10 డిసెంబర్ 2021

06 అక్టోబర్ 2021

ఎదురుచూస్తూ

నాలుగుగంటలు పడుతుంది డాడీ,
ఏం చేస్తారు, ఎదురుచూస్తారా అంది అమ్మాయి
పరీక్ష రాయటానికి వెళ్లబోతూ
చూద్దాం, ఎలా గడుస్తుందో అన్నావు
ఖాళీపూట నదిలో స్నానానికి దిగబోతున్న ఉత్సాహంతో

ఎదురుచూడట మేమీ
తప్పించుకోవాల్సిన అనుభవం కాదు
ఎదురుచూపు దారం కొసన ఎగిరేటపుడు
కిందికీ, పైకీ, నలువైపులకీ
ఖాళీసమయం ఆకాశంలా విస్తరిస్తుంది

ఇప్పుడీ చెట్ల ఆకుల్లో
రుతువులే జీవనానందాన్ని దాచాయో శోధించవచ్చు
వీటి నీడల సంకేతాలతో
సూర్యుడు భూమితో చేసే రహస్యభాషణ వినవచ్చు

నీ ప్రక్కనుండి ఎవరో వెళ్లిపోవటాన్నో
దూరంగా తేలుతున్న సంభాషణనో
నీ దేహమంతటితో శ్రద్ధగా ఆస్వాదించవచ్చు

జీవితం మోపిన వత్తిళ్లు కాసేపు మరచి
ఒక్కొక్క క్షణాన్నీ తీరికగా అనుభవించవచ్చు
నలువైపులకీ శకలాలుగా విసరబడే నిన్ను
ఒక్కచోటికి చేర్చుకొని చూసుకోవచ్చు

నిజానికి, ఎదురుచూడటం మినహా
ఇక్కడికొచ్చి చేస్తున్నదేమీ లేదు
తెలియనిచోటు నుండి వచ్చి
తిరిగి తెలియకపోవటంలోకి వెళ్ళటానికి
ఎదురుచూస్తూ వున్నావు

నీ బాధ్యతలన్నింటి వెనుకా
నీ నెలాఖరు జీతమున్నట్టు
నీ పనులన్నింటి వెనుకా
జీవితం చివర వెళ్లిపోవటానికి
ఎదురుచూపు వుంటుంది

నీ పనుల మధ్య ఖాళీల్లోకి
నీకు ఇష్టమైన పాట
పాపాయిలా వచ్చి పలకరించినట్టు
నీ రోజుల్లోని ఇలాంటి ఖాళీల్లోకి
నిన్నిక్కడ దించి వెళ్లిన అనంతం
వచ్చి పలకరిస్తుంది

బహుశా, అపుడు
నువు పుట్టనే లేనంత భారరహితమై
జీవితాన్ని నిసర్గంగా,
ఉత్త జీవితంగా కాసేపు జీవిస్తావు

ప్రచురణ : దిక్సూచి, ముంబై. సెప్టెంబర్ 2021

04 అక్టోబర్ 2021

నచ్చేలా..


జీవితం ఉక్కగా ఉంది
అందరికీ నచ్చేలా బ్రతకటంలో పడి
నాకు నచ్చేలా బ్రతకటం మర్చిపోయాను అంది
ఆ అమ్మాయి
బహుశా, అందరూ అంతే అనుకున్నావు నువ్వు

తనకి నచ్చేలా బ్రతికేవాళ్ళలో బాల్యం వుంటుంది
సరస్సు మీంచి వీచే ఉదయపు గాలీ
కొమ్మల్లోంచి వాలే బంగారు కాంతీ
వాళ్ళ కోసమే ఈ లోకంలోకి వచ్చినట్టు వుంటుంది
జీవితం వాళ్ళచుట్టూ ఉత్సవభరితమై
పసిపిల్లల్లా గంతులేస్తున్నట్టు వుంటుంది

ఆకాశాన్ని విప్పుకొన్న పక్షిలానో
అడవిని చుట్టుకొన్న జంతువులానో
రేపటి దిగుల్లేని జీవితం గడిపేవాళ్ళని చూస్తే
సమూహానికెప్పుడూ ప్రశ్నగానే ఉంటుంది

వాళ్ళని చూస్తే
కొండ అంచున నడిచేవాళ్ళని చూసినట్టూ
మృత్యువుతో దోబూచులాడే
జీవితాన్ని చూసినట్టూ వుంటుంది
కాస్త ఆకర్షణగా, మరికాస్త భయంగా
జ్వలిస్తున్న దేనినో దగ్గరగా చూస్తున్నట్టుంటుంది

చెట్టులాగా ఉన్నచోటనే ఉనికిలోనికి మునిగి
తనలోనుండే తేలుతూ ఉండేవాళ్ళని చూస్తే
వాళ్ళని అచ్చుపోసిన జీవితంలోకి ఒంపేవరకూ
మనకి ఆందోళనగానే వుంటుంది

చెట్టు ఎలా ఎదగాలో, కొమ్మలు చాపాలో
ఏయే ఋతువుల నెట్లా గానం చేయాలో
ఏయే ఎండల్లోకి నీడల వలలెట్లా విసరాలో
విత్తనంలోనే దాగి వున్నట్టు

ఎలా బ్రతకాల్సి వుందో పుట్టుకలోనే వుంది గనుక
నిన్ను నువ్వూ, వాళ్ళని వాళ్ళూ
చల్లగా బ్రతకనివ్వాలి అంతే కదా అమ్మాయీ


ప్రచురణ : ఆదివారం ఆంధ్రజ్యోతి 3.10.2021

మలిసంధ్యవేళ..

1
ఆమె రాయమంటుంది కొన్ని అక్షరాలు
ఎన్ని రాస్తే
సడిచేయని వెన్నెల పాదాలవుతాయి
వానచినుకు నేలపై తెరిచిన వృత్తాలవుతాయి
పోనీ, సీతాకోక ఎగిరిపోయిన ఖాళీలవుతాయి
అంటావు నువ్వు

2
పలకమంటుంది కొన్ని పదాలు
ఎన్ని పలికితే
జీవనసారంలోంచి వికసించే చిరునవ్వులవుతాయి
దుఃఖపుశిల చెమరించిన కన్నీరవుతాయి
స్పర్శలో మేలుకొనే దయాపూర్ణ లోకాలవుతాయి
అనుకొంటావు

3
ఊరికే కూర్చుందామా దగ్గరగా కాసేపు అంటుంది
ఎన్ని యుగాలు కూర్చుంటే తనివి తీరుతుంది
ఎంత సమీపిస్తే మనమధ్య వెలితి నిండుతుంది
ఏనాటి వేసవిగాడ్పు ఇక విడదీయక వెళ్ళిపోతుంది
అనిపిస్తుంది నీకు

4
ఆమె తన లోపలికి వెళుతూ
దయగా నన్ను నా లోపలికి వెళ్ళమంటుంది
పచ్చిక మైదానంపైన నక్షత్రాలు మెరుస్తున్నాయి
ఇద్దరమూ లేని ప్రశాంతి చలిగాలిలా సాంద్రమవుతోంది

ఒక మధ్యాహ్నం

జీవితం తనతో తాను జీవిస్తోంది
కుదురుగా బొమ్మలతో ఆడుకొంటున్న పాపాయిలా

తనని తాను చూసుకొంటోంది
గాలికి ఎగురుతున్న పేపరు కొసల్లో
ఆమె వస్త్రాలపై వాలుతున్న ఎండలో

వింటోంది తనని తాను
టీవీలోంచి పొడిగా రాలుతున్న శబ్దాల్లో
వాహనాల తొందరలో, మనుషుల చప్పుళ్ళలో

పనిలేని గాలి తనని తానే తాకినట్టు
తీరికగా తనని తాకుతోంది జీవితం
ఆవు దూడని నాకినట్టు
ఎండ నాలుక చాపి లోకాన్ని నాకుతోంది

జీవించటం మినహా జీవితానికి మరేమీ తోచని
మాఘమాసపు మధ్యాహ్నపు వేళ
నదిలో మునగటమెలానో తెలియని నువ్వు
పైకి తేలి కాసిని అక్షరాలని పలవరిస్తావు

నిన్ను కుడుతూనే ఎర్రచీమలు చనిపోయినట్టు
జీవితాన్ని పట్టుకొంటూనే అక్షరాలు చనిపోతాయి

30 జులై 2021

కవిత : ఈ క్షణం

ఈ క్షణ మొకసారి పిల్లకాలువ
తేలికగా ప్రవహిస్తూ పోతుంది
ఒక్క గెంతులో దానిని దాటగలుగుతావు
మరొకసారి మహాసముద్రం
దానిలో మునిగిపోకుండా నిలబడటానికి
నీ శక్తులన్నీ ఒడ్డుతావు

ఒకసా రొక చినుకు
గుర్తించేలోపు పలకరించి మాయమౌతుంది
మరొకసారి మురికికూపం
తప్పుకొని పోయేందుకు తహతహలాడతావు

అనేక క్షణాలుగా కనబడే ఒకే ఒక క్షణం ఇది
దానిని అనుభవిస్తున్న ట్లుంటుంది గానీ
అదే నిన్నూ, నన్నూ, లోకాన్నీ
అనుభవిస్తూ, పలవరిస్తూ సాగుతోంది కొండచిలువలా

క్షణాన్ని ఊరకనే పైపైన తాకి
అది పూవు లాంటిదనో, పండులాంటిదనో
రంగులు రాల్చిన ఎండుటాకులాంటిదనో
తేలికగా తలుస్తావు గానీ
దాని గర్భంలో ఏముందో పసిగట్టలేవు

క్షణం గర్భంలో అనంత విశ్వాలున్నాయి
అంతూదరీ లేని లోతులున్నాయి
మొనదేలిన తర్కాలకూ అందని కొలతలున్నాయి

తెలియరాని ఆకర్షణ ఏదో
దాని ఖాళీరంగు సుడిగుండంలోకి
బలంగా లాగేటప్పుడు జాగ్రత్త
వెనుతిరిగి జీవితంలో పడేందుకు
నీకు నువ్వంటూ ఏమీ తగలక పోవచ్చును

ప్రచురణ : ఈ మాట జూన్ 2021 17 ఏప్రిల్ 2021

కవిత : అలా ఎలా..

అలా ఎలా ప్రేమించావు జీవితాన్ని
బాల్యంలో బొమ్మల్నీ
యవ్వనంలో యువతుల్నీ
ప్రౌఢిమలో బంధాల్నీ, బాధ్యతల్నీ
పలుకుబడినీ, అలవాట్లనీ
నచ్చినవో, నచ్చబడినవో ప్రోవుచేయటాన్నీ
తీరికలోనో, పొరబాటునో
పిల్లలనీ, రంగులనీ, నవ్వులనీ
ఎప్పుడూ భయాన్నీ, భద్రతనీ

అలా ఎలా ప్రేమించేశావు
నువు పుట్టడాన్నీ
నీ ముందు ప్రపంచం పుట్టడాన్నీ
అవి నిద్రల్లోకి రాలిపోవడాన్నీ
అనుభవం గతంలోకీ
ఉత్సాహం భవితలోకీ జారిపోవడాన్నీ

ఇన్ని వేల శ్వాసల తరువాత
మరిన్ని వేల ఊహల తరువాత
అలసిపోయి కూర్చున్నప్పుడు, కాస్త చెప్పు
ఇదంతా ఎలా మొదలైంది
ఎలా ముగియనుంది
తీరనిదాహంలాంటి ప్రేమలోపల
ఏ రహస్యం నీ కోసం ఎదురు చూస్తుంది

ప్రచురణ : ఈ మాట ఏప్రిల్ 2021

కవిత : వెళదామా..

బొమ్మలు గీయి
రంగులు వేస్తూ వాటిల్లోకి తప్పిపో
పాటలు పాడు
స్వరాల అలలపై సవారి చేయి
ప్రేమించు కళ్ళు మెరిసేలా
హృదయం పగిలి కన్నీటికాల్వలు కట్టు
తోచినట్టు బ్రతుకు
బ్రతికినదానికి దుఃఖపడు లేదా తృప్తిపడు

నువ్వు వెళ్ళగానే
అద్దంలోని ముఖం వెళ్లిపోయినంత నిశ్శబ్దంగా
నీలోంచి ప్రతిదీ వెళ్ళిపోతుంది
గోడమీద వాలిన బంగారుకాంతిలా
ఆనవాలైనా మిగలకుండా మాయమౌతుంది

మనం ఒకప్పుడు ఆడిన ఇసుకతిన్నెల్లో
ఇవాళ ఈ పిల్లలు ఆడుతున్నారు
మన హృదయాల్ని చల్లబరిచిన వెన్నెల్లో
ఆ యువతీయువకులు బిడియపడుతూ
హృదయాల్నీ, మౌనాన్నీ విప్పుకుంటున్నారు

ప్రతిదీ ఉండట మెంత బావుందో
వెళ్లిపోవట మంత బావుంది
మనమిక వెళదామా
వచ్చినంత సంతోషంగా, నిశ్శబ్దంగా..

ప్రచురణ: కవిసంధ్య ఏప్రిల్ 2021

02 ఏప్రిల్ 2021

కవిత : ఒక సంభాషణ


ఏది నిన్ను గాయపరిచింది
ఏది భయంలో ముంచింది అన్నాడు మిత్రుడు
చీకటిలో వెలుతురూ
వెలుతురులో చీకటీ పొడిపొడి​లా​ రాలుతున్న రాత్రివేళ

పూవు పూయటానికి రోజంతా పడుతుంది
రాలటానికి క్షణం చాలు
ఇదీ ప్రపంచం అని అర్థమవుతున్నపుడు
గాయపడటం, భయపడటం మొదలైంది అన్నావు

నువు చాలా సున్నితం
దీని నొక ద్వారంలా చూడు
ఈ గాయమే లేకపోతే ప్రపంచాన్ని దాటే దారి వెదకవు

నీ చూపు పరిమితం కూడా
పూవు నువు చూసినపుడు పుట్టలేదు
చూస్తుండగా రాలలేదు

అది ఎప్పుడు పుట్టిందో
మనకు నిజంగా తెలీదు
భూమి పుట్టినపుడో, సృష్టి పుట్టినపుడో
పూవు పుట్టడం మొదలైంది

ఏ మహాశూన్యంలో పుట్టిందో
ఏ మహాశూన్యంలో లయిస్తుందో
పూవుకే తెలియదు
పూవుని చూసే చూపుకీ తెలియదు
చూపుని చూసే తెలివికీ తెలియదు

తెలియకపోవటంలోకి వెళ్ళటానికి
తెలిసినదానిలో పలు ద్వారాలు ఇవి

ఊరికే చూడు రాత్రినీ
నక్షత్రాలనీ, దుఃఖాలనీ, ఈ మాటల్నీ
వెలుగుచీకటుల యుగాల ప్రణయంతో
మేలుకో, కలగను, నిద్రపో

అల లలలుగా ఏం చేస్తున్నా
లోలోపల ఊరికే ఉండటమొక మహాద్వారం

మిత్రుడు పదాలతో తెరిచిన పలు ఖాళీల్లోకి
మిత్రుడూ, నువ్వూ,
రాత్రీ, చీకటీ, వెలుతురూ ప్రవేశించగా
ఏమీ తోచని కాలమూ
వాటి వెనుకే ఖాళీలోకి చేరిపోయింది

ప్రచురణ : పాలపిట్ట. ఫిబ్రవరి 2021 

22 మార్చి 2021

కవిత : తెలుసా


నీ భుజం మీది నుండి ఎగురుతూ వెళ్లిన సీతాకోక
ఎక్కడికి వెళుతోందో తెలుసా
నీలో దాని జ్ఞాపకం ఎగురుతోన్న ఈ క్షణంలో
అది యే పూల చుట్టూ తిరుగుతుందో ఊహించగలవా

నువు గదిలోకి వచ్చాక
బయట మొక్కలకుండీపై వాలిన ఎండ
ఆకులతో ఇంకా ఎంతసేపు సంభాషిస్తుందో తెలుసా
ఎండ సీతాకోకలా ఎగిరిపోయాక​, ​ఆకుల కింది నీడల్లో 
యే కానరాని లోకాలు తెరుచుకుంటాయో ఊహించగలవా

నీ కళ్ళముందు బడిపిల్లల్లా కుదురుగా
ఆకాశంలో కూర్చున్న నక్షత్రాలు
కనురెప్పలు మూసిన క్షణంలో
ఎంత అల్లరి చేసి వుంటాయో
గబగబా చెదిరి, మళ్లీ కుదురులోకి వచ్చి ఉంటాయో
తెలుసుకోగలవా, పోనీ, ఊహించగలవా

ఈ లోకంలోకి రాకముందు
కాలం నిన్ను తెరిచింది ఏ యుగంలోనో తెలుసుకోగలవా
దీనినుండి వెళ్ళిపోయాక
ఆకాశం నిన్ను దాచేది ఏ తలంలోనో​ ఊహించగలవా

అనంతమైన కొలతలతో
అలల్లా ఎగసిపడే సృష్టి ఇది
దీనిలోకి వెలుతురు పుట్టినట్టు పుట్టి
చీకటి పుట్టినట్టు వెళ్లిపోతావు
లేదా, నీలో ఇది చీకటి పుట్టినట్టు పుట్టి
వెలుతురు పుట్టినట్టు వెళ్ళిపోతుంది

వెలుగునీడల మసకచీకట్ల మాయాజాలంలో
నిజంగా ఉన్నదేమిటో, నిజంగా లేనిదేమిటో
నిజం కాకున్నా ఉండీ, లేనట్లున్నదేమిటో
ఎప్పటికైనా తెలుసుకోగలవా, ఊహించగలవా

కవిత : ఏ తలుపులు


ఎటునుండి జీవితపు తలుపులు తెరిచిఇక్కడికి వచ్చావు నువ్వు
ఏ ఆసక్తి నీ చుట్టూ ఇంత ప్రపంచాన్ని పరిచింది
వెనుతిరిగి వెళ్ళేదారి మరిచిన
నీ కలలోని నీలా ఒకటే బెంగతో
నీ దేహం గాలిపటంలా ఊగుతుంది

తూర్పురేఖపై మరోసారి వెలుతురు మ్రోగుతుంది
నిద్రలే, త్వరత్వరగా జీవించుదా మని
నీ చుట్టూ మనుషులు తొందరపెడతారు
ఆలోచనల సాలెగూళ్ల లోంచి
ముఖాలు బయటపెట్టి పలకరిస్తారు
నవ్వు ఒకటుందని గుర్తు చేసుకొని ప్రదర్శిస్తారు

తేదీలూ, వారాలూ, కాలెండర్లూ మారాయి ఇలానే
ఇదంతా ఏమిటని దిగాలుగా మరోసారి అడుగుతావు
దుప్పటి మడతపెడుతూ అంటావు
అస లిదంతా ఎలా మొదలైందని

ఆ ఎగురుతున్న సీతాకోక
ఎటునించి నీ జీవితంలోకి తలుపులు తెరిచింది
ఈ పచ్చదనంపై మెరిసే మంచుబిందువు
ఎందుకని ఈ పూట పలకరించింది
వాటిలోకి మాయమయే క్షణాల్లో
నీ జీవితానికి ఏ చల్లని చేతులు లేపనం పూస్తున్నాయి

అంతంలేని దిగులు, అంతంలేని అందం
అంతంలేని ప్రేమా, అనాసక్తీ
నీపైన కదిలే వెలుగునీడల ఆటలకి అర్థమేమిటి
అర్థాలన్నీ మాయమయ్యే అగాథమైన నిశ్శబ్దంలోకి
ఏ తలుపులు తెరవాలి, లేదా, మూయాలి

ప్రచురణ : ఫండే . సాక్షి 21.3.2021
  

19 మార్చి 2021

కవిత : ఉత్సాహానికి దూరంగా..

ఉన్నట్లుండి నీ ఉత్సాహం జారిపోతుంది
పూలలోని రంగులు జారిపోయినట్టు
ఇంద్రధనువులోని కాంతి మాయమైనట్లు
మధురమైన భావనేదో మరపులోకి కృంగినట్లు

ఉన్నట్లుండి లోకం చేతులు విడిచి
ఏకాంతంలోకి వెళ్లిపోవాలనిపిస్తుంది
మెలకువలోనే నిద్రపోతున్నంత
ఖాళీగా ఉండిపోవాలనిపిస్తుంది

వాన చివరి చెమ్మగాలివంటి నిర్వేదం
మిణుగురు చుట్టూ ముసిరిన రాత్రిలాంటి నిరాశ
దేనినీ మొదలు పెట్టనీయని, ముగించనీయని
వెలిగీ వెలగని దీపం లాంటి ఒంటరితనం
నిన్ను నీ ప్రక్క లాలనగా కూర్చోబెడతాయి

నీకు నువ్వే స్నేహితుడివి, ప్రియురాలివి అప్పుడు
రేకుల మీది ఉదయపు కాంతిలా, గాలిలా
లాలనగా నిన్ను తాకబోతున్న
ప్రపంచానికి ఎడంగా జరుగుతుంటావు

బహుశా, అప్పుడు
బిడ్డ కోపగించిన తల్లిని దూరం నుండి చూస్తున్నట్టు
జీవితం దూరంగా నిలిచి నిన్ను చూస్తూ వుంటుంది.

22 ఫిబ్రవరి 2021

కవితలు : ఊహ, అనంతంలోకి

ఊహ


ప్రతిదీ నీ ఊహ మాత్రమే అన్నాడు
ఈ నక్షత్రాలు..
అవును
గాలివలయంలాంటి జీవితం..
అవును
ఇక ఏం మాట్లాడాలి నీతో అన్నాను
ఏమీ మాట్లాడలేదు
..
తెల్లవార బోతోంది
మరొక రేయిని జారవిడిచిన లోకం
తేలికగా శూన్యంలో చరిస్తోంది
మాటల వెనుక మాయమైన జీవితం
పాపాయిలా కళ్ళు తెరుస్తోందిఅనంతంలోకి 
 
అనంతంలోకి ప్రవేశించాక
వెనుతిరిగే వీలు లేకుండా
తలుపులు మూసెయ్యాలి​​

అప్పుడుగానీ నీ కర్థం కాదు
తలుపు లనేవి ఎప్పుడూ లేవని
కనుక మూయటమూ లేదని
వెనుతిరగటానికి స్థలమే లేదని

ప్రవేశించటమే లేదు గనుక
అనంతమూ లేదని, అంతమూ లేదని

అవునూ, అర్థమంటే ఏమిటి
నువ్వంటే ఏమిటి


ప్రచురణ : సారంగ 15.2.2021

14 ఫిబ్రవరి 2021

కవిత : కడపటి ఖాళీ నుండి..

వెన్న కరిగి నేయి అయినట్లు
అంధకారం కరిగి కాంతి అయినట్లు
నీ ఉనికి కరిగి జీవిత మౌతావు
దుఃఖం కరిగి ఆనందానివీ
భయం కరిగి ప్రేమవీ
తెలియనిది కరిగి జ్ఞానానివీ అవుతావు

పక్షి ఎగిరిపోయిన ఖాళీలో
పక్షిని కలగన్న ఆకాశం మిగిలే వుంటుంది
పూవు రాలిపోయిన కొమ్మ చివర
పూవుని కలగన్న గాలి వలయాలు తిరుగుతుంది
కల మాయమైన కారు చీకటిని
కలగనేవాడు కౌగలించుకుని నిద్రిస్తాడు

ప్రపంచం చెరిగిపోయిన కడపటిఖాళీని
ఎప్పుడూ, ఎక్కడా లేనిది
ఎన్నడూ విడువక పట్టుకుంటుంది

లేనిదానిని ఉన్నది ప్రేమించినట్లే
ఉన్నదానిని లేనిది పొదువుకొని వుంటుంది
వెలుగూ, చీకటీ అనే పేర్లు తప్ప
ఛాయలు మార్చుకొంటున్న ఆకాశం ఒకటే

ఏవో కాలాల లోపల తడిశాక
ఏవో దేశాల వెంబడి తడుముకొన్నాక
వెర్రిగా ఏడ్చాక, నవ్వాక, ఎదురుచూసాక
నిన్ను నువ్వే లాలనగా ఓదార్చుకొన్నాక
అకస్మాత్తుగా తెలుస్తుంది
ఎప్పుడూ, ఇక్కడే ఇలానే నిండుగా ఉన్నావని


08 ఫిబ్రవరి 2021

కవిత : ఉన్నపళంగా ..

 


కవిత : మిగిలిపోతూ 

 కవిత : కలువరేకులా..


ప్రచురణ : పున్నమి 7.2.2021

కవిత : చూసావా

నన్ను చూసావా లో ఇరుక్కోకు
జీవితం బావుంటుంది అన్నాడతను
పూవుని పూవుకన్నా కోమలంగా
తాకటానికి ప్రయత్నిస్తూ

నేను చూసాను లో కూడానా అన్నాను
గాలికి ఊగుతున్న
పూవు నీడలోకి తప్పిపోవటానికి చూస్తూ

రహస్యం తెలిసింది నీకు అన్నాడు
నీలాకాశపు తెర వెనుకకు తప్పుకొంటూ
ఎండ కాసేటపుడు అన్నీ తెరుచుకుంటాయి
చీకటితో సహా అన్నాను

కీచురాయి పాట ఎత్తుకుంది
కాలం దానిలోకి జలపాతంలా దూకింది