30 జులై 2021

కవిత : ఈ క్షణం

ఈ క్షణ మొకసారి పిల్లకాలువ
తేలికగా ప్రవహిస్తూ పోతుంది
ఒక్క గెంతులో దానిని దాటగలుగుతావు
మరొకసారి మహాసముద్రం
దానిలో మునిగిపోకుండా నిలబడటానికి
నీ శక్తులన్నీ ఒడ్డుతావు

ఒకసా రొక చినుకు
గుర్తించేలోపు పలకరించి మాయమౌతుంది
మరొకసారి మురికికూపం
తప్పుకొని పోయేందుకు తహతహలాడతావు

అనేక క్షణాలుగా కనబడే ఒకే ఒక క్షణం ఇది
దానిని అనుభవిస్తున్న ట్లుంటుంది గానీ
అదే నిన్నూ, నన్నూ, లోకాన్నీ
అనుభవిస్తూ, పలవరిస్తూ సాగుతోంది కొండచిలువలా

క్షణాన్ని ఊరకనే పైపైన తాకి
అది పూవు లాంటిదనో, పండులాంటిదనో
రంగులు రాల్చిన ఎండుటాకులాంటిదనో
తేలికగా తలుస్తావు గానీ
దాని గర్భంలో ఏముందో పసిగట్టలేవు

క్షణం గర్భంలో అనంత విశ్వాలున్నాయి
అంతూదరీ లేని లోతులున్నాయి
మొనదేలిన తర్కాలకూ అందని కొలతలున్నాయి

తెలియరాని ఆకర్షణ ఏదో
దాని ఖాళీరంగు సుడిగుండంలోకి
బలంగా లాగేటప్పుడు జాగ్రత్త
వెనుతిరిగి జీవితంలో పడేందుకు
నీకు నువ్వంటూ ఏమీ తగలక పోవచ్చును

ప్రచురణ : ఈ మాట జూన్ 2021