25 సెప్టెంబర్ 2011

ఫొటోలు: వారణాసి, గంగానది, కవిత్వం

వారణాసినీ, గంగానదినీ చూడాలనే ఆర్తి అంతకుముందు చాలాసార్లు కలిగేది. ఇవి ఒక మతానికీ, విశ్వాసానికీ సంబంధించినవి మాత్రమే కాదు, అనాదినుండీ భారతీయ జీవనదార్శనికతకి ఇవి ఉన్నతమైన స్థానాలు. మనిషి మరణించే నిమిత్తం, మరణించాక తిరిగి జన్మించకుండా ఉండే నిమిత్తం ఒక క్షేత్రాన్ని ఎంచుకోవడం బహుశా, భారతీయ జీవనవిధానంలో మాత్రమే ఉంటుందేమో. ఆ ఆలోచనల వెనుక ఉన్న గొప్ప భావవాహిని ఇవాళ్టి ఉపరితల జీవితాలకి అర్ధం కాకపోవచ్చును. అక్కడకు వెళ్ళాక వారణాసీ నగరం నేను ఊహించుకొన్నదానికి అదనంగా కొంత నాగరికతని జోడించుకొన్నట్టు కనిపించింది కానీ, గంగానది నా ఊహల కన్నా ఉన్నతంగా అనిపించింది. గంగానది నా అంతస్సారమేమో అనిపించింది. 'నా' ఒక వ్యక్తి కాదు, మానవజాతి. గంగని దర్శించినపుడూ, గంగ ఒడిలో నన్ను దాచుకొన్నపుడూ గొప్ప స్వచ్చత, గొప్ప సరళత్వం, వాటిని మించి తెలియరాని ప్రశాంతత నా ఉనికిని కమ్ముకొన్నాయి. ఒకరోజు గంగా ఆరతి చూసాను. మరొకరోజు గంగ మొదటి ఘాట్ నుండి చివరి ఘాట్ వరకూ నడిచి తిరిగాను. సుమారు ఒకవారం అక్కడ గడిపి తల్లీ మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను అని గంగానదిని తలుచుకొంటూ తిరిగివచ్చాను.

2006 నవంబరులో గంగను, వారణాసిని మొదటిసారి దర్శించినపుడు తీసిన ఈ ఫొటోలను చూడండి. 156 ఫొటోలు. వాటిని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
తరువాత రెండవసారి 2008 మే లో వెళ్లినపుడు తీసిన ఫొటోలను కూడా ఇక్కడ జత చేస్తున్నాను. 127 ఫొటోలు. వాటిని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

రెండవ యాత్ర.

23 సెప్టెంబర్ 2011

చాలు


అడవిలో వికసించి రాలిన అనామక పుష్పంలా
ఎవరూ చూడనప్పుడు ఎగురుతూ వెళ్ళిపోయిన పేరు తెలియని పిట్టలా
అక్షరాలు గుర్తించేలోపు అదృశ్యమైన ఊహలా
గుడి తలుపులు మూసాక లోపల వెలుగుతున్న దీపంలా
నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి, నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి

కళ్ళలో దయా, స్పర్శలో నిర్మలత్వం,
మాటలో నిజాయితీ, మనిషిలా స్పందించటం మరిచిపోకుండా ఉంటే చాలు
హాయిగా నవ్వటమూ, హాయిగా ఏడవటమూ పోగొట్టుకోకుండా ఉంటే చాలు

దృశ్యమేదైనా చూడటమే ఆనందంగా
శబ్దమేదైనా వినటమే ఆనందంగా
రుచి ఏదైనా ఆస్వాదించటమే ఆనందంగా
జీవితమెలా వున్నా జీవించటమే ఆనందంగా ఉండగలిగితే చాలు

విశాలమైన మెలకువలూ, విశాలమైన నిద్రలూ తనివితీరా అనుభవిస్తే చాలు
వెలుపలా, లోపలా బోలెడంత విశ్రాంతి సంపాదించగలిగితే చాలు
బ్రతికినంత నిశ్శబ్దంగా, నిరాడంబరంగా మన చోటు ఖాళీ చేస్తే చాలు

__________________
'ఆకాశం' సంపుటి నుండి 

13 సెప్టెంబర్ 2011

'ఆరాధన' మొదటి సంపుటి నుండి..

1
సామ్రాజ్యాలను జయించినా
కీర్తి విస్తరిల్లినా
చిరుగాలికి ఊగే పచ్చగడ్డి మీది నుంచి
జారిపడే మంచుబిందువుని చూసి
మౌనంలో పడకపోతే
జీవితపు విలువలు తెలియవు

2
మరొక వేకువ
నీకు నీరాజనం ఇవ్వటానికి వస్తుంది
పుష్పాలు తమ అలంకారాలను
నీకోసం సిద్దం చేసుకొంటున్నాయి
నీకు దారి ఇవ్వటానికి
మంచుపరదాలు పక్కకు తప్పుకొంటున్నాయి
కానీ
నిన్న రాలిన ఎండుటాకు
తన చివరి వీడ్కోలు తెలుపుతూనే వుంది

3
పిట్టల కూతలు
గాలిని కావలించుకొని
ఉదయకాంతికి స్వాగతం చెబుతున్నాయి

మంచుబిందువు చుంబించే పుష్పాన్ని
ఉదయకాంతి ఆశీర్వదిస్తుంది

పసిపాప నుదుటిని
చిరుగాలి చుంబిస్తుంది
కనులు తెరవని పాప
గాలికి చిరునవ్వుని అద్దుతుంది

చెరువులో జారిపడిన ఎండుటాకు
తన అనుభవాలని చెరువుకి వివరిస్తుంది

అహంకారి మానవుడు
ఈ లోకంలో ఒంటరిగా మిగిలాడు

4
నా మౌనం అరణ్య నిశ్శబ్దాన్ని తాకినప్పుడు
నా నిట్టూర్పు కెరటాలచే ఆహ్వానించబడినప్పుడు
నేను జీవించే ఉన్నానని నాకు స్పష్టమైంది

5
ఉదయం వికసించింది
పుష్పాలు రేకులు విప్పాయి
తుమ్మెద వాలింది
గాలితెర కదిలింది

నన్ను ఎరిగిన నా మిత్రుడు
నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు

6
ప్రశ్నా
పరంపరలతో
నన్ను నేను వేధించుకొంటున్నపుడు
నన్ను తాకిన వాన చినుకు
ఆకాశంలో మెరిసే ఇంద్రధనస్సును చూడమని చెప్పింది

సప్తవర్ణాలలో నా చూపులు కరుగుతున్నపుడు
నన్ను గురించీ
ఇంద్రధనస్సును గురించీ
ప్రశ్నించాలన్న ధ్యాసే నానుండి మాయమైంది

12 సెప్టెంబర్ 2011

ఫొటోలు : శ్రీ రమణాశ్రమం, శ్రీ అరుణాచలం

శ్రీ అరుణాచలం (తిరువణ్ణామలై) జీవన్ముక్తిని అన్వేషించేవారు సందర్శించవలసిన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని స్మరించినా ముక్తి కలుగుతుందని పెద్దలమాట. అయితే అరుణాచలం అంటే ఏమిటి, స్మరించటం అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి...

శాశ్వతసత్యానికి సంబంధించిన వెలుగు కొందరు మహాత్ములలో, కొన్ని పవిత్రక్షేత్రాలలో ఏమంత శ్రమలేకుండా గోచరిస్తుంది. అయితే ఆ వెలుగుని అనుభూతించడానికీ తగినంత నిర్మలమైన, ప్రశాంతమైన మానసిక స్థితి ఉండాలి. పాత్రను బట్టి గంగ అన్నట్లు, యోగ్యతను బట్టి అనుభూతి.

అరుణాచల క్షేత్రాన్నికేవలదృశ్యంగా చూసినా ఒక అనాది నిశ్శబ్దమేదో మనని పిలుస్తున్నట్టుగా ఉంటుంది. తన వద్దకు రమ్మని, తనలో కరిగిపొమ్మని ఆ పవిత్రత మనవైపు దయగా చేతులు చాస్తున్నట్లు ఉంటుంది...

శ్రీ రమణులవంటి జ్ఞానులు, పర్వతపాదంలోని ఆలయంలోనే కాక, పర్వతం పర్వతంలోనే భగవంతుని స్వరూపాన్ని దర్శించిన ఆ క్షేత్రాన్ని చూడండి.

ఈ ఫొటోలు 2007 జనవరిలో శ్రీ రమణమహర్షి జయంతి రోజులలో వెళ్ళినపుడు తీసినవి. ఈ ఫొటోలలో శ్రీ రమణాశ్రమం, శ్రీ అరుణాచల గిరిప్రదక్షిణ, కొండపై శ్రీ రమణులు నివశించిన స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, యోగి రాంసూరత్ కుమార్ ఆశ్రమం, శ్రీ అరుణాచల ఆలయ దృశ్యాలను చూడవచ్చు. ఇవి 240 ఫొటోలు.

అన్ని ఫొటోలనూ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


09 సెప్టెంబర్ 2011

మరొక మెలకువ కోసం

నాయకులని చూసి నేనొక నాయకుడిని కావాలనుకోలేదు

ప్రతి మనిషీ తన జీవితానికి తానే నాయకుడినని గ్రహించినపుడు
మానవులు అడుగుతారు
'మాకు లేని ఏ భయాన్ని సృష్టించి
మాకు నాయకుడిగా ముందు నడవాలనుకొంటున్నావు' అని.

శాస్త్రవేత్తలను చూసి నేనొక శాస్త్రవేత్త కావాలనుకోలేదు

ఏ మొక్కల నుండో కొంచెం ఆహారం సేకరించి
మిగిలిన కాలం మానవులు సంతోషంగా గడుపుతున్నపుడు
వారు అడుగుతారు
'మాకు లేని ఏ బలహీనతలు కలిగించి
నీ ప్రయోగఫలాలు మా ముందు ఉంచాలనుకొంటున్నావు' అని.

కవులను చూసి నేనొక కవిని కావాలనుకోలేదు

జీవనానందమే కవిత్వ రహస్యమని,
ప్రతి మనిషీ తానొక కావ్యాన్నని తెలుసుకొన్నపుడు
వారు అంటారు
'మా పాట మేం పాడుకొంటాం. మేమే మా పాటలమై ఉన్నాం.
ఇక నీ పాట వినే తీరిక లే'దని.

ఏ మానవుని చూసీ, నేను అతనిలా కావాలనుకోలేదు.
నేను చూసిన ప్రతి మనిషీ,
తాను మరొకలా, మరొకరిలా కావాలనుకొంటున్నాడు

కానీ,
పూలని చూసి, నేనూ ఒక పూవు కావాలనుకొన్నాను

పూవుకి తననెవరో చూడాలన్న లక్ష్యం లేదు
మరొక పూవులా ఉండాలన్న కోరిక లేదు
సాయంత్రానికి రాలిపోతానన్న దిగులు లేదు
ఒక రంగుల నవ్వులా వికసించి, నిశ్శబ్దంలో కలిసిపోతుంది

ఆకాశాన్ని చూసి, నేనూ ఆకాశాన్ని కావాలనుకొన్నాను

ఎన్ని రాత్రులు, పగళ్ళు వచ్చివెళ్ళినా
ఆకాశం కొంచెం కూడా చలించలేదు
మబ్బులూ, సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ
ఎన్నిసార్లు నడిచివెళ్ళినా దానికి ఏ మరకా కాలేదు
తెంపులేని ఆనందంలా ఆకాశం ఎప్పుడూ తెరుచుకొని ఉంటుంది

ఒక రాత్రి కలగన్నాను
కలలో నేను పూలనీ, ఆకాశాన్నీ చూసాను

మేలుకొన్నాక
అవి నాలోనివనీ,
అవి అన్నీ నేనే అయి ఉన్నాననీ తెలుసుకొన్నాను

ఇప్పుడు మేలుకొని పూలనీ, ఆకాశాన్నీ చూసి
ఇవి నాలోనివనీ, ఇవి అన్నీ నేనే అయి ఉన్నాననీ చెప్పే
మరొక మెలకువ కావాలనుకొంటున్నాను


______________________
'నేనే ఈ క్షణం ' సంపుటి నుండి 

05 సెప్టెంబర్ 2011

హైకూలు


వర్షం
క్షణం పూచే నీటి పూలతో
ఊరు నిండిపోయింది

ఓ క్షణం జీవించాను
అలపై చిట్లిన
వెన్నెలను తాకబోయి

రంగులపిట్ట
మనసు కాన్వాసు పై
రంగులు పులిమేస్తుంది

దూరంగా దీపం
దానిని కాపాడుతూ
అంతులేని చీకటి

పడవ కదలటం లేదు
నీడనైనా తనతో రమ్మని
కాలువ లాగుతోంది
 
(దృశ్యాదృశ్యం  నుండి)


03 సెప్టెంబర్ 2011

గాయపడినప్పుడు

అకస్మాత్తుగా గాయపడతాము
మన ప్రాణం నింపి విడిచిన మాటని ఎవరో తేలిక నవ్వుతో చెరిపేస్తారు
పగటి కలలో గాలిపటంలా తేలుతున్నపుడు ఎవరిదో అరుపు దారమై లాగేస్తుంది
కోనేటిలో నిదానంగా ఈదే చందమామకి రాయి తగిలి వేయి ముక్కలౌతుంది
మన ముఖాన్ని కలగంటున్న అద్దం పగిలి మనల్ని అన్నివేపులా విసిరేస్తుంది

అప్పుడు ఎవరో మనల్ని చెరిపేసి మన స్థానంలో గాయాన్ని నిలబెడతారు
అప్పటి నుండి ఒక గాయం మన బదులు మాట్లాడుతుంది, తింటుంది, నిద్రపోతుంది
మనం నవ్వాల్సివస్తే మన బదులు ఒక గాయం నవ్వుతుంది

గాయం గదిలో చేరి చిరునవ్వు కాంతినైనా, ఆర్ద్రవాక్యం వంటి శీతల పవనాన్నైనా
తనలోనికి రానీయకుండా తలుపులు మూసేస్తుంది
స్వాతి చినుకులాంటి గాయాన్ని స్వీకరించి ఆల్చిప్పలు మూసుకొంటాయి
జీవితం గది చుట్టూ దయగా, ఆత్రుతగా పచార్లు చేస్తూ ఉంటుంది

గాయం తపస్సు చేస్తున్నంత శ్రద్దగా, తనతో తాను యుద్ధం చేస్తుంది
పరీక్ష రాస్తున్నంత ఏకాగ్రతగా తనని తాను వ్యక్తం చేసుకొంటుంది
కాంతినిండిన ఒక ఉదయం ఆల్చిప్పలూ, తలుపులూ తెరుచుకొంటాయి
చినుకుతో పోరాడిన జీవి ఏదో
చందమామలా బైటికి వచ్చి జీవితాన్ని కౌగలించుకొంటుంది


__________________
'ఆకాశం' సంపుటి నుండి