31 ఆగస్టు 2014

ఒక దారి

1
నువ్వు ఇంటిలో వున్నావు 
ఇల్లు నీ ఊరిలో, ఊరు దేశంలో, దేశం భూమ్మీద,
భూమి ఒక పాలపుంతలో, పాలపుంత అనంతంలో

మధ్యలోని గీతల్ని మరిచిపోయి గమనిస్తే
ఎప్పుడూ అనంతంలోనే ఉన్నావని కొత్తగా కనుగొంటావు 

2
నీ దేహాన్ని గూడుగా కట్టుకొని 
లోపల వెలిగే పక్షి అద్బుతమైనది

రెండుకళ్ళ రెక్కల్ని ఎంత చాపగలిగితే 
అంతకు అంతై విస్తరిస్తుందీ పక్షి 

తండ్రీ, నువ్వు చీమని చూస్తున్నపుడు చీమవి
అనంతాన్ని చూస్తున్నపుడు అనంతానివి 

అనంతం తరువాత ఏముందని అడగనవసరంలేదు 
మాట చేరగలిగే ఆ చివరిచోటికి చేరుకొన్నాక 
చూపుకాని చూపులోకి రాలిపోతావు

30 ఆగస్టు 2014

అమ్మమ్మ

1
'అమ్మమ్మా వాన పడుతోంది '
ఆరుబయట పక్కలో పడుకొన్న మనవడు ఉలిక్కిపడినప్పుడు
'పడనీరా చల్లగా ఉంటుంది ' అన్న అమ్మమ్మ మాట
అతని జీవితానికొక చూపునిచ్చింది

వానకి భయపడి ఇంటిలోకి పరుగెట్టనక్కరలేదు 
వానలో తడవటం బావుంటుంది 
దయలాంటి వానకి , ప్రకృతిలోని అందమంతా కరిగి నీరై పడేవానకి
నిన్ను అర్పించుకోవటం బావుంటుంది

మట్టివాసనల్ని మేల్కొలుపుతూ   
నిన్ను ఆర్ద్రతలోకి చల్లగా నడిపించే వానపట్ల,
వానలాంటి జీవితంపట్ల ఉండాల్సింది భయం కాదు, ప్రేమ

2
అమ్మమ్మ దేనినీ ధిక్కరించలేదు
ఎవరినీ ఎప్పుడూ గద్దించగా చూడలేదు

భూమిలాంటి అమ్మమ్మ
అంత ఉమ్మడికుటుంబానికీ కేంద్రమై కూడా
తనని నేపధ్యంలోనే నిలుపుకొంది

తాతయ్య తడినిండిన మేఘగర్జనలకి
ఆమె బెదురుతున్నట్లుండేది కాని
ఆమె బెదిరేమనిషి కాదని తాతయ్యకి తెలుసు
భయం చివర సమస్తజీవితాన్నీ దీవిస్తున్నట్టు విచ్చుకొనే
ఆమె చిరునవ్వు చూసిన మనవడికీ తెలుసు 

3
జలధరంలాంటి ఉమ్మడికుటుంబం క్రమంగా  
తెల్లని మబ్బుతునకలుగా చెదిరిపోయి  
జీవితసహచరుడూ సెలవుతీసుకొన్న చివరిరోజులలో
కూతురు అమ్మయి రుణంతీర్చుకొంటున్నపుడు 

అగాధమైన నిశ్శబ్దం నిండిన చూపులతో
చివరిరోజులోకి భయంలేక ప్రయాణిస్తున్నట్లుండే 
ఆమె జీవస్పందనలని గమనించినప్పుడల్లా

యవ్వనపుతొందరల మధ్యనున్న మనవడు  
అమ్మమ్మ ఏం ఆలోచిస్తుందీ అని విస్మయపడుతూనే ఉండేవాడు

4
ఒక ఉక్కపోసే సాయంత్రంలోకి చేరుకొన్న మబ్బులు 
చినుకుల్లా కరిగి భూమిని నిశ్శబ్దంగా తాకుతుంటే

గదిలోంచి బయటకు వెళుతున్న మనవడితో ఆమె
'ఏమిటది, వానపడుతోందా ' అన్నపుడు
అతను ఊహించలేదు అవి తనతో ఆమె చివరిమాటలని
ఉక్కపోతతో నిండనున్న జీవితంలోంచి చివరి వానాకాలం వెళ్ళిపోనుందని

5
జీవితం అమ్మమ్మలా దయగలదీ, ఓర్పునిండినదీ
కాదని తెలుసుకొంటున్నా
దానిని ప్రేమనిండిన చిరునవ్వుతో ముగించటమెలాగో
ఆమెనీడలో పెరిగిన కూతురుకొడుకు నేర్చుకొంటున్నట్టే ఉన్నాడు  

కనుకనే, దుఃఖపూరిత జీవితానుభవాన్ని
దయగల పదాల్లోకి అనువదిస్తున్నాడుడిసెంబర్

ప్రచురణ: తానా పత్రిక 2014

25 ఆగస్టు 2014

తెరిచినవేళల

ఇంటికిచేరి తలుపులు తెరుస్తున్నపుడు
జీవితమంతా నువ్వు తెరిచినవన్నీ గుర్తుకొస్తాయి

తెరిచిన పుస్తకాలు, స్నేహాలు
తెరిచిన మాటలు, నవ్వులు, కన్నీళ్ళు
తెరిచిన పగళ్ళు, రాత్రులు
భూమ్మీద నీకు నువ్వుగా తెరిచిన నీ జీవితం

ప్రతిదీ తెరిచినపుడల్లా
మరికాస్త పూలరేకుల్లాంటి వెన్నెల
తాజాగా నీలో రాలటం గుర్తిస్తావు

తెరవటంలో సంతోషంవుంది గనుకనే
సృష్టి నిరంతరం తెరుచుకొంటుంది
ఎల్లలులేక జ్ఞానం విస్తరిస్తోంది

కానీ, తెరుచుకొన్నవి
నీ వెనుకనే మూసుకుపోవటం చూసినపుడు
నీడలాంటి విషాదం నీలో పరుచుకొంటుంది

బహుశా, అందుకనే
లోనికి వచ్చి తలుపులు మూసే ప్రతిసారీ
నిలువెత్తు నిస్పృహ నిన్ను కమ్ముకొంటుంది

తెరుచుకొన్న మెలకువ
నిద్రలోకి ముడుచుకొనే ప్రతిసారీ
సదా వికసించేచోటికి యాత్ర మొదలౌతుంది

19 ఆగస్టు 2014

ఆనందంలోకి

ఎవరైనా ఆనందంగా కనిపిస్తే కారణమేమిటని అడగకు
కారణాలకేముంది, భిన్నమైన కోణాల్లో, తలాల్లో వుంటాయి

ఒకటే ఆనందంలోకి ఒక్కసారిగా చొరబడినపుడు
కారణాల సంకెళ్ళని కాసేపు తెంచుకొన్న మనిషికి
విడిచి వచ్చిన దిగుళ్ళని గుర్తుచేయకు

కారణాతీత లోకమొకటి
ఎవరిలో నుండైనా అకస్మాత్తుగా పిలుస్తున్నపుడు
నేలమీది వ్యాకరణాలన్నిటినీ ఒకేసారి విదిలించుకొని తనతో ఎగిరిపోక
భద్రగృహాల తలుపుల్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని
రెండో చేతిని ఆకాశానికి చూపిస్తే ఏం ప్రయోజనం 

మనిషి సునాయాసంగా పువ్వైనపుడు, పక్షైనపుడు
ఇంద్రధనువో, నీటితుంపరో, ఆకాశమో అయినపుడు
అసలేమీకాకుండా మిగిలినపుడు, మిగలనపుడు
సూర్యుణ్ణొక ఆనందబిందువు చేసి మనపై కాంతి కురిపిస్తున్నపుడు
కారణాల లంగర్లు విప్పుకొని
అతని ఆనందంలోకి హాయిగా, దయగా మనల్ని కోల్పోయి చూడాలి

కారణమేం కానీ, పసిబిడ్డలాంటి పరవశమేదో
సాటి మనిషినొక  తెల్లనిమేఘం చేసి
రా అనగానే వెళ్ళగలిగినవాడిదే కదా, స్వర్గం!

17 ఆగస్టు 2014

వెళ్ళనీ

వెళ్ళనీ అంటారు అమృతవిద్య తెలిసినవారు 
పనితొందరలో వున్నట్టు పరుగులుపెట్టే గాలికీ, నీటికీ, కిరణాలకీ
నీ చేతులు విశాలంగా చాపి మరీ వీడ్కోలు పలికినట్టు
మనుషుల్నీ, ఊహల్నీ కూడా నిన్ను విడిచి వెళ్ళనిమ్మని అంటారు

జ్ఞానమనీ, మోక్షమనీ చెబుతారే అదేమిటని అడిగినప్పుడు
ఏదీ ఉండదనే వివేకంలోకి మేలుకోవటమే జ్ఞానమనీ
అన్నిటినీ సహజంగా పోనివ్వటమే మోక్షమనీ చెబుతారు

వెళ్ళిపోతే కొత్తవి వస్తాయా అని అడుగుతామా 
కొత్తవి వచ్చే హామీ లేదు కాని
వెళ్ళనివన్నీ ఉన్నచోటనే జీవం కోల్పోతాయని చెబుతారు

వేటినీ వెళ్ళనివ్వం కనుకనే
మన చుట్టూ ఎడారుల్ని కావలికాస్తున్న దిగులు 
మన ముఖాలపై చీకట్లను దాస్తోన్న వెల్తురు నవ్వులు 

హుందాగా వెళ్లనివ్వటం మరిచినపుడల్లా
కిరణాల్లా బయలుదేరిన మనం నీడలుగా మారిపోతాం   

ఈ బానిసత్వాన్ని ప్రేమగా భ్రమించి మురిసిపోతామా
స్వేచ్చ తెలిసినవాడు రహస్యంగా సమస్తాన్నీ ప్రేమిస్తూ వుంటాడనీ
బంధాలలో మునిగినవాడు రహస్యంగా తనని కూడా ద్వేషిస్తాడనీ  
మనం ద్వేషిస్తామని తెలిసి కూడా ప్రేమకొద్దీ చెబుతూనే వుంటారు

16 ఆగస్టు 2014

నీలో కొన్నిసార్లు

నీలో కొన్నిసార్లు ఉత్సవముంటుంది

అప్పుడు నీకందర్నీ పలకరించాలనిపిస్తుంది
పూలతో, పిట్టలతో, దారినపోయే మనుషులతో
నీకు తోచిన మాటలన్నీ మాట్లాడాలనిపిస్తుంది
దు:ఖంచే నేత్రాలపై మృదువుగా ముద్దులు పెట్టాలనిపిస్తుంది
ఎవరేమనుకొంటే ఏమిటని తోచినపాటలన్నీ పాడాలనిపిస్తుంది
దేహాన్నొక కెరటం చేసి నర్తించాలనీ,
నలుగురు పిల్లల్ని పోగుచేసి పరుగుపందెంలో వాళ్ళతో ఓడిపోవాలనీ అనిపిస్తుంది

నీలో కొన్నిసార్లు నిరాశ వుంటుంది

అప్పుడు ప్రకాశిస్తున్న ఎండలోకి ఎవరో చీకటిని ఒంపుతున్నట్లుంటుంది
కనిపించని తలుపులన్నిటినీ మూసుకొంటూ లోలోపలికి వెళ్ళిపోవాలనిపిస్తుంది
గండశిలలాంటి కాలాన్ని పగలగొట్టి దిగంతాలకి విసిరేయాలనిపిస్తుంది
తెలియని ఉప్పెన ఏదో నలువైపులా నుండీ ముంచేస్తున్నట్లుంటుంది
విసుగువేరు తొలుచుకొంటూ వెళ్ళి నిన్ను పూర్తిగా ఖాళీ చేసుకోవాలనిపిస్తుంది

కొన్నిసార్లు భయముంటుంది నీలో

రాత్రి వచ్చిన కలచివర ఊహకందని శక్తి ఏదో నిన్ను ఎత్తుకుపోయినట్లుంటుంది
నిన్ను నొక్కిపెడుతున్న ఎవరినో శక్తికొద్దీ విసిరేయాలనిపిస్తుంది
రానీ, చూసుకొందామనే మొండిధైర్యంలోకి పూర్తిగా దూకేయాలనిపిస్తుంది
ప్రపంచాన్నంతా కూర్చోబెట్టి గబగబా పాఠాలు చెప్పేయాలనిపిస్తుంది

కొన్నిసార్లు నీలో శుభ్రమైన మౌనం వుంటుంది

ప్రపంచాన్ని చూసి ఒకే ఒక పసినవ్వు నవ్వాలనిపిస్తుంది
రాలినపూవు నేలని తాకిన చప్పుడు నీలో కోమలంగా కరిగిపోయినట్లుంది
సూర్యోదయాన్ని దోసిలిలో ఒంపుకొని సుతారంగా త్రాగినట్లుంటుంది
ఆకాశం ఒక పక్షిరెక్కయి శాంతిలోకి ఎగురుతున్నట్లుంటుంది

అప్పుడు మాత్రమే నీకు నువ్వు నిజంగా పుట్టినట్లనిపిస్తుంది

08 ఆగస్టు 2014

ఆమె స్పర్శ

1
ఆమె చేతిని చేతిలోకి తీసుకొంటున్నపుడు
సగంప్రాణంగా సంచరిస్తున్న దు:ఖమేదో
కట్టతెగిన నదిలా కాసేపు నిన్ను కమ్ముకొంటుంది

ఆమె నీకు ఒక స్త్రీ మినహా ఏమీ కాకపోవచ్చును 
రవంత కాంక్షాపరిమళంతో వెచ్చనైన స్పర్శ
ఆమె చేతినుండి దయగా నీలోకి ప్రవహిస్తున్నపుడు

ఎండినలోయలు నదులతో నిండుతున్నట్లూ
పచ్చని జీవితం మేలుకొనే సందడి 
సమీప మైదానాల నిండా వ్యాపిస్తున్నట్లూ వుంటుంది  

2
నిజంగా, ఒక స్త్రీని, నీ దేహం మాత్రమే కోరుతుందా 
దేహం మాత్రమే ఈ లోకంలో సగంగా తిరుగుతోందా 

అద్దంలో నీ ప్రతిబింబంలా
నువు నవ్వే వాటికి నవ్వే,  ఏడ్చేవాటికి ఏడ్చే 
తెలియరానిలోకాలకి, నీలానే, ఏకాంతపథికురాలయే 
మరొక హృదయం కోసం నీ హృదయం కూడా వెదుకుతోందా 

3
ఆమె తాజాస్పర్శ నీలోకి ప్రవహిస్తున్నపుడు
మీరు కలుస్తూ ఉండగానే వేరుపడుతూ వుండటం గమనిస్తావు
ఆమె నీ స్త్రీ కాదనీ, తనకంటూ ఉనికిలేని నీ మనిషిలా 
ఎవరూ ఉండరనీ, కూడదనీ తెలుసుకొంటావు

వేగంగా ఎదురైన నక్షత్రాలు వేగంగా వెనుకకు వెళ్లిపోయినట్లు
ఆమె చేయి విడిచేలోగానే ఆమె నుండి విడిపోతావు

4
ఒక అమూర్త సమయంలో
సగాలన్నీ ఉత్త ఇంద్రధనువులని తెలుసుకొంటావు
సూర్యకాంతినీ, వాననీ విడిగా గుర్తుపడతావు 
చల్లని గాలితెరలాంటి చిరునవ్వులోకి మేలుకొంటావు

07 ఆగస్టు 2014

స్వీయ పరిశీలన అంటే భయంలేనివారి కోసం..

అనేక విశ్వాసాలనూ, లౌక్యాలనూ తలకిందులు చేసి, మనని దిగ్బ్రమకి గురిచేసే శ్రీ నిసర్గదత్త మహరాజ్ జవాబులు చదవండి.

ప్రశ్న: ఒక రూపంతో ఉన్న దైవాన్నీ లేదా ఒక ఆదర్శ మానవుడినీ పూజించండి కానీ, నిరపేక్ష సత్యాన్ని పూజించవద్దనీ, అది బుద్ధికి శ్రమ కలిగించే విషయమనీ చెబుతుంటారు.

జవాబు: సత్యం సరళమైనది, అందరికీ తెలిసేది. దానిని సంక్లిష్టం చేస్తారెందుకు? అది ప్రేమాస్పదం. అది అన్నిటినీ స్వీకరిస్తుంది, అంగీకరిస్తుంది, శుభ్రం చేస్తుంది. 

సంక్లిష్టంగా ఉండేది అసత్యం, అదే సమస్యలకి మూలం. అది కోరుతుంది, ఎదురుచూస్తుంది, బలవంతపెడుతుంది. అది లేనిది కావటం వలన, ఖాళీగా వుంటుంది, ధృవీకరణ కోసం వెదుకులాడుతుంది. అది పరిశీలన అంటే భయపడుతుంది, నిరాకరిస్తుంది. తనని ఏదో ఒక ఆధారంతో పోల్చుకొంటుంది, అది ఎంత బలహీనమైనా, క్షణికమైనా కూడా. అది దేనిని పొందినా, మళ్ళీ వదిలేసి, మరింత ఎక్కువ కోసం అడుగుతుంది. కనుక చైతన్యం (మనస్సు) పైన  నమ్మకం ఉంచకు. నువు చూసేదీ, అనుభూతించేదీ, ఆలోచించేదీ ఏమీ లేదు. 

పుణ్యమూ, పాపమూ, గుణమూ, దోషమూ కూడా అవి నీకు కనిపిస్తున్నట్టు ఉండవు. మంచీ, చెడూ అనే పదాలు కూడా ప్రపంచం ఆహ్వానించడానికీ, లేదా నిరాకరించడానికీ అలవాటుపడ్డ కొన్ని ధోరణులు మాత్రమే.

ప్రశ్న: అయితే మంచి కోరికలూ, చెడ్డ కోరికలూ, ఉన్నతమైనవీ, హీనమైనవీ ఉండవా?

జవాబు: అన్ని కోరికలూ చెడ్డవే, కొన్ని మిగతావాటికన్నా హీనం. ఏ కోరికైనా సమస్యలకు దారితీస్తుంది.

ప్రశ్న: కోరికనుండి విముక్తి పొందాలనే కోరిక కూడా?

జవాబు: అసలు కోరిక ఎందుకు? కోరిక నుండి స్వేచ్చపొందిన స్థితిని కోరుకోవటం కూడా స్వేచ్ఛనివ్వదు. ఏదీ నీకు స్వేచ్చనివ్వలేదు, కారణం నువ్వు స్వేచ్చగానే ఉన్నావు గనుక. కోరికలేని స్పష్టమైన చూపుతో నిన్నుచూడు. అది సరిపోతుంది.

ప్రశ్న: తనని తాని తెలుసుకొనేందుకు చాలా సమయం పడుతుంది.

జవాబు: కాలం ఎలా సహాయం చేస్తుంది? కాలం క్షణాల పరంపర. ప్రతి క్షణం శూన్యం నుండి పుట్టి, మళ్ళీ కనిపించకుండా శూన్యంలో కలిసిపోతుంది. ప్రవహించిపోయే దానిపై ఏదైనా ఎలా కడతావు?

ప్రశ్న: ఏది శాశ్వతం?

జవాబు: శాశ్వతమైనదానికోసం నీ లోపలికి చూడు. నీ లోలోపలికి దూకి, నీలో నిజమైనదేదో కనుక్కో.

ప్రశ్న: నాకోసం నేను ఎలా చూడాలి?

జవాబు: వెదుకు. నువ్వు కేవలం సాక్షివనీ, నిశ్శబ్దంగా గమనించేవాడివనీ నేను చెప్పినా, నీకు ఏమీ తెలియదు, నీ నిజమైన ఉనికి లోకి నువ్వు దారి కనుక్కోనేవరకూ.

- శ్రీ నిసర్గదత్త మహరాజ్  I am that  నుండి.

Questioner: We are advised to worship reality personified as God, or as the Perfect Man. We are told not to attempt the worship of the Absolute, as it is much too difficult for a brain­centred consciousness.

Maharaj: Truth is simple and open to all. Why do you complicate? Truth is loving and lovable. It includes all, accepts all, purifies all. It is untruth that is difficult and a source of trouble. It always wants, expects, demands. Being false, it is empty, always in search of confirmation and reassurance. It is afraid of and avoids enquiry. It identifies itself with any support, however weak and momentary. Whatever it gets, it loses and asks for more. Therefore put no faith in the conscious. Nothing you can see, feel, or think is so. Even sin and virtue, merit and demerit are not what they appear. Usually the bad and the good are a matter of convention and custom and are shunned or welcomed, according to how the words are used.  
Q: Are there not good desires and bad, high desires and low?

M: All desires are bad, but some are worse than others. Pursue any desire, it will always give you trouble.

Q: Even the desire to be free of desire?

M: Why desire at all? Desiring a state of freedom from desire will not set you free. Nothing can set you free, because you are free. See yourself with desireless clarity, that is all.

Q: It takes time to know oneself.

M: How can time help you? Time is a succession of moments; each moment appears out of nothing and disappears into nothing, never to reappear. How can you build on something so fleeting?

Q: What is permanent?

M: Look to yourself for the permanent. Dive deep within and find what is real in you.

Q: How to look for myself?

M: Whatever happens, it happens to you. What you do, the doer is in you. Find the subject of all that you are as a person.

Q: What else can I be?

M: Find out. Even if I tell you that you are the witness, the silent watcher, it will mean nothing to you, unless you find the way to your own being.

- From Nisargadatta Maharaj's 'I Am That' 

06 ఆగస్టు 2014

ఒకే మెలకువ

'అవతలితీరానికి నాకొక నావ దొరికింది
ఎవరైనా వస్తారా నాతో' అని అడుగుతావు
నది ఒడ్డున రికామీ చేతులతో
ఊరికే తిరిగే బాలుడిలాగే నిన్ను భావిస్తారు ప్రజలు

'రండి, నాతో కాసేపు ఆడుకోండి
ఈ ఆటలలోంచే రెండోవైపుకి దారివుంది' అంటావు
నది ఇసుకలా బిగుసుకొన్న వాళ్ళ క్షణాల్లోంచి
గుప్పెడైనా నీకోసం ఇవ్వలేరు వాళ్ళు

ఇంకా పసితనం పూర్తిగా ఆరిపోని
ఒకరిద్దరికి నీమాటలు ఆశ్చర్యం కలిగించి
నీవేపు చూస్తారు కాని
సాటివాళ్ళ ఉత్సవాల హోరు వాళ్ళని తీసుకుపోతుంది

'తామేం చేస్తున్నారో తమకి తెలియదని'
చెప్పివెళ్ళిన పూర్వయాత్రికులలానే
నువ్వుకూడా ఒక చిరునవ్వు నవ్వుకొని
నీ నావపై బయలుదేరి వెళ్ళిపోతావు

వాళ్ళ కోలాహలం దూరమయేకొద్దీ
వాళ్ళకీ, నీకూ భేదం లేదని 
వేల స్వప్నాలను ఒకే మెలకువ
పహరా కాస్తుందని తెలుసుకొంటావు

________________________
ప్రచురణ: అక్షర ఆటా సావనీరు 2014

04 ఆగస్టు 2014

చూస్తున్నామా

సముద్రతీరంలోని ఇసుకలా  వజ్రాలు దొరుకుతుంటే
భూమి అరుదుగా కాసిని పూలని మాత్రం స్వప్నిస్తూ వుంటే
మనుషుల్లోని రసాత్మకత మరొకలా వ్యక్తమయేది

ఏడాదికి ఒకసారే సూర్యకమలం వికసిస్తే
జన్మకి ఒకరాత్రే ఆకాశం నక్షత్రఖచితమై మెరిస్తే
మానవహృదయాలు అరుదుగానైనా సౌందర్యంతో భాసిల్లేవి

జీవితానికి దయవుంది గనుకనే
నీ చుట్టూ ఇంత అందం, ఆనందం పరిచి
చిరునవ్వుతో నిన్ను సృజించి విడిచింది ఈ సృష్టిలో

దయగలతల్లికి పుట్టిన యోగ్యతలేని బిడ్డలా
నీ ఆట కోసం చుట్టుకొన్న ఊహల వృత్తాలలో చిక్కి
విప్పారే ఆకాశంకింద నిలిచి కూడా ఊపిరాడట్లేదని దు:ఖిస్తావు  

పొందవలసిందేమీలేదు, పోవలసిందెంతో వుందని
కవి పాటపాడుతూ వెళ్ళిపోతాడు
కొందరికి వలయాలు చిట్లి తేలికపడతారు
మరికొందరు మరిన్ని ప్రశ్నల్లోకి దిగులుపడతారు

అప్పుడు, గాలిదేహంతో తల్లి వాళ్ళని కౌగలించుకొని
నుదుటిపైన ముద్దుపెట్టుకొన్నట్టు నిద్రపుచ్చుతుంది

_____________________
ప్రచురణ: కవితా మే-జూన్ 2014

ఈ పుస్తకం: 'ఆకాశం' కవిత్వం

     ఆకాశం నా మూడవ వచనకవిత్వ సంపుటి. కవిత్వసృజనకి సుమారు పదేళ్ళు దూరంగా ఉన్న తరువాత సుమారు మూడు నెలల కాలంలో రాసిన కవిత్వం.
   
     అభివ్యక్తిలో వేగంతో పాటు, ఆర్ద్రత, జీవితం పట్లా, సత్యం పట్లా మరింత స్పష్టమైన చూపూ ఈ కవిత్వంలో గమనించవచ్చు. 'పూలురాలాయి' హైకూలలో కనిపించే నిర్మల, ప్రశాంత హృదయస్పర్శ ఈ కవిత్వమంతటా  కనిపిస్తుంది. 

ఈ-పుస్తకం: 'నేనే ఈ క్షణం' కవిత్వం

     'నేనే ఈ క్షణం' నా రెండవ వచన కవితా సంపుటి. ఆరాధన నుండి హైకూల మీదుగా ఈ నాటి కవిత్వం వరకూ పాఠకుడికి అందివ్వదలచిన అనుభవంలో ఏమంత మార్పు వుండదు కాని, దానికై ఎంచుకొనే అభివ్యక్తి ఈ నాటికీ మారుతూనే వుంది.

     ఆరాధన తరువాత ఆధునిక అభివ్యక్తిని సాధన చేసే క్రమంలో రాసుకొన్న కవిత్వమే 'నేనే ఈ క్షణం' అనుకొంటాను.

     అంతిమ లేదా నిరపేక్ష సత్యాన్ని వెదికే క్రమంలో జీవితంలో ఎదురైన అనుభవాలలో మునుగుతూ, తేలుతూ, అటువైపు చూస్తున్న ఒక మనిషి హృదయగీతాలే 'నేనే ఈ క్షణం' కవిత్వం.
   
     4.8.2014

02 ఆగస్టు 2014

ఈ-పుస్తకం: బివివి ప్రసాద్ హైకూలు

    హైకూ సంపుటాలు 1994 - 99 మధ్యకాలంలో రాసినవి.
 
    హైకూ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆంతరిక మౌనాన్ని అనుభవంలోకి తెచ్చే పదచిత్రం. హైకూ చదివాక హృదయం మేలుకొన్న అనుభవం కలగాలి. ధ్యానం చేస్తున్నట్టూ, ప్రశాంతత కలిగినట్టూ అనిపించాలి. తనలోని నిర్మలమైన తాను తెలియాలి.

    మొదటి సంపుటి 'దృశ్యాదృశ్యం' నాటికి రేఖామాత్రంగా అర్థమైన హైకూ తత్వం, రెండవ సంపుటి 'హైకూ', మూడవ సంపుటి 'పూలురాలాయి'ల నాటికి మరింత స్పష్టంగా అర్థమైందనుకొంటాను. ఈ క్రమంలోనే వస్తువూ, అభివ్యక్తుల పరంగా కూడా నా హైకూలలో మార్పు గమనించవచ్చును.

    జీవితసారంలోకి ప్రశాంతంగా ప్రవేశించేందుకు చదివిచూడండి.

BVV Prasad Haiku by Bollina Veera Venkata Prasad

ఈ -పుస్తకం: 'ఆరాధన' కవిత్వం

     ఆరాధన 1986 నుండి 89 మధ్యకాలంలో రాసిన వచన కవిత్వం. భగవాన్  శ్రీ రమణ మహర్షి గురించీ, వారి ద్వారా నిరపేక్ష సత్యం ఒకటి ఉందనీ, దానిని తెలుసుకోవటానికి సహేతుకమైన, సరళమైన, సూటిదారి ఉందనీ తెలిసిన మొదటి రోజుల్లో రాసుకొన్నకవిత్వం ఇది. అభివ్యక్తిపై టాగోర్ ప్రభావం బాగా ఉన్న రోజులవి. చదవండి.

    2.8.2014

మనమంతే..

నది ఒడిలో సేదదీరుదామని వెళ్లి
కదులుతున్న పడవగదిలో
అందరమూ కబుర్లు చెప్పుకొంటూ గడిపాం రోజంతా

సంధ్య వాలేసరికి
కబుర్లలోంచి, గదిలోంచి, నదిలోంచి
బయటకు నడిచాం ఎవరిదారిన వాళ్ళం

మనమంతే -

నదినీ, జీవితాన్నీ
ప్రేమించడమెలానో మాట్లాడుకొనే సందడిలో
ప్రేమించడం మరిచిపోయి పడవదిగి వెళ్ళిపోతాము