31 మే 2014

రాక

నువు ఎందుకో ఇక్కడికి వస్తావు
వచ్చేసరికే ఇక్కడొక ఉత్సవం కొనసాగుతూవుంటుంది

నువ్వు ఎవరో, నీచుట్టూ జరుగుతున్నది ఏమిటో
నీకు నువ్వుగా తేల్చుకోకముందే వాళ్ళంటారు
'నువ్వు ఫలానా, ఇది చెయ్యాలి, అది కూడదు ' అని

ఈ ఉత్సవానికి అర్థమేమిటని అడగబోతావు
'అదేమిటి కొత్తగా అడుగుతున్నా' వంటారు
కొందరు జాలిదలచి 'నిరాశ కూడ' దని ఓదార్చుతారు

వారికి నచ్చినట్టు ఉండబోతావు కాని
భయ, హింసాపూరితమైన ఉత్సవంలో
ఏదో వెలితి వుందని తెలుస్తూనే వుంటుంది

ఉత్సవాన్ని విడిచి ఏకాంతమైదానం చేరి
నీ జవాబు నీలోనే వుందని నమ్మి అడుగుతావు
'ఇదంతా ఏమిటి’ అని

మరింత విశాలమౌతున్న ఆకాశం క్రింద
దృశ్యాలన్నీ అణగిపోయిన విశ్రాంతిలో ఉండిపోతావు
రాకపోకలు లేని నీలో కరిగిపోతావు

_______________
ప్రచురణ: వాకిలి జూన్ 2014 

20 మే 2014

ఒక మధ్యాహ్నం, ఆమె


1
నా గదిగోడలూ, వెలుపలి చెట్లూ
వాటిమీద వాలుతున్న మధ్యాహ్నపు ఎండా
మనుషుల భయాలూ, అవి సృష్టించే అడవినీడల్లాంటి ఊహలూ, వ్యూహాలూ
యధావిధిగా భద్రంగా ఉన్నాయని నమ్ముతున్నవేళ ఆమె ఫోన్ చేసింది

2
'మీ కవిత్వం చదివాను
మీ ఊహలన్నీ ఇంతకుముందే ఊహించాననిపిస్తోంది
నేను గతంలో ఉన్నానా, మీరు భవిష్యత్తులో ఉన్నారా ' అని అడిగింది

నాకూ అర్థంకాని సమాధానమొకటి చెప్పి
నన్నొక నైరూప్యకవితలోకి నడిపిస్తున్న ఆమె మాటల్ని వింటున్నాను  

ఏ కొండమీది బౌద్ధాలయంలోనో ఖణాలున మ్రోగిన గంటారావం
ప్రశాంతసమయంలోకి ప్రశాంతంగా కరిగిపోతున్నట్టు
స్వచ్ఛ శ్రావ్య కంఠస్వరంనుండి వికసించిన మాటలు నాలో కరిగిపోతున్నాయి  

3
'నేను ఉదయం నిద్రలేస్తానా
నాలోంచి ఎందరెందరో వెళ్ళిపోతుంటారు, ఏవో చెట్లూ, జంతువులూ కూడా 
అన్నీ వెళ్ళిపోయాక నేను లేస్తాను
ఎప్పుడూ నాతో మొక్కలూ, చీమలూ, గోడలూ ఏమో చెబుతుంటాయి'

నా వెలుపలి, లోపలి ప్రపంచాలని చెరిపేస్తూ
నాకు తాజా చూపునీ, ఊహనీ ప్రసాదిస్తూ ఆమె చెబుతూవుంది 

4
'కొన్నాళ్ళు ఎక్కడికో వెళ్లిపోయాను, గదిలో పెట్టి తాళం వేసారు కొన్నాళ్ళు
పిచ్చి అన్నారు కొందరు, కొందరు సైన్సు అంటున్నారు
నాకేమీ అర్థం కావటం లేదు, చెప్పండి నాకు పిచ్చివుందా '

ఇంత నిసర్గమైన మాటలు విని ఎన్నాళ్ళయింది
ఇంత నిర్మలమైన, దయ పుట్టించే కంఠం విని ఎన్ని రుతువులు గడిచాయి
అనాది అమాయక బాల్యపురాశి నుండి
నా వంతు  నేను పంచుకొని అనుభవించిన తొలిరోజుల్లోని
నా కంఠమూ, అమాయకత్వమూ ఆమె మాటల్లో చూసుకొంటున్నాను

5
‘లేదమ్మా, నువు ఆరోగ్యంగా ఉన్నావు
నీ ఊహలు, నీ వాస్తవానికన్నా శక్తివంతంగా ఉండటం మినహా
నువు చాలా బాగున్నావు '

6
ఎక్కడి ఆమె, ఎక్కడి నేను, ఏ జన్మాంతరాలలోని దయగల బంధం
ఏ తల్లీబిడ్డల బంధం, ఏ తండ్రీకూతుళ్ళ బంధం ఇవాళ మా మధ్య మేలుకొంది  

ఇంకా ఏమో విన్నాను, ఏమో చెప్పాను
'భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా '
నా చివరిమాటతో మా సంభాషణ ముగిసింది

భగవంతుడు లేకున్నా 
ఆ దయనిండిన క్షణాలనుండి పుట్టే వుంటాడు
ఆమెని చల్లగా చూస్తాడు

7
భద్రమైన భయాలతో బ్రతుకుతున్న నా ప్రపంచం మంచిదా
భయమెరుగని అమాయకత్వం నిండిన ఆమె ప్రపంచం మంచిదా

నా గదివెలుపల గోడలమీదా, చెట్లమీదా వాలుతున్న మధ్యాహ్నపు ఎండ
నా జీవితాన్ని కాసేపు వెలిగించి మరికొన్ని నీడల్ని మిగుల్చుతూ మాయమవుతోంది

02 మే 2014

బ్రతకాలి


నువు లోకాన్ని లోపలికి తీసుకొంటున్నపుడు
అది నిన్నూ లోపలికంటా తీసుకొంటుంది
నిశ్చలతటంలోకి దిగినట్టు లోకంలోకి దిగుతావు కానీ
నీటి అడుగున వేచివున్న మొసళ్ళని ఊహించలేవు

ప్రతి గెలుపూ, పరాజయమూ
జీవనానందం నుండి మరికాస్త దూరంచెయ్యటానికి వస్తాయి
కీర్తి ఒక వజ్రంలా ఆకర్షిస్తుంది కాని
దానిని మింగినపుడు ప్రాణం తీయటం మొదలుపెడుతుంది

జీవితం ఇటువంటిదని ఎవరూ చెప్పరు
జీవితం కానిది వదులుకొంటే జీవితమే మిగులుతుంది
చనిపొమ్మని నిన్ను ఊపేస్తున్న భావాలన్నీ  
జీవితపు నీడలే కాని, జీవితం కాదు

జీవితం తనని తాను చూసుకొనేందుకు
నిన్ను కన్నది కానీ, నువ్వేదో చేసి తీరాలని కాదు
ఏదో చెయ్యటానికే అన్నీ ఉండాలనుకొంటే
ఏదీ చెయ్యని ఆకాశం ఏనాడో మరణించి వుండేది
ఏమీ ఎరుగని చిరునవ్వు ఏనాడో మాయమైపోయేది 

జీవించడమంటే మరేం కాదు
గాలిలా, నేలలా, నీటిలా ఊరికే ఉండటం
ఉండటమే ఉత్సవమైనట్టు ఉండటం
మిగిలిన పనులన్నీ
నిద్రపోయినప్పుడు నీ పక్కలో ఒంటరివైన ఆటబొమ్మలు    


______________________
ప్రచురణ: నవ్య వారపత్రిక 7.5.14