ఆయన రాజసభకి వస్తారు,, తాను నిరూపిస్తానని చెబుతారు.

జనకుడు సరేనన్నాక, బయట గుర్రం నిలబెడతారు. రాజు ఒక పాదం రికాబులో ఉంచుతాడు. అప్పుడు, మహర్షి నీకు జ్ఞానం బోధిస్తున్నాను గనుక, నాకు గురుదక్షిణ ఇవ్వాలి అంటారు. బోధన అయ్యాక కదా దక్షిణ ఇవ్వాల్సింది, కానీ, ముందుగా అడగటానికి కారణం ఉంది. జ్ఞానం పొందినవాడికి ఇక అన్యత్వభావం (తన కంటే వేరుగా ప్రపంచం ఉంది అనే భావం) నశిస్తుంది. తనకి అన్యంగా ఏదీ లేదు గనుక, గురువూ ఉండడు, దక్షిణా, ఇవ్వటమూ కూడా ఉండవు.

జనకుడు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో చెప్పమంటాడు. మహర్షి 'నేను, నాది అనుకొంటున్న సమస్తాన్నీ నాకు ఇవ్వ'మంటాడు. జనకుడు 'ఇచ్చాను' అంటాడు. అంతే. ఇక జనకుడు శిలాప్రతిమలా నిలబడిపోతాడు. నేను, నాది అనేభావాలతో కూడిన సమస్తాన్నీ, అంటే, నాది అనిపించే దేహంతో సహా, మనస్సుతో సహా మహర్షికి ఇచ్చేసాడు జనకుడు. ఇక తనపై తనకి ఏ ఆధిపత్యమూ లేదు. అసలు తానే లేడు. నేను అనుకొంటున్నది అంతా గురువుకి ఇవ్వగానే, ఇక ఏదీ, ఎవరిదీ కాని శుద్ధమైన ఎరుక మాత్రమే మిగిలింది.

కాలం గడుస్తున్నా స్థాణువులానే నిలబడిపోయిన రాజుని చూసి, పరివారం ఆందోళన పడ్డారు. ఈ ఋషి రాజుగారిని ఏదో చేసాడని భయపడ్డారు, మళ్ళీ ఆయన్నే ప్రార్ధించారు, మా రాజుగారిని మాకు ఇవ్వమని. మహర్షి 'నాయనా, ఇక కదులు' అన్నారు. గురుస్వాధీనమైన ఆ దేహం, మనస్సూ గురువాజ్ఞతో కదిలాయి.

ఇప్పుడు నీస్థితి ఎలా ఉందో చెప్పమంటారు అష్టావక్రుడు. జనకుడు పరమానందంతో, ఆశ్చర్యపోతూ చెబుతాడు. ఇట్లా, ఆ గురుశిష్యుల పరమస్వచ్ఛమైన సంభాషణతో అష్టావక్రగీత మొదలవుతుంది. స్వరూపం అంటే ఏమిటో, ఈ దృశ్యమాన ప్రపంచం ఏమిటో, వీటి వింతవింత లేమిటో ఎంతో కవితాత్మకంగా మాట్లాడుకొంటూ వారి సంభాషణ నడుస్తుంది.

వారికి నీడగానైనా నడిచేంత హృదయనైర్మల్యం సాధిస్తే, అలాంటివారికి అష్టావక్రగీత ఎనలేని మేలు చేస్తుంది.

~ బివివి ప్రసాద్

ఆ పరిణతే చివరికి నిలిచేది.

ఎంత ధనమూ, అధికారమూ, విజ్ఞానమూ, కీర్తీ సంపాదించినా లోపల వాటిని పొందేవాడిలో ఏ పరిణతీ రాకపోతే, పొందినవి రవంతైనా ప్రతిఫలాపేక్ష లేకుండా పంచుకోవటం రాకపోతే, వాటి కోసం పరుగుపెట్టిన కాలమంతా వృధానే అనిపిస్తుంది.

జీవితంలో ఏదో ఒక దశలో, ఏదో ఒక ఖాళీ సమయంలో, తన లోపలి ఖాళీతనాన్ని తాను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఎన్ని సాధించినా, మరి కాస్త అనుకంపన, మరికాస్త మెత్తదనం, మరి కొంచెం నిండుదనం, నెమ్మదీ, సరళత మన లోపల వెలగకపోతే, ఎంత డొల్లగా మన జీవితం మొదలయిందో, అంతకన్నా డొల్లగానే అదిముగుస్తుంది.

మన అహంకారం పట్ల మనకి స్పష్టమైన ఎరుక ఉండాలి. దానిని పెంచి పోషించుకోవటం పట్ల ఉదాశీనత ఉండాలి. అప్పుడుకదా, అది కరిగి జారిపోతున్నపుడల్లా మనలోంచి సత్యమో, సౌందర్యమో, దయో వెలుగులీనుతూ వ్యక్తమయ్యేది.

తమని తామే మోసగించుకొనే కాపట్యంకన్నాజాలి పడాల్సింది మరేదీ లేదేమో. 'తండ్రీ, వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు.' అని ఆ జ్ఞాని అందుకే అన్నారా అనిపిస్తుంది.


~ బివివి ప్రసాద్

01 జూన్ 2016

జీవించాలనే కోరిక ..జీవించాలనే కోరిక మౌలికమైన కోరిక.
మిగతావన్నీ ఆ కోరికపై ఆధారపడినవి.
--
ఇతరులకి  సహాయం చేయటానికి ముందు, ఒకరు,  ఇతరుల సహాయం అవసరంలేని  స్థితిలో ఉండాలి.

~ నిసర్గదత్త

జ్ఞానం మనకులేని దేనినో ఇవ్వదు. మనది కాని దానినుండి విముక్తం చేసి, మన సహజస్థితిలో నిలబెడుతుంది. మహరాజ్ మాటలన్నీ, మనల్ని మళ్ళీ మనం బయలుదేరిన చోటు కి, దారితప్పిన చోటుకి తిరిగి మళ్లిస్తాయి. మన సహజస్థితి తెలుసుకొని, అక్కడ నిలకడగా, స్థిరంగా ఉండగలిగితే.. ఇక లోటూ, భయమూ అనే సంవేదనలకి చోటే ఉండదు మనలో.

జీవించాలనే కాంక్ష ప్రగాఢమైనది జీవులన్నిటికీ. దాని తరువాతనే, దాని లోపలనే, దాని చుట్టూనే మిగతా కాంక్షలన్నీ తిరుగుతుంటాయి. మిగతా కోరికలన్నీ కాసేపు ప్రక్కకునెట్టి ఆ మౌలికమైన కోరికని శ్వాసిస్తూ, ధ్యానిస్తూ ఉంటే మనలో గొప్ప నిలకడ, స్తిమితం ఏర్పడుతూ ఉండటం గమనిస్తాము. మన ఉద్వేగాలలో, సంవేదనల్లో, ఆలోచనల్లో అంతకు ముందుకన్నా లోతైన స్పష్టత ఏర్పడటం, మన లోపలి డొల్లతనం స్థానంలోకి ఒక నిండుదనం చేరుకోవటం గమనిస్తాము.

కానీ మనపైనా, మన జీవితంపైనా మనకు అంత ప్రేమా, శ్రద్ధా ఉన్నాయా? మన జీవితానుభవం పైన మనకు అంత లాలస ఉందా?

ఇతరులు మనల్ని గుర్తించటం, మెచ్చటం అనే ఏ మాత్రమూ అర్థమూ, అందమూ, జీవమూ లేని వెర్రిలో పడి, మన నిజస్థితికి ఎంత దూరమౌతామో.

ఎంతగా లోకంలో కూరుకుపోతామో, అంతగానూ మనల్ని మనం కోల్పోతాం. అంతగానూ మనం చెదిరిపోయి, లోకమంతా చెదిరిపోయిందని, దీనిని బాగుచేసి తీరాలని నడుం కడతాం. నా నమ్మకాల ప్రకారం మాత్రమే లోకంలో శాంతి రావాలని కత్తులు దూస్తాం. నాది మాత్రమే ప్రేమనిండే మార్గమని గట్టిగా కోపించి, కొట్టి మరీ చెబుతాం.

కానీ, తనను తాను చేరుకోవటమే లోకశాంతికి మొదటి అడుగని తెలిసినవారు నిశ్శబ్దంగా ఆ పని చేస్తూనే ఉంటారు.

~ బివివి ప్రసాద్