27 మార్చి 2023

ఊరికే జీవితమై ఆవిష్కరణ

ఊరికే జీవితమై ఆవిష్కరణ సభ 9.4.23 సాయంత్రం ఖమ్మం లో జరగనుంది. 

ఆసక్తి ఉన్న మిత్రులు తప్పక రాగలరు.



06 మార్చి 2023

ఉద్వేగాల లోతుల్లోని ప్రశాంతతని కవిత్వం చేస్తాను : బివివి ప్రసాద్ . పలకరింపు

 

    'నేను' అనే సముద్రం లోంచి పుట్టిన అలల ఉధృతి లాగా ఈ ప్రపంచం నీ చుట్టూ పరచుకుంటుంది. స్వరూపం వేరైనా స్వభావం ఒక్కటే అని అనాది సత్యం హోరుమని కాలపు అంచుదాకా ఎగసిపడుతుంటుంది. ఉల్లిపాయ పొరల్లాగా ప్రశ్నని వొలుచుకుంటూ పోతే, అది బయల్దేరిన మూలం లోనే సమాధానమూ దొరుకుతుంది. ఇంత గొప్ప జీవితానుభవమూ మనిషి లోని ద్వంద్వాలను కలిపి ఏకం చెయ్యలేకపోతుంది. ఉన్నది ఏది, లేకున్నా ఉన్నట్టు భ్రమింపజేసేది ఏది, ఉనికికి ఆధారం ఏది అనే వెదుకులాట ఒక్కోసారి వాక్యాలుగా బహిర్గతం ఔతుంది. 'ఊరికే జీవితమై' పాఠకుల ఎదురుగా కవిత్వమై ప్రత్యక్షం ఔతుంది. అంతశ్శోధనా ధోరణిలో సాగిన ఈ కవిత్వం గురించి కవి బివివి ప్రసాద్ నుండే మరికొంత తెలుసుకుందాం.
 
- స్వాతికుమారి బండ్లమూడి

ఈ కవితల్లో చాలావరకు ఒక అంతర్లీనమైన తాత్విక ధోరణి కనిపిస్తుంది. ఇది కవి స్వభావంలో నుంచి సహజంగా వచ్చి చేరినదా లేక ముందే అనుకున్న కొన్ని అంశాలను కవిత్వ పరంగా చూపించే ప్రయత్నం కొంత ఉందా?

    కవి స్వభావం నుండే కవిత మొదలవుతుంది. స్వభావం పైన తాను అనుకునే వాటి ప్రభావం ఉంటుంది. అందువల్ల రాసే క్రమంలో కొన్నిసార్లు అనుకునేవి కూడా పాయలుగా కలవవచ్చు.

    కవితని అలావుంచి, తర్వాత వాక్యాన్నే ముందుగా ఊహించటం అరుదు. తోసుకువచ్చే ఒక వాక్యం కవిత రాబోతోందని తెలియచేస్తుంది. వీలులేక, రాయటానికి సిద్ధపడనపుడు అది మాయమైపోతుంది కూడా.

    కవితని ఓపెన్ చేసిన ఉద్వేగం, తనంత తానే వికసిస్తూ, తన ముగింపు వరకూ ప్రయాణిస్తుంది. తొలి పాఠకుడిలా దానిని చూస్తూ ఉంటాను.

    కొన్ని కవితలని edit లేదా rewrite చేస్తాను. లోపలి పాఠకుడికి బావుంది అనిపించే వరకూ, లోపలి కవి కవితని దిద్దుతూ ఉంటాడు. బావుంది అనిపించటం ముఖ్యం, ఏం రాయదలిచాను కన్నా. నమ్మనిదీ, కాంతిని ఇవ్వనిదీ ఎట్లాగూ రాయదలచలేదు గనక.

నేనెవరు అనే ప్రశ్న, ఏ వస్తువుకి తనదైన ఉనికి లేదనే సమాధానం, ఏదైనా ఉండటానికి వెనక, లేకపోవడానికి తర్వాత ఉన్నదేమిటి అనే సత్యాన్వేషణ.. ఇవన్నీ మీ కవిత్వం లో వచ్చి చేరడం వెనక నేపథ్యం ఏమిటి?

    జన్మతః introspection బలమైన అంతర్భాగం కావటం వల్ల, ఊహ తెలిసిన నాటినుండీ, నాకు నాదైన ఉనికి లేదా అనే దిగులో, నిండుదనం లోపించిన వెలితో లోలోపల సాంద్రంగా పనిచేసి ఉంటుంది. ఆ వెలితి నుండి బయటపడే ప్రయత్నంలో భాగంగా శ్రీ రమణమహర్షి మాటలు చదివినపుడు, నేనెవరు అనే ప్రశ్న తప్పించుకోలేనిదిగా ఎదురైంది.

    రూపాలకి అతీతమైన substance రూపాలని తెరమీది బొమ్మల్లా చూపిస్తుందని లీలగా తెలుస్తూ వుంటుంది. నేను రూపాన్ని కానా, ఆ substance నేనా, అసలు ఉన్నది నేను మాత్రమేనా అనేది అన్వేషణ.

    కవిత్వంలో అన్వేషణ చేరిందా, అన్వేషణలోనే కవిత్వం చేరిందా. రెండూ ఒకే సారానికి భిన్న రూపాలా. చూడాలి.

రోజువారీ సమస్యలను, ఉద్వేగాలను, సంఘర్షణలను దాటి మీరు చూపించిన ఈ భావనలు ఒక స్థాయి/ తరహా పాఠకులకు మాత్రమే ఉద్దేశించినవి అనుకోవచ్చా?

    వాటిని దాటి కంటే కూడా, వాటి లోపలి కంటా చూసి అనవచ్చునేమో. ఏ వాక్యమూ సార్వజనీనం కాదు, అలా తోచేవి కూడా అంతిమంగా వైయక్తిక స్థితి, స్థాయిని బట్టి అవగాహనకీ, అనుభవానికీ వస్తాయి. ఏ కవి అయినా, అటూ ఇటుగా తనలాంటి పాఠకులనే ఉద్దేశించి రాస్తాడేమో. రాసేటపుడు నాకూ నాలాంటి మనిషితో మాట్లాడుతున్న భావమే ఉంటుంది.

ఈ తరహా కవిత్వం రాయడానికి ప్రేరణ ఏమిటి? ఈ పద్ధతిలో/ ఇటువంటి అంశాలపై మీరు చదివిన ఇతర కవితలు ఏవైనా ఉన్నాయా?

    లోచూపుకి తోచే విషయాల్ని రికార్డ్ చేసుకోవాలనిపించటమే ఈ తరహా కవిత్వానికి దారి తీసింది. చదువుకున్న కవిత్వం తక్కువ. తొలినాళ్ళలో టాగోర్, ఖలీల్ జిబ్రాన్ లని చదివాక ఇలా రాసుకోవచ్చు అనే స్పష్టత వచ్చింది. ఇస్మాయిల్ని చదవటం అభివ్యక్తికి మరికొంత దోహదం చేసింది. హైకూని శ్రద్ధగా సాధన చేసిన ప్రభావం ఉంది. 'ఆకాశం' సంపుటి నాటి నుండి రాస్తున్నవి ఎవరి ఛాయల్లేని నావైన వాక్యాలు అనుకుంటాను.

    సాధారణంగా కవులు ఉద్వేగాలని తట్టడానికీ, మేల్కొల్పడానికీ కవిత్వం రాస్తారు. నాకది discomfort గా తోస్తుంది. ఉద్వేగం లేనిది కవిత్వం లేదు. అయితే, నాకు ఉద్వేగాల లోతుల్లోని ప్రశాంతతని కవిత్వం చేయటం ఇష్టం. సాంద్రమైన ఉద్వేగంతో నిండుగా ఉన్నపుడే ఆ ప్రశాంతత తెలుస్తుంది. తొలి సంపుటి ఆరాధన నుండి ఈనాటికీ అలాంటి మూడ్ లో నుండే కవిత్వం రాయటం అలవాటైంది.

చేపలా

సముద్రంలోని చేప
ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి
మళ్ళీ సముద్రంలో పడినట్టు
ఒక్కొక్కసారి అనంతంలోకి ఎగిరి
మళ్ళీ ప్రపంచంలో పడతావు

గాల్లోకి ఎగిరినపుడు
గాలి అందని చేపలాంటి నువ్వు
ఊపిరిపీల్చే ఆటలో పడి
ఊపిరాడట్లేదంటావు

జీవితావసరా లేవీ వద్దు,
ఉత్త జీవితం కావాలని విలపిస్తావు.

కలలో అమ్మ లేక ఏడుస్తున్న
ఒడిలోని బిడ్డని తల్లి తట్టి లేపినట్టు
నిన్నెవరో ఇప్పుడు జీవితంలోకి తట్టిలేపాలి

(బివివి ప్రసాద్ 'ఊరికే జీవితమై' సంపుటిలోంచి ఒక కవిత)

(ప్రచురణ : వివిధ, ఆంధ్ర జ్యోతి దినపత్రిక 13.02.2023)


#BVV Prasad, #Telugu Poetry, #oorike jeevitamai, #బి‌వి‌వి ప్రసాద్, #తెలుగు కవిత్వం, #ఊరికే జీవితమై

మరికొన్ని మాటలు..

    నలభై యేళ్ళ స్నేహం కవిత్వంతో. ఇక ఇది ముగింపుకు వచ్చిందేమో తెలీదు. కవిత మళ్ళీ పలుకుతుందో, లేదో తెలీదు. కాలేజీ కాలపు ఉద్రేకాలతో నా మీదికి దూకి, ఉక్కిరిబిక్కిరి చేసాక, తెలియరాని వెలితి వల్ల లోచూపులోకి మలుపు తిరిగాక, తెలియని సత్యాన్నీ, తెలిసీ, తెలియని జీవితాన్నీ, తెలుసనుకొంటున్న మనిషినీ తడుముకుంటూ, గ్రహిస్తూ, విస్మరిస్తూ, నేర్చుకుంటూ, విడిచిపెడుతూ పట్టరాని ఆనందమో, దుఃఖమో, దిగులో, భయమో, వెలితో, నిరాశో, ప్రేమో, ఆశ్చర్యమో కమ్మినపుడల్లా, వాటి నీడలేవో ఇక ఊరికే కూర్చోనీయని క్షణాల్లో రాయడం మొదలు పెట్టి, రాయడంలోంచి లోలోతుల్లోకి మునుగుతూ, కవిత ముగింపుతో పైకి తేలుతూ, రాసింది సరిచూసుకుంటూ, నన్ను నేనే మనిషిగా, కవిగా చెక్కుకుంటూ, ఇస్మాయిల్‌ అన్నట్టు, దీన్ని నేను నడిపిస్తున్నానో, నన్ను ఇది నడిపిస్తుందో తెలియకుండా సాగిన విభ్రాంత సమయాల కవిత్వ స్నేహం ఇక ముగిసిందేమో, తెలీదు. ముగిసిందనుకోవటంలో తోసుకువచ్చే ప్రేమ వుంటుంది, కొనసాగుతుందనుకోవటంలో భరోసా ఇచ్చే ఉదాశీనత ఉంటుంది.
. . .
    చాలాసార్లు ఆగాను, మళ్ళీ చాలాసార్లు నడిచాను ఈ స్నేహంలోకి. ఆగినపుడల్లా నేర్చుకుంటూనే ఉన్నాను, బహుశా, తెలియకుండానే. కవిత్వం అంటే ఏమిటో, వస్తువు ఏదో, శిల్పమేదో, మనిషి ఏమిటో, మనస్సు అలజడి ఏమిటో, జీవితమంటే ఏమిటో, ఈశ్వరుడంటే ఎవరో, సత్యమంటే ఏమిటో, సౌందర్యం ఏం చేస్తుందో తడుముకుంటూనే, వేసట పడుతూనే, మరింత సాంద్రతలోకి, లోతులోకి, విశాలత్వంలోకి నన్ను నేను విడిచిపెట్టుకుంటూనే ఉన్నాను. నేను అంటే మనసు, మనసు అంటే భయం, వెలితి, దుఃఖం, ఆరాటం. మనసు అంటే ఎక్కడుందో తెలియకనే, నేనుగా ఆవహించి, నన్ను ఉక్కిరిబిక్కిరి చేసే మృగతృష్ణ. దీనినుండి బయటపడాలి. దీని ఉపకరణాల నుండి విడుదల పొందాలి. గొప్ప శాంతిలోకి, తేజస్సులోకి, ప్రేమలోకి మేలుకోవాలి. ఇలాంటి లోలోపలి వత్తిడి ఏదో నన్ను ఇంత దూరం నడిపింది. దూరం నిజంగా ఉందా. దూరమంతా ఊహ మాత్రమేనా. కాలమైనా నిజమేనా, కల మాత్రమేనా. ప్రశ్నలు, జవాబులు, సందిగ్దతలు. ఇవన్నీ నిజమా, కల్పనా. ఇవన్నీ ఎవరికి నిజం లేదా ఎవరి కల్పన.
. . .
    కొన్ని చదివి ఆశ్చర్య పడ్డాను, కొందర్ని చూసి కూడా. ఈ రాతలు, ఈ జ్ఞానులు నిజమేనా. బహుశా, నిజమనే నమ్మాను. బహుశా, నిజం కావాలని నమ్మాను. ఏదో ఒకటి నిజం కాకపోతే ఏదీ ఆలంబన. దేనికి ఆలంబన, ఎందుకోసం. మనస్సే తనని తాను మెడపట్టి గెంటలేదని అర్థమైంది అనుకొన్నాను తొలినాటి రాతల్లో. నిజంగా అర్థమైందా. అర్థం కాలేదా నిజంగా. ఇన్ని రాతల తర్వాత, నేను మొదలైనచోటనే ఉన్నానా, మొదలే లేనిచోటికి చేరుకున్నానా. ఒక తెలియనితనం కమ్ముతోంది. కమ్ముతోందా, దానికి నేను లొంగుతున్నానా. తెలియనితనంలోని హాయి మాత్రమే, నిశ్చింత మాత్రమే నిజమా. తెలుసు నుండి విడుదల పొందటానికే ఇంత వేసట పడ్డానా. బాల్యం అమృతకాలం. దేవుడు ఊరుకోక తనని జీవిగా చేసుకొన్న తొలి వేకువ సమయం. మళ్ళీ బాల్యంలోకి, మళ్ళీ ఏమీలేనితనంలోకి వెళ్ళటానికి ఎంత దుఃఖం, ఆరాటం, అలసట, ఘర్షణ. ఎన్ని భ్రమావరణాల సంతోషాల, బాంధవ్యాల, అభిరుచుల, అలవాట్ల, నమ్మకాల మొరటుదనాల నుండి బయటపడాలి దీనికి. ఎంత భాషనీ, సమాచారాన్నీ, సంస్కృతినీ వదిలించుకోవాలి, ఎన్ని భయాలని ప్రేమలోకి డీకోడ్‌ చేసుకోవాలి. అన్నీ వదిలించుకుని వచ్చి, ఎంత అమాయకత్వంలోకి ఊపిరి పీల్చుకోవాలి.
. . .
     భాషకి విరుగుడుగా రాసుకొన్న భాష ఈ కవిత్వం. శబ్దాలనుండి నుండి నిశ్శబ్దంలోకి జారిపోవటానికి చెక్కుకున్న మాటలు ఈ కవిత్వం. మనస్సునేను నుండి లేనినేనుకి లేదా ఉన్ననేనుకి చేసే దీర్ఘయాత్ర ఈ కవిత్వం. ఇది నాలోంచి పలికినప్పుడు, బహుశా, కేవలం నాకోసమే పలికిందేమో తెలీదు. ప్రియమైనవారెవరో చెవిలో చెప్పిన మాటల్ని, బజారులో పంచుకొన్న వెర్రివాడిలా, ఈ మాటల్ని లోకంలోకి జారవిడుచుకున్నానేమో తెలీదు. మీకు జీవితం అర్థం కాకపోతే మీ కవిత్వం చదువుకోండి అని స్నేహితురాలు అన్నట్టు, నాకైన మాటల్ని నేను వినటం మాని, ఇలా పలుకుతున్నానేమో తెలీదు. పలికానా, పలికాయా. ఏ శక్తులో అత్యల్పమైన మనస్సుని వెదికి, వశం చేసుకుని, దానిద్వారా ఈ మాటలన్నిటినీ పలుకుతుందేమో. చాలాకాలం తర్వాత, నా రాతలు నేనే చదువుకుని, ఇతను ఇలా ఎలా ఊహించాడు అని ఆశ్చర్యపడే క్షణాల్లో, రాసింది నేను కాదనిపించడంలో నిజముందేమో తెలీదు.
. . .
    నేనే రాశాననుకొంటే, బడాయిగానో, బేలగానో, ఇవి దేశ, కాలాంతరాల్లో ఉన్న నాలాంటి వాళ్ళకి రాసుకొన్న ప్రేమలేఖలు అని చెప్పవచ్చును. చదివినవారూ అక్కడే ఆగి, కవిత్వానికి అటువైపు నుండి ఇటు వున్న కవితో స్నేహం చేయబోతారు కూడా. కానీ, ఒక గొప్పవాక్యం ముందు మోకరిల్లే మనుషులుంటారు. రాసినవారో, చదివినవారో. వారికి మాత్రమే ఆ వాక్యంలోకి, దాని అర్థమిచ్చే వెలుగులోకి ప్రవేశించటం తెలుస్తుంది. వారికోసం ఈ గాలి నిండా, ఆకాశం నిండా శుభ్రమైన వాక్యాలు పసిదేవతల్లా ఆడుకొంటూనే, వెదుకుతుంటాయి. అవి కొన్నిసార్లు అనుకోని మలుపులో అక్షరాలుగా కనబడవచ్చు, అనుకోని క్షణంలో అంతరంగంలోనే మెరవవచ్చు. వారు ఆ మెరుపులోంచి అనంతంలోకి మాయంకావచ్చు.

    ఇంత అద్భుతమైన మెరిసే మాయవస్త్రాల తెరల లోంచి చిరునవ్వే జీవితానికి నమస్కరిస్తూ..

బివివి ప్రసాద్‌, తణుకు
2.2.23 10.15 రాత్రి

(ఊరికే జీవితమై.. కి ముందుమాట)


#BVV Prasad, #Telugu Poetry, #oorike jeevitamai, #బి‌వి‌వి ప్రసాద్, #తెలుగు కవిత్వం, #ఊరికే జీవితమై

ఊరికే జీవితమై.. బివివి ప్రసాద్ కవిత్వ సంపుటి

ఊరికే జీవితమై.. 

బివివి ప్రసాద్ 2016 - 2022 మధ్య రాసిన 75 కవితల సంపుటి వచ్చింది.

జీవితం పట్ల లోచూపుని కలిగిస్తూ, 

సాంద్రమైన నిశ్శబ్దాన్ని అనుభవానికి తెచ్చే, 

ఊరట నిచ్చే కవిత్వం కోసం తప్పక చదవండి.



పేజీలు : 134, వెల : రూ. 150 

ప్రతులకు :

బివివి ప్రసాద్ : 90320 75415

నవోదయ, హైదరాబాద్ : 92474 71362 

అనేక, విజయవాడ : 92472 53884 

నామాడి శ్రీధర్ : 93968 07070 

https://www.telugubooks.in/products/oorike-jeevitamai

https://logilitelugubooks.com/book/oorike-jeevitamai-b-v-v-prasad


#BVV Prasad, #Telugu Poetry, #oorike jeevitamai, #బి‌వి‌వి ప్రసాద్, #తెలుగు కవిత్వం, #ఊరికే జీవితమై