27 సెప్టెంబర్ 2020

కవిత : నీటిలాంటి..

ఉన్నది ఉంది, లేనిది లేదు
ఉన్నది లేదు, లేనిది ఉంది
ఉన్నదీ ఉంది, లేనిదీ ఉంది
ఉన్నదీ లేదు, లేనిదీ లేదు

ఇది నీటిలాంటి కవిత
గాలి లాంటి కవిత
ఎలా కావాలంటే అలా వంపు తిరుగుతుంది
మడతలు పడుతుంది, సర్దుకుంటుంది
ఎప్పుడు ఎలా కావాలంటే అలా
మార్చుకొని చదువుకోవచ్చు

అవి ఉత్త పదాలనుకొంటే
పదాల్లోకి దారి తప్పుతావు
భావాలనుకుంటే భావాల్లోకీ
అనుభవమనుకుంటే అనుభవంలోకీ తప్పిపోతావు

నీకిప్పుడు కావలసింది
పూలు రాల్చిన కొమ్మలానో
ఆకులు రాల్చిన చెట్టులానో ఉండటం కాదు
చెట్టుని రాల్చిన ఆకాశంలా ఉండటం
ఆకాశాన్ని రాల్చిన అనంతమై పోవటం

ఉన్నావా, లేవా
ఈ పదాలతో మరో కవిత రాస్తున్నావా
ఎవరో తలుపు తట్టినట్టు
ఏదో నీ నిద్రని తట్టిన చప్పుడయితే చెప్పు

ప్రచురణ : సారంగ 15.9.20 

కవిత : చిన్ని జీవితాన్ని

ఒక చిన్ని జీవితాన్ని జీవించి వెళతావు
కాఫీ రుచిచూసిన దానికన్నా చిన్నది
పక్షి కూత కన్నా, చినుకు రాలటం కన్నా
సూదిమొన కన్నా చిన్న జీవితం

పసిపాప నవ్వుకన్నా తేలికైన జీవితం
ప్రియురాలి చూపుకన్నా హాయిగొలిపే జీవితం

మరణిస్తానన్న భయం తప్ప
నీ జీవితాన్ని పెద్దది చేస్తున్న
విషయమేదీ ఇక్కడ లేదు

మాయమౌతానన్న బెంగ తప్ప
ఈ జీవితాన్ని భారం చేసేంత
సారమేమీ ఇక్కడ లేదు

తెలియకపోవటమనే ఆకాశంలో
తెలియటం ఒక మేఘంలా కదిలి వెళుతుంది
లేకపోవటమనే అనంతంలో
జీవించటం ఒక కలలా కరిగిపోతుంది

పనిలేక గాలికి తిరిగినట్టు
పనిలేక జీవించి వెళ్లిపోవటం బావుంటుంది

ఎందుకు బ్రతికావని
ఎవరూ అడగకూడ దనుకొన్నట్టే
ఎందుకు వెళ్లిపోయావని కూడా
ఎవరూ అడగకూడ దనిపిస్తే
జీవితానికి పరమగౌరవంతో నమస్కరిస్తావు

బహుశా, అప్పుడు
జీవితం కూడా నిన్ను
మహాప్రేమతో గాఢంగా హత్తుకొంటుంది

ప్రచురణ :

వివిధ ఆంధ్రజ్యోతి దినపత్రిక 21.9.20

20 సెప్టెంబర్ 2020

వాన కురిసింది, వీడియో: కొండేపూడి నిర్మల

బివివి ప్రసాద్ 'వాన కురిసింది' కవిత

కొండేపూడి నిర్మల గారి స్వరంలో, దృశ్య సమ్మేళనం తో చూడండి.

ఇక్కడ క్లిక్ చేయండి.

15 సెప్టెంబర్ 2020

సాహిత్య అకాడెమీ 'కవిసంధి'లో..

సాహిత్య అకాడెమీ వారి వెబ్ లైన్ సిరీస్ లో భాగంగా కవిసంధి ప్రోగ్రామ్ లో బివివి ప్రసాద్ కవితాపఠనం వీడియో లింక్ ఇది. 

ఆసక్తి ఉన్నవాళ్లు వినండి. ఇక్కడ క్లిక్ చేయండి 

Please listen to BVV Prasad poetry in Sahitya Akademi Kavisandhi program. Please click here.