'ఆరాధన' నుండి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
'ఆరాధన' నుండి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23 ఫిబ్రవరి 2013

'ఆరాధన' కవిత్వసంపుటి, ప్రసిద్ధుల ఉత్తరాలు

'ఆరాధన ' నా మొదటి వచన కవితా సంపుటి. నా మొదటి ఇరవైలలో (1986-89) రాసుకొన్న కవిత్వం ఇది. తొలికవిత్వ రచనోత్సాహమూ, శ్రీశ్రీ ప్రభావమూ దాటి, చలం అక్షరాల్లో టాగోర్ నీ, శ్రీ రమణ మహర్షినీ చదువుకొని నా అంతరంగంలోకి ప్రయాణిస్తూ రాసుకొన్న అక్షరాలివి. ఇంతకు ముందు కూడా చెప్పినట్టు, చలం శ్రీ రమణ మహర్షి గురించి రాసిన 'భగవాన్ స్మృతులు ' చదువుకోవటం నా అంతరంగ జీవితంలో పెనుమార్పుకి మొదలు. ఈ కవితల్లో చాలాసార్లు తండ్రీ అని సంబోధించింది శ్రీ భగవాన్‌నే అని గుర్తు. టాగోర్ ప్రభావం వలన వ్యక్తీకరణలో గీతాంజలి చాయలు కనిపిస్తాయి. వ్యక్తీకరణ వరకే చాయలు. వీటిలో కనిపించే ఆర్తీ, ఆలొచనా, సున్నితత్వమూ కవి హృదయంలో పలికినవే. చదివి చూడండి స్వగృహోన్ముఖుడైన ఒకవ్యక్తి తొలి గీతాలాపన.

ఈ సంపుటిని తరువాత కాలంలో సంజీవదేవ్‌గారికీ, ఇస్మాయిల్‌గారికీ పంపిస్తూ నన్ను పరిచయం చేసుకొన్నపుడూ, హైకూకవిగా సాహిత్యలోకానికి పరిచయమయ్యాక ఓల్గాగారికి పంపినప్పుడూ వారు రాసిన లేఖలను ఇక్కడ చూడండి.

ఈ సంపుటిని ఆవకాయ.కాం నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చును. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుస్తకాన్ని ఇక్కడే చదవటానికీ, Scribd సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవటానికీ ఈ పోస్ట్ చివర ఇచ్చిన లింక్ చూడండి.










13 సెప్టెంబర్ 2011

'ఆరాధన' మొదటి సంపుటి నుండి..

1
సామ్రాజ్యాలను జయించినా
కీర్తి విస్తరిల్లినా
చిరుగాలికి ఊగే పచ్చగడ్డి మీది నుంచి
జారిపడే మంచుబిందువుని చూసి
మౌనంలో పడకపోతే
జీవితపు విలువలు తెలియవు

2
మరొక వేకువ
నీకు నీరాజనం ఇవ్వటానికి వస్తుంది
పుష్పాలు తమ అలంకారాలను
నీకోసం సిద్దం చేసుకొంటున్నాయి
నీకు దారి ఇవ్వటానికి
మంచుపరదాలు పక్కకు తప్పుకొంటున్నాయి
కానీ
నిన్న రాలిన ఎండుటాకు
తన చివరి వీడ్కోలు తెలుపుతూనే వుంది

3
పిట్టల కూతలు
గాలిని కావలించుకొని
ఉదయకాంతికి స్వాగతం చెబుతున్నాయి

మంచుబిందువు చుంబించే పుష్పాన్ని
ఉదయకాంతి ఆశీర్వదిస్తుంది

పసిపాప నుదుటిని
చిరుగాలి చుంబిస్తుంది
కనులు తెరవని పాప
గాలికి చిరునవ్వుని అద్దుతుంది

చెరువులో జారిపడిన ఎండుటాకు
తన అనుభవాలని చెరువుకి వివరిస్తుంది

అహంకారి మానవుడు
ఈ లోకంలో ఒంటరిగా మిగిలాడు

4
నా మౌనం అరణ్య నిశ్శబ్దాన్ని తాకినప్పుడు
నా నిట్టూర్పు కెరటాలచే ఆహ్వానించబడినప్పుడు
నేను జీవించే ఉన్నానని నాకు స్పష్టమైంది

5
ఉదయం వికసించింది
పుష్పాలు రేకులు విప్పాయి
తుమ్మెద వాలింది
గాలితెర కదిలింది

నన్ను ఎరిగిన నా మిత్రుడు
నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు

6
ప్రశ్నా
పరంపరలతో
నన్ను నేను వేధించుకొంటున్నపుడు
నన్ను తాకిన వాన చినుకు
ఆకాశంలో మెరిసే ఇంద్రధనస్సును చూడమని చెప్పింది

సప్తవర్ణాలలో నా చూపులు కరుగుతున్నపుడు
నన్ను గురించీ
ఇంద్రధనస్సును గురించీ
ప్రశ్నించాలన్న ధ్యాసే నానుండి మాయమైంది