08 సెప్టెంబర్ 2013

ఒక్కసారిగా తెరుచుకోగల హృదయమేదీ..

'నీ జీవన సందర్భాన్ని మరిచిపోయి, నీ జీవితం పై దృష్టి నిలుపు. సందర్భం కాలం లోనిది, జీవితం ఈ క్షణంలోది. సందర్భం నీ మనస్సుకి చెందింది, జీవితం వాస్తవమైనది.' ~ ఎకార్ట్ టోలీ

ఎంత మేధాశక్తీ, విజ్ఞానమూ ఉన్నా ఈ సరళమైన విషయం అర్థం కాదు, కానీ కాస్తంత పసిదనం మనలో ఇంకా మిగిలి ఉంటే, చాలా తేలికగా, అర్థమవుతుంది ఎకార్ట్ టోలీ ఏమి చెపుతున్నారో, జీసస్, బుద్ధుడూ, నిసర్గదత్తా, రమణ మహర్షీ, జిడ్డు కృష్ణమూర్తీ ఇత్యాదులంతా ఏమి చెబుతున్నారో.

మనం బాల్యాన్ని కీర్తిస్తాం, దానిపై బెంగపెట్టుకొని కవిత్వం రాస్తాం, కానీ, రవంత అహంకారం తగ్గించుకోం, రవంత వ్యూహచతురత విడిచి నిసర్గంగా నిలబడం. గతానుభవాలు నేర్పిన భయాలూ, పెద్దరికం మోసుకొచ్చిన జడత్వమూ మనకు సౌకర్యం. భయాల నుండీ, నిలబడిపోవటాల నుండీ పుట్టే సిద్ధాంతాలూ, వ్యవస్థలూ, వ్యక్తిపూజలూ, యుద్ధాలూ, అపనమ్మకాలూ, అవి పుట్టించే వేదనా, హింసా, కాలక్షేపమూ మనకు ఇష్టం.

మనం పెద్దవాళ్ళం. నది ఒడ్డున నిలబడి, నదీస్నానపు పారవశ్యాన్ని అనుభవించాలనుకొనే భద్రజీవులం. బలమైన గోడలతో గదులు నిర్మించుకొని, ఆకాశపు విశాలత్వం మన గదిలోకి రావాలనుకొనే నియంతలం. బెరడుకట్టిన పెద్దరికంతో పసిదనపు సౌకుమార్యాన్ని, పూవులా బహు పలుచని అస్తిత్వంగా మిగిలివుండటంలోని పరమ సంతోషాన్ని, శాంతిని, స్వేచ్చని, నిష్కపటమైన దయలాంటి ప్రేమని తాకాలని పదేపదే ప్రయత్నించేవాళ్ళం.

మనం దురదృష్టవంతులం కాదు, మనమే దురదృష్టాలం. పసిదనాన్నీ, ప్రకృతినీ, జీవన లయనీ, లాలసనీ మతం పేరుతో, సైన్సు పేరుతో, అభివృద్ధి పేరుతో, కళల పేరుతో, నాగరికత పేరుతో పూర్తిగా విస్మరించిన వాళ్ళం, అశాంతిని జీవనగీతంగా వరించిన వాళ్ళం.

వాళ్ళు చెబుతున్నారు.. నువ్వు నీటిబుడగవి కాదు, నదివి. నువ్వు జీవితంలోకి ప్రవేశించలేదు, నువ్వే జీవితానివి. స్వేచ్చవి. శక్తివి. శాంతివి.
కానీ, వినే తీరికేదీ.. విని, చూపుసారించే ఓపికేదీ.. అన్నిటినీ ధిక్కరించి జీవితాన్నిజీవితంగా నిసర్గంగా కౌగలించుకొనే ప్రేమ ఏదీ.. ఒక్కసారిగా తెరుచుకోగల హృదయమేదీ..

7.9.13