'నేనే ఈ క్షణం' నుండి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
'నేనే ఈ క్షణం' నుండి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29 మార్చి 2013

కానుకగా 'నేనే ఈ క్షణం ' కవిత్వసంపుటి



'నేనే ఈ క్షణం ' నా ఐదవ కవిత్వసంపుటి. నా మొదటి వచనకవిత్వం ఆరాధన . ఆ తరువాత రాసిన మూడు హైకూ సంపుటాలకీ తరువాత వచ్చిన వచనకవిత్వం ఇది. నా మూడు హైకూ సంపుటాలలోనూ హైకూ అభివ్యక్తిలో ఒక క్రమపరిణామం కనిపించినట్టుగానే, నా వచన కవితాభివ్యక్తిలోనూ సంపుటి నుండి సంపుటికి పరిణామం కనిపిస్తుంది. నా అభివ్యక్తిలో వస్తున్న మార్పులను రెండేళ్ళ క్రితం వచ్చిన ఆకాశం లోనూ, ఇప్పుడు రాస్తున్న కవిత్వంలోనూ కూడా చూడవచ్చును .

అయితే హైకూ రాసినా, వచనకవిత్వం రాసినా నా కవిత్వం 'అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం ' చెయ్యాలనే ప్రయత్నిస్తూ వస్తున్నాను.

నా కవిత్వం శాంతినిస్తుందనీ, బతికే ధైర్యాన్నిస్తుందనీ, నిర్మల దు:ఖాశృవులతో తమని శుభ్రంచేస్తుందనీ పాఠకులెవరైనా అంటున్నపుడల్లా నా సాధన వృధాకాలేదని అనిపిస్తుంది. ఈ కవిలాగా దు:ఖపడిన మరొక కవి తప్ప, ఈ గాఢమైన శాంతి వెనుక, జీవన్మరణాల సరిహద్దుల్లో పదేపదే ఊగిసలాడిన ఒక సాధారణమానవుని గుర్తుపట్టలేడు. ప్రతిచేదు అనుభవమూ జీవితం ఎంత అందమైనదో, ప్రేమాస్పదమైనదో నేర్పుతూనే ఉంటుంది, బహుశా మనలో ఎక్కడో మన అంతరాత్మని నిష్కపటంగా అనుసరించాలన్న అవ్యాజమైన అనురక్తి ఉంటే.

మీ హృదయాలు గాయపడి ఉంటే, బాధాతప్తమై ఉంటే ఈ కవిత్వం మీకేమి చెబుతుందో ఒకసారి వినండి. కవిత్వమంటే హృదయభాష అని ధృఢంగా నమ్ముతూ, బహిరంతర పోరాటాలతో అలసిన వాళ్ళకోసమే నా కవిత్వం కాని, కేవల వినోదానికి కాదని స్పష్టం చేస్తున్నాను.

'ఆరాధన ' 'నేనే ఈ క్షణం ' సంపుటులు ఆవకాయ.కాం లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. హైకూ, ఆకాశం సంపుటులు కినిగే.కాం లో లభిస్తాయి. కొత్త కవిత్వమంతా నా బ్లాగ్‌లో చూడవచ్చును.

ఇవాళ ప్రకటించిన 'నేనే ఈ క్షణం ' సంపుటికి ఆవకాయ.కాం లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

30 April 2013

పుస్తకాన్ని ఇక్కడే చదవటానికీ, Scribd సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవటానికీ క్రింది లింక్ చూడండి.

13 అక్టోబర్ 2012

ఆనందం

పూలూ, పక్షులూ, ఎడారులూ, సముద్రాలూ,
మబ్బులూ, సూర్యుళ్ళూ, నక్షత్ర సముదాయాలూ
ఎవరూ ఎరుగని ఏ శూన్యం నుండో
ఆనందాన్ని నీలోకి ఒంపుతున్నాయి
నీ జీవితం స్వయంగా ఆనందపు అభివ్యక్తి

దు:ఖం అనే నల్లటి ముసుగును మనపైన కప్పుకొని
కాలాన్ని గాఢాంధకారంగా చూస్తున్నపుడు కూడా
మనం ఆనందపు రూపంగానే వున్నాం

జీవనానందం అనే కాంతి మన కళ్ళని వెలిగించకపోతే
అంధకారాన్ని అయినా ఎలా చూడగలం

ఆనందించటం నీ హక్కు మాత్రమే కాదు. నీ బాధ్యత.
కళ్ళులేకుండా మరొకరికి దారి ఎలా చూపటం
నీకు తెలీని ఆనందాన్ని మరొకరికి ఎలా ఇవ్వటం
ఆనందంగా ఉండే పనిలో ఆనందంగా ఉండటమే విశ్రాంతి

ఆనందం దేనికీ ప్రతిచర్య కాదు
ఆనందానికి ఏదీ ప్రతిఫలమూ కాలేదు
మనం మాత్రమే ఆనందం పొందటంలేదు
ఆనందమూ మనని నిరంతరం పొందుతోంది

ఆనందమే ప్రేమ. ఆనందమే త్యాగం. సాహసం. స్వేచ్చ
ఆనందమే నిరంతర ముక్తబంధం

కారణాల సంకెళ్ళని ఆనందం తెంచుతోంది
మిత్రమా! అకారణంగా ఆనందించు
నువ్వు ఎవరూ ఎరుగని ఏకాంతపు ఆనందానివి



____________________
'నేనే ఈ క్షణం' సంపుటినుండి
 

09 సెప్టెంబర్ 2011

మరొక మెలకువ కోసం

నాయకులని చూసి నేనొక నాయకుడిని కావాలనుకోలేదు

ప్రతి మనిషీ తన జీవితానికి తానే నాయకుడినని గ్రహించినపుడు
మానవులు అడుగుతారు
'మాకు లేని ఏ భయాన్ని సృష్టించి
మాకు నాయకుడిగా ముందు నడవాలనుకొంటున్నావు' అని.

శాస్త్రవేత్తలను చూసి నేనొక శాస్త్రవేత్త కావాలనుకోలేదు

ఏ మొక్కల నుండో కొంచెం ఆహారం సేకరించి
మిగిలిన కాలం మానవులు సంతోషంగా గడుపుతున్నపుడు
వారు అడుగుతారు
'మాకు లేని ఏ బలహీనతలు కలిగించి
నీ ప్రయోగఫలాలు మా ముందు ఉంచాలనుకొంటున్నావు' అని.

కవులను చూసి నేనొక కవిని కావాలనుకోలేదు

జీవనానందమే కవిత్వ రహస్యమని,
ప్రతి మనిషీ తానొక కావ్యాన్నని తెలుసుకొన్నపుడు
వారు అంటారు
'మా పాట మేం పాడుకొంటాం. మేమే మా పాటలమై ఉన్నాం.
ఇక నీ పాట వినే తీరిక లే'దని.

ఏ మానవుని చూసీ, నేను అతనిలా కావాలనుకోలేదు.
నేను చూసిన ప్రతి మనిషీ,
తాను మరొకలా, మరొకరిలా కావాలనుకొంటున్నాడు

కానీ,
పూలని చూసి, నేనూ ఒక పూవు కావాలనుకొన్నాను

పూవుకి తననెవరో చూడాలన్న లక్ష్యం లేదు
మరొక పూవులా ఉండాలన్న కోరిక లేదు
సాయంత్రానికి రాలిపోతానన్న దిగులు లేదు
ఒక రంగుల నవ్వులా వికసించి, నిశ్శబ్దంలో కలిసిపోతుంది

ఆకాశాన్ని చూసి, నేనూ ఆకాశాన్ని కావాలనుకొన్నాను

ఎన్ని రాత్రులు, పగళ్ళు వచ్చివెళ్ళినా
ఆకాశం కొంచెం కూడా చలించలేదు
మబ్బులూ, సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ
ఎన్నిసార్లు నడిచివెళ్ళినా దానికి ఏ మరకా కాలేదు
తెంపులేని ఆనందంలా ఆకాశం ఎప్పుడూ తెరుచుకొని ఉంటుంది

ఒక రాత్రి కలగన్నాను
కలలో నేను పూలనీ, ఆకాశాన్నీ చూసాను

మేలుకొన్నాక
అవి నాలోనివనీ,
అవి అన్నీ నేనే అయి ఉన్నాననీ తెలుసుకొన్నాను

ఇప్పుడు మేలుకొని పూలనీ, ఆకాశాన్నీ చూసి
ఇవి నాలోనివనీ, ఇవి అన్నీ నేనే అయి ఉన్నాననీ చెప్పే
మరొక మెలకువ కావాలనుకొంటున్నాను


______________________
'నేనే ఈ క్షణం ' సంపుటి నుండి 

22 ఆగస్టు 2011

మహా వైఫల్యం

విఫలమైన కాంతి రంగులుగా కనిపిస్తుంది

అన్నీ అంతే
సత్యం నుంచి వైఫల్యమే జీవితం, ప్రపంచం, పాలపుంతలు

నా కవిత్వమూ అలాగే ఉండాలని, 
ఒక మహా నిశ్శబ్దం వైఫల్యంగా

జల జలా మాటలు కాదు
మహా నిశ్శబ్దాన్ని అదిమి పట్టుకొన్న ఒక్కొక్క అక్షరం కావాలి

ఇంత ప్రపంచం, ఇన్ని అనుభవాలూ అక్కర్లేదు
చాలా వరకూ చెరిపేయ వచ్చును

ఓ మంచు కణం ..  ఓ తృణం..  ఓ నేను..
అది కూడా క్రమంగా చెరిగి పోవచ్చును 

ఎండుటాకుల మీద నడక

పక్క కుదరదు. కలలు పట్టవు
రెప్పలకింద సూర్య బింబం మెరమెర లాడుతుంది

ప్లాస్టిక్ పూలని తాకి గాలి గాయపడుతుంది
నాగరికుడు వాడిపోడు. వికసించనూ లేడు

సంభాషణలో కొత్త వాక్యం, పదం, లేదా ఉచ్ఛారణ
నవ్వే చూపు రెక్క ముడిచి ఆలోచనపై వాలుతుంది

కొయ్య స్పర్శ లూ, కొయ్య మాటలూ,
కొయ్యబారిన చెట్లకి పూలు పూయవు

నమ్మకాల బుడగలకి సూది స్పర్శ
కలల రంగులు ముడుచుకు పోతాయి

కన్నీరు రాని దు:ఖం, కోపం రాని దు:ఖం,
కెరటాన్ని మడిచి లోయలోకి విసురుకొన్న దు:ఖం

ఏ కారణమూ, ఏ ఉద్వేగమూ శాశ్వతంగా ఆదుకోవు
దొరికిన శబ్దాలు పట్టుకొని ఎటో ఈదుతుంటాం 

18 ఆగస్టు 2011

పిల్లల లోకం

ఏ లోకం నుంచి వస్తారో ఈ పిల్లలు
ఈ కొత్త ప్రపంచాన్ని తేరిపార చూస్తారు

అక్కడ వాళ్ళు సంగీతంలో సంభాషిస్తారేమో
మన ఎదగని భాషని వాళ్ళ సంగీతంలోకి అనువదించుకొంటారు

వాళ్ళ లోకంలో జీవించటమంటే నర్తించటమేమో
ఇక్కడకూడా అల్లరి లయబద్దంగా చేస్తారు

మొక్కలూ, పిల్లలూ కలిసి ఆడుకొనే లోకమేమో అది
ఇక్కడ నవ్వుతారా, నిద్రిస్తారా, ఏడుస్తారా
అన్నీ పూలు పూస్తున్నట్టో, రాలుతున్నట్టో ఉంటాయి
తాము చేసేవి తమకు తెలీదు మొక్కలకు లాగే

ఏ లోకమో ఈ పిల్లలది
అక్కడ కాలం వుండివుండదు
ఆనందం తరువాత ఆనందమే కాని క్షణాల లెక్క తెలీదు

వాళ్ళ కలలూ, జ్ఞాపకాలూ
నీటి మీది బుడగలలా  ఎటో కొట్టుకుపోయినా పట్టించుకోరు

పిల్లలకి పుట్టామని తెలీదు, చనిపోతారని తెలీదు
అవి లేని లోకం నుండి వచ్చారేమో, అవి వాళ్లకి అర్ధం కావు

శరీరాలు అక్కర్లేని ఏ లోకం నుండి వచ్చారో ఇక్కడ దోబూచి ఆడతారు
అదృశ్యమయ్యే  లోకాలు మనకు అందవు కదా
కళ్ళు తెరిచి ఫకాలున నవ్వుతారు

పిల్లలకి చీకటి భయం, నిశ్శబ్దం భయం
అవి లేని కాంతి నించి వచ్చి ఉంటారు, శబ్దం నించి వచ్చి ఉంటారు

పిల్లలు తపతపా అడుగులేస్తూ మన లోకం లోకి నడుస్తూ ఉంటారు
వాళ్ళ అడుగులలో చివరిసారి ప్రతిఫలిస్తూ ఆ లోకపు సౌందర్యం అదృశ్యమౌతుంది

వాళ్ళ చేతులు పట్టుకొని నడక నేర్పుతామా
ఎపుడైనా వాళ్లిటు రావటం మాని
మననే అటు తీసుకుపొతే బాగుండునని ఎదురుచూస్తాము

ప్రపంచాలు

మనిషి ఒక ప్రపంచం 

బలం - బలహీనత 
వెలుతురూ - చీకటి 
ఒక ప్రపంచానికి ఒక మిశ్రమం 

ప్రతి ప్రపంచంలో 
పూలుంటాయి. ఎడారులుంటాయి

ప్రతి ప్రపంచంలో ముప్పాతిక 
కన్నీటి సముద్రమూ ఉంటుంది 

బహుశా, 
ప్రతి ప్రపంచంలో 
తనకే తెలియని అనంతాకాశం ఉంటుంది 

కొవ్వొత్తి

గది అంతా కాంతి నిచ్చే ఈ జ్వాలకి
చిక్కని కాంతి చర్మం ఒక సరిహద్దు

విత్తనం లాంటి వత్తిని
పారదర్శకంగా దాచుకొంది ఈ కాంతి ద్రాక్ష

వణికి వణికీ కదలని కాంతి ఏ చలికి గడ్డ కట్టింది

ఇంతలో రూపాంతరమై
జారుతున్న చినుకులా మృదువుగా మొనతేలింది

ఏ పిల్లాడు చెక్కాడు
ఈ కాంతి ముల్లును ఇంత సూటిగా

ఈ కొవ్వొత్తికి పొడవునా నీడ ఉంది కాని
నీడకి కాంతి రేఖలేదు

ఆర్పివేశాక చూస్తే
కొవ్వొత్తి టేబుల్ మీద ఉండిపోయింది
నీడని వెంటబెట్టుకొని కాంతి ఎటో వెళ్ళిపోయింది

17 ఆగస్టు 2011

పాపాయితో దేవుడు

నిద్రలో పాపాయి నవ్వింది 
తల్లి చెప్పింది 
'పాపాయితో దేవుడు మాట్లాడుతున్నాడ'ని

మనకి దేవుడు లేడు
కానీ 
దేవుడంటేనే లేకపోవటం 
మబ్బు మరకలు లేని నిర్మలాకాశం దైవం 

మన నిండా మబ్బులు పట్టి
రంగులూ, మెరుపులూ, శబ్దాలూ, జల్లులూ వెదజల్లుతాం
మనకి దేవుడు ఉండడు

కానీ, 
ఏమీ లేని నిర్మలాకాశం వంటి పాపాయితో 
లేకుండా ఉన్న దేవుడు మాట్లాడితే 
ఆశ్చర్యమేముంది 

16 ఆగస్టు 2011

అగరువత్తుల అమ్మాయి

అగరువత్తుల పెట్టెలు పట్టుకొని
ఒక చిన్నారి పాప, తన తమ్ముడితో  నా దగ్గరకు వచ్చింది
'రెండుకొంటే ఒకటి ఫ్రీ, తీసుకోండి' అంది
తీసుకొన్నాను

వాటికి అంత పరిమళం ఉండదు
కొన్ని క్షణాలు ఆ చిన్నారులలో వీచే సంతోష పరిమళాలు
నాకు అగరు వాసనల కంటే ఎక్కువ ఇష్టం

పక్కన ఉన్న మిత్రుడు నా తెలివి తక్కువ కొనుగోలును కనుగొన్నాడు
'అవి మంచి వాసన రావు' అన్నాడు
అతనితో అన్నాను
'అంతర్జాతీయ రంగునీళ్ళ వ్యాపారుల దగ్గర కంటే
ఈ పిల్లల దగ్గర మోసపోవటం నాకు తృప్తినిస్తుంది' అని

ఏం చెప్పాలి మరి
'తెలివిగా, నిర్దయగా ఉండటం కంటే
తెలివితక్కువగా, దయగా ఉండటం మంచిది' అంటే 
అతనికి అర్ధమౌతుందా
 

13 ఆగస్టు 2011

పాప ఇచ్చిన ఆకాశం

గదిలో నేను ఎప్పటి నాతోనే కాలం గడుపుతున్నపుడు
గుమ్మంలోంచి మా అమ్మాయి మబ్బుతునకలా లోనికి వచ్చి
'నాన్నా, ఆకాశం వెళ్ళిపోతోంది చూడు' అంది.

బైటికి వచ్చి చూస్తే
సూర్యకాంతిలో స్వచ్ఛనీలంగా మెరుస్తున్న ఆకాశంలో
తేలికపాటి మబ్బు తునకలు
బడి వదిలిన పిల్లల్లా వేగంగా వెళిపోతున్నాయి

ఇన్ని సంవత్సరాలుగా
నా లోపల కదలకుండా ఉన్న ఆకాశాన్ని
కొన్ని క్షణాలు చలింపచేసి
నాకు ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది మా అమ్మాయి

ఏదీ నిలబడకపోవటం వెనుక ఎంత సంతోషం దాగి వుందీ

'ఆకాశం ఎక్కడికీ వెళ్ళదమ్మా, మబ్బులు వెళతాయి' అని
పాపతో చెప్పాలనుకొన్నాను
కానీ కదిలే ఆకాశాన్ని నాకు ఇచ్చిన ఆమెకి
కదలని ఆకాశాన్ని ఎలా ఇవ్వను

నిజంగా ఆకాశం ఎప్పుడూ వెళ్లిపోతూనే ఉందేమో
నాకు మాత్రం ఏం తెలుసు


11 ఆగస్టు 2011

మంచుబిందువు

ఉదయాన్నే మంచుబిందువులు
ఆకాశం నుండి పిట్టల వలె ఎగురుతూ వచ్చి గడ్డిపరకలపై వాలతాయి.

వస్తూ, వస్తూ అవి ఒక్కొక్క చల్లని సూర్యుని వెంట తెచ్చుకొంటాయి.

వాటితో
'ఇన్ని సంవత్సరాలలో ఒక్క సూర్యుడైనా నాలో ప్రతిఫలించలేదు.
మీలో ఎలా నిలిచాడు?' అంటాను.

'మా వలే పారదర్శకంగా ఉండు.
నీలో విశ్వమంతా ప్రతిఫలిస్తుంది.' అంటాయి.

చూస్తూ ఉండగానే
వర్ణ వర్ణాలుగా రెక్కల్ని అల్లార్చుతూ
కనిపించే లోకం నుండి కనిపించని లోకానికి ఎగిరిపోతాయి.

మంచు నివసించిన జ్ఞాపకాలు ఏవో
గడ్డిపరకలపై గాలికి ఊగుతుంటాయి.

09 ఆగస్టు 2011

సీతాకోక రంగుల ప్రయాణం

వేసవి మధ్యాహ్నం
చెట్ల నీడలో ఇసుకపైన వాలింది సీతాకోక

తన రంగుల రెక్కల్ని విప్పుతూ, ఆర్పుతూ వుంది.

విప్పిన ప్రతిసారీ
ఒక కొత్త ప్రపంచం నా కళ్ళముందు పరుచుకొంటూ వుంది.

బహుశా, అది రెక్కలు మూసిన ప్రతిసారీ
ఏ సూక్ష్మ రహస్య లోకాలనుండో
ఒక్కొక్క ప్రపంచం వాటిపైన వాలుతుందనుకొంటాను.

సీతాకోక రెక్కలు విప్పినపుడల్లా
ఒక్కొక్క ప్రపంచం
ఈ వేసవి మధ్యాహ్నపు ఆకాశంలో
చప్పుడుచేయకుండా కరిగిపోతూ ఉంటుంది.

బహుశా, ఈ రంగుల ప్రపంచాలే
ఆకాశం ద్రవించి
కారుణ్య వర్షమై కురుస్తున్నపుడు
ఇంద్ర ధనస్సులై కనిపించి,
ప్రపంచాన్ని దీవించి
సూక్ష్మ రహస్య లోకాలకు మరలా తరలిపోతాయి.

నిన్ను ఊహించటమే...

నా ప్రపంచం వెనుక నీ స్మృతి
అంతర్గత సంగీతంలా ప్రవహిస్తూనే ఉంటుంది.

నా విరామాలలో
అల తీరాన్ని తాకినట్లు
నీ జ్ఞాపకం నన్ను కోమలంగా తాకుతుంది.
సంతోషమో, విచారమో తెలియని వ్యాకులతలో
సంధ్యాకాశంలా స్తబ్దంగా ఉండిపోతాను.

పగటి దు:ఖాలపైకి
రాత్రి దయగా అవతరించినట్లు
నువ్వు నా లోపల మృదువుగా అవతరిస్తావు.

నువ్వు దూరంగా ఉన్నావని దు:ఖించాలని ఉంటుంది.
నా లోపల నా కన్నా దగ్గరగా ఉండి నవ్వుతావు.

నీ స్మృతిలో ఉంటానా
క్రమంగా నువ్వు నన్ను ఆవరిస్తావు.
తెప్పరిల్లి గమనిస్తే నేను నువ్వుగా ఉంటాను.

నేను, నేనుగా ఉండటం కన్నా
నువ్వుగా ఉండటంలోనే ప్రశాంతత కలుగుతోంది నాకు.

బహుశా నేను నేనుగా ఉండటం
నా ఊహ అయి వుంటుంది.
నువ్వుగా ఉండటం వాస్తవం అయి వుంటుంది.

ఇప్పుడు అనిపిస్తోంది..
నా బాల్యంలో
నిన్ను ఊహించెందుకే ఊహ తెలిసింది నాకు.
కానీ, నిన్ను ఊహించటమే
నిన్ను నాకు దూరం చేసినట్లుంది.