29 జులై 2014

స్వేచ్ఛకి దారులు

1.
ఎంతో తెలుసుకోవాలి, అంతా మరిచిపోవాలి
తెలుసుకొంటున్నపుడు చూపు విశాలమవుతుంది
మరిచిపోతున్నపుడు అది స్వేచ్ఛ పొందుతుంది

విశాలం కావటానికి తెలుసుకోవాలి
మరింత విశాలం కావటానికి మరిచిపోవాలి
తెలుసుకొంటూ, మరిచిపోతూ మరింత స్వేచ్ఛలోకి మేలుకోవాలి

2.
ఎన్ని బంధాలనో  ప్రేమించాలి, అన్నిటినీ విడిచిపెట్టాలి
ప్రేమిస్తున్నపుడు నీ ఉనికి విస్తరిస్తుంది
విడిచిపెట్టినపుడు విశాలమైన వెలితి ఏకాంతయాత్రికుని చేస్తుంది

ఏకాంతంగా ఉండటమంటే స్వేచ్చగా ఉండటం
యాత్రికుడు కావటమంటే జీవించటంలోకి ప్రవేశించటం

3.
జీవితం ఒక బందీ ఆలపించే స్వేచ్ఛాగీతం
అతను ఉండటమే బంధం, అతని చుట్టూవున్న అనంతాకాశమే స్వేచ్ఛ
అతన్ని పక్షిని చేసే మంత్రవిద్య పాట
 
అతను పాడుతూ, పాడుతూ పక్షిలా మారిపోతాడు
పక్షి ఎగురుతూ, ఎగురుతూ అనంతాకాశంలో బిందువై, ఆకాశమై కరిగిపోతుంది

28 జులై 2014

దీపం వెలిగిస్తూ..

1
నిజం, నీ చుట్టూ నవ్వులున్నాయి, నవ్వలేకపోవటముంది
కన్నీరుంది, కన్నీరు ఆవిరైపోవటముంది
కోట్ల జీవుల అలజడులు, ఆనందవిషాదాలు,
భయాలు, బెంగలు, సందేహాలు, సందిగ్దతలున్నాయి

2
నడిసముద్రంలోని ద్వీపంలా
వీటిమధ్య నువు మాత్రమే బతకాల్సిన నీ జీవితముంది
చాతనైనంత నిండుగా బతికిచూపే బాధ్యతవుంది
ఎలా జీవించాలో, ఎలా అవసరంలేదో
మాటకన్నా ముందు పాదాలు నడిచి చూపాల్సివుంది

హుందాగా, బిడియంగా పూలలా వికసించే కోరికలతో
కలలన్నీ కన్నీరై  రాలినా లోటేలేని చిరునవ్వు విసురుతూ
ఏ మరకా తాకలేని జీవనానందంతో, మెరిసే ముఖంతో
కాస్త వినమ్రంగా, మరికాస్త సరదాగా భవితలోకి వెళ్ళటమొకటుంది

3
నేనూ ఎదిరిస్తాను మనుషుల్లోని అమానుషాన్ని
బహుశా మరింత తీవ్రంగా, బలంగా, లోతుగా 
నువు ధనికులని నిందిస్తున్నపుడు వాళ్ళ ధనాన్ని చులకనచేస్తాను
వారి నల్లని విజయాలు జీవితాన్ని కోల్పోయిన ఫలితాలని వ్యాఖ్యానిస్తాను

వాళ్ళు సృష్టించే భయోన్మత్త విపణివీధుల మాయాజాలం నుండి
నా వాళ్ళని వెన్నెల్లోకీ, వేసవిలోకీ, చెట్ల ఋతుగానాల్లోకీ
క్షణక్షణమూ సరికొత్తగా మేలుకొనే ఆకాశం లోకీ, ఆశ్చర్యంలోకీ
ఏకాంతవేళల వికసించే లోతులెరుగని మౌనంలోకీ
ఎవరి దయా అక్కర్లేని పరమనిర్లక్ష్యంలోకీ ప్రశాంతంగా నడిపిస్తాను

నీకూ, నాకూ మధ్య భేదాలన్నీ వట్టి భయాలు కట్టిన తెరలని
అలలునిజం కాదనీ, మనం సముద్రజలమనీ మౌనంగా తెలియచేస్తాను 
ఇందరిలోపలి ఆర్ద్రత నా ఆత్మబంధువని, స్వేచ్ఛ నా నేస్తమని
నిరపేక్షసత్యం నన్ను నడిపించే గురువని నిష్కపటంగా నమ్మిచూపిస్తాను 

4
ఎవరెవరిలోనో నచ్చనిదానిని నిందిస్తూ ద్వేషంతో
నువు జీవితాన్ని చీకటి చేసుకొంటున్నపుడు
అందరిలో ప్రేమించతగిన వెలుతురుని వెదుకుతూ, తాకుతూ
నువు నిందిస్తున్న చీకటిలో దీపం వెలిగించాలని చూస్తాను

18 జులై 2014

పసుపుకాంతి

ఈ పసుపురంగు పూలని చూస్తున్నపుడు
ప్రపంచం కాసేపు మాయమౌతుంది
పుట్టాక మొదటిసారే ఈ రంగుని చూసినట్టు
పసుపుకాంతిలోకి ప్రవేశిస్తాను

‘నువు ప్రపంచంలోకి ఎందుకు వచ్చావో
ఎందుకు గొడవపడతావు
ఇక్కడ నువు చూసేందుకు నేనున్నాను

నదిలోకి పడవ జారినట్టు
ఎక్కడి కిరణమో నీవరకూ, నావరకూ వాలినట్టు
ఫలం నాలుకపై రుచిలా వికసించినట్టు
నాలోకి జారిపో, వాలిపో, వికసించు

ఈ వివశత్వానికి ముందు
నువ్వెవరో, నేనేమిటో ఎందుకు చింతిస్తావు
ఈ రససంయోగం తరువాత
ఏం కావటంలోకి విడిపోతామో, ప్రయాణిస్తామో ఊహిస్తావు

ఈ క్షణంలో మనం ఒకటి కావటంలోనే
పురాతనకాలాల విశ్రాంతి కొలువుతీరింది
ఈ విశ్రాంతిలోనే సమస్తసృష్టీ
నదిలో ప్రతిఫలించే ఆకాశంలా తేలుతూ వుంది’

పసుపుకాంతీ, నేనూ ఒకటైన క్షణాలలో
నక్షత్రాలు నా ప్రక్కగా వెళ్ళిపోతూవుండటం గమనించాను

ఒక గాఢమైన నిశ్శబ్దం
'ఏదీ లేదు, ఊరుకో' అంటూ వుండటం
నేను చివరిసారి విన్నాను

______________________
ప్రచురణ: ఈ మాట  జూలై 2014 

17 జులై 2014

పిల్లలూ క్షమించండి..

పిల్లలూ మమ్మల్ని క్షమించండి

భూమి నుండి వేర్లని వేరు చేసి
మొక్కని మహావృక్షం కమ్మని శాసించినట్టు
జీవనానందం నుండి మీ చూపు తప్పించి
మిమ్మల్ని గొప్పవ్యక్తులు కమ్మని దీవిస్తాం

జీవితమంటే
హృదయం నుండి హృదయానికి
ఆశ్చర్యం నుండి ఆశ్చర్యానికి
కాలం నుండి కాలంలేని చోటుకి వెళ్ళటమని
ఎవరో చెబితే ఇక్కడికి వచ్చారు కాని

జీవితమంటే
అందరికన్నా ముందుండటమనే అగ్నిలోకి దూకటమని
చనిపోయే వరకూ రేపటిలోనే బ్రతకటమని
మాయావస్తుసముదాయాల మధ్య దారితప్పి తిరగటమని
మీ కోమల హృదయాల్లో జీవరసం ఎండిపోయే వరకూ నేర్పి
మీ చూపుల్ని కాగితాలకి ఊడిరాకుండా అతికించి మరీ
యోగ్యతాపత్రాలు బహూకరిస్తాము

పిల్లలూ మమ్మల్ని క్షమించండి

చదువంటే చూడటమనీ, ప్రశ్నించటమనీ, ఊహించటమనీ
చదువంటే ఆటలనీ, పాటలనీ,
పంచుకోవటంలోని పరమానందాన్ని తెలుసుకోవటనీ  
చదువంటే తల్లి మెడను కౌగలించుకొన్నట్టు
జీవితాన్ని కౌగలించుకోవటమెలానో నేర్చుకోవటమనీ
మీలోలోపలి జీవితేచ్చ మీతో గుసగుసలాడి వుండొచ్చుకానీ

చదువంటే తడినేలని ఎడారి చేసి విత్తనాలు నాటడమని,
బెరడై కలకాలం  బతకాలి కాని,
పూలై, పళ్ళై రసమయలోకాల్లోకి పరుగుపెట్టకూడదని
మీకు పట్టిన సంతోషాన్ని మార్కులతో వదిలించి మరీ నేర్పుతాము

పిల్లలూ మమ్మల్ని క్షమించకండి

మీలోంచి దయా, తృప్తీ, రసమూ వడకట్టి
మిమ్మల్ని ఘనపదార్ధంగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతగా 

మీరు డబ్బు యంత్రాలు కండి 
బహుళజాతి విపణివీధుల బానిసలై తరించండి
కాఠిన్యం నిండిన ప్రేమలతో కాలం గడపండి
మమ్మల్ని వృద్దాశ్రమాలకి కానుక చేసి వదిలించుకోండి