11 డిసెంబర్ 2019

కవిత : కోరుకొని చూడు


కోరుకొని‌ చూడు ఏదైనా ఒక కోరిక

తామరాకుపై నీటిబిందువు తొణికినట్లు
వెన్నెలలో దూరంగా వేణువు వినవచ్చినట్లు
కలలోంచి పసిపాప ఇలలోకి నవ్వినట్లు
ఉండివుండీ వేడి నిట్టూర్పు విడిచినట్లు
మొలకెత్తనీ ఒక కోరిక నీ ఉనికి నుండి

వికసించనీ కోరికని
విశ్వమంతా తానై నిండునట్లు
జీవన కలశాన్ని తనలోకి ఒంపు కొనునట్లు
గుండె చెమరింపులో పలువర్ణాల మెరయునట్లు

కోరుకొని చూడు
వానధారల జగతి అంతా తనివిదీరా తడవాలని
ఎండ కన్నుల నిండుగా పండుగై వెలగాలని
మంచురేకులు విచ్చుకొనగా లోకమర్మం తెలియాలని

కోరుకొని‌ చూడు
ప్రాణులన్నీ శాంతిలోనికి ఒదగాలని
ప్రేమతో ద్రవించు జీవితం
మృతిని సైతం మనసు తీరా హత్తుకోవాలని

కోరుకొని‌ చూడు
చిన్ని కోరికనైనా మొలకెత్తనీయని
అంతు తెలియని ఆనంద గగనాన
విశ్వమంతా గుర్తుతెలియక కరిగిపోవాలని

6.4.18 6.10 PM
కవిసంధ్య సెప్టెంబర్ 2019

కవిత : ఉన్నట్టుండి

కవిత : ఎదురుచూస్తావు


నాన్న చనిపోయాడని విన్నావు కాని, చూడలేదు
ఏదో ఒకరోజు నీ కంటిముందు నిలుస్తాడని ఎదురుచూస్తావు

బడిలో, వీధిలో తోటిపిల్లలతో ఆదమరచి ఆడుకొంటూ ఉంటావా,
నీలో ఎవరో తనకోసం అదేపనిగా ఎదురుచూస్తూనే ఉంటారు
అమ్మ ప్రక్కలో పడుకొని, ముఖంలోకి మరోసారి చూస్తూ ఉంటావా,
తను వస్తాడన్న నమ్మకానికి బదులు, ఎప్పటి దిగులు మేఘాన్నే చూస్తావు

పూలు రాలిన చప్పుడు కన్నా, ఆకుల గలగలల సవ్వడి కన్నా
ఎవరిదో అడుగుల చప్పుడూ, ఎవరో తలుపు తెరిచిన చప్పుడూ
నీలో ఉద్విగ్న కెరటాలని మేలుకొలుపుతుంటాయి
బహుశా, వెళ్ళిన మనిషీ,
నీ దుఃఖం చూడలేక, కలలోకొచ్చి నిన్ను కౌగలించుకొంటాడు

ఎదురుచూస్తావు,
నవ్వుతూ, ఏడుస్తూ, ఇంటిలో, వీధిలో,
ఏ ఊరో వెళ్ళినపుడు కొత్త కొత్త మనుషుల్లో,
మనుషులు మాట్లాడుకొనే మాటల్లో అతని జాడ కనబడకపోతుందా అని
వెదుకుతూ, తడుముతూ ఎదురుచూస్తుంటావు

ఎదురుచూస్తూనే ప్రపంచాన్ని నేర్చుకొంటావు
ఎదురుచూస్తూనే ఎదుగుతావు దేహంలో, మనసులో, చూపులో
ఎదురుచూస్తూనే, ఇక రాడని తెలుసుకొంటూనే
కన్నీటిని చిరునవ్వుగా, కోపాన్ని క్షమగా పక్వం చేసుకొంటూనే
నువ్వు నీలో నిలదొక్కుకొంటావు

బహుశా, ఇప్పుడెవరైనా
ఊరెళ్ళిన తనవాళ్ళకోసం వియోగదుఃఖం ప్రకటిస్తే,
నీకు నవ్వొస్తుందేమో

వియోగమంటే
చాచిన చేతులకి తగలాల్సిన వాత్సల్యం పొంగే ఛాతీ,
కన్నీళ్లు జారే ముఖంపై పారాడాల్సిన దయగల శ్వాసా
ఊహల్లోంచి శూన్యంలోకి రాలిపోవటమని నీకన్నా ఎవరికి తెలుసు 

. . .
 
ఈ లోకం ఇంద్రధనుస్సనీ,
దీనిలోకి చేతులు చాపినా, చూసిన రంగులేవీ అంటుకోవనీ
ఈ ఇంద్రధనువుని కావలించుకోవాలంటే
నువ్వొక ఆకాశానివి కావటం మినహా వేరే దారి లేదనీ

దారినపోయే బైరాగి పాట వినగలిగితే తల్లీ,
నువ్వు ఎదురుచూసినవానికీ, నీకూ
అణుమాత్రమూ భేదంలేదని తెలిసివుండేది

2.8.16 11.37 ఉదయం

కవిత : ఆవలితీరం మిత్రునికి

కవిత : ఎలా


ప్రచురణ : వివిధ ఆంధ్రజ్యోతి దినపత్రిక 9.9.2019

కవిత : ఆకాశమూ - జీవితమూ

కవిత : ఖాళీద్వారం

కవిత : ఎవరిని