ప్రతిస్పందనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రతిస్పందనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25 జూన్ 2026

మరేమీ కాదు ఒట్టి ప్రేమ సారమీ కవిత్వం : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

సీతాకోకఒకటిఎగురుతూ ఉంటుందిమనంఉన్నచోటే. దానిని పరికించే మనసు ఎంతమందికి ఉంటుంది. దానికి కొంత సున్నితత్వం కావాలి. ప్రకృతిని చూసి పరవశించే మెత్తదనం ఉండాలి.దానితో మమేకమయ్యే స్వభావం ఉండాలి. అదో ధ్యాన స్థితి.విషయీ విషయాల ఏకత. హైకూ కవిత్వానికి ఇదే మూలవనరు. దానిని దాటి,సీతాకోక రావడానికి ముందు శూన్యాకాసాన్ని అది వచ్చి వాలి తారాడిన క్షణాలను, ఎగిరిపోయిన తర్వాతి శూన్య సౌందర్యాన్ని అద్వైతాంశతో కవిత్వం చేస్తున్నారు బివివి ప్రసాద్.

వీరి కవిత్వం నిండా, కవి తనను తాను తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. దానికి కవి నిర్మించుకున్న వాతావరణం మానవ జీవితం పట్ల అపారమైన శ్రద్ధ,అవ్యాజమైన ప్రేమ, అనంతమైన దయ మరి ఏమీ కాదు ఒట్టి ప్రేమ సారమీకవిత్వం.అందుకే వీరి నుండి నిసర్గమయ్యే ప్రతి వాక్యం తాజాగా అప్పుడే పూసిన గులాబీల్లా గుబాళిస్తుంది.మనసుని ఓ మత్తుకు గురిచేసి ప్రశాంతతనిస్తుంది.

 ఇది మార్మిక కవిత్వం. నిజానికి కవిత్వం కళ అవుతుంది. మార్మికత కళకాదు. కానీ ఈ కవి మార్మికంగా కవిత్వం అల్లడం మనం గమనిస్తాం. ఇదో వినూత్న పంథా. ఆధ్యాత్మికత అంటే మన మూలాలను మనం తెలుసుకోవడం. ఎరుకతో జీవించడం ఆ అనుభూతి గాఢతలోనే ఈ కవిత్వమంతా సాగుతుంది. 

వీరి భావనా ప్రపంచం మాటల కందేది కాదు. మరి కవి ఎలా పద సృష్టి చేస్తున్నారు. కవితా వాక్యాలను ఎలా నిర్వహిస్తున్నారు. అనేది ఆసక్తి కలిగించే విషయం. ఆశ్చర్యంగా కోకొల్లలుగా వచ్చి వాలే సుతిమెత్తని "కాయిన్డ్వర్డ్స్" ఈ కవిత్వ వాక్యాలకు పుష్టినివ్వడం మనం గమనిస్తాం. ఉదాహరణకు చీకటి వరద, రంగుల కాంతి, ఏకాంత సంగీతం, పరాయి శబ్దం, విసుగు పురుగు, ప్రేమ తునక, తెలికాంతి, జీవితేచ్చవిత్తనం, చీకటి ద్రవం, ఖాళీ వెలుతురు, లోకపు చిటికెన వేలు మొదలైనవి.

వీరి కవిత్వం చదివి ఒక అనుభూతి గాఢతకి గురికాని వారు లేరు చదివినా మళ్లీ చదవాలనిపించే కవిత్వం అంతేకాదు కొత్త వాక్యాల కోసం చకోరకాల్లా ఎదురు చూస్తాం. ఇప్పుడదే తారసపడింది .మన ముందు ఈ కవిత్వ వాక్యం పుష్టిగా రెక్కలు కట్టుకువాలింది "సృష్టి"గా.ఈ పుస్తకానికి “రమణ జీవి”వ్రాసిన అభిప్రాయం “గంగారెడ్డి” గారి మాటలు ఈ కవిత్వం పట్ల చాలా క్లారిటీ ఇస్తాయి. దీనిలో మొదటి కవిత "సృష్టి" అనే శీర్షికతోనే ప్రారంభమవుతుంది .

"ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు/ అవి ఆకాశమూ గాలీ నీరూ/ కాంతీ, చీకటిలో వెన్నెలా/ రంగుల పై కొన్ని గీతలు గీయి/ నదులూ, కొండలూ, మైదానాలూ/ఉదయాస్తమయ,మేఘాలూ, పాలపుంతలూ/
కదలికలలో ఉద్వేగాలు కలుపు/ చిక్కగా లేతగా తీవ్రంగా,తేలికగా/మంచీ,భయమూ,బాధా,ప్రేమా/
ఇంతకన్నా ఊహించేదేమీ లేదు/ నువ్వైనా దేవుడై నా/మళ్లీ మొదటికి రావాల్సిందే/నిద్రలోనో మరణంలోనో జ్ఞానంలోనో.

ఈ కవిత మొదటి పంక్తుల్లో ఖాళీ మనసు శూన్యానికి ప్రతీక సృష్టికి ముందు స్థితి. ఎత్తుగడలోని ఆ ఖాళీ మనసుతో కాసేపు రమిస్తాం.ఆ శూన్య సౌందర్య అనుభవంలో కాసేపు ఉండిపోతాం. కవిత మొత్తం చదివి మరలా రెండోసారి చదవడం మొదలుపెట్టినప్పుడు కలిగే అనుభవం ఇది.

ఇప్పుడు అందులో కొన్ని రంగులు ఒంపమన్నారు కవి. ఎంత అందంగా సరళంగా ప్రారంభమయ్యింది ఈ కవిత్వ “సృష్టి"అవే పంచభూతాలన్నమాట. భూమిని 'చీకటిలో వెన్నెల' అన్నారు. జ్ఞానానికి ప్రతీక కాబట్టి.రంగులపై గీతలు గీస్తే నదులూ కొండలూ, మొదలైన స్థావరాలు ఏర్పడ్డాయట.గీతల్ని కొంచెం కదిలిస్తే చెట్లు పిట్టలూ మనుషులూ మొదలైన జంగమ ప్రపంచం నిర్మాణమైందట. ఇప్పుడు వాటికి ఉద్వేగాలు కలిపారు కవి. అవి చిక్కగా లేతగా బాధ ప్రేమ అయ్యాయట.చివరి వాక్యాల్లో కవి నిద్ర,మరణం, జ్ఞానం మూడిటిలో కూడా మళ్లీ మొదటికి రావాల్సిందే మనమైనా దేవుడైన అంటారు. ఇక్కడ ఈ మూడూ లయానికి ప్రతీకలు. అత్యంత నేర్పుతో గిజిగాడి ఊయల గీము నిర్మాణాన్ని తలపించేలా కదలాడే భావ చిత్రాలను మన ముందు ఉంచారు కవి బివివి.
 
"రంగుల పిల్లలు" అనే కవితలో.. రంగులు అమాయకమైనవి/ నలుపూ తెలుపుల్లా కలలు రాలి పోయినవి కావు/ పసిపిల్లలు ఉల్లాసంగా మేల్కొన్నట్లు ఉదయాన గగనంలో మేలుకుంటాయి"
 ఇంద్ర ధనువుల మీదుగా /సీతాకోకల రెక్కల మీదుగా పూలని చేరి/ నీ వైపు నవ్వుతూ దర్శనమిస్తాయి....
అని సాగే ఈ కవితలో కవి రంగులు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, దుఃఖంలో మరలా నిలబడేట్టు వెన్ను తడతాయి. నలుపూ తెలుపూ అనే దుఃఖానందాల మధ్య ఆశని రగులుస్తాయి అంటారు. తర్వాత వాక్యాల్లో తెలియందేదో లోకంగా వికసించడం అని వేదాంతపరంగా లోకాన్ని నిర్వచించడం బాగుంది. ఆడింది చాలు, పడుకోండని అమ్మానాన్నల వంటి నలుపూ తెలుపులు పిలిచినపుడు, బొమ్మల్లాంటి మనని విసిరేసి ఏకైక మహాశాంతి లోకి జారిపోతాయి.
ఇక్కడ ఏకైక మహాశాంతి లోకి జారిపోయిన రంగులు మనల్ని ఏకైక శూన్యంలో తేలేలా చేసాయి. చివరి వాక్యాల్లో "ఇప్పుడు కలల్లోకి పాకుతూ వచ్చిన రంగులు/ నీతో ఏం మాట్లాడుతున్నాయి" అని ఉంటుంది 
ఇక్కడ 'అందరి నిద్రా ఒక్కటే అది ఏకైక శూన్యం' అక్కడ రంగులు మీతో ఏం అంటున్నాయి అని ప్రశ్నిస్తారు కవి 
నలుపూ తెలుపులు మన మూలాలకి, ఏకైక శాంతికి సంకేతాలు అక్కడి నుండి వచ్చిన మనం ప్రకృతికి అద్దిన రంగులనే ఆశల వలన జీవిస్తూ ఉంటాం. సత్యం బోధపడ్డాక వాటిని వాటిగానే యథార్థ స్థితిలో చూడగలుగుతాం.ఈ కవితా శిల్పం కవి ప్రతిభకు గీటురాయిగా చెప్పవచ్చు. 

"పుట్టినరోజున"అనే కవిత లో 
     "ఇవాళ నీకు నువ్వే గుర్తుకొస్తుంటావు/ ఉదయం పూలూ చినుకులూ రాలినట్లు/ ఒకనాడు ఇక్కడకు రాలావు/వాటికి కరిగి మాయమైపోవడం తెలుసు/ మరి నీ సంగతి అంటారు ఎవరో?... అని సాగే ఈ కవితలో కవి ఎంత సున్నిత వాక్యాలతో ప్రారంభించారు కవితని. మనిషి పుట్టుకలోని సహజత్వాన్ని ఇంత మృదువుగా ఉత్ప్రేక్షించిన కవిని ఇంతకు మునిపెన్నడూ మనం చూడము.

సృష్టిలో ప్రతి జీవి ఎంత సహజంగా వచ్చిందో అంత సహజంగా జీవించి వెళ్ళిపోతుంది.మరి మానవుడు, ఇదే ప్రశ్న కవి వేశారు " మరి నీ సంగతి అంటారు ఎవరో? ఆ 'ఎవరో 'అనడంలోనే వాక్య బలం రెండింతలు అయింది.
ఈ కవితలో బతుకుని నైరూప్య చిత్రమనీ నిర్వచించి అర్ధాల ఇరుకునుండి ఎంత విముక్తమయితే అంత సారవంతం అవుతుందని ఎంత స్వేచ్ఛ లోకి మేలుకుంటే అంత ఆర్ద్రతలోకి వికసిస్తుందని జీవనమాధుర్యాన్ని ఎలా చవిచూడాలో పాఠకుడిని శిశువుగా చేసి మరీ కవిత్వపు ఉగ్గుపడుతున్నారీ కవి. 

నైరూప్యఛాయాచిత్రణ లో చిక్కబడ్డ అద్వైతం ఈ కవిత్వం
"ప్రేమ ఉంటే" అనే కవితలో ప్రేమ ఉంటే పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు/ మాటలన్నీ మంచు ముక్కల్లా ప్రేమలో కరిగిపోతాయి/పూలరంగులు వెలుగుతాయి/ నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి/ స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది. కవి ఇక్కడ ఓ మాట అంటారు "జీవుల చూపుల సారం ప్రేమ కోసం ఎదురుచూపు. భయాలు కోరికలు ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు" ఇది మానవాళికి అందాల్సిన ఓ అద్భుతమైన 'మోరల్ స్టేట్మెంట్'. నిజమే కదా లోకంలోని సమస్త సమస్యలకు దుఃఖాలకి సరిపడా ప్రేమ లేకపోవడమే కారణం. అనంతమైన ప్రేమలోకి ఒక్కసారి మేల్కొనగలిగితే బాధలు అన్నిటికీ ఉపశమనం దొరికినట్టే.      
 
'అద్వైతం'అనే మరో కవితలో 
సాంద్రమైన స్వచ్ఛమైన ఒక జీవితానుభవం చాలదా బ్రతుకంతా వెలగడానికి అంటారు. పాఠకుడు తాను కూడా లోతుగా మౌనంలోకంటూ మేల్కొంటే గాని ఈ కవిత్వం ఒంటపట్టదు.
 
"ఒకరికొకరు" అనే కవిత ఉంది.రెండవ భాగంలో
 ఆమె ముఖంలోకి చూసేటపుడు/అతని ముఖంలో చలిమంట వెలుగుంటుంది/ చల్లని గాలుల పూతరేకుల శబ్దాలుంటాయి /వెన్నెలలో వినిపించి ఆగే పిట్ట పాట ఉంటుంది/చినుకుల్లో మాయమయ్యే ఇంద్ర ధనువులుంటాయి అంటారు.

ఇక్కడ పిట్ట పాట ఆగిన తర్వాత, ఇంద్రధనువు మాయమైన తర్వాత, కలిగే సౌందర్యానుభవం చాలా గాఢమైనది. కాలాల కావలి నిశ్శబ్దంలోకి మనల్ని జారిపోయేలా చేసే సుతి మెత్తని వాక్యం. 

"ఉత్తప్రేమ" అనే కవితలో 
పూవు విచ్చుకోక ముందు దానిలో దాగిన చీకటి/సీతాకోక రంగుల ఆటలకి ముందు దాగిన చిక్కని ఏకాంతం/మధుర గానానికి ముందు సవరించుకునే కంఠధ్వని/ జీవితం ఉత్త ప్రేమ/ దుఃఖమంతా రహస్యం రాల్చిన ఎండుటాకులు. అందుకే ఈ కవిత్వం ఉత్త ప్రేమ సారం 

"లోపలికి" అనే కవిత లో 
కొలతలకి లొంగకు లెక్కల నుండి ఎగిరిపో/లొంగనట్టు కనబడడానికి కూడా.... అప్పుడు మేలుకుంటావు/ నిశ్శబ్ద రహస్య ప్రశాంత తటాకం ఒడ్డున..... కొంచెం తడిగా ఉండటం మినహా/ ఇక్కడ వేరేది చేయదగింది లేనట్లుంది. మన అసలుని మనకు అప్పగించే మాటలు ఇవి. ఇంకా ఇంత ప్రపంచం అతనికి/ రాలుతున్న ఎండుటాకు పాటి కాకపోవచ్చు. 
ఇక్కడ అవ్వచ్చు అనడానికి ఎలా నిర్ధారిస్తారు కవి అది కావచ్చు కాకపోవచ్చు కాబట్టి కాకపోవచ్చు వాడారు కవి. ఎంత సమయోచిత ఉపమానమిది. చివరిగా "బహుశా అతనే నీలా ఉన్నాడు/ ఇప్పుడు నువ్వు చేయాల్సింది/ ఏమైనా మిగిలి ఉందా ఇక్కడ.
 ఏమి ప్రశ్న వేదాంతానికి పరాకాష్ట.మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అలవోకగా అత్యంత సహజంగా వచ్చి చేరే ఉపమానాలు అభివ్యక్తి కి మంచి బలాన్ని ఇచ్చాయి.

"వాన రాత్రి" కవిత 
వాన చప్పుడు ఒడిలో వాలి మనుషులు సుఖంగా నిద్రిస్తున్నారు/ తమ వారు అనుకుంటున్నా వారి మధ్య భద్రంగా/ఎప్పటికీ ఇలానే ఉంటామని కలలు కంటూ.

మనిషి లౌకికలంపటంలో పడి అదే శాశ్వతం అన్న భ్రాంతిలో బతికి అలాగే వెళ్ళిపోతాడు.కానీ ఒంటరిగా ఈ లోకంలోకి వచ్చిన వాడు సమూహంలో జీవిస్తూ చివరికి ఒంటరిగా వెళ్లాల్సిందే. ఈ లోపులో సుఖాలు దుఃఖాలూ, వేదనలూ, ఆనందాలూ, ఉద్వేగాలూ వీటితో సహచర్యం చేస్తూ ఒక స్పష్టత లేక ఇంత విలువైన జీవితం నిస్సారంగా గడిపేస్తాడు.  

జీవితానికి ఒక స్పష్టత అవసరం. కొన్ని మౌలిక ప్రశ్నలవసరం. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము?ఎందుకు జీవిస్తున్నాము? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఈ ప్రశ్నలకు ఊరట ఈ కవిత్వం. కవిత చివరి వాక్యాలను శిల్పించిన తీరు అమోఘం.

"కలలు కంటావు"
 కొన్ని కలలు కంటావు ఉదయాన పూలపై వాలిన నీరెండవి అయినట్లు ఎంత చిక్కని వాక్యం అంతేనా ఆ వాలిన ఎండ ఎవరో కాదు మనమే, కలగంటూ ఆ తాజాదనపు ప్రశాంత అనుభవాన్ని మనకు ఇస్తుంది. ఇక్కడ కలనిజంగా నువ్వు కనాలి లేదా ఊహలోనైనా జీవించాలి.తాథాత్యము చెందాలి. అప్పుడే ఈ కవిత చదివిన పాఠకుడు ధ్యాన ఫలితాన్ని పొందినట్లు. సీతాకోక సృష్టించే కొత్త శూన్యమైనట్లు. 
కవి ప్రయోగించిన వాక్యం పాఠకుని అనుభవంలోకి తేగలిగే వాతావరణాన్ని ఇవ్వగలగాలి. 

"ఉద్వేగాల నుండి"
ఉద్వేగాలని అడవిలోని వృక్షాలుగా వృక్షాల నుండి జాలువారే కిరణాలుగా కిరణాల్లో మిల మిలలాడే సెలయేళ్లుగా సెలయేళ్లలో దప్పిక తీర్చుకునే కీటకాలూ పక్షులుగా ఉత్ప్రేక్షించడం సముచితంగా కొత్తగా ఉంది. 

" దయ నుండి" ....
ముందుగా శబ్దం ఉందని వారంటారు కానీ ముందుగానే దయనుండి ఆకాశం పుట్టిందని దయగల ఆకాశం నుండి సమస్తము పుట్టాయని సృష్టికి కొత్త నిర్వచనం ఇచ్చారు బివివి ప్రసాద్. సృష్టి ఆవిర్భావం దయతో జరిగిందని అక్షరాల దయను వర్షింప చేస్తారీ కవి.

" జీవనోద్వేగం" 
   ఈ కవిత జీవితం పట్ల ఒక స్పష్టతను కలిగిస్తుంది. " ఇంత విశ్వం" అనే కవితలో ఇంత విశ్వం నిన్ను జీవితంలా చిలికి నీ నుండి శాంతి అనే వెన్న తీస్తుంది.అంటారు" కాస్త ఆశలోకి"...జీవితాన్ని గురించి కవి, ఈ కవితల వెలువరించిన తీరు అతి సరళంగా అత్యంత కవితాత్మకంగా ఉంటుంది మనలో ఆశని మేల్కొల్పే కవిత ఇది. మెత్తని పూలరేకులు లాంటి శబ్దాలు,చక్కటి ఊహలు ఈ "సృష్టి" కవిత్వం.
"ప్రాతః కాలపు పొగ మంచును చూసావా/ సాలె గూటి పై పొందికగా ముత్యాలు పేర్చుతుంది/ అవి ఎండలోకి రంగులు చల్లుతూ మాయమవుతాయి/ ఊరికే మంచు బిందువులా నిలిచి మాయం కావాలి" అంటున్నారు ఎంత నిర్మలం ఎంత కోమలం చెట్ల ఆకుల వెనుక ఆకాశాన్ని గుర్తించటం కవి దార్శనికత కి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి ఊహలు కోకొల్లలు ఈ పుస్తకం నిండా.

“మోహం”అనే కవితలో 
జీవితం మీద ఇంత మోహం ఏమిటి అంటారు ఏ రోజైనా వెళ్లిపోయే విరక్తి ఉంది గనుక అంటావు.
చివరి వాక్యాల్లో “నువ్వు ప్రేమించేది దేనినో చెప్పమంటారు/ దేనిని ప్రేమిస్తున్నానో నాకు తెలియదు/బహుశా ఈ వెలుగునీడల కదలికల్లో/ నన్ను నేనే పొందుతున్నాను/ దాచుకుంటున్నాను/ జీవితం ప్రియురాలు రూపంలో/నన్నే చూసుకుని ఆశ్చర్యపోతూ, ప్రేమిస్తున్నాను”.
ఈ కవితలో ప్రేమ అయితే ఉంది గాని అది దేని మీద తెలియదు అంటారు అవును హృదయంలో ప్రేమ ఉండటం ప్రధానం దేని మీదో చెప్పగలిగితే అది పరిమితం అయిపోతుంది. అది అవధులు దాటాలి, పరిధి విస్తరించి విశ్వవ్యాపితం అవ్వాలి.

"జాగ్రత్త" అనే కవితలో 'మృత్యువు లోపలి కరుణ' అని కవి చేసిన వాక్య ప్రయోగం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మృత్యువును దయారహితంగా భావిస్తాం. కానీ కవి మాత్రం మృత్యువు లోపలి కరుణను దర్శించే అరుదైన నూతన సంస్కారాన్ని మనలో మేల్కొలుపుతున్నారు. 

"సృష్టి"కవిత్వం విసిరిన సౌందర్యపు చెణుకులు కొన్ని.. 
1. కవి జీవితం రహస్యాలు ఎంతకీ అర్థం కావని చెబుతూ 'ఎంతకీ పగలని కొబ్బరికాయలా' అని చమత్కరిస్తారు. 
2. మిత్రుడు వెళ్ళ వలసిన రైలు లేటుగా టైముకే వచ్చి నిలబడింది. 
3. కలలో అందమైన మొహాన్ని మెలకువలో వెతకబోయినట్లు 
4. సాయంత్రపు గగనంలో చివరి రంగులు ఆగి, ఇంకెవరైనా చూసేవారు ఉన్నారా అని అడిగినట్లు 
5. పాత ఉద్యోగుల్లా వచ్చి వెళ్ళే ఋతువులు 
6. మీట నొక్కినట్లు వెలిగి ఆరే ప్రేమలు ఉద్వేగాలు 
7. నీడలు సంధ్యలో దీర్ఘమవుతూ మధ్యాహ్నాలు దాక్కుంటాయి 
8. టీ కప్పులో లేచే ఆవిరి లాంటిది జీవితం. 
9. తలపై బుడగలా ఎగురుతోంది గగనం 
10. రాలిపోయే ఎండుటాకు మరో క్షణం ఆగినట్లు 
11. కదలాడే నీటి బుడగపై తిరుగాడే బొమ్మ లాంటిది ప్రపంచం 
12. గోడలపై బొమ్మల రంగులు గతకాలపు పిల్లల్లా శాంతిగా చూస్తున్నాయి. 

ఇలాంటి 'ఎపిగ్రమేటిక్ అభివ్యక్తి' తో కూడిన వాక్యాలు కవిత్వం చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. 
వారు చెప్పినట్లుగానే ఈ కవిత్వం మనల్ని మహా శాంతి లోకి జారిపోయేటట్టు చేస్తుంది. మరేమీ కాదు ఒట్టి ప్రేమ సారమీ కవిత్వం.

మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్ 
పార్ట్ టైం పరిశోధక విద్యార్థి 
ఆంధ్ర విశ్వ కళా పరిషత్, విశాఖపట్నం 
9441350260 
sriram9441350260@gmail.com

ప్రచురణ : సాహిత్య ప్రస్థానం జూన్ 2026

బి.వి.వి.ప్రసాద్ కవిత్వ పరిశీలన : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

 బి.వి.వి.ప్రసాద్ కవిత్వ పరిశీలన : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

వ్యాససంగ్రహం :-

ఈ వ్యాసం "మానవ జీవితం అనేక జీవితాలుగా కాక ఒకే జీవితంగా, ఉన్నదంతా ఒకే సారంగా భావించి కవిత్వం చేయడం బి.వి.వి. ప్రసాద్ కవిత్వ దృక్పథంగా గుర్తిస్తుంది". మనలో "ఎరుక/ఇంటెన్షనాలిటీ" ఒకటి ఉంటుంది. అది మన మూలాలకు చెందినది. దాని మూలకాలు ప్రేమ, దయ, శాంతి, ఓర్పు, మొదలైన మౌలిక భావనలు. ఇవే మనలను పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దేవి అని ఈ కవిత్వం ద్వారా స్పష్టం చేస్తుంది ఈ వ్యాసం. కవి వ్యక్తిత్వం లోని సున్నితత్వం, వినూత్న ధోరణితో కవిత్వం అల్లడానికి నిర్మించుకున్న వాతావరణం మరియు సహజ అనలంకారిక శైలి, అభివ్యక్తి నవ్యత మొదలైన విషయాలను ఆధునికత కలిగిన కవితా రీతిగా వివరిస్తుంది ఈ వ్యాసం, ఆధ్యాత్మికత లో వుండే సమర్పణ భావం విశ్వచైతన్యం పట్ల హైకూ ఏవిధంగా పాఠకుడిలో మెలకువ కలిగిస్తుందో చెబుతుంది ఈ వ్యాసం. "నేనే ఈ క్షణం" సంపుటిలో కవి మెటానమీ టెక్నిక్/పద చిత్రాలద్వారా ఏవిధంగా జీవన సారం, ప్రాకృతిక సౌందర్యం కవిత్వం చేసారో వివరిస్తుంది. 'ఆకాశం', 'నీలో కొన్ని సార్లు', 'ఊరికే జీవితమై', 'సృష్టి' సంపుటులు అందించిన తాత్వికానుభూతిని లోతుగా విశ్లేషిస్తుంది ఈ వ్యాసం. ఈ కవి కవిత్వాన్ని తమ సమకాలీన ప్రసిద్ధకవులు ఎలా ఆదరించారో రికార్డు చేయడం ద్వారా కవిత్వ పరిశీలనద్వారా బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలోని నవ్యతను వివరిస్తుంది. విశ్లేషణాత్మక, వర్ణనాత్మక పద్ధతిలో ఈ పరిశోధన సాగింది. తాత్విక నేపథ్యమున్న భవిష్యత్ పరిశోధకులకు ఈ వ్యాసం ఉపకరిస్తుంది.

కీలక పదాలు :- మౌలిక భావనలు, తాత్వికానుభూతి, నూతన దృక్పథం, హైకూ, మెటానమీ టెక్నిక్, ఆకాశం, కొత్తదైన మెలకువ, ఎరుక, ఒక ఫిల్టర్. ప్రధాన స్రవంతి కి భిన్నంగా, అద్వైతాంశ.

2 :

బి.వి.వి. ప్రసాద్ కవిత్వ దృక్పథం

ఆధునికత/నవ్యత :
ఆధునికత :- "కవిత్వంలో ఆధునికత్వం అనగా స్వభావమును బట్టి ఆధునికత్వమే గాని కాలమును బట్టినది కానేకాదు" డా॥ సి.నారె. ఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలోని నవ్యతను వివరిస్తుంది ఈ వ్యాసం.

సాహిత్య ప్రయోజనం సమాజ హితమే. అది ఏదో ఒక వాదమునకు పరిమితమైతే ఆ సమస్య మాత్రమే పరిష్కరించబడుతుంది. అది కూడా మంచిదే. కాని పరిపుష్టమైన, సమగ్రమైన సమాజనిర్మాణానికి మార్పు అనేది ముందు నీ నుండి రావాలని అంటారు బి.వి.వి. ప్రసాద్. మనలో తేలికదనము ఉండాలి, సరళత ఉండాలి. ఏ పని చేసిన ఏమి ఆలోచించినా దయ, ప్రేమ నింపుకొని చేయాలి అనే నూతన దృక్పథంతో వీరి కవిత్వం పరిమళిస్తుంది.

నువ్వు చెప్పేది ఏదైనా నీ అనుభవంలోంచి పలకాలి అన్న ఆర్.ఎస్.సుదర్శనం గారి మాటలు తూచా తప్పకుండా పలికాడు ఈ కవి.

ఐతే ఇతని భావజాలం, కవితా వస్తువులు, భావ చిత్రాలు, మర్మంగా లోతుగా అనుభవంలోంచి చెప్పడం ఒక నూతన కవితా రీతిని కలిగి ఉన్నాయి.

1) సహజ అనలంకారిక శైలి :
ఇప్పటి వరకూ ఫిగరేటివ్ లాంగ్వేజ్ / అర్నేట్ స్టైల్ చదవడానికి అలవాటు పడిన పాఠకుడు
ఒక్కసారిగా ఈ సహజ అనలంకారిక రచనా విధానాన్ని తీసుకోవడం కొంత కష్టమే కానీ ఇదే మన అసలు సహజ స్థితిని ఎరుక చేసే శైలి అని తెలుసుకున్నాక పాఠకుడు సాంత్వన పొందుతాడు. అంతే కాకుండా ఈ కవిత్వానికి అంకిత మయిపోతాడు.
ఈ కవిత్వం మనకు అందించేది ఒక్కటే హాయిగా జీవించడమెలానో నేర్పుతుంది. ఏ పేచీ లేకుండా శాంతంగా ఎలా మనవచ్చో తెలుపుతుంది. ఊరికే జీవితమై అన్నంతగా, ఇదే బి.వి.వి.ప్రసాద్ కవిత్వం మనకందించే గొప్ప కవిత్వ కానుక.

2) వ్యక్తిత్వం లోని సున్నితత్వం
బి.వి.వి.ప్రసాద్ స్వభావ రీత్యా సున్నితస్థుడు, లోతైన అన్వేషి, తగినంత ఆర్ద్రత, నిజాయితీ, చేసే పనిపట్ల ప్రాణం పెట్టి చేయడం నచ్చని వాటికి దూరంగా ఉండడం, ఇతరుల్లో మానవీయ విలువలు ఆశించి తరచూ నిస్పృహకు గురికావడం తన వ్యక్తిత్వంగా గమనించి. తన లోపలి వెలితి ఒకటి తన జీవిత గమనాన్ని శాసిస్తుందని భావించి ఆ వెలితిని నింపే ప్రయత్నంగా కవిత్వాన్ని ఆవిష్కరించారు.

3) కవిత్వం కోసం నిర్మించుకున్న వాతావరణం
వైరుధ్య భావాలతో జీవించే మానవ లోకంలో మనందరి మనస్సు ఉపశమించే మంత్రనగరి ఒకటి కావాలి. అక్కడ అందరం కలసి చెట్టపట్టాలేసుకుని హాయిగా తిరగాలి, బిగ్గరగా నవ్వుకోవాలి.

3:
మనస్పూర్తిగా ఏడవాలి. అదో పరమ శాంతిమయ లోకం కావాలి. ఈ విశ్వంలో చెలరేగుతున్న మనో మాలిన్యపు రాశులను బూడిద చేయగలగాలి. ఆ పరమ శాంతి ధామమే ఈ కవిత్వం.

II మొదటి వచన సంపుటి "ఆరాధన" సమర్పణ భావన

బి.వి.వి.ప్రసాద్ తన 23 ఏళ్ళ వయస్సులో మొదటి కవితా సంపుటి 'ఆరాధన' వేసారు. దీని నిండా సమర్పణ భావన వుంటుంది. దీనికి ముందుమాటలో కవి తనను తాను వెతుక్కునే ప్రయత్నమే ఇందులో వుంది. అంతేకాక ఇతరులలో తను గుర్తించడాన్ని ప్రేమ అంటారనుకుంటాను. ప్రేమను తెలియజేయడంలో 'ఆరాధన' ఒక పద్ధతి అంటారు.

మానవ జీవితం అనేక జీవితాలుగా కాక ఒకే జీవితంగా ఉన్నదంతా ఒకే సారంగా భావించి కవిత్వం చేయడం వీరి దృక్పథంగా కనిపిస్తుంది.

నిన్ను సేవించుదామని / ఎన్నో సుందర పుష్పాలు ఏరి తెచ్చి తుదకు / వాటి సౌందర్యం పై మోహంతో / నిన్నే విస్మరించాను అంటారు. 
(ఆరాధన వచన కవిత్వం- 1989)

మనం చేసేదిదే. ఈ లోకంలోకి ఎందుకొచ్చామో మరచిపోయి ఇతర వ్యామోహాల్లో పడిపోతాము. అంటే మన అసలుని మరిచి పోవడం, అదే మాయ. అలాంటి మాయలో పడవద్దని కవిపిలుపు. సాధారణంగా మనందరికీ మృత్యు భయం వుంటుంది. ఏ రమణ భగవానో, ఓషో లాంటి తాత్వికులను మినహాయిస్తే. ఈ కవి తన కవిత్వంలో చాలా విరివిగా మృత్యువును గురించిన కవితలు అల్లారు. మృత్యువనేది జీవితంలో తప్పని సరి భాగం అయినప్పుడు దాన్ని సానుకూలంగా ఎలా తీసుకోవాలో మరింత ఎరుకతో జీవితాన్ని ఎంత చక్కగా పండించుకోవచ్చునో తెలుసుకోవడమే కాక సాంత్వన పొందుతాము.

మృత్యుస్పృహ / మన మనస్సులో / ప్రధానమైన అంతర్వాహిని అయ్యే కొలదీ// మన జీవితాలలో అనుబంధాలలో/ లాలిత్యమూ, ప్రేమా ఉన్నతంగా దర్శనమిస్తాయి// 
(ఆరాధన- 1989- మృత్యుస్పృహ)

III హైకూ కవిత్వం తాత్విక సాంద్రత

తెలుగు హైకూకి వెలుగులద్దిన ప్రసిద్ధ హైకూ కవిగా బి.వి.వి. ప్రసాద్ సుపరిచితులు. తెలుగు హైకూని పరిపుష్టం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. హైకూ అనేది ఒక పదచిత్రం. కవి ఇస్మాయిల్ గారన్నట్లు చంద్రుణ్ణి చూపించే వేలు, చంద్రుణ్ణి చూపించాక వేలు అవసరం లేనట్లు హైకూను చదివాక అనుభూతి మాత్రమే మిగలాలి. క్లుప్తత, సాంద్రత, గాఢమైన తాత్విక చింతన, సౌందర్యాత్మకత ప్రకృతిలో మమేక మయ్యే స్వభావముండాలి. తేలిక దనం వుండాలి. ఇవన్నీ స్వభావరీత్యా బి.వి.వి. ప్రసాద్ లో సహజంగా వుండడం వలన హైకూ పేరు చెబితే బి.వి.వి. హైకూలు గుర్తుకొచ్చేట్లుగా హైకూలు రాసారు. బివివి మూడు హైకూ సంపుటాలు తీసుకొచ్చారు.

1.దృశ్యాదృశ్యం,(1995), 2. హైకూ (1997). 3. పూలు రాలాయి (1999) వీరు 'బషో' హైకూలను స్వేచ్ఛానువాదం కూడా చేసారు. రెండు ప్రసిద్ధ హైకూ వ్యాసాలు 1. ప్రకృతీ, జీవితం హైకూల మయమే, 2. హైకూ అంటే జీవన స్పృహ రచించారు. ఇవి సాహితీ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు.

4:

వర్షం / క్షణం పూచే నీటి పూలతో / ఊరు నిండిపోయింది// ఈ హైకూని వినగానే ఓ గొప్ప సౌందర్యానుభూతికి గురవుతాము. వర్షపు చినుకులను క్షణం పూచే నీటి పూలు అనడం ఎంత బాగుంది. పాఠకుడు ఒక అవ్యాజమైన అనుభూతికి గురవుతాడు. సౌందర్యం క్షణికమనే అవగాహన నుండి పుట్టిన ఒక వైరాగ్య వీచిక ఈ హైకూ ఈ అనుభూతిని 'అవారే' అంటారు.

మరో హైకూ :
పధికుని పలకరింపుకై / చూసి, నవ్వి, చిన్న బోయిన /వీధి దీపం//
(దృశ్యాదృశ్యం,(1995).

హైకూ పరిభాషలో దీనిని "సతోరి" అంటారు. మనం ప్రకృతిలోని చరాచరములనుండిఎంతో మేలు పొందుతాము. కానీ కనీసం ఆ స్పృహ కూడా మనకుండదు. అంత సున్నిత విషయాలపట్ల కృతజ్ఞతను మేల్కొల్పడం ఇక్కడ హైకూ కవి ఉద్ధేశ్యం. ఇంత సున్నిత విషయాలపట్ల స్పృహ ఉంటే మనం జీవించే తీరు ఇంకా ఉన్నతంగా వుంటుంది కదా!

రాత్రి తారలు / నదినిండా కురిసాయేమో / తీరమంతా ఇనుకమయం//
దృశ్యాదృశ్యం,(1995)

నదీ తీరమంతా ఇసుక మేటలతో నిండి వుంటుంది. మనం అంతవరకే గమనిస్తాం. కానీ హైకూ కవి ఆ ఇసుక రేణువులు సూర్యకాంతికి మెరవడం ఎలా ఉందంటున్నాడంటే అది చిన్ని చిన్ని తారలు చిన్ని రేణువులుగా కుప్ప బోసినట్లుందట. అది రాత్రంతా తారలు కురవడం వలన అలా అయిందట ఏమీ సౌందర్యం. ఇది ఒక అమోఘమైన అనుభూతి చిత్రం కదా!

IV "నేనే ఈ క్షణం" అనుభూతి సౌందర్యం

వీరు 2006లో 'నేనే ఈ క్షణం' అనే కవితా సంపుటి వేసారు. ప్రాకృతిక సౌందర్యాన్ని, జీవనతత్వాన్ని పెనవేసుకొని అద్భుత భావచిత్రాలుగా ఆవిష్కరించబడ్డ కవితా సుగంధం "నేనే ఈ క్షణం"

ఎండకురిస్తే / చెట్టునిండా / ఆకు పచ్చని చినుకులు//
చీకటి కురిస్తే / చెట్టు నిండా / నల్లని మబ్బులు //
మబ్బుల్లోని చినుకుల్ని కురుస్తూంది చెట్టు //

ఈ కవితలో కవిగీసిన పదచిత్రాలు "మెటానమీ" టెక్నిక్ లో వుండడం వల్ల పాఠకుణ్ణి చురుకుగా ఆలోచింపజేసి, సమాధాన పడ్డాక చక్కటి ఆనందానుభూతిని కలిగిస్తాయి.

V "ఆకాశం" ఓ మార్మిక పరిమళం

ఒక దశాబ్ద కాలంపాటు కవిత్వానికి దూరంగా వున్న ప్రసాద్ గారు ఆ సమయంలో చేసిన అంతర్ముఖ సాధన, జీవనానుభవాలను దగ్గరగా దర్శించడం అదే కవిత్వంగా ఒక వినూత్న ధోరణితో మూడు, నాలుగు నెలల వ్యవధిలో 100 ప్రసిద్ధ కవితలుగా 'ఆకాశం' వెలువడడం గమనార్హం. హైకూ కవిగా సుపరిచితులైన బివివిని 'ఆకాశం' కవితా సంపుటి వచనకవిగా సమున్నత సాహితీ శిఖరంపై కూర్చోబెట్టింది.

"ఆకాశం" వ్రాసేటప్పుడు వారు పెట్టుకున్న నియమాలు తూచా తప్పకుండా పాటించడం మనం చూస్తాము.

5:

ఏ భావం పలికినా మార్దవంగా, తాత్వికానుభూతిని, సౌందర్యాన్ని రంగరించి 'దయ' అంతర్లీనంగా వుండేట్టు కవిత్వీకరించడం మనం గమనిస్తాము.

పుట్టగానే పిల్లలు నవ్వరెందుకని వాళ్ళు ఏ వెలుతురులో ఈది వచ్చారు/ ఏ ఆనందాలు దాటి వచ్చారు/ ఏ హద్దుల్లేని దేశాలు ఎగిరి వచ్చారు/ పుట్టగానే పిల్లలు నవ్వలేరెందుకని ఏ పవిత్ర సీమలు విడిచి వచ్చారు/ ఏ దయాపూర్ణ హస్తాలు విడిచి పెట్టారు / ఏ కపటం లేని లోకాలు పోగొట్టుకున్నారు//

పుట్టగానే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తారు ఎందుకని / దుఃఖమయ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని// (పుట్టగానే పిల్లలు ఆకాశం - 2011)

పిల్లల్ని గురించిన మరోకవిత:-
పిల్లల్ని ప్రేమించడం నేర్చుకుంటే చాలు/ పిల్లల్ని ప్రేమిస్తే చాలు వారికోసం ఒక మంచి ప్రపంచాన్ని వారే సృష్టించుకుంటారు (ఆకాశం 2011)

ఈ వాక్యం మనం మరవకుండా వుండగలిగితే చాలు. నేటి సమాజంలో పిల్లల్ని ప్రభావితం చేయడంలో పెద్దలు విఫల యత్నం చేస్తున్నారు. దీని వలన పిల్లలు ఒత్తిడికి గురయి వారి సహజత్వాన్ని, సృజనని కోల్పోతున్నారు. పిల్లల్ని వారి మానాన్న వారిని ఎదగనిస్తే చాలు అద్భుతాలు సృష్టిస్తారు. వారి స్వచ్ఛమైన లేత మనసుల్ని కలుషితం చేయకుండా వుండగలిగితే చాలు. సినారె. అంటారు. "పాపాలను కడిగి వేస్తుందిలే పాల నవ్వుల నురుగు" అని

VI "నీలో కొన్ని సార్లు" లోతైన మౌనం పలికే వాక్యాలు

బి.వి.వి.ప్రసాద్ కవి "నీలో కొన్ని సార్లు" అనే కవిత్వ సంపుటిని 2015 లో వేసారు. ఇది ''ఇతను' అనే కవిత తో ప్రారంభమవుతుంది. మానుష ప్రపంచం మరీ అంత భయావహమైంది కాదని/ నీ కలలోని భూతమే నిన్ను మ్రింగ బోయినట్లు / నువ్వు విలువిస్తే బ్రతికే సముహం నిన్ను కమ్ముకుంటుందని/ సమూహాన్ని చెరిపేస్తూ నిన్ను గుర్తు చేయాలనే ఇతను మాట్లాడుతున్నాడు... ఎప్పుడూ పాతదైన నిద్రలోంచి, ఎప్పటికీ కొత్తదైన మెలకువలోకి/ మెలకువలాంటి పూలలోకి, గాలిలోకి, మౌనంలోకి, కాంతిలోకి / జీవితం పంపిన దూతలా పిలుస్తున్నాడు.

ఈ కవితలో ఎప్పటికి కొత్తదైన మెలకువలోకి అనే మాట పాఠకుడు చాలా పట్టుకోవాల్సిన మాట. ఆదమరిచిన నిద్ర అనడంలో భౌతిక సుఖాల్లో పడి మనతో పాటున్న తోటి చరాచరాలకి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వడం మరచిపోయిన మనకి మన మూలాల్ని పరిచయం చేస్తూ అక్కడి లోతైన దయాప్రేమలతో నిండిన సూక్ష్మ ప్రపంచాన్ని మనలో జాగృతం చేస్తున్నాడీ కవి. దీనిని ఇంటెన్షనాలిటీ/ ఎరుక అని అంటాం. 

మరో కవిత:-
తోటి వారిని గాజులానో, పూలలానో / కదలని నీటిపై నిదురించే చంద్రుని బింబంలానో చూడలేమా/ బహుశా ఏ గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే / అద్దంలో ప్రతి బింబంలా మృదువుగా చూసుకుంటాం ఒకరినొకరం ... అని సాగే ఈ కవితలో కవి ఇతరులతో మనం మెలగాల్సిన తీరు పట్ల ఒక అపురూపమయిన కొత్త సంస్కారాన్ని మనకందిస్తున్నారు.

:6:

VII "ఊరికే జీవితమై" - అన్నంతగా

బి.వి.వి. ప్రసాద్ కవితా సంపుటి "ఊరికే జీవితమై" (2023) నుండి

నిద్రలో ఎక్కడుంటావు నువ్వు/ మెలకువలో నీ దేహాన్ని మోసీ మోసీ అలసి పోయాక / దానిని ఎక్కడకు విసిరేసి, ఎటు వెళ్ళిపోతావు// సృష్టికి పూర్వం వున్న ఏ శీతల నిశ్శబ్ద ప్రశాంతతలోకి నిదురించేవేళల రహస్యంగా ప్రవేశిస్తావు/

అని సాగే ఈ కవితలో మనము నిద్రపోయేటప్పుడు ఏ లోపలి సీమలోంచి విహరిస్తామో అక్కడి మెలకువడి సంబంధించిన అనుభూతిని కవిత్వంగా పలకాల్సివుంటుంది. ఇది ఒక దార్శనికునికో, యోగికో, తాత్వికునికో సాధ్యమయ్యేపని.

ఈ కవి కవిత్వం పరిశీలించాక "అనుభూతి వాదం" భూమికగా కనబడుతుంది. నువు చెప్పేదేదయినా నీ అనుభవంలోంచి పలకాలి అన్నది అనుభూతి వాదం ప్రాధమిక సూత్రం.

VIII "సృష్టి" ఒట్టి ప్రేమసారం ఈ కవిత్వం

ఇటీవల వెలువరించబడిన బి.వి.వి. ప్రసాద్ గారి కొత్త పుస్తకం "సృష్టి" నుండి "ప్రేమ ఉంటే" అనే కవితలో

ప్రేమ ఉంటే పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు/మాటలన్నీ మంచు ముక్కల్లా ప్రేమలో కరిగి పోతాయి/పూలరంగులు వెలుగుతాయి./ నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి./ స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది..

కవి ఇక్కడ ఒక మాట అంటారు. "జీవుల చూపుల సారం ప్రేమకోసం ఎదురుచూపు/భయాలు, కోరికలు ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు". ఇది మానవాళికి అందాల్సిన అద్భుతమైన "మోరల్ స్టేట్మెంట్" నిజమే కదా లోకంలోని సమస్త సమస్యలకు దుఃఖాలకు సరిపడా ప్రేమలేక పోవడమే కారణం. అనంతమైన ప్రేమలోకి ఒక్కసారి మేల్కొనగలిగితే బాధలన్నిటికి ఉపశమనం దొరికినట్టే.

శుద్ధవేదనా జగత్తునుండి వెలువడ్డ నిర్మల స్వచ్ఛగంగాజలం వీరి వాక్యం.

మరో పద చిత్రాన్ని చూద్దాం.

నల్లని కాన్వాసు పై / మరింత నల్లని చిత్రాలయి/ ఇళ్ళూ చెట్లూ// (దృశ్యా దృశ్యం - 1995)

ఇదొక రంగుల పద చిత్రం నల్లని రంగుపైన మరింత నల్లని రంగుని పులమడం ఎంతో

రమ్యమైన శిల్పం ఆవిష్కరించబడింది.

డా||అద్దేపల్లి వారన్నట్లు ఆలోచనలోనే వినూత్నత వుండడం వీరి శైలికి బలం. (నీలో కొన్ని సార్లు 144 పేజీ ఉత్తరాల నుండి)

వీరి కవిత్వం పైపై ఉద్వేగల అణచివేతకాదు. లోలోపల జరిగే మధనం ఒక విచికిత్స. నీ మూలాలతో నీవు శృతి చేసుకుంటేగాని ఈ కవిత్వం నీకు కనెక్ట్ అవ్వదు. పాశ్చాత్య విమర్శకుడు 'కెబుల్' చెప్పినట్లు "వెంట్ ఫర్ ఓవర్ చార్జుడ్ ఫీలింగ్/ ఉప్పొంగు అనుభూతుల అభివ్యక్తి" వీరి కవిత్వం.

:7:

వీరి ఉపమానాలు, రూపకాలు అప్పుడే పుట్టిన పిట్ట కూనల్లా పాఠకుణ్ణి అబ్బుర పరుస్తాయి.

ఉదా|| భూమి వంటి అమ్మమ్మ, ఆకు పచ్చని చెట్లు బడి పిల్లల్లా, కాలంనది, చినుకు శిశువు నీడల కాలువలు, వెల్తురు పుప్పొడి, పడవ చంద్రుడు, తారల ఇసుకమైదానం మొదలైనవి.

ఒక విధంగా ఈ కవిత్వం ఒక ఫిల్టర్ వంటిది. మనం చదివే ప్రతి వాక్యం మనల్ని ప్యూరిఫై చేయడమే తప్ప కొత్తగా మనకేదో నేర్పాలనే ప్రయత్నం చేయదు. మన మానసిక స్థౌల్యతని కరిగించి తేలిక పరచి స్వస్థత కలిగించి మన అసలుని మనకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది.

వీరి కవిత్వం పై సమకాలీన ప్రముఖ కవుల అభిప్రాయాలు

అందుకే సమకాలీన కవులంతా వీరి కవిత్వాన్ని అత్యంతగా ఇష్టపడతారు దీనికి కారణం వారు కూడా ఈ కవిత్వంలో ఉపశమనం పొందడమే

ఆకాశం కవితాసంపుటిని గురించి డా॥ రెంటాల వారు ఇది 'ప్రొఫెట్' తరువాత పుస్తకం. ఇది ఆంగ్లంలోకి అనువాదమైతే భారతీయ ఖలీల్ జీబ్రాన్ ఇలా వుంటాడని అందరికీ తెలుస్తుంది. అని అంటారు.

ఆకెళ్ళ రవిప్రకాష్ గారు తన వ్యాసంలో బి.వి.వి.ప్రసాద్ గారిని యువచలం అన్నారు. (ఆంధ్రజ్యోతి దినపత్రిక, వివిధ 18/05/2020)

నాకనిపిస్తారు వీరు శ్రమణకుల ఆర్తిని తీర్చిన గౌతమ మునిలా

కళ్ళలో దయా స్పర్శలో నిర్మలత్వం
మాటలో నిజాయితీ, మనిషిలా స్పందించడం మరచిపోకుండా ఉంటే చాలు

హాయిగా నవ్వడమూ, హాయిగా ఏడవటమూ పోగొట్టుకోకుండా ఉంటే చాలు 
(ఆకాశం - 2011 చాలు)

ముగింపు :-

బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలో శాంతి, కరుణ, ప్రేమ, క్షమ, వంటి మౌలిక భావనలు ఎంతో లోతుగా అనుభూతి ప్రధానంగా అద్వైతాంశతో దర్శనమిస్తాయి.

మానసిక కాలుష్యంతో, వైషమ్యాలతో కొట్టు మిట్టాడుతున్న మానవ లోకం ఉపశమించే పరమశాంతి ధామమీకవిత్వం.

నేటి ప్రథాన స్రవంతికన్నా భిన్నమైన ఆధునిక ధోరణితో వెలువడుతున్న ఈ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

8:

ఆధార గ్రంథాలు :

1. ఆరాధన, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, రవి ప్రింటర్స్, తణుకు, 1989.

2. బి.వి.వి. ప్రసాద్, హైకూలు (దృశ్యాదృశ్యం 1995, హైకూ 1997, పూలు రాలాయి 1999) బి.వి.వి. ప్రసాద్, శ్రీ శ్రీ ప్రింటర్స్ విజయవాడ.

3. నేనే ఈ క్షణం, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, శ్రీ రత్న ప్రింటర్స్, రాజమండ్రి. 2006

4. ఆకాశం, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, 2011.

5. నీలో కొన్నిసార్లు, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, వాసిరెడ్డి పబ్లికేషన్స్, హైదరాబాద్, 2015.

6. ఊరికే జీవితమై, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, ప్రేమలేఖ ప్రచురుణలు, 2023.

7. సృష్టి బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, స్వేచ్ఛా ప్రచురణ, తణుకు. 2026.

8. ఒలుపు సాహిత్య వ్యాసాలు, డా॥ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, చినుకు పబ్లికేషన్స్, విజయవాడ, 2017.

9. ఆలోచన, సాహిత్య వ్యాసాలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ M.A.I Books, సికింద్రాబాద్, 2014.

10. ఆధునిక ఆంధ్రకవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు. డా॥ సి.నా.రె. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.

మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్, 
పి.జి.టి. (తెలుగు)
ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాల ప్లస్, పెంటపాడు
పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
(ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్టణం, తెలుగు శాఖ, పార్ట్ టైం పి. హెచ్. డి. రీసెర్చి స్కాలర్)
9441350260, 7013543732, sriram9441350260@gmail.com

ప్రచురణ : 
భావ వీణ - ప్రత్యేక సంచిక 28.2.26
ప్రభుత్వ డిగ్రీ కాలేజి, రాజోలు, డా॥ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ తెలుగు విభాగం

10 మార్చి 2026

ఒకే రూపమెత్తిన కవీ - తత్వవేత్త

 తత్వశాస్త్ర సారం కవిత్వ ప్రక్రియలో ఒదుగుతుందా? నిజానికి కవీ, తత్వవేత్తా ఒకే పాత్ర పోషించగలరా? హృదయాన్ని గిలిగింతలు పెట్టే మహోద్వేగ జలపాతానికీ, మెదడుని అగ్నిపర్వతం వలే విస్ఫోటనానికి గురి చేసే సత్యాన్వేషణకీ లంకె వేయడం ఎప్పుడూ దుస్సాధ్యచర్య. 'కనబడని ఆనందంలోకి తిరిగిరాకుండా తప్పిపోవాలి'; 'వాక్యాలకవతల ఖాళీ ఆకాశం ఉంటుంది'; 'జీవితం గాజుకన్నా అల్ప'మని .. బివివి ఒక్కో కవితా వాక్యం ఘనసముద్రమంత లోతుగా ఉంటుంది. పాఠకుడికి అసంకల్పితంగా ప్రతి కవితలో ఒక మూర్తిమత్వం కదలాడుతుంది. కవి మానవీయస్వరంలో ఆరాధనా భావం సున్నితమైనది. అంతమాత్రాన దీన్నేమీ భక్తి కవిత్వం అనకూడదు. పోనీ జ్ఞానదాహంలానూ తోచలేదు. 144 కవితలున్నప్పటికీ ఇందులో విముక్తకాంక్షతో పలికే సారాంశ ధ్వని ఉంది. చెబుతున్నదెవరు, చెవి ఒగ్గి వింటున్నదెవరూ అన్న వ్యత్యాసం లేదు. అది తనని తాను తెలుసుకునే ఒక మనిషి ఆరాటమే. ఈ సౌందర్యం భిన్నమైనది. పరిణితి గలది. కవి తనలో అణచిపెట్టుకోలేని జీవన రహస్యాలన్నీ వెల్లువగా ప్రవహించిన కవిత్వ ధార ఇది.

- పుప్పాల శ్రీరామ్
ప్రతులకు : అనేక బుక్స్, విజయవాడ 92472 53884

ఆదివారం ఆంధ్రజ్యోతి 8.3.2026


02 జనవరి 2026

జీవనోద్వేగం వైపు ... - డాక్టర్ సుంకర గోపాల్

బివివి ప్రసాద్ మొదటి పుస్తకం ఆరాధన నుండి ఇప్పటి సృష్టి వరకు వచ్చిన కవిత్వంలో తన తాత్విక ధారను కొనసాగిస్తున్నారు. మొత్తం మీద వారి సారాంశం అద్వైత భావన. జీవితంలో ఆయన జీవితేచ్చ వెతుకుతున్నాడు. జీవితంలో ఉండే సుఖ, దుఃఖాలను జీవితంలో ఉండే ద్వంద్వాలను అనేకమార్లు బివివి గుర్తించాడు. ఈ జీవితాన్ని ఎట్లా దాటాలో, ఎందుకు దాటలేమో దాని అంతు చూడాలనేది ప్రసాద్ గారి బలమైన కాంక్ష. ప్రకృతికి ,కాలానికి మనిషి అతీతుడు కాదు. శూన్యం నుండి మొదలై భావోద్వేగాల ద్వారా పరిపూర్ణత చెంది, తిరిగి శూన్యం వైపు అనగా అది నిద్ర కావచ్చు, మరణం వైపు కావచ్చు. మానవ జీవితం శూన్యం నుండి శూన్యం వైపు వెళుతుంది అనే భావనను ప్రసాద్ గారు గాఢంగా నమ్మారు. సరళపదాలలో తాత్వికతను పలికించారు. జీవితం తనని తాను ఎట్లా జీవిస్తుందో పసిగడుతున్నారు

వారు రాసిన సృష్టి అనే కవితని పరిశీలిస్తే ఈ సృష్టిని చిత్రకారుడు నైపుణ్యంతో పోలుస్తూ మానవ ఉనికిలోని తాత్విక కోణాన్ని చూపుతారు. సృష్టి కవిత మూడు మూడు పాదాలుగా ఉంటూ చివర నాలుగు పాదాలతో ముగుస్తుంది. ఇందులో వారు మొదట కవితకి పునాది వేస్తారు.

"ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు
అవి ఆకాశమూ, గాలీ, నీరూ
కాంతీ, చీకటిలో వెన్నెలా"

ఈ మూడు పాదాలను చిత్రకారుని నైపుణ్యంతో పోలుస్తూ కవితకి పునాది వేస్తారు.

"రంగులపై కొన్ని గీతలు గీయి 
నదులూ, కొండలూ, మైదానాలూ 
ఉదయాస్తమయ మేఘాలూ, పాలపుంతలూ"

ఈ పాదం మనకు ఒక ఆకృతిని ఆకారాన్ని తెలియజేస్తుంది. తరువాతి మూడు పాదాలలో ప్రకృతికి చైతన్యాన్ని ఇచ్చే ప్రతీకలను చెప్తారు.

"గీతలను కొంచెం కదిలించి చూడు
చెట్లు, పిట్టలూ, చేపలూ
చీమలూ, ఏనుగులూ, మనుషులూ"

ఆ తర్వాతి మూడు పాదాలలో ఖాళీ మనసులోని భావోద్వేగాలను చెప్తారు.

"కదలికలలో ఉద్వేగాలు కలుపు 
చిక్కగా, లేతగా ,తీవ్రంగా, తేలికగా 
మంచీ, భయమూ, బాధా, ప్రేమా"

చివరి నాలుగు పాదాలలో శూన్యం నుండి శూన్యం వైపు వెళ్ళడం గురించి చెప్తారు.

"ఇంతకన్నా ఊహించేదేమీ లేదు 
నువ్వైనా, దేవుడైనా 
మళ్లీ మొదటికి రావాల్సిందే 
నిద్రలోనో, మరణంలోనో, జ్ఞానంలోనో" అంటారు.

బివివి ప్రసాద్ చాలా కవితలలో ప్రకృతిలోని వైవిధ్యానికి జీవన ఉత్సాహమే కారణం అనే భావన కనిపిస్తుంది. ఆయన రచించిన మరో కవిత రంగుల పిల్లలు, ఇందులో రంగులు ఆశకి, అస్తిత్వానికి గుర్తుగా చెప్పారు. జీవితంలోని సుఖ, దుఃఖాలను ఓదార్పుగా బతుకుపై ఆశను కలిగించే పసిపిల్లలలాంటి శక్తులుగా కవి అభివర్ణిస్తాడు. ఈ కవిత చదివాక పాఠకుడు తన అంతరంగాన్ని తానే చూసుకోవాలి.

ప్రసాద్ గారికి ఉన్న గొప్ప శక్తి దృశ్య చిత్రణ, అది అన్ని కవితల్లో కనిపిస్తుంది.

"అస్తమయబింబం ఆకాశంలోకి విసిరే 
చివరి నారింజ కాంతిలా

అట్లా నలుపు, తెలుపుల
దుఃఖానందాల కెరటాల మధ్య
రంగులు నీకు ఆశ కల్పిస్తాయి అమాయకంగా 
ఇక్కడింకా ఏదో ఉందని"

ఇక్కడ కవివాడిన నలుపు, తెలుపులు వాస్తవానికి, నిశ్శబ్దానికి సూచికలు.
 
ఇందులో ఉన్న మరొక కవిత మోహం. ఈ కవిత ద్వారా బ్రతికే క్షణాల విలువను కవి చెప్తారు. బాహ్య ప్రపంచానికి అంతరంగ ప్రపంచానికి మధ్య ఉన్న విభజనను గుర్తించమంటారు. జీవితాన్ని అనుభవించాలి అనే తహతహ అడుగడుగునా కనిపిస్తుంది. రెండున్నర గంటల సినిమా అయిపోతుందని జాగ్రత్తగా చూసినట్లు జీవితాన్ని చాలా విలువగా చూడాలని ఈ కవితలో కవి
గుర్తించమంటాడు. మోహం జీవితం పట్ల ఉన్న లేదా ఉండాల్సిన ప్రేమకి సూచిక.

"జీవితమ్మీద ఇంత మోహమేమిటి అంటారు 
ఏ రోజైనావెళ్ళిపోయే విరక్తి ఉంది గనుక అంటావు

ఆ దీపం వెలుతురు, బాటపై మనుషులు 
ఇళ్లపై వెలుగునీడల దోబూచులాట 
ఉండి ఉండి తగిలే గాలి తెరలు
కురవలేక బేలగా నిలబడిన మబ్బులు 
మానుష ప్రపంచపు వింత శబ్దాలు 
చనిపోతే ఇక దొరకవు కదా అని కూడా

జీవించటం ఇంత అపురూపమైన సంగతా అంటారు".

పై వాక్యాలలో కవి నిర్మాణాన్ని పరిశీలిస్తే
చాలా తేలికైన వాక్యాలుగా అనిపిస్తాయి. కానీ ఇందులో కవి జీవితంలోని దృశ్య, స్పర్శ, శబ్ద సన్నివేశాలను చెప్పాడు.

ఇక ఇదే కవితా సంపుటిలో సీతాకోకల కథ
కవిత ఉంది. అందులో కవిత చాలా మామూలుగా 

"రెండు తెల్లటి ప్లాస్టిక్ సీతాకోకల్ని
తలలో తురుముకుంది ఆ అమ్మాయి"
అంటూ ప్రారంభం అవుతుంది.

ఆ కవితలో 
"మాకు రెక్కలున్నాయి, ఊహల్లేవు, 
నీకు ఊహలున్నాయి, రెక్కల్లేవు"
వాక్యాలు మనిషి ఉనికిలోని వెలితిని సూచిస్తాయి. మనిషికి ఎగరాలనే కోరిక ఉంటుంది కానీ పరిమితులు ఉంటాయి. ఈ రెండింటి కలయికతో కళాసృష్టి జరుగుతుందని కవి సీతాకోకల కథ అనే కవితలో చెప్తాడు.

ఈ కవిత, వస్తువు రీత్యా సామాన్యంగా అనిపించినా, దాని వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది. ఒక చిన్న దృశ్యాన్ని (అమ్మాయి తలలోని ప్లాస్టిక్ సీతాకోక చిలకలు) తీసుకుని, దాన్ని కవిత్వం, ఊహ మరియు జీవిత సత్యాల మధ్య సంఘర్షణగా మార్చిన తీరు గొప్పగా ఉంది.
 
కవి నిరంతరం బాహ్య ప్రపంచాన్ని తన ఊహలతో నింపేయాలని చూస్తుంటాడు, కానీ జీవితం దానికంటే బరువైనదని ఇక్కడ గుర్తు చేస్తారు.
 
"మాతోపాటు సూర్యకాంతినీ, ఆకాశాన్నీ, భూమినీ
అంతటినీ దాచుకునే, పంచిపెట్టే 
జీవితం బరువునీ నువు మోస్తూనే ఉండాలి" అని అంటారు.

"జీవితం బరువునీ నువు మోస్తూనే ఉండాలి" - ఊహల్లో విహరించడం సులభమే కానీ, సూర్యకాంతిని, ఆకాశాన్ని, భూమిని మోయడం కష్టమని కవి అంటారు. కవి కేవలం అందాన్ని మాత్రమే కాదు, ఆ అందం వెనుక ఉన్న జీవిత పాఠాన్ని కూడా వెతుకుతున్నారు.

అమ్మాయి వెళ్ళిపోయాక, అక్కడ మిగిలిన 'నీరెండ'
సీతాకోకలా ఎగరడం అనేది కవితకు ఒక గొప్ప దృశ్యాత్మక ముగింపునిచ్చింది. అమ్మాయి వెళ్ళిపోయినా, కవి ఆలోచనల్లో ఆ అనుభూతి ఇంకా మిగిలే ఉంది.

ఈ కవిత కేవలం ఒక అమ్మాయి తలలోని పిన్నుల గురించి కాదు; ఇది కవిత్వానికీ - జీవితానికీ, ఊహకూ - వాస్తవానికీ మధ్య జరిగే నిరంతర సంవాదం. లోకాన్ని పరిశీలించే క్రమంలో కవి తనని తాను ఎట్లా విశ్లేషించుకుంటారో ఈ కవిత ప్రతిబింబిస్తుంది.

"భూమి ఇంకా ఎడారి కాలేదు
సముద్రం ఎండిపోలేదు 
వెన్నెల మసకగానైనా కనిపిస్తూ ఉంది 
ఎందుకు బ్రతకకూడదు"

అంటూ మరొక కవితలో ఆత్మహత్యలు చేసుకునేవారికి క్షణాల విలువ, ఊపిరి విలువ, జీవితం విలువ, సారహీనమైన జీవితాన్ని వెలిగించుకోవడానికి ఏమేమి చేయాలో, మనకు ఏది భరోసాగా నిలుస్తుందో చాలదా అనే కవితలో చెప్తారు. ప్రసాద్ గారు ఉదయం కిరణాలు, గాలి, మధ్యాహ్నపు ఎండ నీడ, సాయంత్రం దిగులు ఆకాశం పైన కనిపించే రంగులు, చీకటి వచ్చిన సమయాల్లో ఆకాశంలో మెరిసే నక్షత్రాలు.. ఇవన్నీ మనల్ని బతికిస్తాయని, కొంచెం ప్రేమ మిగిలి ఉన్న చాలు ద్వేషాలు, అపనమ్మకాల మధ్య ఒక్క తడి చూపు చాలు ఈ లోకం చాలా ఏళ్లు బతుకుతుందని తన కవిత్వం ద్వారా భరోసా ఇస్తాడు. 

ఈ లోకంలో మనం ఏమన్నా బతికితే చిన్నప్పుడు మాత్రమే బతికామని మిగిలిన జీవితం అంతా కేవలం బదులు చెల్లించడం వలే గడిపేస్తున్నామని వాపోతాడు. జీవితాన్ని సాహసంగా స్వీకరించడం ఎలానో సృష్టి కవితా సంకలనంలోని చాలా కవితలు ఒక తడి హృదయం తో చెప్తాయి. బీవీవీ కవిత్వంలో ఆకాశము, సముద్రం, క్షణాలు, జీవితం, పూలు, సీతాకోకలు, ప్రేమ, దయ, దుఃఖం వంటి పదాలతో చేసే ఊహలు సరికొత్తగా ఉంటాయి. ఇక ఆయన వాక్యాలు మృదువైన స్పర్శతో సున్నితంగా, లాలనగా ఉంటాయి. ప్రపంచం పట్ల, ఈ ప్రపంచంలోని మనుషులు పట్ల అపారమైన ప్రేమ కలిగిన కవి బివివి ప్రసాద్. ప్రపంచాన్ని లేదా జీవితాన్ని చిన్నారిపాపలా దగ్గరకు తీసుకోవడం ఎట్లాగో ఈ కవిని చదివాక తెలుస్తుంది. ఆయన ఓ కవితలో ముగింపువాక్యం చూడండి.

"జీవితం నీ ప్రేమ కోసం ఏడుస్తున్న 
నీ తప్పిపోయిన శిశువు"

సృష్టి కవిత సంపుటి కోసం బీవీవీ ప్రసాద్ గారిని సంప్రదించవచ్చు.

- డాక్టర్ సుంకర గోపాల్
8555971630

(కవిసంగమం గ్రూప్ లోని కవిత్వ కాంతి శీర్షిక కోసం రాసిన 44వ వ్యాసం)



22 డిసెంబర్ 2025

"సృష్టి" First look , first impression. - CV Ramana

Bvv Prasad గారి కవితాసంకలనం, 'సృష్టి' అందింది . కృతజ్ఞతలు! కవితలు చదివి, పాఠకుని గా ప్రతిస్పందన చెప్పమన్నారు. ఆయన కవితల్లో లోతు తెలిసినవారు, అలా చెప్పడానికి చాలా టైం పడుతుంది అని వొప్పుకుంటారు . 

వీటిలో అధిక భాగం, 2023-25 సంవత్సరాల మధ్య రాసినవి లాగ ఉన్నాయి. మొత్తం 144 కవితలు. 250 పేజీలు. Rs 250/- 

Very rarely he has written so profusely and prolifically ever since I knew him .

ఆయన "రాయాలి"  అనుకుని Will Power తో రాశారా ? లేక ఏదైనా శక్తి పూని ఆయన చేత రాయించిందా ? 

ఆయనే రాశారా? లేకా ఆయన ద్వారా, ప్రసాద్ గారు 'వాహకం' గా, కవిత్వమే ఆయనను పూని రాయిపించిందా? అనేది, ఆయన కవిత్వం, BVV Prasad's Poetry రెగ్యులర్ గా చదివే పాఠకులు అర్ధం చేసుకో గలరు. 

గంగారెడ్డిగారు, స్వాతికుమారిగార్లు ఎపిలోగ్ లు అనగా, పుస్తకం చివరిమాటలు రాశారు. 

Most of his earlier poetry too, was deeply philosophical. నాకు ఆయన అలానే పరిచయం, 2010 నుంచి, due to deep philosophy in his writing. Profound feel. 

2012 లోనో, ఏమో, ఒక కవిత చదివాను. From BVV Prasad sir. కూతురిని కాలేజి హాస్టల్ లో వదిలి, కాస్త దిగులు తో ఇంటికి వచ్చిన తండ్రికి, phone call from his daughter.  

"బెంగ గా ఉంది నాన్నా, ఇక్కడ, ఈ రాత్రి!" అంటూ. 

It made such a profound impact on me that I still remember it today. I could resonate with it deeply. I wish he reproduces it sometime or it's already published in one of his poetry books.

***

"ఎన్నో దుఃఖాలు ఈది, భయాలు దాటి 
ఏళ్ళకి ఏళ్ళు నడిచి
ఈ ప్రశాంతమైన ఉదయానికి చేరుకున్నావు 
ఈ క్షణం స్వచ్ఛ స్ఫటికంలా 
నిలిచిపోతే బావుండుననిపిస్తుందా 
ఇక మెల్లగా మంచులా చెదురుతుంది ప్రశాంతత"

ఈ పీసు, ఒక కవిత లో ని ఈ మొదటి పద్యం , దానిలోని చివరి 2 పాదాలు చదివాక, 30 నిముషాలు, కళ్ళు మూసుకుని ఉండి పోయాను. Reflecting, brooding. 

"ఈ క్షణం, స్వచ్ఛస్ఫటికంలా ఇలానే నిలిచిపోతే బాగుండును అనిపిస్తుందా? 
ఇక మెల్లగా, మంచులా చెందుతుంది ప్రశాంతత!" 

నా మనసు జిడ్డు కృష్ణమూర్తి దగ్గరకు వెళ్ళిపోయింది . 
ఆయన దగ్గరికి వచ్చిన ఒకరు అడిగారు "ఒక్కసారి వచ్చింది ఆ ప్రశాంతమైన ఫీలింగ్. వచ్చి అలా వెళ్ళిపోయింది. మళ్ళీ ఎంత ధ్యానం చేసినా, ఎంత అన్వేషించినా, దొరక లేదు! దాన్నీ మళ్ళీ వెదికి పట్టుకోవడం ఎలా?' అని అడిగారు, కళ్ళల్లో నీటిపొరలతో. దుఃఖంతో.  

JK said, with the compassion of a surgeon's knife "The very demand for continuation or continuity is the denial of it! It will spoil the beauty of it. Besides, demand for continuity will become the genesis for fear of death (మృత్యు భయం), desire, fear and all the rest of it.  What ever happens, let it happen. What ever leaves you , let it leave" అని. 

ఈ పద్యం లో చివరి 2 పాదాలు చదివాక, నన్ను జిడ్డు కృష్ణమూర్తి ఆవహించారు.

18 డిసెంబర్ 2025

మనలో ఒక ఖలీల్ జిబ్రాన్ : రఘు శేషభట్టర్

రాత్రుల్లో విందు చేసే మిణుగురు పుష్పాల్ని ఎండలోకి రమ్మని ఎవరూ అడగరు. చేతుల్లోకి తీసుకున్న బంతిపూల దండ నుండి జాజుల మత్తు కోసం ఎవరూ వెతకరు. వాటి సహజ గుణాలు తెలుసు కనుక గౌరవించి తప్పుకుంటాం. Bvv Prasad కూడా అంతే. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని అలౌకిక ప్రపంచం తనకుంది. అది దాటి కవిత చెప్పమని అడిగితే కృతకంగా ఉంటుంది..

జీవితం పట్ల తనకున్న ప్రేమను వ్యాకులతను పలు పార్శ్వాల్లో మననం చేసే BVV బహుశా ఖలీల్ జిబ్రాన్ స్థాయి కవి. ఆయన లీనమయ్యే విషయాలేవన్నది పక్కన పెడితే తనను చదువుతున్నప్పుడు, చదివి ఆపినప్పుడు ఒక తల నెరిసిన మనిషి జీవిత సత్యాలేవో చెబుతున్నట్టుంటుంది. ఒక ప్రశాంత గంభీరత తట్టి కుదుపుతుంది.

   ' ప్రేమ ఉంటే పెద్దగా చెప్పేందుకు ఏమీ ఉండదు
     మాటలన్నీ మంచు ముక్కల్లా కరిగిపోతాయి '

   ' లోకాన్ని నువ్వు, నిన్ను లోకమూ చేయగలిగిందేమీ లేదు
     ఒకేచోట తిరిగే గాలిదీ కాంతిదీ వేరు వేరు ప్రపంచాలైనట్టు
     ఒకదానినొకటి ఏమీ చేయలేనట్టు '

     ' ప్రపంచంలో గడిపాక
      ఈత చాలించిన దేహంలా ఏకాంతంలో మునిగినప్పుడు'

ఈ తరహా మాటలు అతి సహజంగా ఉబికి వస్తాయి తన తాజా సంపుటి ' సృష్టి' లో. దిగులు పడినప్పుడు, విడిపోతున్నప్పుడు పొగిలి పోయే మనిషి సృష్టితో చేసే సంభాషణ పుస్తకం నిండా ఆవిరించి ఉంటుంది. ఎన్నో వెతుకులాటలు, దూది అద్దిన భాషణలు సీతాకోకల్లా తాకిపోతాయి.

'ఎవరైనా నిష్కపటంగా ఒక జీవిని ప్రేమించటం చూస్తే ముఖం ప్రసన్నమౌతుంది' అని BVV చెప్పిన మాటల్ని అతని కవిత్వానికి కూడా అన్వయించ వచ్చు.

Thank you Raghu Seshabhattar garu 🙏❤️

15 డిసెంబర్ 2025

ఆహా! ఎంత అందమైనదీ సృష్టి! - వాసు (న్యాయపతి శ్రీనివాస్)

 బి.వి.వి. ప్రసాద్ నలుగురి మన్నననూ పొందిన కవి. ఆయన హైకూలు రాస్తూండిన కాలం నుంచే ఆయనకొక fan following ఏర్పడింది. అది కవులకు అరుదుగా దొరికే గుర్తింపు. ప్రసాద్ కవిత్వంలోని విమల కోమల పదాల, వాక్యాల వరుసల్లో కనిపించే ప్రశాంతత వెనుక ఆయన నమ్మే అద్వైత సిద్ధాంతముంది. ఇందులోని కవితాత్మక పంక్తుల కుంభవృష్టిలో తడిసిపోయిన పాఠకులు చివరకు మిగిలేది ఏమిటో ఇట్టే గ్రహిస్తారు. ఇదొక రెండంచుల కత్తి. తను నమ్మిన సిద్ధాంతం తళుక్కున మెరుస్తూండే కవిత్వం రాయడం ఏ కవికి ఎంత కష్టమో గానీ ఈ కవికి ఇది సులభసాధ్యమేనని ఈ కవితా సంపుటి చెబుతోంది. "ఊరికే జీవితమై" సంపుటి తరువాత రెండేళ్ళకు ఇది వస్తూ ప్రసాద్ అభిమానులను అలాగే అలరించగలిగిన సంపుటి ఈ "సృష్టి". కవి ఈ చరాచర సృష్టినీ జీవితాన్నీ అద్వైతసిద్ధాంతపు వెలుగులో చూస్తూ అనుభవించగా చెందిన తన్మయమే ("తత్"+మయం!) ఇతని కవిత. వర్షం, రంగులు, పిల్లలు, తల్లీపిల్లలు, కొండా కోనా - వీటన్నిటినీ ఏ కవీ చూసి ఊరుకోలేడు, ఉరకలు వేస్తాడు. ఈ కవి వేసిన ఉరకలు చల్లగా వెన్నెల్లా సోకుతాయి. ఇంకా, ఈ కవి చెప్పిన సత్యాల వెనుక కఠోరమైన అనుభవాలున్నాయి. "గాఢమైన దుఃఖం తర్వాత మళ్ళీ పుడతావు/లోపలి జీవితేచ్ఛ నిన్ను మళ్ళీ ప్రసవిస్తుంది" అనడానికి ఎంతో బాధ తెలిసుండాలి. కవితాత్మక వాక్యాలు ఇందులో ఆద్యంతమూ కనిపిస్తూ హాయినిస్తాయి. "ఒక ఉదయం లేచేసరికి/పూవుగా మారిపోయి ఉంటావు" అనడమొక ఉదాహరణ. "వాన కురిసే వేళ/నీకు నువ్వు నిజంగా దక్కుతావు" అన్నప్పుడు కవి ఎన్నో పరకాయప్రవేశాలు చేసాడని ఊహించవచ్చు. ఏకాంతం విలువ, అది పెట్టే ఒత్తిడీ తెలిసిన కవి కనుక, "చీకటి పడేకొద్దీ ప్రకాశిస్తావు నీలోపలికి" అనగలిగాడు ఈ కవి. ఇందులో వరమో శాపమో అర్థం కాని, బహుశా రెంటికీ అతీతమైనదేదో దొరికేట్టుచేసే epigrams కూడా చాలా ఉన్నాయి. ఇది చూడండి: "గగనంలో తేలిన ఇంద్రధనువు/గగనంలోనే మునిగినట్లు/జీవితంలోంచీ తేలిన నువ్వు/జీవితంలోనే మునుగుతావు". "కనబడని ఆనందంలోకి తిరిగిరాకుండా తప్పిపోవాలి" ఈ వాక్యం కవి కొండల్లో తొలిచిన రోడ్లమీదుగా వెళుతుండగా రాసిన కవితలో ఆఖరి వాక్యం. జీవితానికి అర్థం చెప్పిన మహావాక్యమూ ఇదే. "ఇతరులు లేరనేంత ప్రేమ నీపై నీకు లేకపోవటమూ/ఇతరులు నువ్వే అనేంత ప్రేమ వారిపై లేకపోవటమూ/జీవితం లోతుల్లోని బలమైన విషాదం" అంటూ మనిషికే భాష్యం చెప్పాడు ఈ కవి. "చూస్తూ ఉండగా, గాఢమైన దిగులులోంచీ/కాంతివంతమైన మృత్యుపుష్పం/నీ ముందు దయగా విచ్చుకుంటుంది". నన్నడిగితే, ఈ దీవెన చాలు. ఈ సంపుటిని విశ్లేషిస్తూ గంగారెడ్డి గారు అన్నట్టు ఇది కవి తనకు తాను రాసుకున్న మ్యూజింగ్స్‌లాంటి కావ్యలేఖ. గంగారెడ్డిగారి కన్నా బాగా ఈ సంపుటిని అర్థం చేసుకున్న వారున్నారా అని నా సందేహం. ఉన్నారేమో! వాళ్ళు ఏదీ రాయరు. 

-వాసు-

Thank you Srinivasa Nyayapati garu!



14 డిసెంబర్ 2025

సృష్టి పై Sivaji Tallavajhula గారి స్పందన

సుకవీ, మీ సంకలనం చదవటం పూర్తయింది. వెంటనే స్పురించిన కొన్ని మాటలు మీకు ఇలా.. 

మనసును శాంతింపజేసే మంచి కవిత ఎదురైతే చాలు, ఆ పుస్తకాన్ని అలాగే గుండె మీద పరచి ఆనందావస్థ లోకి జారిపోగలను, సృష్టి నాకదే చేసిపెట్టింది. సకలమైన వ్యక్తిగతాలను కళ్లద్దాల వలె మార్చుకుని ఏ ఒక్క కవిత చదవను. అలా చేస్తే నా సెంటిమెంటుకి దగ్గరగా ఉంది గనుక భలే కవిత ఇదని చెప్పడం ఫక్తు దొంగనాటకం కదా, నాకు కుదరదు. కనుక ఘనీభవించిన కలను గాని, ఊహను గానీ ముందస్తుగా సిద్ధం చేసుకోకుండా పుస్తకంలోని కవితలన్నీ చదివాను.

రాసిన కవికీ, చదివిన నాకూ నుదుటి మీద గానీ, అరచేతిలో గాని ఒక ప్రత్యేక కన్ను ఏర్పడిందని స్పష్టం అయింది. 

ఎట్టి వర్ణనలకు లొంగని ప్రశాంతమైన ఆనందలోకం, రెక్కలొచ్చిన నిశ్శబ్దం, వెన్నెల వెలుగు పరావర్తనం వంటివన్నీ నాలో జరిగిపోయాయి.

రంగుల పిల్లలు, ఇవాల్టి పని వంటి కవితలు ఎవరు చదివినా వారికి అవ్యక్త మాధుర్యాన్నిస్తాయి, అందుకు పూచికట్టు నాది.

"ఏ కారణమూ లేదనుకున్నా దయలోకి కరిగి పోవటం కంటే ఏదీ అనుభవం" తపోదర్శనం వంటి ముక్క ఇది. "అర్ధం లేకపోవటంలోకి ఎగరలేక కదా ఇదంతా ఇంత బరువు" "లోపలికంటా కురిసే ఒక వాన చాలు" ఇలా చెప్పుకుంటూపోతే నాకు తెలీకుండా నీ మొత్తం పుస్తకం అప్పగిస్తానో ఏమో.. నమస్తే కవీ!

తల్లావఝుల శివాజీ

13 డిసెంబర్ 2025

నిండైన శూన్యం : స్వాతి కుమారి

"ఈ కవితలు మీరు రాస్తున్నవి కావు, మీ ద్వారా రాయబడుతున్నవి” అని గతంలో ప్రసాద్ గారితో కొన్నిసార్లు అన్నాను. ఈ పుస్తకానికి సంబంధించి ఆ మాటలు పూర్తిగా నిజం అనిపిస్తుంది.

రాత్రింబవళ్ళకి, వెలుగునీడలకి మధ్యలో స్పష్టమైన విభజనరేఖ లేనట్టుగానే - మనిషితనంలోని మధనకి, కవిసమయంలోని కరుణకి మధ్య పరచుకున్న సాయంకాలపు నీరెండలాంటిది ఈ కవిత్వం.

ఇక్కడ కవి తనను మించిన, తను ఊహించిన, అనుభవించిన లేదా అనుభూతికి అతీతమైన ఒక మహాశక్తికి పూర్తిగా తనని తాను అర్పించుకోవడం కనపడుతుంది. దీనిలో రహస్యం ఏమీ లేదు, అన్నీ మనందరి కళ్ళ ముందర తేటతెల్లంగా కనబడే సంగతులే. ఇవి కేవలం దిగుళ్ళో, ప్రశ్నలో, బాధలో, భయాలో కాదు. అలా అని సంతోషపు కేరింతలో, పరవశత్వపు పలవరింతలో మాత్రమే కూడా కాదు. నిమిత్తమాత్రంగా, నిర్మోహంగా, నిరామయంగా తనతో సహా సమస్త ప్రపంచాన్ని చూసుకునే చూపు, లేదా కొత్తగా చూడాల్సిందేమీ లేదనే గుర్తింపు.

ఇంతా కలిసి మాటల్లో చెప్పలేని దాన్ని మాటలు గానే ప్రత్యక్షం చేసుకున్న కవి కఠోరతపస్సు, మౌనంగా మోయవలసిన బరువుని మౌనంలోకే దింపుకున్న ఒక మామూలు మనిషి తేలికపాటి మనసు. తెలియనంత వరకు చిక్కుముడిగానే ఉన్నదాన్ని, తెలుసుకోవడం అంటే "ఇది ఎప్పటికీ చిక్కుముడి అనే ఎరుకతో మసలడం" మాత్రమే అనే గమనింపు.

అదే కాలం, అదే కవిత్వం, అదే ఈ సృష్టి

స్వాతి కుమారి

(సృష్టి సంపుటికి కవితల ఎంపికలో సహాయం చేసిన స్వాతికుమారి పరిచయ వాక్యాలు. )



02 డిసెంబర్ 2025

వెలుగునీడల దోబూచులాటలో తండ్రీ తానే, బిడ్డా తానే: ఏ.గంగారెడ్డి

 1

కవి రాసిన సృష్టి కావ్యం ఆసాంతం, ఒకటికి రెండుసార్లు చదివాను. కవి ఏం చెబుతున్నాడో కనెక్ట్ కావడానికి ప్రయత్నించాను. ఇది సున్నితమైన, కళాకారుడైన ఓ జీవుడి ఘర్షణ. ఘర్షణ నుండి, ద్వంద్వాల నుండి బయటపడాలని చేస్తున్న తాత్విక ప్రయాణం. ఏది నిజమో, ఏది అబద్దమో పూర్తిగా తేల్చుకోలేని ఊగిసలాట. దొరికినట్లు, జారినట్లు ఉండే జీవనఫల ప్రయాణం.

బయటి మనిషికి, లోపలి మనిషికి మధ్య నడుస్తున్న రాయబారం. బయటి ప్రపంచంలో కొడుకు అలసిపోతే, తన లోపలి తానే తండ్రిగా కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఓదార్చుతున్న తాత్వికకావ్యం. ఇక్కడ తండ్రీ తానే, కొడుకూ తానే. బాధా తానే, బోధా తానే. బాహ్యానికి అంతరానికి మధ్యలో సంధి కుదిర్చే ప్రయత్నం. లోకం నుండి పోవాలనుకునే కవికి, ఉండాలనుకునే కవికి మధ్య సయోధ్య ఈ కావ్యం. పొంతన కుదరని అంతర, బాహ్యాలకు, చీకటి, వెలుగులకు మధ్య సమన్వయ ప్రయత్నం ఈ కావ్యం. సత్యాసత్యాల సంఘర్షణ ఈ తాత్వికకావ్యం. మనసు పగుళ్ళతో విరక్తి చెంది, మనసులేని ప్రకృతి ఒడిలో సాంత్వన పొందుతున్న కవి అంతరంగప్రయాణం ఈ కావ్యం.

ఇట్లాంటి మనోస్థితిని అనుభవించే సున్నితమైన బుద్ధిజీవులు ఉండవచ్చు. కానీ, దాన్ని ఓ తాత్వికకావ్యంగా మలుచుకుంటూ, దాంట్లోనే విముక్తిని కోరుకునే ఇలాంటి కవులు అరుదుగా ఉంటారు.

ఇది తనకు తానే రాసుకున్న మ్యూజింగ్స్ంటి కావ్యలేఖ. ఈ కవిత్వం చదివి, అర్థం చేసుకున్న తరువాత నాలో ఈ విచారధార అప్రయత్నంగా ఇలా వస్తున్నది. ఇది కవిత్వ పరామర్శకు సంబంధించిన విషయమా, కాదా నాకు తెలియదు. కవిత్వాన్ని తూచే కొలతలూ తెలియవు. ఈ కావ్యమంతా కవి జీవితస్వేచ్ఛను,విముక్తిని కోరుతున్నాడు. ఇది సుస్పష్టం. అయితే విముక్తి దేని నుండి? తన నుండి తనకే! ఇంతకీ ఆ తను ఎవరు? తనువా, ఆలోచనా; రూపమా, మానసిక నిర్మాణమా?

2

సూక్ష్మంగా ఆలోచిస్తే ఇలా ద్యోతకమవుతుంది : మనం పుట్టామా?

పుట్టినట్లు అనుకుంటున్నామా? పుట్టింది తనువా? ఆలోచననా? పుట్టినట్లు మనకు ఏ వయసు నుండి అనుభవంలో ఉంది? మన ఇంట్లో పెరుగుతున్న పిల్లలను జాగ్రత్తగా చూసినా కూడా ఏం అర్థమవుతుంది? నేను పుట్టాను, అందరితోపాటే పెరుగుతున్నాను అనుకుంటూ, నేను వేరు అనే వ్యక్తిత్వభావనను పెంచుకుంటారు. చుట్టూ ఉన్న సమాజం అలానే నేర్పుతుంది. నమ్ముతాడు. అదే అలవాటుగా మారుతుంది. గత సంస్కారం ద్వారానో, జీన్స్ ద్వారానో కొన్ని లక్షణాలను తెచ్చుకుంటాడు. స్థల, కాలాలు మారుతున్నట్లుగా అనుభవంలోకి వస్తుంటాయి. అవి నిజమని నమ్ముతాము.

నామరూపాల మాంత్రిక సముద్రంలో ఈదడం మొదలెడతాము. భాషకు, రూపానికి సంబంధించిన అర్థాలు ఇవే అని బలపడుతుంటాయి. జ్ఞాపకాల బలం పెరుగుతుంది. సమాజం, మతం, సైన్స్ అనేవి కూడా శాస్త్రం, హేతువుల పేరుతో ఈ 'అనుకోడాన్ని' మరింత బలపరుస్తున్నట్లుగా కనిపిస్తాయి. కండిషన్ అవుతాము. ఇలా కండిషనింగ్ గా మారడమే అహంగా మారడం. అహమంటే ఒక్కటిగా కాకుండా భేదంతో చూడడం, భేదమైపోవడం. ఇదే స్ట్రాంగ్, ఫిక్సెడ్ అండ్ రిజిడ్ గా మారి నేను నీవు అనే సపరేషన్తో, గొప్ప శక్తిగా విస్తరిస్తుంది. పోలికతో గొప్ప ఆటను సృష్టిస్తుంది. కానీ, తనను తాను మరిచి, పెద్ద సమస్యై కూర్చుంటుంది.

మనిషి గాయపడడమంటే, దుఃఖపడడమంటే ఈ అహం గాయపడడమే. భయపడడం అంటే అభద్రతతో ఈ అహం భయపడడమే. సుఖసంతోషాలు కూడా ఈ అహానికే. అహం చుట్టూ నేను, నీవు; నాదీ, నీది; మంచీ, చెడు; ఈర్ష్య, అసూయ: సుఖదుఃఖాల వలయం ఏర్పడుతుంది. అది నైజమై కూర్చుంటుంది. ఈ ఫాల్స్ ఇగో ముదిరి పెద్దదవుతుంది. ఇక దాని నుండి బయటపడం.

చుట్టూ ఉన్న వాతావరణంలో మనం భౌతికంగా మానసికంగా అలానే పెరుగుతున్నట్లుగా భావిస్తూ, ఆ మనోనిర్మాణానికి అలవాటుపడతాము. తాను శరీరాన్ని మాత్రమే అనే ఆలోచనతో బందీ అవుతాము. ఆలోచన అంటే కాలమే. కాలం, ఆలోచన పరస్పర ఆశ్రయాలు. మొదటి ఆలోచన మరెన్నో ఆలోచనలను సృష్టిస్తుంది. ఎన్నో ఆలోచనలు జ్ఞాపకాలుగా, జ్ఞాపకాలు ఆలోచనలుగా మరింత ముదురుతాయి. ఇంద్రియజ్ఞానం దృఢమైన ఓ నమ్మకంగా, నిజంగా మారుతుంది. ఇలా ఈ కంటిన్యుటీ అనే తాడుతో బలంగా కట్టివేయబడి, కొనసాగి అసలైన తనను మర్చిపోతుంటాము. పోలిక, కోరిక, లక్ష్యం, ఐడెంటిటీ, అసూయ, అవసరం, అహంకారం, చర్యా, ప్రతిచర్యలతో భగభగ మండుతుంటాము. ఇక ఈ కంటిన్యుటీ తాడు తెగదు.

వాస్తవానికి మనకు పుట్టిన అనుభవమూ లేదు, మరణించిన అనుభవమూ లేదు. కానీ అందరిలాగే పుట్టినట్లు, మరణిస్తున్నట్లు నమ్ముతుంటాము. ఇతరులను అంటే బాహ్యంలోని మార్పును చూసి, మన మార్పును నమ్ముతాము. మారినట్లుగా ఉన్నది బయటనా, మన లోపలనా? ఈ ఇతరమే పెద్ద మాయ! ఇతరం ఉన్నదా, ఉన్నట్లు కనిపిస్తున్నదా? ఇతరము తనలో ఉన్నదా, బయట ఉన్నదా? ఇది కేవలం తన ఆలోచనలలో మార్పా, సత్యమా? ఆలోచనలు ఎక్కడినుండి ఎందుకు మొదలయ్యాయో, దాని పునాది ఎక్కడుందో తెలియదు. కనీసం రెండు ఆలోచనల మధ్యన ఉన్న ఖాళీని స్పష్టంగా చూడలేని ఆలోచనల వేగపరంపర. ఇక ఆ కంటిన్యుటీ తాడు తెగదు.

అనుకోవడాలూ, అలవాట్లూ అనే ఈ రెండూ మనల్ని బంధిస్తాయి. తానే వేటగాడై పన్నిన మాయావల ఇది. వల వేసిన వేటగాడూ తానే, చిక్కుకున్న పక్షి తానే. అది మనం ఏర్పరుచుకున్న మాయవల అని తెలియకుండానే మన ఒరిజినాలిటీ కోల్పోతాము. భౌతికంగా చూస్తున్నదే నిజమని నమ్ముతాము. ద్వంద్వాల సుడిగుండంలో గిరగిరా తిరుగుతుంటాము. గాయపడుతుంటాము. పడతాము, లేస్తాము, మళ్ళీ పరుగెడతాము. వాస్తవానికి సత్యం కోసం నిజంగా కలవరించే సతాన్వేషికి దుఃఖం, నొప్పి, కన్నీళ్ళు అనేవి వరమే. గాయాలు తూట్లు పొడుస్తున్నపుడు, బాహ్యం పట్ల భ్రమ తగ్గి, సత్యం కోసం లోపల చూసుకునే తపన తీవ్రమవుతుంది. ఇంద్రియ, ఇంద్రియాతీతమైన అనుభూతుల ఘర్షణలో తన తావును వెతుక్కునే ప్రయత్నం నిరంతరం చేస్తుంటాడు. దాని స్పర్శ ఏ కొంచెం దొరికినా, మళ్ళీ మళ్ళీ దాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటాడు.

అయితే అలవాట్లు, అంటే, బలమైన వాసనల వల్ల, అంతర్లీనంగా ఉన్న వ్యక్తిత్వకాంక్షల వల్ల, దొరికిన నిజస్థితి అవగాహన నుండి జారిపోతుంటాడు. ఈ కావ్యంలో కూడా కవి తనకు దొరికినట్లే దొరికి చేజారిపోతున్న స్వస్థితి స్పర్శ కోసం వేదన పడతాడు. తన నిజస్వరూపం కోసం అల్లాడుతుంటాడు. తానే తయారు చేసుకున్న తన మనోనిర్మాణంతోనే నిరంతరం గాయపడుతూ, దాన్ని దాటిన స్వస్థితి కోసం కలలు కంటాడు. అటువంటి తాత్వికకవి మనస్సును, తపనను ఈ కవిత్వం నిండా చూడవచ్చు.

ఏ "అనుకోవడాలు” ద్వారా, ఏ అలవాట్ల ద్వారా, ఆలోచనల ద్వారా ఈ మాయాప్రపంచంతో మానసికబంధం ఏర్పరచుకుని ఓ మనోనిర్మాణపు వలయంలో చిక్కుకున్నాడో కవి, ఆ నిర్మాణాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ, లోకంతో సమన్వయం కోసం, తన శాంతి కోసం, తప్పిపోతున్న తనకు, తానే బోధించుకుంటూ, తిరిగి దారిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తనను తానే ఓదార్చుకుంటూ అమృతఘడియల వైపు ప్రయాణిస్తున్నాడు. తన జీవనయాత్రలో ఎన్నిసార్లు దారి తప్పి దుఃఖపువలలో చిక్కుకున్నా, తిరిగి మళ్ళీ మళ్ళీ లేస్తూ, ఏ మానసికఛాయలు లేని అమ్మలాంటి సహజప్రకృతి ఒడిలో సేద తీరుతూ, తనదైన రాగంలో పాటలు అల్లుకుంటున్నాడు కవి.

3

ఈ కావ్యమంతా తనే గురువు, తనే శిష్యుడు. తనే తండ్రి, తనే బిడ్డా. వేదన తానే, ఓదార్పు తానే. కవి అత్యంత సున్నితత్వం గలవారు. ఆ సున్నితత్వంలోంచే తన్ను తాను ఆవిష్కరించుకుంటున్నారు. తన సంతోషాల్ని, దుఃఖాల్ని, గాయాలను, ఆత్మానందాన్ని, భయాల్ని, ఓదార్పుల్ని, కన్ఫెషన్స్ ని, తాను శాంతిని పొందుతున్న తావులని కవితలుగా మలిచారు. ఎవరికో ఏదో చెప్పడం కాకుండా తనకు తాను లోపలి టోన్లో చేసుకుంటున్న ఆత్మావిష్కరణ. ఇది ఓ రకంగా భిన్న ప్రయోగం. తన కవితాశక్తి ద్వారా కవి తన మనోభూమికపై ఎగసిపడుతున్న అలల సముద్రానికి పటం కట్టి తనను తాను చూసుకుంటున్నాడు. మనల్ని మనకూ చూపిస్తున్నాడు. ఐడెంటిఫై చేసుకునే వాళ్ళకు కవి చాలా దగ్గరగా తోస్తాడు. దిస్ ఈస్ ఎ వెరీ యూనిక్ అండ్ సెన్సిబిల్ టోన్.

జననం, మృత్యువు, మనస్సు, విముక్తి, సత్యం, అసత్యం, స్వర్గం, కల, మెలకువ, గాయాలు, నవ్వులు, ఏడుపులు, సుఖం, ప్రేమ, దయ, శాంతి, అసూయ, దిగులు, వేదన, ఆనందం, కలత, లాలస, స్పర్శ, దుఃఖం, వెలితి, గాయం, క్షమా, స్నేహం, ఏకాంతం, నిట్టూర్పు, పోలిక, కోరిక, ఓదార్పు, భయం, బాధా, ఆశ్చర్యం, మంచీ, చెడూ, అనుమానం, అనంతం, జ్ఞానం అనే ఈ జీవనకోణాలన్నిటి వెంట కవి పదేపదే ప్రయాణించి తన నిశ్శబ్ద ఏకాంతానికి చేరుకునే ప్రయత్నం చేస్తుంటాడు.

ఈ కావ్యంలో వాడిన సింబాలిక్ ఇమేజెస్ మొత్తం చూస్తే, కవి రాగ ద్వేషాలు అంటని స్వచ్ఛప్రకృతి ముందు తనను తాను హృదయార్పితం చేసుకోవడం వలన, తన త్రోవ ఏమిటో స్పష్టపరుస్తున్నాడు. ఆ ఇమేజెస్: ఆకాశం, నక్షత్రాలు, మేఘాలు, చంద్రుడు, సూర్యుడు, పగలు, రాత్రి, కాంతి, గాలి, నీరు, వెలుతురు, పూలు, కాలం, సూర్యాస్తమయాలు, వాన, మబ్బులు, ఇంద్రధనస్సు, మంచుబిందువు, రంగులు, పిట్టలు, సీతాకోకలు.

ఇలా మనసు సోకని బాహ్యప్రకృతిని కవి పదేపదే వాడడంలో నిర్మలప్రకృతిని ఆలింగనం చేసుకుంటున్న తీరును గమనిస్తే, లోకం, మనుషుల తీరుకన్నా, తనను గాయపరచని, దుఃఖపరచని ప్రకృతి జాడలే తనకు సుఖమని సింబాలిక్గా నమ్ముతున్నాడు. అంతేకాకుండా మనోమాలిన్యం లేని, తన లోపలి సత్ వస్తువు పట్ల ఎట్లా తపించిపోతున్నాడో కూడా ఈ సింబాలిక్ ఇమేజెస్ వల్ల అర్థమవుతున్నది. మనస్సు లేని అటువంటి తావుల్లో తన శాంతిని కాంక్షిస్తున్నాడు. ఈ ఇమేజెస్ అన్నీ బయటి వస్తువులుగా కనబడుతున్నా, మనస్సు అంతమయ్యే లోపలిచూపుకు దారిగా కవిని అవి గట్టిగా పట్టుకుంటున్నాయి.

కవి ఎక్కడ ఉన్నాడని చూస్తే, కవితల్లో ద్వంద్వాల మధ్య మానసికయుద్ధం చేస్తున్నాడు. వీటిలో లోకంతో పొసగక అశాంతితో, ఇక వెళ్ళిపోతాను అన్న కవితలూ ఉంటాయి. జీవితేచ్ఛతో సమన్వయాన్ని పొందుతూ, హాయిగా బతికిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుని శాంతిని పొందిన కవితలూ ఉంటాయి. తనకు తానే గురువై బోధించుకుని ఓదార్చుకుంటున్న కవితలూ ఉన్నాయి. ఒక కవిత నుండి మరో కవితకు కాంట్రడిక్షన్లా అటూ ఇటూ ఊగిసలాడడం ఉంటుంది. ఒక కవితలో జీవితామృతం దొరికిందని జీవితేచ్ఛను వ్యక్తం చేస్తారు, మరో కవితలో జీవితం దుఃఖమయమని నిరాశను వ్యక్తం చేస్తారు. ఇవి ఆయా సందర్భాల్లో కవి మూడ్స్్స్న రిఫ్లెక్ట్ చేస్తాయి.

రచయిత, సత్యాన్వేషి చలంగారు కూడా తన నలభై ఏళ్ళవయసులో జీవితం చాలా నిరాశగా ఉంది అన్నారట. ఏభై ఏళ్ళ వయసులో ఇక జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకున్నారట. అరవై ఏళ్ళు వచ్చేసరికి అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది అన్నారట! ఇక్కడ అరవై ఏళ్లకు చేరుకుంటున్న కవి మనోభావాలు కూడా ఆశనిరాశలవలయంలో చలిస్తూ ఉంటాయి. గ్రౌండ్వల్లో ఉండి తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు. రోజువారీ డైరీ రాసినట్లు, సందర్భాలను బట్టి ఈ కవితాశిల్పాలను మనసుపెట్టి చెక్కారు. అందుకే కవిని చదువుతూ మనల్ని కూడా అందులో చూసుకోవచ్చు.

4

కవి మనోరీతిని ఈ కవితల్లో చూడవచ్చు :

"ఈ లోకంలో ఏమన్నా బ్రతికితే, చిన్నపుడు బ్రతుకుతాం, మిగిలిన జీవితమంతా బదులు చెల్లిస్తాం, కాసిని శైశవక్షణాలు అనుభవించినందుకు ఇంత బదులుతీర్చడం అవసరమా అని అడుగుతావు దేవుడిని, ఉండీ, లేనివాడిని, లేకుండడంలో దాగినవాడిని, జవాబురాదు, బ్రతికావు కదా కాసిని రోజులో, నిమిషాలో, శుభ్రమైన పసిదనంలో, స్వేచ్ఛలో, భయరహిత క్షణాల్లో, ఏదీ గుర్తుండని కాంతిలో, చెల్లించి వెళిపోవా మిగిలిన బరువైన రోజుల్ని". ఇలా కవే తనను బ్రతిమాలుకుంటూ, సంవేదనను అనుభవిస్తూ, భారమైనా సరే మిగతా జీవితం గడపాలి అంటాడు. ఇదంతా భయావహ ప్రపంచం అంటాడు.

"జీవించడం అసౌకర్యమైన అనుభవం, పీడకలలవేళ దేహం కూడా కదిలినట్లు, జీవితం నుండి మరణంలోకి నిన్ను నీవు బ్రతిమాలుకుంటావు" అని తనను మరణంలోకి లాక్కొంటాడు. మనుష్యులతో తనకు సంబంధం లేని క్షణాల్లో ప్రపంచం తటాలున విశాలమవుతుంది అంటాడు. మనుషులు తనకేమీ కాని క్షణాలు, వారు తన చేతనలోకి చొరబడని క్షణాలు అద్భుతం అంటాడు. ఉన్నచోటును విడిచి లోపలికి వెళ్ళకుండా, బయటకి రాకుండా తనలోని భయమే తనను అడ్డుకుందని వాపోతాడు. దుఃఖపు తేనెపట్టు పిండి, జీవితం చప్పరించాలని చూశారట, కానీ చివరకు విషాదమే మిగిలింది అని వేదన చెందుతారు.

తెలియకపోవడంలోని హాయిని పసిపాప తేలికగా అనుభవిస్తుంది, తెలియటం కదా ఇంత దుఃఖానికి మొదలు అని విచారం వ్యక్తం చేస్తారు. రాత్రులు నిదురించే ముందు దైవాన్ని ఇది కడపటి నిద్ర కావాలని ప్రార్థిస్తారు కవి. "విసుగుపుట్టే రోజున తెలివిలేని సినిమాకు వెళ్ళినట్లు తీరికగా చేరుతావు ఈ లోకంలోకి, ఇది బాలేదు, అయినా వెళ్ళలేవు, అట్లాగని ఉండాలన్న ఉబలాటం లేదు” అని తన మనోస్థితిని ఆవిష్కరించుకుంటారు.

కవి బ్రతికి ఉన్న క్షణాలు, తన జీవితంలో తనకు హాయిని, ఆశ్చర్యాలను ఇచ్చిన అద్భుతాలని కూడా ఇలా వట్టుకుంటాడు :

పున్నమి చంద్రుడు నెమ్మదిగా ఎగురుతున్నపుడు, ఇంద్రధనువులు రంగులని విరజిమ్ముతున్నపుడు, ఉదయపు వెలుగు, పిట్టలు పాడడం, లేళ్ళు గెంతడం, పిల్లలు నవ్వడం, యవ్వనం ప్రేమించుకోవడం, సెలయేళ్ళు ప్రవహించడం, సూర్యుడు కాంతిని విరజిమ్మడం, అమ్మ బిడ్డతో దోబూచులాడడం, తనతో తాను హాయిగా నవ్వుకున్నపుడు, తన బిడ్డను కడుపారా కావలించుకున్నపుడు, ఆజన్మాంతం గాలిపటంలా ఎగిరే ఆకాశాన్ని చూసినపుడు, ఎండ పాడుకునే సన్నటి నేపథ్య సంగీతం విన్నపుడు, చేపల్లా ఈదే రాత్రులను, పగళ్ళను చూసినపుడు, ఇట్లాంటపుడు తాను మృత్యువును దాటాను అంటాడు.

వాన కురిసినప్పుడు తనకు తాను దక్కుతారట! ఎడతెగని వాన తనను కాగితపు పడవ చేసి ఎటైనా తీసుకపోతే బాగుంటుందని ఎదురుచూస్తాడు. ఉదయాలు బంగారాన్ని వెదజల్లింది తన ప్రశాంతమైన చూపు కోసమే కావచ్చు అంటాడు. ఉదయం గడ్డిపరకపై వాలిన మంచుబిందువు, దానిలో ఆడుకుంటున్న రంగులు, ఏవీ పట్టకుండా ఓ బైరాగిలా ఊరిలో, తన ఇంట్లో తిరుగాడే క్షణాలుంటే అద్భుతమంటారు. ఇలాంటివి తాను బతికున్న క్షణాలకు గుర్తులుగా ఉన్నాయంటాడు.

కవి తనను తాను ఓదార్చుకుంటున్న క్షణాలు :

నీలోంచి నవ్వు వస్తే రానివ్వాలి, భయం పుడితే పుట్టనివ్వాలి, పూలు రాలుతుంటే రాలనివ్వాలి, సీతాకోకలని ఎగరనివ్వాలి, గాలి వీచినట్లు సహజంగా, నీరు పారినట్టు సరళంగా జరగనివ్వాలి, వెళ్ళనివ్వాలి. తేలికగా ఉండాలి, తెలియనట్లు ఉండాలి, ప్రపంచాన్ని తన కల కననివ్వాలి, పెద్దగా గొడవపడేదేం లేదు ఇక్కడ, అంతగా నిలబెట్టుకోవాల్సింది కనరాదు, కాలం గడిచిందా లేదా అన్నట్లుండాలి, స్థలమొకటుందా లేదా అనుకోవాలి, ఊరికే కదలాలి, మాట్లాడాలి, అలసటతో హాయిగా నిద్రపోవాలి, కడపటిబిందువు ఎదురైనపుడు తృప్తిగా దానిలో లీనం కావాలి.

అనుకునేంత భయావహం కాదు, ఊరికే ఉండు కాలువలో నిశ్శబ్దంగా పారే నీటిలా, బ్రతకాలని చూడకు, పోవాలని కూడా, ఉండటమే చాలు, అంతకన్నా నీ నుండి ఈ గాలి కోరేదేమీ లేదు అని ఓదార్చుకుంటారు. మనమా బ్రతికేది, వెళ్లిపోయేది, జీవితం తనను తాను చూసుకుంటుంది, నమ్మకం లేకపోతే నీలాకాశం కిందికి వెళ్ళి చూడు విప్పారిన నేత్రంతో నిన్ను చూస్తూ నీకు నమ్మకాన్ని ఇస్తుంది అని తనకు తాను ఓదార్చుకుంటూ తేలిక పడతారు .

మృత్యువు గురించి ఇలా వివరిస్తారు :

“చూస్తూ ఉండగా కాలం చివరికొస్తుంది, పలుసంధ్యలు పూలలా రాలిపోతాయి, పలు చందమామలు ఉదయాల్లో కరిగిపోతాయి, ప్రేమ నిండిన నవ్వులు తడి నిండిన బంధాలు, చూస్తూ ఉండగా పొడిబారిపోతాయి, కాలం చివరికొస్తుంది, కలలు చివరికొస్తాయి, దుఃఖాలు చివరికొస్తాయి, బ్రతుకు భయం చివరికొస్తుంది, స్వర్గమో నరకమో తెలీని ప్రపంచానుభవం ముగింపుకొస్తుంది, చూస్తూ ఉండగా గాఢమైన దిగులులోంచి కాంతివంతమైన మృత్యుపుష్పం నీ ముందు దయగా విచ్చుకుంటుంది”. ఇంకోచోట “ఈ మృత్యువు ఇంత విశాలమైనది, శబ్దాల పక్షులూ, రంగుల చేపలూ సంచరించే జాడైనా లేని పరమ చల్లనిశాంతి గుండెలకి హత్తుకుంటుంది” మృత్యువుని ఇలా కాంతిగా, శాంతిగా వర్ణించడంలో కవి వైరాగ్యాన్ని కొత్త టోన్ లో ప్రకటిస్తున్నారు.

ఈ కావ్యంలోని కవితలన్నీ చదివాక, కవి తాను నిర్మించుకున్న ప్రత్యేకలోకంలోకి మనల్ని తన వెంట తీసుకెళ్లి, తన దుఃఖాన్ని, భయాల్ని, తన సంతోషాన్నీ, తాను బతికిన క్షణాలను, తన ప్రేమగీతాలను, తన ఆత్మను మనకి నిర్మొహమాటంగా విప్పి చెప్పి మనల్ని సహానుభూతికి లోను చేస్తారు .

5

కవి తనను తాను ఆవిష్కరించుకున్న కావ్యం ఇది. ఒకరకంగా ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్. ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ జీవితేచ్ఛతో లేచే ప్రయత్నం. మనుష్యులు, మనసులేని మరోలోకంలో విహరించాలని కవికి బలంగా ఉంది. ఊగిసలాట నుండి స్థిరత్వానికి వెళ్ళిపోవాలనే కాంక్ష అంతర్లీనంగా బలంగా ఉంది. సాధారణంగా కవిత్వంలో తాత్వికత ఉంది అంటారు. కానీ, ఈ కవిలోని తాత్వికకాంక్షనే ఈ కవిత్వాన్ని ఓ నెపంగా ఎన్నుకుని కావ్యమై ప్రవహిస్తున్నది. 

అందుకే ఈ కవిత్వం మొత్తం ఈ కొస నుండి ఆ కొస వరకు ఏదో అశాంతి. ఆ అలజడిని తిరిగి శాంతిలోకి తీసుకువెళ్లాలనే తపన, ప్రయత్నం కనిపిస్తుంది. మళ్ళీ అశాంతి. ఇది పరంపరగా కొనసాగుతుంది. ఎప్పడికప్పుడు ఇలా తన మూడ్స్ రికార్డ్ చేయడం కవి నిజాయితీని చెబుతుంది.

ఎందుకు జారిపోతుంటాము?

లోపల ఉన్న వాసనలు (లేటెంట్ టెండెన్సీస్), అలవాట్లు, భయాలు, ఐడెంటిటీ, ఆలోచనలు, వ్యక్తిత్వకాంక్ష, కొనసాగాలనే ఇచ్ఛ ఇవన్నీ స్వేచ్ఛలోకి, విముక్తిలోకి దూకాలనే కాంక్షను అడ్డుకుంటాయి. స్వస్థితిని మరుపుకు లోను చేస్తాయి. కేవలం ఇక్కడ కవికే కాదు, అనేకానేక మహాసాధకులకి కూడా ఆ అనుభవం దొరికినట్లే దొరికి జారిపోతుంటుంది.

ఎందుకంటే, కన్స్ట్రక్టెడ్ ఇగో దట్ ఈస్ ద అప్పారెంట్ ఐ, విచ్ ఆల్వేస్ ట్రెస్ టు లివ్ ఇన్ సెపరేషన్, యాజ్ సపరేట్నెస్ ఈస్ ఇట్స్ డియరెస్ట్ ఫుడ్. ఇన్ సెపరేట్నెస్, ద ఫాల్స్ ఇగో ఎంజాయ్స్ ద టేస్ట్ ఆఫ్ డిఫరెన్స్ టు కంటిన్యూ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. నీవు, నేను; చావు, పుట్టుక; అహం, భయం; రాగద్వేషాలు; బంధం, విముక్తి. ఇలా పరంపర కొనసాగుతుంది. అయితే తపన, ఆర్తి కలిగినవాళ్ళు రెడీనెస్లో ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు జారిపోయినా, కింద పడ్డా పట్టు వదలరు. తనలోని మలినాన్ని తొలగించుకోవడానికి, పదేపదే ప్రయత్నిస్తారు. తనను తాను లోలోపలికి చూసుకుంటారు. తనలోని శాంతిని అడ్డుకున్న తెరలను తొలగించుకుంటారు.

తనకు తాను తయారుచేసుకున్న ఈ నేను (ఇగో) అనే మనోనిర్మాణాన్ని కరిగించుకోవడం ఓ మహాతపస్సు. అది కరగడానికి ఇష్టపడదు. పోవడానికి అసలే ఇష్టపడదు. భయాన్ని, అభద్రతను ఎగదోస్తుంది. కళ్ళకు గంతలు కడుతుంది. మన అసలు తావును మరపులోకి తీసుకెళ్తుంది.

విముక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడడం. కన్ఫ్యూషన్ క్లారిటీగా మారడం. అహం మాయమవడం. దుఃఖానికి లోను కాకపోవడం. భయం నుండి విముక్తి చెందడం. ఎరుకతో ఆ అనుభవంలో ఉండడం. సదా వర్తమానం అనుభవంలోకి రావడం. విముక్తి అనేది ఎక్కడో లేదు, అది ఇపుడు ఇక్కడే నాలోనే ఉందని, నేనై ఉందని తెలుసుకోవడం.

ఇక అప్పుడు ఆలోచనలుండవా? ప్రపంచం ఉండదా? కుటుంబం ఉండదా? ఉన్నదంతా సత్యమే. ఎప్పటిలాగే అన్నీ ఉన్నట్లు ఉంటాయి. అందరూ ఉన్నట్లు ఉంటారు. కానీ ఏదీ నిన్ను అంటదు. చేయాల్సినవి అన్నీ చేస్తావు, కానీ నీవు చేసినట్లుగా ఉండవు. లేస్తావు, పొలానికెళ్తావు, పంట పండిస్తావు, తింటావు, పడుకుంటావు. ఎప్పటిలాగే కుటుంబంతో ఉంటావు, నవ్వుతావు, ఏడుస్తావు, అన్నీ చేసినట్లుగా ఉంటావు, కానీ ఏమీ చేయవు. పాత్రోచితధర్మం నిన్ను నడిపిస్తుంది. పాత్రోచిత రియాక్షన్ ఉంటుంది.

భేదం కేవలం ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఆ భేదం వల్ల దుఃఖం ఉండదు. ఎందుకంటే ఆ భేదం నాటకీయమైనది. ఏకత్వం అనే తెరమీద నటించే పాత్ర అది. కంటిన్యుటీ తాడు తెగిపోతుంది. కంటిన్యుటీ ఉన్నట్లుగా ఉంటుంది, కానీ కలలాగా ఉంటుంది. ఉన్నది నీవే, జరుగుతున్నట్లు అనిపిస్తున్నదంతా నీలోనే అని తెలుస్తుంది. మేలుకున్న తరువాత కల నిన్ను అంటనట్లుగా, ఏవీ నీకు అంటవు. ఎప్పుడూ ఏమీ జరగలేదు అనే అనుభవంలో ఉంటావు.

ఇది ఆలోచననో, ఊహనో కాదు, వాటి ప్రమేయం ఏమాత్రం లేని నీ ఉనికి. శరీరంలో నేను ఉన్నాను అన్న స్థితి నుండి నాలో శరీరం ఉంది అనే షిఫ్ట్ జరిగి శరీరానికి ఎడంగా అవుతావు. శరీరం మనస్సును సృష్టించదు, మనస్సే శరీరాన్ని సృష్టిస్తుంది అని అర్థమవుతుంది. ప్రపంచంలో నేను ఉన్నాను అనే స్థితి నుండి ప్రపంచం నాలో ఉంది అనే షిఫ్ట్ ను చూస్తావు. గతం కలలాగా ఉంటుంది. మూడు కాలాలు, స్థలాలు 'నేను' అనే తెర మీద వచ్చి పోతున్నట్లుగా ఉంటుంది. తేలిక. బరువు ఉండదు. ఇది నీకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని వివరించడానికి అవసరానికి పదాలు వాడుతావు గానీ, పదాలలో అది ఇమడదు అని తెలుస్తుంది. అందుకే నీలో నీవు నవ్వుకుంటావు. ఉంటాయి. కలగా నీవు ఎరుకతో ఉండడం కాదు, ఎరుక నీతో ఉంటుంది, నీవై

ఉంటుంది. నీలో పొంగే కరుణ, ప్రేమ నీ ప్రయత్నం లేకుండానే విప్పుకోవడం చూస్తావు. విముక్తి అంటే ఏదో కొత్తగా సాధించేది కాదు, అంతవరకు నిన్ను కప్పివేసిన మాలిన్యతెరలు ఏవో తొలగిపోవడం, హృదయం శాంతితో నిండడం. నీవు సదా మార్పు లేకుండా ఒక్కలాగే ఉన్నావని, మార్పు అంతా నీ మీద వచ్చి, పోతున్నది కానీ అది నీవు కాదని తెలుస్తుంది.

తన పైన ప్రవహిస్తున్న ప్రసాద్ అనే వ్యక్తిని తొలగించుకోవడానికి

అనేక ఎత్తుపల్లాలను, దుఃఖాలను, అనుభవాలను చూసిన కవి చివరకు "బోనులో సింహం ఆకలితో లొంగినట్టు, జీవితానికి లొంగి చూడు" అంటాడు. "సమస్తాన్ని దేవుడినీడలా ప్రేమిస్తున్నావు" అంటాడు. ఈ భావన గొప్పది. టోటల్ యాక్సెప్టెన్స్ అండ్ సరెండర్ అనేది గొప్పయోగం. అది జారకుండా ఉండాలని, ఆ కాన్స్టాంట్ అవేర్నెస్తో కవి ప్రయత్నం, జీవితం, సాధన సఫలం కావాలని, ఆ నిర్మలశాంతి తీరంలో ఆయన నిరంతరం సేద తీరాలని మనసార కాంక్షిస్తూ!

ఏ . గంగారెడ్డి
హైదరాబాద్
11.11.2025



01 డిసెంబర్ 2025

జీవన గీతం సృష్టి : గార్లంక భగవాన్

అందిన కవిత్వం, ప్రసాద్ గారి  మూడు దశాబ్దాల సుధీర్ఘ జీవన  గీతం  కొన్ని పుస్తకాలుగా విడివిడిగా అలరిస్తుంది. అరుదైన కవి అద్భుతమైన వాక్యాలు, మహాత్మాగాంధీ తాను విచారానికి కలవరపాటుకు గురైన ప్రతిసారి  భగవద్గీత సాంత్వన కలిగిస్తుందని చెప్పుకున్నారు. BVV Prasad's Poetry నావరకూ ఆకోవకు చెందినదే , ఒక్కటే అసూయ ఇవన్నీ నా అక్షరాలే ప్రసాద్ గారి ద్వారా వెలువడుతున్నాయి అని , ఇలాంటి కవి మన భాషలో ఇంతకాలం జీవం తొణికిసలాడుతూ కొనసాగటం భాషకు గౌరవం. ఈ నల్లనివాడు పద్మనయనమ్ములవాడు మహా శక్తిమంతుడు.  ఏముందిలే అదే వాక్యం అదే భావం మళ్ళీ మళ్ళీ అదే కదా అనుకుంటామా ఛటేల్మని ఓ వాక్యం వీపు చరుస్తుంది , ఎంతో సంక్లిష్ట భావాన్ని అలవోకగా చిటెకేసినట్లు అలా విసురుతారు అంతే మనసు జిగేల్మని రగులుతుంది  . "ఛ్ఛా"  ఏం చెప్పారు  ఎంతటి భావాన్ని ఇంతందంగా చెప్పారు కదా అనిపిస్తుంది.  ఈ కవికి పరాజయం  తొట్రుపాటు ఆత్మన్యూనత లాంటి మామూలు మనుఘలకు వుండే అవలక్షణాలేమీ లేవు.   మనల్ని ఏ వేళనైనా తన సహజ సుందర  వాక్యంతో ఆత్మీయంగా  హత్తుకునే మహత్తుగలవాడు . ఇంతకీ" సృష్టి " ఎలా వుందీ అనే ప్రశ్నకు ప్రసాద్ గారి కవిత్వం  పైకి ఆత్మాశ్రయంగా కనిపిస్తుంది కానీ జీవితాన్ని సాహిత్యాన్ని లోతుగా అరగదీసిన  అనుభవశాలురను తీవ్రంగా అలరిస్తుంది . ధన్యవాదాలు ప్రసాద్ గారు 

Thank you Bhagavan Garlanka garu for writing this!










30 నవంబర్ 2025

తేన త్యక్తేన భుంజీథాః - ఈ ఈశోపనిషత్తు వాక్యాన్ని స్ఫురింపచేసిన కవితలు- ' సృష్టి'.

మూగవాడు తిన్న పంచదార ఈ సృష్టి, కవులు తన గురించి మాట్లాడకపోతే. కవి పలకటం మొదలు పెట్టినపుడు, లోకానికి, అప్పుడు సంతోషం, తన తరఫున ఒక గొంతు విచ్చుకుందని, తనకొక ప్రతినిధి దొరికాడని. 
 కానీ, కవి చాలా సార్లూ తన గురించే మాట్లాడతాడు. అలా మాట్లాడినా సృష్టికి అది తన గురించి లాగే వినిపిస్తుంది. 
 అలా తనను కవి చిరంజీవి చేస్తాడనే ఆనందం. 
 మరి కవి? అతని కవిత?
 అమృతం కురిసిన ఆ రాత్రి , అందరూ నిద్రపోతున్నప్పుడు తను అమరుడనయ్యానని ప్రకటించాడు తిలక్. 
నిజానికి ఒక ‘వాన కురిసిన రాత్రి’ కదా, తను తప్ప మరెవ్వరూ, ఎక్కడా లేని ఆ నాటి రాత్రి కదా, అతని చేతన పూర్తిగా మేలుకుని ‘విరహిణి కన్నులా, ఎర్రనై , ఏకాంత సరసున కలువ వంటి దీపశిఖ’ యై మేలుకున్నది, ఇక్కడి నుంచే అమరలోకాలను కూడా వెలిగించింది. 
 ‘సృష్టి’ కవికి తెలుసు తనకు ఒక్క వాన చాలని. అమృతం అక్కరలేదు, అమరత్వం కాదు ఇతని కోరిక. విలీనం ఈ కవి వాంఛ. 
 ‘వాన కురిసిన రాత్రి’ తనను కేవలం ఒళ్ళు తడిపి, ఒక చిన్న నీళ్ళ గుంట చేసి ఇచ్చి, దాంట్లోకి కాగితం పడవ చేసి వదులు అని చెప్పే పిల్లవాన కురవవద్దు తనకు.
వర్షం తనకు ప్రళయపరిమాణంలో కురవాలి. “నను అది కాగితం పడవ చేసి లాక్కుపోవాలి”. “నోవా పడవకు దొరకకుండా” కొట్టుకుపోవాలి ఆ వర్షంలో అని కోరుకుంటున్నాడు.
పునః పునః పుట్టుచావులకు తనను దొరకనీయకుండా మహాప్రళయంలోకి లయం చేసే వర్షం కావాలి. 
ఇదేమి కోరిక! 
కవి అయినా కాకపోయినా, ఆలోచించే మనిషిగా పుట్టిన ప్రతివాడికీ, ప్రపంచం కావాలి…ప్రపంచం వద్దూ. 
రెండూ బలమైన ఆశలే. మధ్యనున్న తలుపు రెక్క తీసి తనదైన గది లోంచి గవాక్షం ఉన్న పెద్ద నడిఇంట్లోకి తను వెళ్ళివచ్చినంత సులువుగా తను ఆ రెండు స్థితులలోకి వెళ్ళివస్తుండాలనుకుంటాడు. కానీ, ఈ తలుపును యథేచ్ఛగా వేసీ, తీస్తుండే విద్య అంత సులభంగా అబ్బేది కాదే. 

సృష్టి ఏర్పడినప్పటినుంచీ దీనికి అవతల ఏముందా అని కుతూహల పడేవారు తక్కువ లేరు. 
దీన్ని మించి అవతల మరేం లేదు, భయం లేదు మీకు అనేవారూ ఎక్కువే ఉన్నారు. ఈ రెండుమాటల సమన్వయాన్ని కవిత్వం ద్వారా సాధించటం ఒక వ్యాపకం.
కవిది ఎప్పుడూ ఒక అందమైన అసంబద్ధ ఊహ. అయినా దాన్ని శాస్త్రబద్ధంగా క్షుణ్ణంగా అల్లుతాడు.
సత్యమూ స్వప్నమూ చెరొక పోగు తన నేతలో. వెలి చూపు కొంత, అంతర్దృష్టి మరింత. 
సుకవి బాహ్యాన్ని చూస్తూ తననూ, అంతర్దృష్టితో ప్రపంచాన్నీ అనుభవంలోకి తెచ్చుకుంటాడు.
కవిత్వం లోది తన వ్యక్తీకరణమా? దాని నుంచి విముక్తా? 
రెండూ! 

మొదటి టాస్క్ గా ఈ కవి, సృష్టి ఎలా వచ్చింది అని ఒక పిల్లవాడు అడిగిన ప్రశ్నకు తల్లిలా జవాబు చెప్తాడు. దేన్నైనా సూక్ష్మం చేసి తేటగా చెప్పగలది తల్లి గాక మరెవరు! వస్తువు పనిచేసే తీరు తెలియాలంటే దాని నిర్మాణ రహస్యం తెలిసుండాలి ముందు-
         కొన్ని రంగులు వంపు, గీతలు గీయ్, కదిలించు వాటిని కాస్త, చివరగా నీకు తెలిసిన ఉద్వేగాలు కలుపు, అంతే! కొండలూ నదులూ పగలూ రాత్రి ప్రేమా ద్వేషాలతో సమస్త లోకాలూ నీ తెల్లకాగితం మీదనే అంటాడు కవి బ్రహ్మ. 
సృష్టికి ముందరి శూన్యాన్ని, కవితకు మునుపటి ఖాళీ కాగితాన్ని సిద్ధం చేయటమే కవి పని. కవి లయకారుడు.
అప్పుడు కవిత్వమో, తత్త్వమో తనే వచ్చి తనను రాసుకుంటుంది అంటుంది కవి చేతన. 

 ఆ ఖాళీ చేసుకోవటమే ఈ కవితలు. 
ఇతను భగవాన్ రమణుల భక్తుడు.

సకలమూ తనలో నింపుకునేప్పుడు ఇతడు, అరుణాచలం లో చలాన్ని కూడా చూసినవాడు. 
కొండ తండ్రిలానూ కనిపిస్తుంది - అరుణాచలం నీవు కాక మరేమిటి అనీ అంటుంది: “కొండంత అద్దంలో నీవే కనపడతావు”.
కల్తీలేని వైరాగ్యం, నిండు జీవన లాలస - ఈ రెండూ పరస్పర విరుద్ధాలు కావు ఒకే నాణేనికి ఇరు ముఖాలని తెలిసిన కవితలివి.
కల్పము, వికల్పము.
“పగలంతా గగనంలో చాప పరిచి నిద్రపోయిన పగటి ఎండ చాప చుట్టగానే తెల్లని చుక్కల నల్లనేల తళతళలాడుతుంది” పిల్లల కథ కోసం చేసిన కల్పనలా కనపడుతూన్న ఈమాట, పగటి వెలుగు ను నమ్మవద్దు, అది విశ్వరహస్యాలకు మనలను అంధులను చేస్తుంది అని హెచ్చరించే గంభీర ఉపనిషద్ స్వరం. మరో నిమిషం లో వల్లమాలిన గారాబం తో ముద్దు చేస్తాడు ఈ ప్రపంచపు రంగులను - “గునగనా నడుస్తూ ఆరిందాల్లా వస్తాయి రంగులు, అంతటినీ చక్కదిద్దే ఘనుల్లా.” ఈ రంగులే మరి “లోకం మీద నీ ఆశలు నిలిపేవి, ఆశల మీద ఈ లోకాన్ని నిలిపేవి.”
రాగము లోకాన్ని నిలబెడుతుంటుంది. దాన్ని విరాగము రద్దు చేస్తుంటుంది. 
జ్ఞానికి రెండవది మాత్రం సమ్మతం. కవికి రెండూ ప్రియమే. ఆశ, దుఃఖం రెండిటి రుచీ తెలిసినవాడు. 
“అస్తమయబింబం ఆకాశంలోకి విసిరే చివరి నారింజకాంతి లా ఎంత దుఃఖంలోనూ ఎక్కడో ఉండే ఆశ ఉంటుంది చూసావా!”
ఈ దుఃఖం కానీ ఆశ కానీ లౌకిక వస్తుపరమైనవేనా ! వాటికి అతీతమైన నిగూఢ సత్యాన్ని అధ్యయనంచేసేవారికి కూడా కళ్ళతడి తప్పదేమో. 
ఆశ, కోరిక, లాలస తెగవు. తరువాత ఏమిటి అనేది ఆలోచించటమూ మానవు. అదే ఆ కళ్ళ తడి. అందుకే ప్రేమ.
“జీవితం ప్రియురాలి రూపంలో నన్నే చూసుకుని ఆశ్చర్యపోతూ ప్రేమిస్తున్నాను.” 
వస్త్వేకత్వం! జీవితం, తనూ, ప్రేమా వేరు వేరు కాదు. ఈ మాటలను మేధ కు పరిమితం చేయక అనుభవానికి తెచ్చుకుంటున్న కవి సమయాలేమో ఇవి. 
“జీవితం నీ ద్వారా తనని తాను కావలించుకోవాలని చూస్తోంది, విలువలనూ, భయాలను విప్పుకుని నగ్నంగా దూకగలవా ఇదే జీవితం అని గట్టిగా అనిపిస్తున్న ప్రేమలోకో, అందంలోకో, అనుకంపనలోకో? అడుగుతుంటారు నిన్ను లోపలి నుంచి.” క్షణక్షణం కఠినమైన అగ్నిపరీక్ష పెడ్తూ లోపల్నించి ఈ ప్రశ్నలు అడిగేవన్నీ గురువులే. 

ప్రవర్తనలో విశృంఖలత్వమా! కాదు. నిజ తత్త్వానికి పడిన శృంఖలాలను విరగగొట్టటం. 
“నీటి బుడగపై తిరుగాడే బొమ్మలాంటిది ఈ ప్రపంచం.” 
కంటిపాప అనే నీటిబుడగ. 
అది చూస్తుంటుంటేనే ఇవన్నీ ఉంటుంటాయి.
ఈ ఎఱుక వచ్చాక కూడా “నేల మీద నమ్మకం పోదు, ఆకాశం మీద నమ్మకం కలగదు. ఆకాశం ఇచ్చే సుఖంలో స్వేచ్ఛ లోని ఒంటరితనం అయిష్టం” అంటాడు. కారణం? “నేల మేల్కొలిపే కరుణ ఇష్టం.” “నేల దుఃఖదాయిని.” 
ఇంతకన్నా క్లుప్తంగా మనిషిగా పుట్టడంలోని సార్ధకత ఏది చెప్పగలదు! నీ దుఃఖం నిను శోకం కాదు చేయవలసింది. తక్కిన లోకం కోసం కరుణగా మారు. కరుణ గా మారటానికే ఈ నేలకు వచ్చాడు మనిషి. కానినాడు నేల కు మరి వేరే ప్రయోజనం లేదు అని గట్టిగా నమ్మే కవి. 
అందుకే ఈ జీవితం ఇష్టం.అది ఇచ్చే ఏ అనుభవమైనా ఇష్టమే. 

అందులో నిండా మునిగీ అది తనను ముంచకుండా చేసుకున్నప్పుడే, “తేన త్యక్తేన భుంజీథాః”- అనే ఈశోపనిషద్ వాక్య సాయంతో సమస్తమూ చూడగలిగినప్పుడే, “ఊరికే జీవితమై” (అతని సృష్టేనా ఈమాట ?) ఉన్నప్పుడే చేయగల కవిత్వసృష్టి ఇది. 

శాంతం లో మూగవాడు. సంతోషం లో వాచాలుడు. రెండూ ఉంటాయని చూడగలిగిన దుఃఖంలో కవౌతాడు.

ఆ కవిత్వం ఈ ‘సృష్టి’ అనే పుస్తకంలో ఉంది.
కావాలంటే 92472 53884 ను అడగండి. 
నేను అలా అడిగే జీ పే చేసే తెప్పించుకున్నాను.

ఈ పుస్తకం గురించీ, కవీ గూర్చి వెనక కవర్ మీది రమణజీవి గారి మాటలు, వెనకమాటగా ఏ. గంగారెడ్డి గారి మాటలు విలువైనవి.

- పద్మజ సూరపరాజు 

Many thanks to Padmaja Suraparaju garu for writing this!


12 అక్టోబర్ 2025

సున్నిత సౌందర్య తాత్విక భావనా విపంచి బి.వి.వి.ప్రసాద్

 విమల సాహితి లో ప్రసాద్ కవిత్వంపై కృష్ణవేణి పరాంకుశం గారి వ్యాసం. వారికి ధన్యవాదాలు.




31 ఆగస్టు 2025

మాయాతెరల వెనుక అన్వేషణ - బివివి ప్రసాద్ కవిత్వం

"అనంతమైన కొలతలతో అలల్లా ఎగసిపడే సృష్టి ఇది/ దీనిలోకి వెలుతురు పుట్టినట్టు పుట్టి/చీకటి పుట్టినట్టు వెళ్ళిపోతావు/లేదా నీలో ఇది చీకటి పుట్టినట్టు పుట్టి/ వెలుతురు పుట్టినట్టు వెళ్ళిపోతుంది" అంటారు కదా ఈ కవి.. ఇది మొదలు కాదు.. చివరా కాదు. జీవన ప్రయాణంలో ఎదురైన అనుభవాల తాలూకు వాస్తవం.. నిజానికి సృష్టి నిన్నటినీ, నేటినీ కలిపే అనేకానేక కలిపే రేఖలతో పాటు ఒకే ఒక్క విడదీసే రేఖతో కూడా నడుస్తూనే వుంటుంది. అలాంటి రేఖలకు ఎదురైన శిలా మస్తకాల్ని పలకరిస్తూ, మచ్చిక చేసుకుంటూ ఎదురపుతున్న కంటక ముఖాల్ని తొలగిస్తూ కదల్లేక పోతున్న కాలాన్ని కదిలిస్తూ, నడిపిస్తూ పదం పదం ముందుకు పయనం చేసేవాడే కవి. ఏదో తోచక రాస్తున్నారనుకునే మీమాంశతో సమాజం నడుస్తున్నా కవి తన అక్షరాలతో అర్పేది ఆకలి మంటల్నే కాదు. రాలే కన్నీటి చుక్కల్ని కూడా.. నిత్యం మానసిక దౌర్భల్యంతో ఎదురవుతున్న దిబ్బల్ని, దుబ్బల్ని సస్యశ్యామలం చేస్తూ నవ చలనం కలిగించే రీతిలో సాగే మహా ఋషి కవి.

ఆధ్యాత్మికత, తాత్వికత, వాస్తవికత మూడింటిని ఒక తాటిపై ఒడిసి పట్టుకున్న బొల్లిన వీరవెంకట ప్రసాద్ తెలుగు సాహిత్యంలో కవితా ప్రపంచానికి తనదైన ముద్ర వేసుకున్న కవి. 1966 నవంబరు 21న జన్మించిన ఆయన బాల్యం మాతామహులు, మేనమామలు ఉన్న ఉమ్మడి కుటుంబంబో గడిచింది. అనంతరం తల్లిదండ్రుల వద్ద చాగల్లులో ఏడవ తరగతి వరకు, తణుకులో బీకాం రెండవ సంవత్సరం వరకు, చివరి సంవత్సరం కాకినాడలో చదివారు.

సాహిత్యం పట్ల ఆయనకున్న ఆసక్తి చిన్ననాటి నుంచే అవిర్భవించింది. స్కూలు చదివే రోజుల్లో చిత్రకళలో మొదలైన సృజనాత్మకత కళాశాల దశలో కవిత్వంగా రూపాంతరం చెందింది. 1989లో ఆయన తొలి కవితా సంపుటి "ఆరాధన" వెలుపడేలోపు అనేక కవితలు, కథలు, సాహిత్య తత్త్వ చింతనలు రచించారు. ఆరంభంలో వచన కవిత్వం రాసిన ఆయనకు హైకు ప్రక్రియపై ప్రత్యేక ఆకర్షణ పెరిగింది. ఫలితంగా 1995, 1997, 1999లో వరుసగా "దృశ్యాదృశ్యం", "హైకూ", "పూలురాలాయి" పేర్లతో మూడు హైకూ సంపుటాలు వెలువడ్డాయి. ఆయన హైకూలలో ప్రకృతి సౌందర్యం, జీవన సత్యం, అనుభూతి విశ్వం సులభమైన పదాలతో అవిష్కృతమవుతాయి.

వచన కవిత్వంలో ఆయన శైలి అనుభూతి ప్రాధాన్యతను చాటి చెబుతుంది. 2006లో “నేనే ఈ క్షణం”, 2011లో "ఆకాశం", 2015లో "నీలో కొన్నిసార్లు" అనే సంపుటాలు ఆయన కవితా వైశాల్యానికి నిదర్శనం, ఈ కవిత్వంలో కవి మనిషి అంతర్ముఖంలోని నిశ్శబ్దాన్ని, సమాజంపై ఉన్న అవగాహనను సున్నితంగా వ్యక్తం చేస్తారు. 2022లో "ఊరికే జీవితమై" అనే వచన కవితా సంపుటి కూడా ఈ ప్రయాణానికి చిహ్నం. అదనంగా హైకూలు, హైకుపై వ్యాసాలను కలుపుకొని "బివివి ప్రసాద్ హైకూలు" అనే పుస్తకాన్ని కూడా ఆయన అందించారు. వీరి కవితల్లో సహజత్వం, వాస్తకవిత్వం ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. ఉదాహరణకు "అమాయకం" అనే కవితలో కవి అమాయకత్వాన్ని ఒక శక్తిగా, జీవన విలువల మూలంగా చూపిస్తారు. లోకం అమాయకుడిని హేళన చేసినా, గెలుపు కోసం పరిగెత్తినవారు ఎవరూ తృప్తిగా జీవించలేదని, ఒంటరితనంలోనూ సంపూర్ణత ఉందని కవిగా తమ దోరణిని వ్యక్తీకరిస్తారు. ఈ దృక్పథం వీరి కవిత్వానికి ప్రత్యేకతను అందిస్తుంది.

ప్రకృతిలోని ప్రతి చిన్న చలనం ఆయన కవిత్వంలో ఒక సంకేతంలా కనిపిస్తుంది. గాలి వీచటం, చెట్లు చిగురించడం, వానజల్లులు రావడం అన్నీ కవి దృష్టిలో జీవన సౌందర్యానికి ప్రతీకలు. "మనం ఒకరి లోపలికి ఒకరం మరీ ఎక్కువ చొరబడుతున్నామేమో" అనే ఆయన భావన, ఆధునిక జీవితంలోని హడావిడిలో మనిషి కోల్పోతున్న స్వాతంత్ర్యాన్ని గుర్తు చేస్తుంది. ఆయన కవిత్వం కేవలం భావాల వ్యక్తీకరణ కాదు, అది జీవితాన్ని అనుభవించమనే పిలుపు. భావోద్వేగాలకు, ప్రకృతికి, సంబంధాల సౌకుమార్యానికి ఆయన కవిత్వం అద్దం పట్టింది. అందుకే ప్రసాద్ గారి కవిత్వం నేటికీ పాఠకుడి మనసును మృదువుగా తాకుతూ, అలోచనల్లో కొత్త వెలుగులు నింపుతుంది.

బివివి ప్రసాద్ కవిత్వం సరళమైన భాషలో గాఢమైన అర్థాలను మోసుకువస్తుంది. హైకూలలో సంక్షిప్తత, వచన కవిత్వంలో విస్తృతి కలగలిపిన అయన సాహిత్యసృష్టి తెలుగు కవితా సంప్రదాయానికి ఒక విలువైన వనరుగా నిలిచింది. హైకూ ప్రక్రియలో అనవసర పదాల్లేకుండా, మూడు పాదాల్లోనే ఒక విశ్వాన్ని సృష్టించే సామర్థ్యం ఆయనలో ఉంది. హైకూలలో ప్రకృతి దృశ్యాలు కేవలం వర్ణనకే పరిమితం కాకుండా, జీవన సత్యాలను ప్రతిబింబించే సాధనాలుగా నిలుస్తాయి. "పూలురాలాయి" వంటి హైకూ సంపుటాల్లో కవి ఉపయోగించిన దృశ్యాలు పాఠకుడికి ఒక క్షణానుభూతిని కలిగిస్తాయి.

బివివి ప్రసాద్ కవిత్వ శైలిని విశ్లేషిస్తే, ఆయన రచనల్లో స్పష్టంగా కనబడే కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఆయన కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మొదటగా, ఆయన శైలిలో సహజత్వం ప్రధానంగా ఉంటుంది. బలవంతపు అలంకారాలు, గజిబిజి ప్రయోగాలు ఆయన రాతల్లో కనిపించవు. కవి అనుభవాన్ని ఏకకాలంలో సులభమైన భాషలో, కానీ లోతైన భావాలతో వ్యక్తం చేస్తాడు. ఉదాహరణకు, ప్రకృతిలోని చిన్న సంఘటనలు గాలి. వీయటం, చెట్లు చిగురించటం, వాన చినుకులు పడటం అన్నీ వీరి కవిత్వంలో జీవితానికి ప్రతీకలుగా మారుతాయి. ప్రకృతిని కేవలం వర్ణించడమే కాదు, జీవన తత్త్వాన్ని అందులో కనుగొని పాఠకుడికి అందజేస్తాడు. మరొక్క విషయం వీరి కవితా శైలిలో అనుభూతి ప్రధాన స్థానం కలిగి ఉంటుంది. కవిత్వం కేవలం భావుకతతో కాకుండా, లోతైన మానసిక అన్వేషణతో నిండి ఉంటుంది. ఉదాహరణకు, "మనం ఒకరి లోపలికి ఒకరం మరీ ఎక్కువ చొరబడుతున్నామేమో" అనే వాక్యం, అధునిక మనిషి సంబంధాలపై లోతైన అవగాహనను తెలియజేస్తుంది. ఈ భావనల్లో కవి ఒంటరితనం, మనుషుల మధ్య దూరం, అంతర్మధనం వంటి అంశాలను సున్నితంగా వ్యక్తం చేస్తారు.

వీరి వచన కవిత్వంలో విస్తృతమైన భావప్రవాహం ఉంటుంది. వచనకవిత్వంలో సంప్రదాయ లయ లేదు కానీ, ఆయన రాతల్లో అంతరంగ లయను సృష్టించే పద ప్రయోగం కనిపిస్తుంది. ఈ లయ పాఠకుడికి చదివేటప్పుడు ఒక మృదువైన నాదాన్ని అందిస్తుంది. కవితలోని అత్మీయత, వ్యక్తిగత అనుభవాల సౌకుమార్యం పాఠకుడిని కవితో మమేకం చేస్తాయి. వీరి శైలి తాత్వికతతో కూడి ఉంటుంది. "స్వర్గం వేరే లేదనీ, సంతోషం ముందు కాలంలో దాగి లేదనీ, ఉన్నాం మనం ఒకరి కొకరమని" అనే వాక్యాలు ఆయన తాత్విక దృష్టిని స్పష్టంగా తెలియజేస్తాయి. జీవితం అంటే వర్తమానాన్ని అస్వాదించడం, ప్రస్తుత క్షణంలోనే సంపూర్ణత ఉందని కవి నమ్మకం వ్యక్తం చేస్తారు. వీరు తమ శైలి సంప్రదాయానికి గౌరవం ఇవ్వడంతో పాటు ఆధునికతను కూడా అక్కున చేర్చుకున్నారు.. వీరి భావమేదయినా పాఠకుడిని మృదువుగా తాకుతూ, జీవితాన్ని కొత్తకోణంలో చూడమని అహ్వానిస్తుంది. సరళమైన పదాల్లో గాఢమైన అనుభూతి వ్యక్తం చేయడం ఆయన శైలికి మూలసారం. ఉదాహరణకు...

"నిష్కపట స్వప్నం" కవితను పరిశీలిస్తే, ఇందులోని భావనలతో పాటు కవి శైలిని గమనించడం ఆసక్తికరం.

ఈ కవితలో ప్రధానాంశం నిష్కపటత. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ వంటి విలువలను కవి జీవితంలో ఉన్న అత్యున్నత అనుభూతులుగా చూపించాడు. "ఎవరైనా ఇద్దరు మనుషులు నిష్కపటంగా ప్రేమించుకోవటం చూస్తే కనులు చెమ్మగిలుతాయి" అనే పాదంలో కవి మానవ సంబంధాల సౌందర్యాన్ని సున్నితంగా వ్యక్తం చేశాడు. ప్రేమను కేవలం వ్యక్తిగత అనుభవం కాకుండా, సామాజిక విలువగా ప్రతిపాదించారు.

వీరి కవితలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ప్రవాహం ఉంది. ప్రతి పద్యంలో మొదట ఒక దృశ్యం ప్రేమ, జీవనానందం, దయ చూపించి, తరువాత దాని ఫలితంగా కలిగే అంతరంగ మార్పుని వ్యక్తం చేశాడు. ఉదాహరణకు, "ఒక జీవి నిష్కపటంగా జీవనానందంలో మునిగితే హృదయం సారవంతమౌతుంది" అనే వాక్యం పాఠకుడికి ఒక నిశ్శబ్దమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది. భాషలో సరళత ఉన్నప్పటికీ, భావంలో లోతు ఉంది. కవి కట్టుబాట్లకు, భయాలకు అతీతమైన ఆత్మీయ క్షణాన్ని సృష్టిస్తాడు:

"ఉన్నట్లుండి పనులు పక్కన పెట్టేస్తావు, భయాలు మరిచిపోతావు, / కట్టుబాట్లు గాలికి వదిలేస్తావు"
 "ఎందుకు బతికావని/ ఎవరూ అడగకూడదనుకొన్నట్టే/ఎందుకు వెళ్ళిపోయావని కూడా ఎవరూ అడగకూడదనిపిస్తే/జీవితానికి పరమ గౌరవంతో నమస్కరిస్తావు// బహుశా అప్పుడు జీవితం కూడా నిన్ను మహా ప్రేమతో హత్తుకుంటుంది" 
ఈ పాదాల్లో ఒక తాత్విక స్వేచ్ఛా భావం వ్యక్తమవుతుంది. ఇది బివివి ప్రసాద్ కవిత్వానికి ప్రత్యేకత.

ఈ కవి ఒక సామాజిక-తాత్విక దృక్పథాన్ని చేర్చడం మనం గమనించవచ్చు. ఆ క్షణాలు భవిష్యత్ తరాల మనుషుల్లో కూడా మిగులుతాయని చెప్పడం ద్వారా ప్రేమ అనేది కేవలం వ్యక్తిగత అనుభవం కాదు, అది మానవ జాతి పరంపరలో కొనసాగుతున్న ఒక సాంస్కృతిక శక్తి అని స్పష్టం చేయడం కూడా మనం గమనించవచ్చు. శైలి ప్రయోగంలో సరళమైన వచనంలా కాకుండా వుంచడానికి ప్రయత్నిస్తారు. కృత్రిమ అలంకారాలు లేకుండా, సున్నితమైన అనుభూతుల్ని జతచేస్తూ వ్యక్తిగత అనుభవం నుంచి విశ్వానుభూతి వరకు తామెరిగిన దృశ్యాల ద్వారా భావవ్యక్తీకరణ చేస్తూ ప్రేమ,
దయ, జీవనానందం వంటి అరుదైన భావాలను దృశ్య రూపంలో చూపించడం ఒక ప్రత్యేకతే. దానితో పాటు తాత్విక స్పర్శ వర్తమానంలో మునిగి, సత్యాన్వేషణ చేయమనే పిలుపును వినిపించడం విశేషం. ఉదాహరణకు "నట్టనడిమి" కవితలో బివివి ప్రసాద్ గారి శైలిని, భావాన్ని విశ్లేషిస్తే అనేక సున్నితమైన లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఈ కవితలో ప్రధానంగా ధ్యానంలో ఒక క్షణికమైన మెలకువ, అంతరంగపు నిశ్శబ్ద అనుభూతి ప్రధాన పాత్రల్ని పోషిస్తాయి. ఈ కవి మొదటి పద్యంలోనే ఒక ప్రతీకాత్మక దృశ్యాన్ని సృష్టించారు గమనించండి.

"తుదిమొదలు తెలియని శూన్యంలో/ తెగిన గాలిపటంలా ఊగుతున్న జీవితమిది" ఇది కవితలోని పరివర్తన భావాన్ని బలంగా తెలియజేస్తుంది. కఠినత నుండి సున్నితత్వానికి, ఆందోళన నుండి విశ్రాంతికి మధ్య వుంచే మార్పును కవి ఒక శబ్దంతో, ఒక అనుభూతితో కలిపి చూపించారు. ఈ రూపకం కవి శైలిలోని అధ్యాత్మికతకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ.

 "మెలకువొకటి" అనే కవితలోని దృశ్యాల్ని సందర్శించాల్సి వస్తే "పూలపై వాలిన బంగారు కిరణం", "ఎగిరే పక్షి రెక్కల నుండి లీలగా తాకిన గాలి", "హోరు తరువాత వికసించే నిశ్శబ్దం" ఇవన్నీ కేవలం వర్ణనలు కాకుండా మనసుకు శాంతి ఇచ్చే ప్రతీకలుగా మిగిలిపోతాయి. వాటిని అనుసరిస్తూ ఒకే దిశగా కవితను ముందుకు నడిపిస్తాయి అందోళనల నుండి విముక్తి, ఒక తాత్కాలిక స్వేచ్చ, 

"భారమవుతున్న జీవితాన్ని తలుచుకొని ఏమీ లేదులే అంటావు శాంతంగా" అనే పాదం కవితలోని తాత్విక మెలకువను వ్యక్తం చేస్తుంది. ఇది జీవితభారాన్ని గుర్తించడం, కానీ దానికి లొంగిపోకుండా క్షణాన్ని అస్వాదించడం అనే భావన. కవి ఇక్కడ భయాలను అధిగమించే అంతరంగిక శాంతిని ప్రతిపాదించాడు.

తదుపరి పాదాల్లో కవి తన కవిత్వ స్వభావాన్నే ప్రతిబింబించాడు: "మరి కొంచెం సమయం అక్కడే ఉండమని పసిపిల్లల్లా అదుగుతాయి ఈ అక్షరాలు" ఇది కవిత్వం పాఠకుని దగ్గరికి రావడాన్ని, ఆ అనుభూతిలో మరికొంత సమయం గడపమని చేసే వేడుకోలు. కవి ఇక్కడ కవిత్వాన్ని ఒక ప్రాణమున్న జీవిగా ప్రతీకాత్మకంగా చూపించాడు.

కవిత యొక్క హృదయాన్ని అవిష్కరించడదలిస్తే "కానీ, ప్రేమ ఉంది చూసావా ఆ సున్నితమైన శబ్దం గుర్తుకు తెచ్చినది" కవిత ఒక తాత్విక వాక్యంతో ముగుస్తుంది చీకటా, వెలుతురా అనేది సందేహంగా ఉన్నా, ప్రేమ మాత్రం ఉందని కవి దృవీకరిస్తారు. చివరి పాదాలు "మబ్బుల వెనుకకి మాయమయే ముందు విశాలమైన గగనంలో ఒంటరిగా సంచరించే చందమామ" కవితను ఒక సజీవమైన, దృశ్యాత్మక ముగింపుకు తీసుకువెళ్తాయి.

పచ్చగడ్డి కోసం వచ్చిన లేళ్ళు ఇనుప కంచె తీగల్లో తలదూరుస్తాయి లేదా కాలు చాస్తాయి. తిన్నది తక్కువైనా పాపం నెత్తుటి కాళ్లతో బయటపడతాయి. నక్కిన నక్కల్ని, పొంచివున్న పులుల్ని ఈ మాటుకో తరిమేస్తూ నేటిని రేపు అనే అశతో కదిలించే దిశగా వీరి కవితల్లోని శైలి లక్షణాలు సున్నితమైన భాష, సులభమైన వచన నిర్మాణం, ప్రతీకాత్మక దృశ్యాలు పూలు, కిరణం, పక్షి, చందమామ తాత్విక మెలకువ జీవితం కంటే విలువైనది అనుభూతి, ప్రేమ అంతర్ముఖ దృష్టి, భయాల నుంచి బయటకు తీసుకువచ్చే అంతరంగ శాంతి కవిత్వ స్వరూపంపై అవగాహన అక్షరాలను పసిపిల్లలుగా పోల్చడం.

ఇది బివివి ప్రసాద్ శైలిలోని ప్రత్యేకత భావం, దృశ్యం, తత్త్వం కలిసిన సరళమైన కవిత్వం. బివివి ప్రసాద్ కవిత్వం సహజత్వంతో, మానవీయతతో నిండి ఉంటుంది. ఆయన పదాలు అలంకారభరితం కావు, కాని అనుభూతి లోతైనది. ప్రతి కవితలో ఒక తాత్విక మెలకువ, జీవితాన్ని కొత్త కోణంలో చూడమనే ఆహ్వానం ఉంటుంది. నిష్కపట ప్రేమ, దయ, కృతజ్ఞత వంటి విలువలను కవి అత్యున్నత సత్యాలుగా ప్రతిపాదిస్తాడు. ప్రకృతిని ఆయన కవిత్వంలో కేవలం దృశ్యరూపంగా కాకుండా, అంతరంగ శాంతికి ప్రతీకగా ఉపయోగిస్తాడు. చిన్న క్షణాల్లో పెద్ద అర్థాలను సృష్టించడం ఆయన శైలికి ప్రత్యేకత. హైకూలలో సంక్షిప్తత, వచన కవిత్వంలో భావ విస్తృతి కవిత్వానికి ద్వంద అందాన్ని తెస్తాయి. అందోళనలతో నిండిన ప్రపంచంలో ఆయన కవిత్వం పాఠకుడికి శాంతి, స్వేచ్ఛ, ప్రేమ అనే మార్గాలను చూపుతుంది. బివివి ప్రసాద్ కవిత్వం మనసుకు మృదువైన స్పర్శ, జీవితానికి అంతరంగ వెలుగులా నిలుస్తుంది. ఎంతో భావాలున్నాయి ఇంకా వర్ణించడానికి.. ఎన్నో వ్యక్తీకరణలున్నాయి.. వివరించడానికి.. కవి అంతరంగాన్ని కొలవడానికి కామాలుండవు. చుక్కలుండవు. అయినా గెలుపు కవిదే.. ఒక కవిని విశ్లేషించాలనుకున్న నా ధైర్యానిదే.. ప్రణామాలు..!

శైలజామిత్ర

ప్రచురణ : సృజనక్రాంతి 31.8.25
శైలజామిత్రగారికి అనేక ధన్యవాదాలు,
మిత్రులు పెరుగు రామకృష్ణ గారికి నమస్సులు