22 మార్చి 2021

కవిత : తెలుసా


నీ భుజం మీది నుండి ఎగురుతూ వెళ్లిన సీతాకోక
ఎక్కడికి వెళుతోందో తెలుసా
నీలో దాని జ్ఞాపకం ఎగురుతోన్న ఈ క్షణంలో
అది యే పూల చుట్టూ తిరుగుతుందో ఊహించగలవా

నువు గదిలోకి వచ్చాక
బయట మొక్కలకుండీపై వాలిన ఎండ
ఆకులతో ఇంకా ఎంతసేపు సంభాషిస్తుందో తెలుసా
ఎండ సీతాకోకలా ఎగిరిపోయాక​, ​ఆకుల కింది నీడల్లో 
యే కానరాని లోకాలు తెరుచుకుంటాయో ఊహించగలవా

నీ కళ్ళముందు బడిపిల్లల్లా కుదురుగా
ఆకాశంలో కూర్చున్న నక్షత్రాలు
కనురెప్పలు మూసిన క్షణంలో
ఎంత అల్లరి చేసి వుంటాయో
గబగబా చెదిరి, మళ్లీ కుదురులోకి వచ్చి ఉంటాయో
తెలుసుకోగలవా, పోనీ, ఊహించగలవా

ఈ లోకంలోకి రాకముందు
కాలం నిన్ను తెరిచింది ఏ యుగంలోనో తెలుసుకోగలవా
దీనినుండి వెళ్ళిపోయాక
ఆకాశం నిన్ను దాచేది ఏ తలంలోనో​ ఊహించగలవా

అనంతమైన కొలతలతో
అలల్లా ఎగసిపడే సృష్టి ఇది
దీనిలోకి వెలుతురు పుట్టినట్టు పుట్టి
చీకటి పుట్టినట్టు వెళ్లిపోతావు
లేదా, నీలో ఇది చీకటి పుట్టినట్టు పుట్టి
వెలుతురు పుట్టినట్టు వెళ్ళిపోతుంది

వెలుగునీడల మసకచీకట్ల మాయాజాలంలో
నిజంగా ఉన్నదేమిటో, నిజంగా లేనిదేమిటో
నిజం కాకున్నా ఉండీ, లేనట్లున్నదేమిటో
ఎప్పటికైనా తెలుసుకోగలవా, ఊహించగలవా

కవిత : ఏ తలుపులు


ఎటునుండి జీవితపు తలుపులు తెరిచిఇక్కడికి వచ్చావు నువ్వు
ఏ ఆసక్తి నీ చుట్టూ ఇంత ప్రపంచాన్ని పరిచింది
వెనుతిరిగి వెళ్ళేదారి మరిచిన
నీ కలలోని నీలా ఒకటే బెంగతో
నీ దేహం గాలిపటంలా ఊగుతుంది

తూర్పురేఖపై మరోసారి వెలుతురు మ్రోగుతుంది
నిద్రలే, త్వరత్వరగా జీవించుదా మని
నీ చుట్టూ మనుషులు తొందరపెడతారు
ఆలోచనల సాలెగూళ్ల లోంచి
ముఖాలు బయటపెట్టి పలకరిస్తారు
నవ్వు ఒకటుందని గుర్తు చేసుకొని ప్రదర్శిస్తారు

తేదీలూ, వారాలూ, కాలెండర్లూ మారాయి ఇలానే
ఇదంతా ఏమిటని దిగాలుగా మరోసారి అడుగుతావు
దుప్పటి మడతపెడుతూ అంటావు
అస లిదంతా ఎలా మొదలైందని

ఆ ఎగురుతున్న సీతాకోక
ఎటునించి నీ జీవితంలోకి తలుపులు తెరిచింది
ఈ పచ్చదనంపై మెరిసే మంచుబిందువు
ఎందుకని ఈ పూట పలకరించింది
వాటిలోకి మాయమయే క్షణాల్లో
నీ జీవితానికి ఏ చల్లని చేతులు లేపనం పూస్తున్నాయి

అంతంలేని దిగులు, అంతంలేని అందం
అంతంలేని ప్రేమా, అనాసక్తీ
నీపైన కదిలే వెలుగునీడల ఆటలకి అర్థమేమిటి
అర్థాలన్నీ మాయమయ్యే అగాథమైన నిశ్శబ్దంలోకి
ఏ తలుపులు తెరవాలి, లేదా, మూయాలి

ప్రచురణ : ఫండే . సాక్షి 21.3.2021
  

19 మార్చి 2021

కవిత : ఉత్సాహానికి దూరంగా..

ఉన్నట్లుండి నీ ఉత్సాహం జారిపోతుంది
పూలలోని రంగులు జారిపోయినట్టు
ఇంద్రధనువులోని కాంతి మాయమైనట్లు
మధురమైన భావనేదో మరపులోకి కృంగినట్లు

ఉన్నట్లుండి లోకం చేతులు విడిచి
ఏకాంతంలోకి వెళ్లిపోవాలనిపిస్తుంది
మెలకువలోనే నిద్రపోతున్నంత
ఖాళీగా ఉండిపోవాలనిపిస్తుంది

వాన చివరి చెమ్మగాలివంటి నిర్వేదం
మిణుగురు చుట్టూ ముసిరిన రాత్రిలాంటి నిరాశ
దేనినీ మొదలు పెట్టనీయని, ముగించనీయని
వెలిగీ వెలగని దీపం లాంటి ఒంటరితనం
నిన్ను నీ ప్రక్క లాలనగా కూర్చోబెడతాయి

నీకు నువ్వే స్నేహితుడివి, ప్రియురాలివి అప్పుడు
రేకుల మీది ఉదయపు కాంతిలా, గాలిలా
లాలనగా నిన్ను తాకబోతున్న
ప్రపంచానికి ఎడంగా జరుగుతుంటావు

బహుశా, అప్పుడు
బిడ్డ కోపగించిన తల్లిని దూరం నుండి చూస్తున్నట్టు
జీవితం దూరంగా నిలిచి నిన్ను చూస్తూ వుంటుంది.