వ్యాసాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యాసాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21 సెప్టెంబర్ 2026

నాలోంచి పలికే వాక్యం దొరికింది : బివివి ప్రసాద్

 1966లో మధ్యతరగతి వ్యవసాయకుటుంబంలో తణుకు ప్రాంతంలో పుట్టాను. ఊహ తెలిసేసరికి మాతామహుల ఉమ్మడి కుటుంబంలో సూర్యారావుపాలెంలో ఉన్నాను. అయిదారేళ్ల వయసులో నాన్న ఉద్యోగం చేస్తున్న చాగల్లు చేరాను. పన్నెండేళ్లపుడు కుటుంబం తణుకు చేరాము. నాన్న కోళ్ళమందుల వ్యాపారం ప్రారంభించారు. పల్లె నుండి గ్రామానికి, అటునుండి పట్టణానికి చేరే క్రమంలో; బాల్యం నుండి కౌమారానికి, అటునుండి యవ్వనానికి చేరే క్రమంలో నాకు నేను దూరమవుతున్న ఒంటరితనమేదో పెరుగుతూ ఉండేది.

పదేళ్ళవయసునుండి చదవటం ఇష్టంగా ఉండేది. టెన్త్ పూర్తయేనాటికి సీరియస్ సాహిత్యంలోకి వెళ్ళాను. శరత్ మొదలు టాల్ స్టాయ్ వరకూ చదువుకుంటున్న దశలో, ఇంటర్ లో, చదవటానికి ఏమంత ఆసక్తి లేని కవిత్వం రాయటం మొదలుపెట్టాను. ఏదో ఒక ఉద్వేగం, మెరిసే ఆలోచన తోచాక, రాసేవరకూ మనసు నిలిచేది కాదు. ఇంటర్ తెలుగు లెక్చరర్ జీయస్వీగారి సలహాపై మహాప్రస్థానం చదివాను. ముందుమాట రాసిన చలం మరింత ఆకర్షించారు. ఒకవైపు చలం, మరోవైపు కమ్యూనిస్టు సాహిత్యంతో ఆ రోజులు ఆదర్శాల ఉద్వేగాల్తో వెలుగుతున్నట్లుండేవి. కానీ, పంచుకొనే తోడెవరూ ఉండేవారు కారు.  

కొన్నాళ్ళకి, బాహ్య విషయాల ఉద్వేగాల కన్నా లోతుగా హృదయంలో నిలవనీయని వెలితి ఏదో తోచింది. జిడ్డు కృష్ణమూర్తి జీవనవ్యాఖ్యలు దొరికింది. బావున్నట్టు అనిపించింది. అనేక సందిగ్ధతలతో ఉండగా, డిగ్రీ చివర్లో, చలం రాసిన భగవాన్ స్మృతులు దొరికింది. శ్రీ రమణమహర్షి తీవ్రంగా ఆకర్షించారు. నేనెవరో తెలిస్తే ఇన్ని దుఃఖాలనుండి విముక్తి అని లోతుగా, బలంగా తోచింది. పెనుగులాట మొదలైంది. అదేమీ తేలిక విషయం కాదని, లోకం పట్టు గొప్పదని, దీనిని తప్పుకోవడం చిన్న విషయం కాదని, ఇప్పటికీ అనిపిస్తూ ఉన్నా, ఈ వెదుకులాటతో పోలిస్తే మిగిలినవి ఏమంత కాంతిగా తోచవు. లోచూపు పెరిగేకొద్దీ విస్తృతి, వైవిధ్యాలపై ఆసక్తి తగ్గింది., చదువుపై కూడా. లోతులోకి, సారంలోకి చూడటం ఒకటే ఆకర్షణగా మిగిలింది. 

భగవాన్ బోధన, టాగోర్ కవిత్వ ప్రభావాలతో రాసుకున్న కవితలతో తొలిసంపుటి ఆరాధన 89లో వచ్చింది. ఆరాధన వలన చిక్కాల కృష్ణారావు గారి ద్వారా ఆలపాటి రాంబాబు పరిచయమయ్యారు. అనేక సాయంకాలాలు, రాత్రులు ఆయనతో, జీయస్వీ, సక్సేనారాజుగార్లతో తాత్విక చర్చలలో గడిచాయి, 18లో ఆయన కాలం చేసేవరకూ.

94లో కొప్పర్తి తణుకు చేరారు. ఆయన స్నేహంతో ఆధునిక తెలుగు కవిత్వలోకం విస్తృతంగా పరిచయమైంది. ఈ సమయంలోనే, సంజీవదేవ్ వ్యాసాల్లో హైకూ గురించి చదివి, ఇస్మాయిల్ గారికి నా తొలి హైకూలు చూపించటమూ, తర్వాత ఆయన రాసిన హైకూలతో ఒక్కసారిగా హైకూకి తెలుగునాట గుర్తింపు రావటమూ జరిగాయి. కొప్పర్తిగారి సహాయంతో ఎడిటింగ్ చేసి, తొలి హైకూ సంపుటి దృశ్యాదృశ్యం 95లో తెచ్చాము. తణుకులో చేరా, ఇస్మాయిల్, కె.రామ్మోహన్ రాయ్ లతో ఆవిష్కరణసభ జరిపాము. 97లో హైకూ, 99లో పూలు రాలాయి హైకూ సంపుటాలు వచ్చాయి. పూలురాలాయి నాటికి, కంజిరలో నాసరరెడ్డి అనువదించిన జపనీయ హైకూల స్థాయిలో రాయగలిగాననిపించింది. 

తర్వాత సుమారు దశాబ్దంపాటు జీవితపు వత్తిడులతో నిశ్శబ్దకాలం. ఆ కాలంలో మూడేళ్ళు ఒక స్కూల్ నడిపాను. 2006లో అప్పటికి రాసిన వచనకవిత్వంతో నేనే ఈ క్షణం సంపుటి తెచ్చాను. నాదైన శైలి కోసం, వస్తువు కోసం తపన పడటం ఈ సంపుటిలో కనిపిస్తుంది.
 
2010లో నిసర్గదత్త సంభాషణలు చదువుకున్నాక, లోపలంతా గొప్ప శక్తి, కాంతి నిండినట్లు ఉండేది. మళ్ళీ కవిత్వం తెరుచుకుంది. ఊహలు, వాక్యాలు ప్రవహించటం మొదలైంది. 2011లో ఆకాశం వచ్చింది. పూర్తిగా నాలోంచి పలికే వాక్యం దొరికింది. 15లో నీలో కొన్నిసార్లు వచ్చింది. 21లో నాన్న కాలం చేశాక, వ్యాపార, కుటుంబ బాధ్యతలతో కవిత్వసృజన నెమ్మదించింది. 23లో ఊరికే జీవితమై ప్రచురించాక, ఇక కవిత్వం సరిపెడదామనుకున్నాను. మళ్లీ, ఏకాంతపు రాత్రులలో కవిత్వం పుష్పించింది. 25లో సృష్టి వచ్చింది.

ఈ క్రమంలో గ్రహించింది ఏమంటే, రాసేది ఏమైనా కానీ, హృదయం నుండి పలికితేనే హృదయాన్ని చేరుతుందని.
హృదయం నుండి జీవిస్తేనే హృదయం నుండి రాయగలమని. ఈ దశకి చేరాక పలికితే రాయని సందర్భాలున్నాయి గానీ, బలవంతంగా రాసింది లేదు. మొత్తంగా ఇప్పటికి మూడు హైకూ, ఆరు వచన కవితా సంపుటాలు వచ్చాయి.

బివివి కవితలన్నీ ఒకలానే ఉంటాయి అనేవారున్నట్లే, ఒకలా కనబడుతూ, అనేక ఛాయలు, గాఢతలు చూపుతాయని ప్రేమించేవారున్నారు. అర్థంకావనేవారిలానే, శాంతినీ, ఊరటనీ ఇస్తాయనేవారున్నారు. ప్రక్కనపెట్టిన వారిలానే, తరచూ ఒకటి, రెండు కవితలో, హైకూలో చదువుకొనే, తలచుకొనేవారున్నారు. రచనలు ఆసక్తి ఉన్నవారికి అందుబాటులో ఉండాలని bvvprasad.blogspot.com లో ఉంచాను.

ప్రచురణ : నేను - నా సాహితీ యాత్ర సిరీస్. 30.

https://epaper.manatelangana.news/reader/4201223/HYDERABAD/21-09-2026/page/4/2/rw





26 ఏప్రిల్ 2026

వ్యాసం : అనుభవ కవిత్వం

1
అనుభూతి కవిత్వం గురించి మీరు మాట్లాడాలి అన్నారు మిత్రులు చక్రధర్. నాకు ప్రసంగాలు చేయటం రాదు. పుస్తకాలు చదవటం మానేసి చాలా కాలమైంది. కనక నేనేమీ మాట్లాడలేనన్నాను. అని ఊరుకుంటే బావుండేది. కవిత్వం ఏదైనా అనుభూతే. కనక, అనుభూతి కవిత్వం అనే మాట సరైనది కాదు, దానికన్నా అనుభవ కవిత్వం అనటం సరైనది అన్నాను, ఇస్మాయిల్ గారు కూడా ఆ లేబిల్ ఒప్పుకోలేదు అని కూడా అన్నాను. మీడియావాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలన్నది అనుభవంలో లేక తొందరపడ్డాను. అయితే అనుభవ కవిత్వం మీద మీరు మాట్లాడుతున్నారు అన్నాడు.

సీరియస్ గా సాహిత్యం చదువుకుని రెండు దశాబ్దాలు దాటింది. ఎప్పుడైనా ఒకటీ, అరా పుస్తకాలు మినహా ఎలాంటి చదువూ లేని, ఈ మిత్రుని మాటలు మిత్రులు సీరియస్ గా తీసుకోనవసరం ఉండకపోవచ్చని ముందుగా సూచిస్తున్నాను.

చదవకుండా ఇంత కవిత్వం ఎలా రాస్తున్నారు, మీరు ఏదో చదువుతున్నారు అన్నారు చక్రధర్. అవును, చదువుతున్నాను. నా అస్తిత్వాన్నీ, నా అస్తిత్వం చుట్టూ విస్తరించిన అనంతమైన అస్తిత్వాలనీ, విశ్వం నాలోకి ప్రసరిస్తున్న ప్రతిఫలనాలనీ చేతనైనంత శ్రద్ధగా చదువుకుంటున్నాను. నా జీవితానుభవాన్ని వీలైనంత దగ్గరగా చదువుతూ, కదిలే సమస్తం వెనుక కదలని మూల ద్రవ్యం ఏదన్నా వెండితెరలా ఉందా అని వెదుకుతున్నాను. 

2
ఈ మౌలికమైన వెదుకులాట ఆధారంగా కవిత్వం ఏమై ఉంటుంది అని ఆలోచించినప్పుడు, కవిత్వం ప్రధానంగా మూడు శక్తుల కలయికగా తోస్తుంది. అవి ఆలోచన, ఉద్వేగం, అనుభూతి. ఒక వస్తువుకి సంబంధించిన సమాచారాన్ని ఆలోచన అనవచ్చును. ఉదాహరణకు అది మామిడిపండు అని తెలియటం ఆలోచన. ఆ వస్తువుతో సంబంధం కోసం మనస్సులో కలిగే చలనాన్ని ఉద్వేగం అనవచ్చును. మామిడిపండు తినాలి అనిపించటం ఉద్వేగం. వస్తువుతో సంబంధం ఏర్పడినపుడు మనసులో కలిగే సంవేదనను అనుభూతి లేదా అనుభవం అనవచ్చును. మామిడిపండు రుచి చూస్తున్నపుడు కలిగేది అనుభూతి లేదా అనుభవం. 

అయితే, అనుభూతి, అనుభవం ఒకటేనా అని అంటే, ఒకలానే కనిపిస్తాయి కానీ, కొంత సూక్ష్మమైన భేదం ఉన్నట్లు తోస్తుంది. అనుభూతిలో కొంత ఉద్వేగం పాలు కూడా ఉంటుంది. ఉద్వేగమూ, అనుభవమూ కలగలిసిన ఒకానొక చలనాన్ని అనుభూతి అనవచ్చును అనుకుంటాను. అనుభవంలో ఉద్వేగ సంబంధంలేని శుద్ధ సంవేదన మాత్రమే ఉంటుంది అనిపిస్తుంది. ఇస్మాయిల్ గారు ఏమన్నారని మళ్ళీ చదివి చూస్తే, ఆయన రెండిటినీ సమానంగానే చూసినట్లు కనిపించింది. అయితే పైన చెప్పిన సూక్ష్మ భేదం జోలికి పోనట్లయితే, అనుభూతి కవిత్వంగా స్థిరపడ్డ అభిప్రాయాన్ని కూడా కాదనలేము.  

3
ఇక ఒక కవితలో మూడు శక్తులూ ఉన్నట్లయితే, కవిత్వాన్ని ఆలోచనాత్మక, ఉద్వేగపూరిత, అనుభూతి కవిత్వాలని మూడు పాయలుగా చూడటం ఎలా కుదురుతుంది అన్నపుడు, దాని జవాబు తేలికగానే తడుతుంది. 

ఒక బలమైన లేదా సాంద్రమైన కవితలో మూడు శక్తులూ ఉన్నప్పటికీ, ఆ శక్తుల ప్రాధాన్యతను బట్టి, శాతాన్ని బట్టి వాటిని ఆలోచన, ఉద్వేగ, అనుభూతి కవితలుగా మనం గుర్తించవచ్చును. 

గురజాడ రాసిన 'మంచి, చెడ్డలు ఎంచి చూడగ రెండె కులముల లోకమందున, మంచి యన్నది మాల యైతే మాల నేనౌతాను' అన్న వాక్యాలు గానీ, బసవరాజు అప్పారావు రాసిన ' ప్రేమించు సుఖముకై, ప్రేమించు ముక్తికై, ప్రేమించు ప్రేమకై, ఏమింక వలయురా ' అన్న వాక్యాలు గానీ, ఆలోచన ప్రధానమైన కవిత్వంగా మనకి తోస్తాయి. 

టాగోర్  ' నక్షత్రాలన్నింటితో ఆకాశము, అంతులేని ఐశ్వర్యాలతో ప్రపంచమూ అన్నీ నాకు ఉన్నా నేనింకా కావాలని అడుగుతాను, కానీ ఈ ప్రపంచంలో మరీ మూల కాస్త చోటుంటే చాలు, ఆమె  నాదైతే ' అన్నపుడు మనకి ఒక కవి శుద్ధ ఉద్వేగంతో చలించటం కనిపిస్తుంది. 
ఎంకెవ్వరని లోకమెపుడైన అడిగితే, వెలుగునీడల వైపు వేలు చూపింతు అన్న నండూరి మాటలు కూడా నిండైన ఉద్వేగం నుండి ఉబికి వచ్చినట్లు కనిపిస్తాయి.

ఇక ఇస్మాయిల్ గారు రాసిన ' తరుచాపము వీడి దివిని గురి మరచిన బాణంలా తిరుగాడును పిట్ట ' అన్న వాక్యాలు కానీ, ' అంతా తెల్లకాగితం, ఒక మూలన నిలువుగా ఒక గీత, అడ్డంగా ఒకటి. తెరచాప ఎత్తిన పడవ. కిందిది నదీ, పైది ఆకాశమూ కావచ్చును ' అన్న వాక్యాలు కానీ చదివినపుడు, ఆలోచన, అనుభూతీ చెరిగిపోయి, కవి అనుభవించిన శుద్ధ ఇంద్రియానుభవం మనకి బదిలీ అవుతుంది.  

4
కవిత్వం ఏదైనా, కవి తనని వ్యక్తీకరించుకోవటానికీ, తనకి ఒక ఔట్ లెట్ గానూ భావించి, బలమైన వత్తిడి నుండి రాసినపుడు సాంద్రమైన అభివ్యక్తులు ప్రకటమవుతాయి.  అయితే ఈ ప్రకటమయ్యే క్రమంలో కవి తన పాఠకునికి ఇవ్వదలచిన అనుభవంలో స్పష్టత ఉన్నపుడు ఆయా కవులు బలమైన ఆలోచననో, ఉద్వేగాన్నో, అనుభవాన్నో ఇవ్వగలుగుతారు. 

వీటిలో ఆలోచనాత్మక కవిత్వం ఆలోచనల విస్తృతి పెంచితే, ఉద్వేగ కవిత్వం పాఠకుని ఉద్వేగాలను బలమైనవిగా తయారు చేస్తుంది. అనుభవ కవిత్వం వీటికి భిన్నంగా మనిషిని ఆలోచనల నుండీ, ఉద్వేగాల నుండీ ఉపశమింపచేసి, తన నిజమైన, సాత్వికమైన అస్తిత్వంలోకి మేలుకోలుపుతుంది. దేని ప్రయోజనం దానికి ఉంటూనే, మూడు పాయలూ కూడా చైతన్య పరిధిని విస్తరింప చేసేవి గా, పరస్పర పూరకాలుగా కూడా ఉంటాయి. 

మనం మన మానసిక స్థితిని బట్టి, అవగాహనని బట్టి, అవసరాన్ని బట్టి ఆయా కవిత్వాలని ప్రేమిస్తాము.

( మిత్రులు ముక్కామల చక్రధర్  ఏప్రిల్ 25, 26 తేదీలలో చిత్ఫలపాలెం లో నిర్వహించిన గోదావరి కోనసీమ సాహితీ సమాలోచన కోసం రాసుకున్న ప్రసంగ పాఠం. )

బివివి ప్రసాద్
22.4.26










14 ఏప్రిల్ 2026

ఒక దృక్పథం నుండి ప్రేమ, స్నేహం, ఆకర్షణ:

ఒక దృక్పథం నుండి ప్రేమ, స్నేహం, ఆకర్షణ:

తానూ, నేనూ ఒకటే అనిపించటం ప్రేమ,
తానూ, నేనూ ఒకలాంటివాళ్ళం అనిపించటం స్నేహం,
తాను నాకు కావాలి అనిపించటం ఆకర్షణ

ప్రేమలో అహంకారాలు కరిగిపోయి, సన్నిధి మాత్రమే మిగులుతుంది. తాను నా సమీపంలో ఉంటే చాలనిపిస్తుంది. దూరంగా ఉన్నా తనతోనే ఉన్నట్లనిపిస్తుంది. 

స్నేహంలో అహంకారాలు వెలుగునీడల్లా దోబూచులాడతాయి. కొంత ప్రేమ వెలుతురు ప్రసరించినా, కొంత ఆకర్షణ ఉన్నా, తాము సములం అనిపిస్తుందే గానీ, తానే నేను అనిపించకపోవచ్చు.

ఆకర్షణ (మోహం, ముదిరితే కామం) లో అహంకారాలు బలపడతాయి. తాను నాకే దక్కాలి అనిపిస్తుంది. దక్కకపోతే తనని నశింపచేయాలని కూడా. నాకు పూర్తిగా లొంగి, నా మనో, దేహాలకి కావలసిన అనుభవాలు ఇస్తూ ఉండాలి అనిపిస్తుంది.

ప్రేమలో కొంత స్నేహం, కొంత ఆకర్షణ ఉంటాయి.
స్నేహంలో కొంత ప్రేమ, కొంత ఆకర్షణ ఉంటాయి. 
ఉత్త ఆకర్షణలో ప్రేమ, స్నేహం ఉన్నట్లు కనిపిస్తాయి కానీ ఉండవు. ఉండలేవు. 

బివివి ప్రసాద్

11 మార్చి 2026

ఫోన్ కాల్ అను పర్సనల్ స్పేస్ లేదా నిశ్శబ్దం కథ

 ఫోన్ కాల్ అను పర్సనల్ స్పేస్ లేదా నిశ్శబ్దం కథ

ఫోన్ కాల్ మాట్లాడటమంటే తలమీద రాయిపెట్టినట్లు ఉంటుంది. ఫోన్ సంభాషణలో నిశ్శబ్దానికి అవకాశం ఉండదు. పర్సనల్ స్పేస్ వీలుకాదు. అవతలి మాట ఆగగానే అందుకోవాలి. ఒకోసారి అవతలివాళ్లు కాల్ చేసి, ఏమిటి కబుర్లు అన్నారా రాయి మరింత బరువెక్కుతుంది. ఊరికే వినమంటే, పోనీలే అని వినిపెట్టవచ్చు. ఎక్కువగా ఊ కొట్టినా తప్పే.. స్పందించాలి. ఆ సమయానికి మనం ఏ మూడ్ లో ఉన్నామో, పనిలో ఉన్నామో, వత్తిడిలో ఉన్నామో, ఏ ఆలోచనల్లో, ఊహల్లో దారులు వెదుకుతూ ఉన్నామో అవతలివారికి సంబంధం ఉండదు. 

ఒక బాల్యమిత్రుడు కాల్ చేసి, చెప్పరా అని మొదలు పెట్టేవాడు. నువు కాల్ చేస్తావని, కబుర్లు పోగేసుకుని, ఏ పనీ లేకుండా, ఎదురుచూస్తున్నారా.. అనేవాడిని.. వాడు గనక ఆ మాత్రం స్వేచ్చ ఉండేది.. మరొకరైతే.. కనక, ఫోన్ కాల్ రాగానే, పులిబోను గేటు తెరిచి పట్టుకున్నట్టు, నన్ను లోనికి రమ్మన్నట్టు ఉంటుంది. 

కనకనే, ఫోన్ కాల్స్ చేయను, ఎవరన్నా చేసినా ఇబ్బందిపడతాను. ఫోన్లలో హాయిగా కబుర్లు చెప్పుకొనేవాళ్ళని చూస్తే ఆశ్చర్యం. ఇన్ని కబుర్లు కామా లేకుండా ఎలా పొంగుకువస్తాయా అని. నా వరకూ ఫోన్ కాల్ షెడ్యూల్స్ చెప్పుకోవటానికి, పనుల పురమాయింపులకి. కాల్ రెండు నిముషాలు దాటకుండా పూర్తవుతుంది. అరుదుగా కొందరు హృదయానికి దగ్గర వారు చేస్తే బాగానే ఉంటుంది. వాళ్ళైనా నువు మాట్లాడు అనకపోతేనే. వాళ్ళు చెప్పేది ఆసక్తిగా వినటం వరకే. 

టెక్స్ట్, వీడియో కాల్స్ నా పాలిటి వరాల్లా వచ్చాయి. టెక్స్ట్ లో స్పేస్ ఉంటుంది, అవతలి వాళ్ళు మాట్లాడాక మనం ఎప్పుడైనా చదివి, ఎప్పుడైనా జవాబు ఇవ్వవచ్చు. మనం మాట్లాడితే అవతలి వాళ్ళు కూడా అంతే. అంటే, సంభాషణ నిండా స్వేచ్ఛ పరుచుకుని ఉంటుంది. స్వేచ్ఛ ముఖ్యం కదా.

వీడియో కాల్ మనుషులు దూరంగా ఉన్న బెంగ పోగొడుతుంది, చూడవచ్చు. వెంటవెంటనే మాట్లాడనక్కరలేదు. మనం ఎలా, ఏ పరిస్థితిలో ఉన్నామో అవతలివారికి, అలానే వారి గురించి మనకి తెలుస్తూ ఉంటుంది. మాటల్లేని సంభాషణ కొనసాగుతుంది. ముఖ్యం కళ్ళు మాట్లాడుకుంటాయి, చిరునవ్వులు మాట్లాడుకుంటాయి, ముఖాల్లోని వెలుగునీడలు మాట్లాడుకుంటాయి. మాటల అవసరం వెనుకబడుతుంది. కనిపిస్తూ ఉంటారు గనక, అవతలివారి నిశ్శబ్దంలోకి మాటలతో దూరిపోవాల్సిన పని ఉండదు.

మనుషుల్ని సరాసరి కలవటం ఇష్టం. గుంపులుగా కాదు. మహా అయితే నలుగురైదుగురి వరకూ. ఆ సంఖ్యదాటితే చిరునవ్వుకు పరిమితమైన ప్రేక్షకుడి పాత్రలోకి జారిపోతాను. కలిసి మాట్లాడటం కన్నా, ఊరికే నిశ్శబ్దంలోకి కలిసి ప్రయాణించటం మరీ ఇష్టం. ఎవరిమీదనైనా ఎక్కువ ఆత్మీయత కలిగినప్పుడు వారితో కలిసి నెమ్మదిగా, నిశ్శబ్దంగా, ఏ లోతైన, గంభీరమైన విషయం పైనో హృదయం విప్పుకొని మాట్లాడుకోవాలని ఉంటుంది. ఒకానొక కాలంలో అలాంటి ఒకానొక మిత్రుడితో గడపగలిగాను కొన్నేళ్లపాటు.

లోకం ఎలా ఉందో తెలీదు గానీ, నా వరకూ, పర్సనల్ స్పేస్ లేని, తగినంత నిశ్శబ్దం లేని మానవ సంబంధాలు చాలా వరకూ మొరటుగా, కృతకంగా తోస్తున్నాయి. ఇటీవల మరింతగా. ఒకరి స్వేచ్ఛని ఒకరు గౌరవించే, ఒకరి స్థలాన్ని ఒకరు గౌరవించే, ఒకరి నిశ్శబ్ద భాషణని ఒకరు గ్రహించే సున్నితమైన సమాజాన్ని కలగంటూ, మనుషులకి దూరం అవుతున్నానేమో కూడా తెలీదు. కానీ, నా స్పేస్ లో, ఏకాంతంలో నేను నిండే కొద్దీ, మనుషులూ, జీవితమూ ఇంకా లోతుగా తెలుస్తూ, ప్రేమాస్పదంగా మారుతూ ఉండటం గమనిస్తున్నాను.

బివివి ప్రసాద్
11.3.26 6.15 సాయంత్రం

17 ఫిబ్రవరి 2025

వ్యాసం : నా మొదటి పుస్తకం

' ప్రభూ! నిన్ను సేవించుదామని ఎన్నో సుందరపుష్పాలు ఏరి తెచ్చాను. తుదకు వాటి సౌందర్యంపై మోహంతో నిన్నే విస్మరించాను ' చలం అనువదించిన టాగోర్ కవిత్వం చదువుకున్నాక రాసుకున్న వాక్యాలివి. 

కవిత్వం పలికితే రాయటమే గానీ, పనిగట్టుకు రాయటం లేదు. ఇంటర్ చదివే రోజుల్లో సహజంగా ఉండే ఉద్రేకాలతో పాటు, శ్రీశ్రీ, సామ్యవాద సాహిత్యాల ప్రభావంతో సమాజాన్ని మార్చాలనే ఆవేశంతో రాస్తున్న కవితలు, టాగోర్ ని చదివాక ఆగిపోయినట్టున్నాయి. బయటి చూపు లోపలికి మళ్ళాక, మారాల్సింది నేను అనిపించాక, రాసుకొనే కవిత్వం మారింది. దైవం, ప్రకృతి, మృత్యువు, ప్రేమ వంటి ఉదాత్తభావాలు కవితా వస్తువులయాయి.
 
డిగ్రీ చివర్లో, 86లో చలం రాసిన భగవాన్ స్మృతులు దొరికింది. ఒక ఆధ్యాత్మిక గురువు అత్యంత సరళంగా, సహజంగా, సూటిగా, దయగా ఉండటం గమనించి శ్రీ రమణమహర్షి పట్ల గురుభావం కలిగింది. వారి సహేతుకమైన బోధ ' నిన్ను నీవు తెలుసుకో ' జీవిత లక్ష్యమైంది. ఆ తర్వాత వచ్చిన కవితలని, ఇంటర్ లోని తెలుగు మాష్టారు జీయస్వీ నరసింహారావుగారికి చూపిస్తే, చాలా బాగా రాస్తున్నావన్నారు. 89లో వీటిని పుస్తకంగా తీసుకురావాలనిపించింది.
 
మా ఊరు తణుకులో సాహిత్య వాతావరణం చైతన్యవంతంగానే ఉండేది. నన్నయ్య భట్టారక పీఠం, రీడర్స్ ఫోరం సాహిత్య సభలు జరిపేవి. అయితే, స్వతహాగా ఉన్న బిడియం వల్ల ఎవరినీ కలవటం జరగలేదు.

సంస్కృతాంధ్రాల్లో పండితులు చెరువు సత్యనారాయణశాస్త్రిగారి దగ్గర కూర్చుని ఎడిట్ చేద్దాం అన్నారు జీయస్వీగారు. ఎడిటింగ్ కి ముందు కొన్ని చిత్రమైన ప్రశ్నలు అడిగారు శాస్త్రిగారు. రైలు ఎక్కటానికి స్టేషన్ కి టైముకి వెళతావా, ముందుగానా వంటివి. జవాబులు విని, నీ సాహిత్యం ప్రసిద్ధి పొందుతుంది వంటి మాటేదో అన్నారు. ఎడిటింగ్ జరిగింది. నేను చదవటం, వారిద్దరూ విని, సరిచేయటం. ముందుమాట అడిగితే రాసుకోమని, చెప్పుకుంటూ వెళ్ళారు శాస్త్రిగారు. ఆరాధన టైటిల్ నేననుకున్నానో, వారు చెప్పారో గుర్తులేదు. ఆరాధన భగవాన్ కి అంకితమైంది. 

మా ఊరిలోనే రవి ప్రింటర్స్ లో పుస్తకం అచ్చుకి ఇచ్చాను. కవర్ పై నా ఫోటో వేసుకోవాలనే ఆలోచన అప్పటికే ఉన్నట్టుంది. పాలంగిలోని రాయల్ ఆర్ట్స్ దగ్గరికి వెళ్ళి, ఫోటో ఇచ్చి, బొమ్మ గీయించాము. 89 చివర్లో పుస్తకం వచ్చింది. ఆవిష్కరణ సభ తలపెట్టలేదు. తొలికాపీ దేవుడి దగ్గర పెట్టి ఉంటాను. లేదా తల్లిదండ్రులకి ఇచ్చి వుంటాను. కొన్ని పత్రికలకి సమీక్షలకి పంపి ఊరుకున్నాను. 

తర్వాత చలంగారి సన్నిహితులు చిక్కాల కృష్ణారావుగారికి పంపిస్తే, వారంలో ఉత్తరం వచ్చింది. మరునాడు ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారు కృష్ణారావుగారు చెప్పారంటూ. ఆలపాటి రాంబాబుగారు, పుల్లేశ్వరరావుగారు. 2018లో వెళ్ళిపోయేవరకూ, సుమారు మూడు దశాబ్దాలు లోపలి అన్వేషణలో సహచరుడిగా, సంక్లిష్ట సమయాల్లో ఆప్తుడిగా ఉన్నారు రాంబాబుగారు. 

తర్వాత రోజుల్లో చిరునామాలు దొరికిన ప్రముఖులకి పుస్తకాలు పంపించాను. మీవి మాటలతో వ్రాయబడినప్పటికీ, మాటలను దాటి వెళ్ళిపోయాయి, సంవేదనా జగత్తును వదిలి, శుద్ధవేదనా జగత్తుకన్నారు సంజీవదేవ్. కవి తన్ను తాను వెదుక్కునే ప్రయత్నంలోనే కవిత్వం పుడుతుంది. అందుకనే నిజమైన, స్వచ్చమైన కవిత్వం రాయగలిగారన్నారు ఇస్మాయిల్. పట్టుపురుగులోంచి పట్టు వచ్చినట్లు, మీలోంచి కవిత్వం నిర్గతమవుతోందన్నారు శేషేంద్ర. 

2017లో ఆరాధన మూల కవితలు చదివితే, ఎడిటెడ్ కన్నా అవే మరింత సహజంగా తోచాయి. వాటినే కాలక్రమంలో కూర్చి, ఆరాధన రెండో ప్రతి తయారు చేసి ఆన్లైన్ లో ఉంచాను. కవర్ పై సవరించిన ప్రతి అని రాశాను గానీ, నిజానికి సవరించని ప్రతి అని రాయాలి. 

94లో తణుకు వచ్చి, నన్ను వెదికి పట్టుకున్న కొప్పర్తి గారి స్నేహం తర్వాత, 95 లో నా తొలి హైకూ సంపుటి దృశ్యాదృశ్యం వచ్చింది. తణుకులో ఆవిష్కరణసభకి చేరా, ఇస్మాయిల్, కె. రామ్మోహన్ రాయ్ గార్లు వచ్చారు. బివివి ప్రసాద్ అప్పటి నుండి సాహిత్య ప్రపంచానికి తెలియటం మొదలైంది. తర్వాతి కాలంలో నాగభైరవ, ఓల్గా, అద్దేపల్లి ఆరాధన చదివి సాంద్రమైన అనుభూతితో స్పందించారు. 




06 మార్చి 2023

ఉద్వేగాల లోతుల్లోని ప్రశాంతతని కవిత్వం చేస్తాను : బివివి ప్రసాద్ . పలకరింపు

 

    'నేను' అనే సముద్రం లోంచి పుట్టిన అలల ఉధృతి లాగా ఈ ప్రపంచం నీ చుట్టూ పరచుకుంటుంది. స్వరూపం వేరైనా స్వభావం ఒక్కటే అని అనాది సత్యం హోరుమని కాలపు అంచుదాకా ఎగసిపడుతుంటుంది. ఉల్లిపాయ పొరల్లాగా ప్రశ్నని వొలుచుకుంటూ పోతే, అది బయల్దేరిన మూలం లోనే సమాధానమూ దొరుకుతుంది. ఇంత గొప్ప జీవితానుభవమూ మనిషి లోని ద్వంద్వాలను కలిపి ఏకం చెయ్యలేకపోతుంది. ఉన్నది ఏది, లేకున్నా ఉన్నట్టు భ్రమింపజేసేది ఏది, ఉనికికి ఆధారం ఏది అనే వెదుకులాట ఒక్కోసారి వాక్యాలుగా బహిర్గతం ఔతుంది. 'ఊరికే జీవితమై' పాఠకుల ఎదురుగా కవిత్వమై ప్రత్యక్షం ఔతుంది. అంతశ్శోధనా ధోరణిలో సాగిన ఈ కవిత్వం గురించి కవి బివివి ప్రసాద్ నుండే మరికొంత తెలుసుకుందాం.
 
- స్వాతికుమారి బండ్లమూడి

ఈ కవితల్లో చాలావరకు ఒక అంతర్లీనమైన తాత్విక ధోరణి కనిపిస్తుంది. ఇది కవి స్వభావంలో నుంచి సహజంగా వచ్చి చేరినదా లేక ముందే అనుకున్న కొన్ని అంశాలను కవిత్వ పరంగా చూపించే ప్రయత్నం కొంత ఉందా?

    కవి స్వభావం నుండే కవిత మొదలవుతుంది. స్వభావం పైన తాను అనుకునే వాటి ప్రభావం ఉంటుంది. అందువల్ల రాసే క్రమంలో కొన్నిసార్లు అనుకునేవి కూడా పాయలుగా కలవవచ్చు.

    కవితని అలావుంచి, తర్వాత వాక్యాన్నే ముందుగా ఊహించటం అరుదు. తోసుకువచ్చే ఒక వాక్యం కవిత రాబోతోందని తెలియచేస్తుంది. వీలులేక, రాయటానికి సిద్ధపడనపుడు అది మాయమైపోతుంది కూడా.

    కవితని ఓపెన్ చేసిన ఉద్వేగం, తనంత తానే వికసిస్తూ, తన ముగింపు వరకూ ప్రయాణిస్తుంది. తొలి పాఠకుడిలా దానిని చూస్తూ ఉంటాను.

    కొన్ని కవితలని edit లేదా rewrite చేస్తాను. లోపలి పాఠకుడికి బావుంది అనిపించే వరకూ, లోపలి కవి కవితని దిద్దుతూ ఉంటాడు. బావుంది అనిపించటం ముఖ్యం, ఏం రాయదలిచాను కన్నా. నమ్మనిదీ, కాంతిని ఇవ్వనిదీ ఎట్లాగూ రాయదలచలేదు గనక.

నేనెవరు అనే ప్రశ్న, ఏ వస్తువుకి తనదైన ఉనికి లేదనే సమాధానం, ఏదైనా ఉండటానికి వెనక, లేకపోవడానికి తర్వాత ఉన్నదేమిటి అనే సత్యాన్వేషణ.. ఇవన్నీ మీ కవిత్వం లో వచ్చి చేరడం వెనక నేపథ్యం ఏమిటి?

    జన్మతః introspection బలమైన అంతర్భాగం కావటం వల్ల, ఊహ తెలిసిన నాటినుండీ, నాకు నాదైన ఉనికి లేదా అనే దిగులో, నిండుదనం లోపించిన వెలితో లోలోపల సాంద్రంగా పనిచేసి ఉంటుంది. ఆ వెలితి నుండి బయటపడే ప్రయత్నంలో భాగంగా శ్రీ రమణమహర్షి మాటలు చదివినపుడు, నేనెవరు అనే ప్రశ్న తప్పించుకోలేనిదిగా ఎదురైంది.

    రూపాలకి అతీతమైన substance రూపాలని తెరమీది బొమ్మల్లా చూపిస్తుందని లీలగా తెలుస్తూ వుంటుంది. నేను రూపాన్ని కానా, ఆ substance నేనా, అసలు ఉన్నది నేను మాత్రమేనా అనేది అన్వేషణ.

    కవిత్వంలో అన్వేషణ చేరిందా, అన్వేషణలోనే కవిత్వం చేరిందా. రెండూ ఒకే సారానికి భిన్న రూపాలా. చూడాలి.

రోజువారీ సమస్యలను, ఉద్వేగాలను, సంఘర్షణలను దాటి మీరు చూపించిన ఈ భావనలు ఒక స్థాయి/ తరహా పాఠకులకు మాత్రమే ఉద్దేశించినవి అనుకోవచ్చా?

    వాటిని దాటి కంటే కూడా, వాటి లోపలి కంటా చూసి అనవచ్చునేమో. ఏ వాక్యమూ సార్వజనీనం కాదు, అలా తోచేవి కూడా అంతిమంగా వైయక్తిక స్థితి, స్థాయిని బట్టి అవగాహనకీ, అనుభవానికీ వస్తాయి. ఏ కవి అయినా, అటూ ఇటుగా తనలాంటి పాఠకులనే ఉద్దేశించి రాస్తాడేమో. రాసేటపుడు నాకూ నాలాంటి మనిషితో మాట్లాడుతున్న భావమే ఉంటుంది.

ఈ తరహా కవిత్వం రాయడానికి ప్రేరణ ఏమిటి? ఈ పద్ధతిలో/ ఇటువంటి అంశాలపై మీరు చదివిన ఇతర కవితలు ఏవైనా ఉన్నాయా?

    లోచూపుకి తోచే విషయాల్ని రికార్డ్ చేసుకోవాలనిపించటమే ఈ తరహా కవిత్వానికి దారి తీసింది. చదువుకున్న కవిత్వం తక్కువ. తొలినాళ్ళలో టాగోర్, ఖలీల్ జిబ్రాన్ లని చదివాక ఇలా రాసుకోవచ్చు అనే స్పష్టత వచ్చింది. ఇస్మాయిల్ని చదవటం అభివ్యక్తికి మరికొంత దోహదం చేసింది. హైకూని శ్రద్ధగా సాధన చేసిన ప్రభావం ఉంది. 'ఆకాశం' సంపుటి నాటి నుండి రాస్తున్నవి ఎవరి ఛాయల్లేని నావైన వాక్యాలు అనుకుంటాను.

    సాధారణంగా కవులు ఉద్వేగాలని తట్టడానికీ, మేల్కొల్పడానికీ కవిత్వం రాస్తారు. నాకది discomfort గా తోస్తుంది. ఉద్వేగం లేనిది కవిత్వం లేదు. అయితే, నాకు ఉద్వేగాల లోతుల్లోని ప్రశాంతతని కవిత్వం చేయటం ఇష్టం. సాంద్రమైన ఉద్వేగంతో నిండుగా ఉన్నపుడే ఆ ప్రశాంతత తెలుస్తుంది. తొలి సంపుటి ఆరాధన నుండి ఈనాటికీ అలాంటి మూడ్ లో నుండే కవిత్వం రాయటం అలవాటైంది.

చేపలా

సముద్రంలోని చేప
ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి
మళ్ళీ సముద్రంలో పడినట్టు
ఒక్కొక్కసారి అనంతంలోకి ఎగిరి
మళ్ళీ ప్రపంచంలో పడతావు

గాల్లోకి ఎగిరినపుడు
గాలి అందని చేపలాంటి నువ్వు
ఊపిరిపీల్చే ఆటలో పడి
ఊపిరాడట్లేదంటావు

జీవితావసరా లేవీ వద్దు,
ఉత్త జీవితం కావాలని విలపిస్తావు.

కలలో అమ్మ లేక ఏడుస్తున్న
ఒడిలోని బిడ్డని తల్లి తట్టి లేపినట్టు
నిన్నెవరో ఇప్పుడు జీవితంలోకి తట్టిలేపాలి

(బివివి ప్రసాద్ 'ఊరికే జీవితమై' సంపుటిలోంచి ఒక కవిత)

(ప్రచురణ : వివిధ, ఆంధ్ర జ్యోతి దినపత్రిక 13.02.2023)


#BVV Prasad, #Telugu Poetry, #oorike jeevitamai, #బి‌వి‌వి ప్రసాద్, #తెలుగు కవిత్వం, #ఊరికే జీవితమై

మరికొన్ని మాటలు..

    నలభై యేళ్ళ స్నేహం కవిత్వంతో. ఇక ఇది ముగింపుకు వచ్చిందేమో తెలీదు. కవిత మళ్ళీ పలుకుతుందో, లేదో తెలీదు. కాలేజీ కాలపు ఉద్రేకాలతో నా మీదికి దూకి, ఉక్కిరిబిక్కిరి చేసాక, తెలియరాని వెలితి వల్ల లోచూపులోకి మలుపు తిరిగాక, తెలియని సత్యాన్నీ, తెలిసీ, తెలియని జీవితాన్నీ, తెలుసనుకొంటున్న మనిషినీ తడుముకుంటూ, గ్రహిస్తూ, విస్మరిస్తూ, నేర్చుకుంటూ, విడిచిపెడుతూ పట్టరాని ఆనందమో, దుఃఖమో, దిగులో, భయమో, వెలితో, నిరాశో, ప్రేమో, ఆశ్చర్యమో కమ్మినపుడల్లా, వాటి నీడలేవో ఇక ఊరికే కూర్చోనీయని క్షణాల్లో రాయడం మొదలు పెట్టి, రాయడంలోంచి లోలోతుల్లోకి మునుగుతూ, కవిత ముగింపుతో పైకి తేలుతూ, రాసింది సరిచూసుకుంటూ, నన్ను నేనే మనిషిగా, కవిగా చెక్కుకుంటూ, ఇస్మాయిల్‌ అన్నట్టు, దీన్ని నేను నడిపిస్తున్నానో, నన్ను ఇది నడిపిస్తుందో తెలియకుండా సాగిన విభ్రాంత సమయాల కవిత్వ స్నేహం ఇక ముగిసిందేమో, తెలీదు. ముగిసిందనుకోవటంలో తోసుకువచ్చే ప్రేమ వుంటుంది, కొనసాగుతుందనుకోవటంలో భరోసా ఇచ్చే ఉదాశీనత ఉంటుంది.
. . .
    చాలాసార్లు ఆగాను, మళ్ళీ చాలాసార్లు నడిచాను ఈ స్నేహంలోకి. ఆగినపుడల్లా నేర్చుకుంటూనే ఉన్నాను, బహుశా, తెలియకుండానే. కవిత్వం అంటే ఏమిటో, వస్తువు ఏదో, శిల్పమేదో, మనిషి ఏమిటో, మనస్సు అలజడి ఏమిటో, జీవితమంటే ఏమిటో, ఈశ్వరుడంటే ఎవరో, సత్యమంటే ఏమిటో, సౌందర్యం ఏం చేస్తుందో తడుముకుంటూనే, వేసట పడుతూనే, మరింత సాంద్రతలోకి, లోతులోకి, విశాలత్వంలోకి నన్ను నేను విడిచిపెట్టుకుంటూనే ఉన్నాను. నేను అంటే మనసు, మనసు అంటే భయం, వెలితి, దుఃఖం, ఆరాటం. మనసు అంటే ఎక్కడుందో తెలియకనే, నేనుగా ఆవహించి, నన్ను ఉక్కిరిబిక్కిరి చేసే మృగతృష్ణ. దీనినుండి బయటపడాలి. దీని ఉపకరణాల నుండి విడుదల పొందాలి. గొప్ప శాంతిలోకి, తేజస్సులోకి, ప్రేమలోకి మేలుకోవాలి. ఇలాంటి లోలోపలి వత్తిడి ఏదో నన్ను ఇంత దూరం నడిపింది. దూరం నిజంగా ఉందా. దూరమంతా ఊహ మాత్రమేనా. కాలమైనా నిజమేనా, కల మాత్రమేనా. ప్రశ్నలు, జవాబులు, సందిగ్దతలు. ఇవన్నీ నిజమా, కల్పనా. ఇవన్నీ ఎవరికి నిజం లేదా ఎవరి కల్పన.
. . .
    కొన్ని చదివి ఆశ్చర్య పడ్డాను, కొందర్ని చూసి కూడా. ఈ రాతలు, ఈ జ్ఞానులు నిజమేనా. బహుశా, నిజమనే నమ్మాను. బహుశా, నిజం కావాలని నమ్మాను. ఏదో ఒకటి నిజం కాకపోతే ఏదీ ఆలంబన. దేనికి ఆలంబన, ఎందుకోసం. మనస్సే తనని తాను మెడపట్టి గెంటలేదని అర్థమైంది అనుకొన్నాను తొలినాటి రాతల్లో. నిజంగా అర్థమైందా. అర్థం కాలేదా నిజంగా. ఇన్ని రాతల తర్వాత, నేను మొదలైనచోటనే ఉన్నానా, మొదలే లేనిచోటికి చేరుకున్నానా. ఒక తెలియనితనం కమ్ముతోంది. కమ్ముతోందా, దానికి నేను లొంగుతున్నానా. తెలియనితనంలోని హాయి మాత్రమే, నిశ్చింత మాత్రమే నిజమా. తెలుసు నుండి విడుదల పొందటానికే ఇంత వేసట పడ్డానా. బాల్యం అమృతకాలం. దేవుడు ఊరుకోక తనని జీవిగా చేసుకొన్న తొలి వేకువ సమయం. మళ్ళీ బాల్యంలోకి, మళ్ళీ ఏమీలేనితనంలోకి వెళ్ళటానికి ఎంత దుఃఖం, ఆరాటం, అలసట, ఘర్షణ. ఎన్ని భ్రమావరణాల సంతోషాల, బాంధవ్యాల, అభిరుచుల, అలవాట్ల, నమ్మకాల మొరటుదనాల నుండి బయటపడాలి దీనికి. ఎంత భాషనీ, సమాచారాన్నీ, సంస్కృతినీ వదిలించుకోవాలి, ఎన్ని భయాలని ప్రేమలోకి డీకోడ్‌ చేసుకోవాలి. అన్నీ వదిలించుకుని వచ్చి, ఎంత అమాయకత్వంలోకి ఊపిరి పీల్చుకోవాలి.
. . .
     భాషకి విరుగుడుగా రాసుకొన్న భాష ఈ కవిత్వం. శబ్దాలనుండి నుండి నిశ్శబ్దంలోకి జారిపోవటానికి చెక్కుకున్న మాటలు ఈ కవిత్వం. మనస్సునేను నుండి లేనినేనుకి లేదా ఉన్ననేనుకి చేసే దీర్ఘయాత్ర ఈ కవిత్వం. ఇది నాలోంచి పలికినప్పుడు, బహుశా, కేవలం నాకోసమే పలికిందేమో తెలీదు. ప్రియమైనవారెవరో చెవిలో చెప్పిన మాటల్ని, బజారులో పంచుకొన్న వెర్రివాడిలా, ఈ మాటల్ని లోకంలోకి జారవిడుచుకున్నానేమో తెలీదు. మీకు జీవితం అర్థం కాకపోతే మీ కవిత్వం చదువుకోండి అని స్నేహితురాలు అన్నట్టు, నాకైన మాటల్ని నేను వినటం మాని, ఇలా పలుకుతున్నానేమో తెలీదు. పలికానా, పలికాయా. ఏ శక్తులో అత్యల్పమైన మనస్సుని వెదికి, వశం చేసుకుని, దానిద్వారా ఈ మాటలన్నిటినీ పలుకుతుందేమో. చాలాకాలం తర్వాత, నా రాతలు నేనే చదువుకుని, ఇతను ఇలా ఎలా ఊహించాడు అని ఆశ్చర్యపడే క్షణాల్లో, రాసింది నేను కాదనిపించడంలో నిజముందేమో తెలీదు.
. . .
    నేనే రాశాననుకొంటే, బడాయిగానో, బేలగానో, ఇవి దేశ, కాలాంతరాల్లో ఉన్న నాలాంటి వాళ్ళకి రాసుకొన్న ప్రేమలేఖలు అని చెప్పవచ్చును. చదివినవారూ అక్కడే ఆగి, కవిత్వానికి అటువైపు నుండి ఇటు వున్న కవితో స్నేహం చేయబోతారు కూడా. కానీ, ఒక గొప్పవాక్యం ముందు మోకరిల్లే మనుషులుంటారు. రాసినవారో, చదివినవారో. వారికి మాత్రమే ఆ వాక్యంలోకి, దాని అర్థమిచ్చే వెలుగులోకి ప్రవేశించటం తెలుస్తుంది. వారికోసం ఈ గాలి నిండా, ఆకాశం నిండా శుభ్రమైన వాక్యాలు పసిదేవతల్లా ఆడుకొంటూనే, వెదుకుతుంటాయి. అవి కొన్నిసార్లు అనుకోని మలుపులో అక్షరాలుగా కనబడవచ్చు, అనుకోని క్షణంలో అంతరంగంలోనే మెరవవచ్చు. వారు ఆ మెరుపులోంచి అనంతంలోకి మాయంకావచ్చు.

    ఇంత అద్భుతమైన మెరిసే మాయవస్త్రాల తెరల లోంచి చిరునవ్వే జీవితానికి నమస్కరిస్తూ..

బివివి ప్రసాద్‌, తణుకు
2.2.23 10.15 రాత్రి

(ఊరికే జీవితమై.. కి ముందుమాట)


#BVV Prasad, #Telugu Poetry, #oorike jeevitamai, #బి‌వి‌వి ప్రసాద్, #తెలుగు కవిత్వం, #ఊరికే జీవితమై

03 మే 2020

అన్వేషులకు..

 

సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ కాళహస్తి 

      భగవాన్‌ శ్రీ రమణ మహర్షి ‘నేనెవరిని’ అనే పుస్తకానికి ముందుమాటగా ఇలా రాశారు. ‘అందరూ దుఃఖం అనేది లేక ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతివ్యక్తికీ తనయందే పరమప్రీతి వుంటుంది. ప్రీతికి సుఖమే కారణంగా వుంటుంది. మనస్సు అణగిన నిద్రలో ప్రతిరోజూ అనుభవించే ఆ సుఖాన్ని పొందాలంటే తనని తాను తెలుసుకోవాలి. దానికి నేను ఎవరిని అనే జ్ఞానవిచారమే ముఖ్య సాధనం.’ అయిదు వాక్యాల్లో జ్ఞానవిచారణ ఎందుకు చేయాలో చెప్పారు. అవి నిజమా, కాదా అని తనలోకి తాను తరచి చూసుకొన్నవారికి విచారణ మొదవుతుంది.
      జీవితం దుఃఖమయం. తనకి అన్యంగా కనిపించే ఇంత విశ్వం, ఇన్ని అనుభవాలూ చివరికి తనకి దుఃఖాన్నీ, భయాన్నీ మాత్రమే మిగుల్చుతున్నాయని జీవితాన్ని లోతుగా గ్రహించినవాళ్ళకి తెలుస్తూనే వుంటుంది. మనకి సుఖమనిపించింది కొనసాగాలనో,  మరింత పొందాలనో కోరికా, పొందుతున్న సౌఖ్యం చేజారిపోతుందన్న భయమూ తప్ప, మన పనులకి అర్థమేమన్నా ఉందా అని చూస్తే, ఏమీ కనిపించదు. సుఖ, దుఃఖాలకి కారణమైన ప్రపంచాన్ని వదిలి, వీటిని అనుభవిస్తున్న ‘నేను’ ఎవరు అని వెదకి, కనుగొంటే, భయ, దుఃఖాలు అంతరిస్తాయని జ్ఞానులు చెబుతున్నారు.
        జ్ఞానం వల్ల ప్రపంచం మారదు, కానీ, ప్రపంచం పట్ల మన స్పందనలో, చూపులో జీవమూ, తాజాదనమూ, వివేకమూ తొణికిసలాడతాయి. భారంగా, విసుగ్గా గడిచే జీవితం కలలాగా తేలికగా మారుతుంది.
        జ్ఞానం పొందటం అహంకారాన్ని వదులుకోవటమంత తేలిక, అంత కష్టం. మనకన్నీ అన్యంగా (ఆబ్జెక్టివ్‌గా) చూడటమే తెలుస్తుంది. అంటే నేను వేరు, అవతలి వస్తువు వేరుగా. ‘నేను’ ఎవరు అనే అన్వేషణ మొదలుపెట్టినా మనం అదే పద్దతి అనుసరిస్తాం. ‘నేను’ని అన్యం (ఆబ్జెక్ట్‌) చేస్తాం. అందువల్ల ‘నేను’ ఎప్పటికీ తెలియకుండానే వుంటుంది. అందువల్లనే భగవాన్‌ ‘నేను’గా ‘ఉండటమే ఉంటుంది’ అంటారు.
      అట్లా ఉండటం తెలిస్తే ఇక ఏ సాధనా లేదు. అది తెలియటం అంతకష్టం గనుకే, అనేక గ్రంథాలు, సాధనలు అవసరమయ్యాయి. ఈ గ్రంథాలు ప్రధానంగా రెండు విధాలు. 1. ‘నేను’ని ఇతరాన్ని గురించి చెప్పినట్టు చెప్పేవి. ఇవి మొదటి దశలో  అవగాహన కలగటానికి సహాయం చేస్తాయి. 2. ‘నేను’ అనుభవాన్ని చెప్పేవి. (అనుభవం అనే మాట సరైనది కాకపోయినా, అవగాహనకి అంతకన్నా దారిలేదు.) అంటే ‘నేను’గా స్థిరపడిన జ్ఞానులు తమ అనుభవం నుండి చెప్పేవి. ఇట్లా చెప్పే జ్ఞానుల మాటలు మనస్సులో అతి సూక్ష్మమైన చోట పనిచేస్తాయి. తటాలున ‘నేను’ స్ఫురణలోకి మేల్కొలుపుతాయి.
        ఇలా చెప్పేవారు అరుదు. ప్రాచీనకాలంలో ఇలా చెప్పిన గ్రంధాలని స్వరూపవర్ణన గ్రంథాలంటారు. వాటిలో నేను విన్నవి అవధూతగీత, ఋభుగీత, అష్టావక్రగీత, యోగవాశిష్టం. శ్రీ శంకరుల అద్వైతబోధనలోనూ ఈ ధోరణి చూసిన గుర్తు. నవీనకాలంలో ఇలా బోధించినది శ్రీరమణ మహర్షి, శ్రీనిసర్గదత్త మహరాజ్‌, వారి శిష్యులు శ్రీరమాకాంత మహరాజ్‌. రాబర్ట్ ఆడమ్స్, ఎకార్ట్ టోలీ కూడా ఈ కోవకే వస్తారనుకుంటాను.
        ఈ ధోరణిలో చెప్పే, సజీవంగా వున్న జ్ఞానుల కోసం చాలా వెదికాను, వారితో ముఖాముఖి మాట్లాడటం వలన, వారి సన్నిధి యొక్క పవిత్రత వలన మేలు కలుగుతుందని. గత ఏడాది చివర, మిత్రులు గంగారెడ్డి కొన్ని సూక్తులు పంపి, ఎలా వున్నాయో చూడమన్నపుడు, చదివి, ఆశ్చర్యపడ్డాను. ఎలాంటి మాటలు చెప్పగలవారికోసం వెదుకుతున్నానో, వారే మాట్లాడినట్టు తోచింది.
       సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యంగారి సన్నిధీ, మాటలూ నాపై అమృతోపమానమైన ప్రభావం చూపాయి. ఇవి మిత్రులందరికీ చేర్చాలనే తలంపు బలంగా కలిగింది.
      చిత్తశుద్ధితో సత్యాన్ని వెదుకుతున్న మిత్రులకి రెండు సూచనలు. 1. వారిని కలవండి, మీ వెదుకులాటలో మీకు కలిగిన సందేహాలని అడగండి. జ్ఞానుల సన్నిధి, వాక్కు శక్తివంతమైనవి. వాటిని స్వీకరించండి. 2. వారు తన దగ్గరికి వచ్చినవారితో చెప్పిన మాటలు చదవండి. ఎవరి విషయంగానో కాదు, మీ విషయం అనుకొని చదవండి. ఆ మాటల్ని నమ్మటం, ఆలోచించటం కాదు. మీ గురించే చెప్పినట్టుగా పరిశీలించండి, అనుభూతించండి. మీ అనుభవంలోంచి, ఆ మాటల సారాన్ని పట్టుకోవటానికి చూడండి.
మన అవగాహన నిండా మాయ కప్పిన తెరల్ని తేలికైన మాటతో, పదునైన తర్కంతో, చూపుతో తొలగిస్తున్నారు. మాయ తొలగించుకొని మిమ్మల్ని మీరు అనుభవించండి.        
కొందరికైనా ఈ మాటలు ఆత్మోద్దీపన కలిగించగలవన్న నమ్మకంతో..

పీడీయఫ్ పుస్తకాలకు డౌన్ లోడ్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి 

వారి శిష్యులు నిర్వహిస్తున్న వెబ్ సైట్ లింక్ : ​ఇక్కడ క్లిక్ చేయండి 

12 మార్చి 2018

ఏడు పుస్తకాలు : 7. ఐ యాం దట్ - నిసర్గదత్త మహరాజ్

మనస్సు సందేహాల పుట్ట, కాస్త తర్కమూ, ఊహా కూడా బాగా తెలిస్తే, ఇక అది పుట్టించే సందేహాలకి అంతే వుండదు. పెద్దగా తెలివిలేనివారికి ఇలా చెయ్యి అని చెబితే చాలు , దానినే పట్టుకొని వెళతారు, తెలివైనవారికి ఒకటి చెబితే, పది సందేహాలు వస్తాయి అంటారు శ్రీ రమణమహర్షి. చాలా సందర్భాల్లో ఆయన 'నీ సందేహాలన్నీ సరే, అవి ఎవరికి కలుగుతున్నాయంటే, నాకు అంటావు కదా, ఆ నేనెవరో చూడు' అని చెప్పేవారు. మనబోటి తెలివైనవాళ్ళు సందేహాలకి జవాబులు దొరక్క నిరాశ పడేవారు. నిన్న చెప్పినట్టు, ఎవరు చెబుతున్నా సారాంశం ఒకటే, కానీ వినే మనస్సే పరిపరివిధాలు గనుక, దానికి తగినట్టు దొరికే మాటల్ని వెదుకుతూ వుంటుంది. అలా వెదకగా దొరికినవారు శ్రీ నిసర్గదత్త మహరాజ్. 

మారుతి అనే యువకుడు కుటుంబపోషణ నిమిత్తం బొంబాయిలో చిన్న వ్యాపారం చేస్తూ, ఒక సందర్భంలో నవనాధ సంప్రదాయానికి చెందిన సిద్దరామేశ్వర్ మహరాజ్ అనే గురువుని కలుస్తాడు. ఆయన ఇచ్చిన ఉపదేశమూ, సూచనల మేరకి సాధన చేసి, రెండుమూడు సంవత్సరాలలోనే జ్ఞానం పొందుతాడు. ఆ మారుతినే నిసర్గదత్త మహారాజ్ పేరుతో పిలవబడతారు. 

దేశ, విదేశాలకు చెందిన పలువురు అన్వేషకులు ఆయనను కలిసి ప్రశ్నలడిగేవారు. నిసర్గదత్త చదువుకున్నవారు కాదు. మరాఠీ లోనే మాట్లాడేవారు. విదేశీయులు వచ్చినపుడు మౌరిస్ ఫ్రీడ్మన్, బహుశా మరికొందరూ అనువాదకులుగా పనిచేసేవారు. వారు ఆ సంభాషణలని రికార్డు చేసేవారు. అట్లా ఫ్రీడ్మన్ రికార్డు చేసిన నూటొక్క సంభాషణల ఆంగ్లానువాదమే ఈ ఐ యాం దట్. 'నేను' ను గురించి, దానిని కప్పిన మనస్సు గురించి, శరీరం గురించి మరింత సూక్ష్మం గా, అనేక విధాల వివరిస్తారు నిసర్గదత్త. చాలాసార్లు, ఇప్పటివరకూ మనం మననీ, ప్రపంచాన్నీ అర్థం చేసుకొన్నా మనుకొన్న పద్దతిని తలక్రిందులు చేస్తారు ఆయన. తర్కానికి అంతకు మించిన తర్కంతో జవాబిస్తారు. మాటల్లో అద్భుతమైన కవితాత్మకత కలిగిన ఊహలు జాలువారుతూ ఉంటాయి.


జ్ఞానం వల్ల ఏం కలుగుతుందో ఒక్కమాటలో చెప్పమంటే, నేనైతే భయం పోతుంది అని చెబుతాను. మనం చూసే, వినే సో కాల్డ్ ధైర్యాలూ, సాహసాలూ భయానికి రెండో కొసన ఉండేవే కాని, అవి భయరాహిత్యం కాదు. అట్లాంటి భయరాహిత్యం నిసర్గదత్తలో స్పష్టంగా కనిపించేది. ప్రాథమిక విద్యకూడా లేని ఆయనకి అంత సూక్ష్మ బుద్ధి ఎలా సాధ్య మయిందనేది మరొక ఆశ్చర్యం. జ్ఞానం పొందాక కూడా ఆయన చాలాకాలం తన చిన్న వ్యాపారాన్నే చూసుకొంటూ గడిపేవారు. చివరివరకూ తన చిన్న ఇంటిలోనే జీవితం గడిపారు. ఒక చిన్నగదిలో తనతో మాట్లాడవచ్చినవారితో సంభాషించేవారు. క్రిష్ణాజీకి వచ్చినట్లే, ఈయనకూ చివరిలో గొంతు కాన్సర్ వచ్చినపుడు, దేహానికీ, తనకీ సంబంధం లేనట్లే మాట్లాడేవారట. 

ఈ పుస్తకమూ, తరువాత వరుసగా నిసర్గదత్తతో మరికొందరు జరిపిన సంభాషణల పుస్తకాలూ చదివిన తరువాత, నా వరకూ, పుస్తకాల ద్వారా నేనేమి పొందాలని కోరుకొన్నానో అదంతా లభించినట్లుగా అనిపించింది. ఎనిమిదేళ్ళ క్రితం అవి చదవటం పూర్తయాక, ఇక చదువుపై ఆసక్తి పోయింది, కావలసిందేదో చదువుకొన్నాను అనే తృప్తి ఒక కారణమైతే, అంత నిశితమైన, లోతైన భావాలనో, అవగాహననో చదువుకొన్నాక మిగిలినవన్నీ వెలిసిపోయిన వాక్యాల్లా కనిపించటం మరొక కారణం.

నా టైం లైన్ చూసే మిత్రులు తరచూ నేను నిసర్గదత్త కోట్స్ షేర్ చేయటం గమనించే వుంటారు. ఇటీవలి కాలంలో నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ గారు అనువదించిన నిసర్గదత్త సంభాషణలు కొన్ని 'అమృతధార ఖడ్గధార' పేరుతో పుస్తకంగా వచ్చాయి. లక్ష్మీప్రసాద్ గారు గొప్ప అవగాహన గల వ్యక్తి గనుక, చాలా బాగా అనువదించారు. మిత్రులెవరైనా ఆ పుస్తకం సంపాదించి చదవవచ్చును. ఇంగ్లీషు పుస్తకాలు అమెజాన్ లో లభిస్తున్నాయి ఇప్పుడు. పీడీయఫ్ ఫైల్స్ నెట్లో పలుచోట్ల ఉచితంగానే అందుబాటులోనే వున్నాయి.



ఈ పుస్తకం ఆన్ లైన్ సైట్లలో లభిస్తుంది.

ఏడు పుస్తకాలు : 6. శ్రీ త్రిపురా రహస్యం

మౌలికంగా, మనకు జీవితం లో రెండు ప్రశ్న లుంటాయి. మనకు ఊహ తెలిసిన మొదట్లో ఈ రెండూ మనకి ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. రాను, రానూ జీవించటం మానేసి, బతకటం ఒక అలవాటుగా మారిపోయే మొరటుదనంలో ఈ ప్రశ్నలు మరుగునపడిపోయి, తత్కాల ఘటనలకి తోచిన విధంగా స్పందిస్తూ కాలం గడుపుతాము మనం. ఆ ప్రశ్నలు నేనేమిటి, ఈ ప్రపంచం ఏమిటి. ఇవి ఇట్లా పద రూపంలో కాకపోయినా, మన బాల్యంలో మనలోంచి ప్రకటమయ్యే ఆశ్చర్యం వెనుక ఉండేది ఈ ప్రశ్నలే. మనస్సు స్థూలాన్నే ఆశ్రయిస్తుంది గనుక, అధికులు ప్రపంచానికి తోచిన జవాబులు కల్పించుకొంటూ సాగుతారు. కొద్దిమంది మాత్రం నేను కి అర్థం వెదుకుతారు. నేను అనేది పరిష్కారమైతే ప్రపంచం పరిష్కారమౌతుంది, ప్రతి నేనూ నా నేనుకి నమూనానే గనుక. ఒకటి తెలిస్తే, అన్నీ తెలుస్తాయి. ఈ దృక్పథం రమ్మంటే వచ్చేదీ కాదు, వస్తే పోయేదీ కాదు. ఇట్లా ఈ నేను ఏమిటి అనే ప్రశ్న వచ్చినపుడు లోచూపు మొదలవుతుంది, ఈ దారిలో వెళ్ళినవారు ఏమి చెప్పారో తెలుసుకోవాలనిపిస్తుంది. వారి మాటలనుండి తనకి కావలసిన జవాబులూ, సారమూ తీసుకోవటం జరుగుతుంది. అట్లా నన్ను నేను వెదుక్కొంటున్న క్రమంలో నాకు ఎంతో సహాయం చేసిన పుస్తకాలలో త్రిపురా రహస్యం ఒకటి. 

అప్పుడేమి చదివానో గుర్తులేదు కాని, ఈ పుస్తకం ముద్ర నాపై బలంగానే ఉందనుకొంటాను. త్రిపురాదేవి అంటే మన యదార్థస్వరూపమే. త్రిపురాలు అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. భౌతిక దేహం స్థూలమనీ, దానికి కారణమైన మనస్సు సూక్ష్మమనీ, మనస్సుకి కారణమైన మౌలిక సంస్కారాలు కారణమనీ చెబుతారు. కారణ శరీరానికీ ఆధారమై 'నేను ' గా తోచే స్వరూపాన్నే త్రిపురాల యొక్క రహస్యంగా భావించవచ్చును. పరశురాముడు సుమేథునికి చేసిన బోధగా త్రిపురా రహస్యంలో కథ జరుగుతూ ఉంటుంది. కథలో మళ్ళీ అనేక ఉపకథలు వస్తూ ఉంటాయి. నేను అంటే ఏమిటి, మనస్సు స్వభావం ఏమిటి, ప్రపంచం యొక్క ఉనికి ఎటువంటిది వంటి విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి దీనిలో.


స్వరూపానుభవం మనకు తరచూ జరుగుతూనే ఉంటుందన్న విషయం ఈ గ్రంథం లోనే చదివిన గుర్తు. ఆలోచనకీ, ఆలోచనకీ నడుమ విరామంలో, మెలకువ నుండి నిద్రలోకీ, నిద్ర నుండి మెలకువలోకీ వచ్చే సందర్భాల్లో, మహా సుఖం, మహా దుఃఖం, మహా భయం సంభవించి మనస్సు నిశ్చేష్టితమయ్యే సమయాల్లోనూ మనం స్వరూపంగా క్షణకాలమో, కొద్దికాలమో ఉంటామని, మళ్ళీ మనస్సు మనని స్థూల ప్రపంచంలోకి తీసుకు వచ్చినపుడు ఆ స్వరూపానుభవం మరుగున పడుతుందనీ చెబుతారు. అట్లానే మనస్సుకి స్వతహాగా రూపం లేదనీ, తాను చూసే దృశ్యాలని అనుసరించి అది ఒక రూపం తీసుకొంటూ ఉంటుందనీ, అట్లానే బయటి ప్రపంచమూ, బయట కాక మనస్సులోనే ఉందనీ చర్చిస్తారు. విరుద్ధంగా కనిపించే ఈ ప్రతిపాదనలకు పై మాటగా చూసేవాడూ (ద్రష్ట), చూడబడేదీ (దృశ్యం) ఒకసారే తోచి, ఒకసారే మాయమయే విషయాలే కాని, వాటికి అస్థిత్వం లేదనీ, చూపు (దృక్కు) మాత్రమే సత్యమనీ, స్వతంత్రమనీ చెబుతారు. ఏ తాత్విక చర్చ చూసినా ఈ పర్యవసానాలకే భిన్న మార్గాల ద్వారా రావటం కనిపిస్తుంది. భారదేశంలోనే కాక, ప్రాక్పశ్చిమ దర్శనాలలో ఎక్కడైనా, ప్రాచీనంలోనే కాక, నవీన దార్శనికుల్ని చదివినా ఇవే మౌలిక విషయాలుగా గోచరిస్తాయి. తిరిగి తిరిగి మనస్సే సమస్య. మనస్సే పరిష్కారం కూడా. లోనికి చూసినా, బయటికి చూసినా.

మనలో ఏదో వత్తిడి ఉండాలి, వేదన ఉండాలి, వెలితీ, వెదుకులాటా ఉండాలి. మంచిగా బతికే ప్రయత్నం, మంచిగా మాత్రమే బతకాలనే మొండితనం ఉన్నపుడు ఈ వత్తిడి కలుగుతుం దనుకొంటాను. అది ఉన్నపుడు వెదుకుతాము. వెదుకు దొరుకుతుంది. తట్టు తెరుచుకొంటుంది. అని జీసస్ చెప్పేది దీని గురించే అనుకొంటాను. నిజానికి నడిపించేది ఆ వెదుకులాటే అయినా, ఆ మార్గంలో నడిచినవారి అవగాహన తెలుసు కొన్నపుడు మన ప్రయాణం వేగవంతమౌతుంది. చదవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటే ప్రయాణం వేగవంతం కావటం ఒక్కటే అనుకొంటాను. కానీ, ఎవరి ప్రయాణం వారు చేయవలసిందే. పడుతూ, లేస్తూ తన అనుభవం తను చూడవలసిందే.



 ఈ పుస్తకం శ్రీ రమణాశ్రమం, తిరువణ్ణామలై లో లభిస్తుంది.

ఏడు పుస్తకాలు : 5. అష్టావక్ర గీత - వ్యాఖ్య : స్వామి చిన్మయానంద

 భారతీయఋషుల గురించి మనకి చాలా తక్కువ మాత్రమే తెలుసనుకొంటాను నేను. వారి అన్వేషణ, దాని ద్వారా వారు గ్రహించిన సత్యాలు అద్భుతమైనవి. జీవన మౌలిక వాస్తవికతని గ్రహించటానికి వారు తమ అంతస్ఫురణను ఆశ్రయించినట్టు కనిపిస్తుంది. అది మేథ కన్నా లోతైనది, ఖచ్చితమైనది. కాలక్రమంలో అనేక సామాజిక, రాజకీయ ప్రయోజనాలతో నిండిన అంశాలు మాత్రమే జాతిపై పెత్తనం చేసినపుడు, భారతీయ దర్శనం అంటే అది మాత్రమే అని సామాన్యులు అనుకొంటున్నపుడు, ఆయా అంశాల వలన ప్రయోజనం పొందేవారూ, నష్టపోయేవారూ రెండుగా చీలి, ఇద్దరూ కూడా ఆ మౌలిక విషయాలని ప్రతిపాదించిన శాస్త్రాలని విస్మరించారని నాకనిపిస్తూ వుంటుంది. 

ఉపనిషత్తులూ, మరికొన్ని స్వరూపవర్ణన గ్రంథాలూ ఏ మహాసత్యాన్ని విశదీకరించాలని పలువిధాల ప్రయత్నించాయో అనిపిస్తుంది, వాటిని నిజమైన వెదుకులాట తో సమీపించినపుడు. వాటికి మతంతో, ఆచారవ్యవహారాలతో ఉండే సంబంధం నామమాత్రమైనది. నిజానికి, వారందరూ కూడా అన్ని రకాల కపటవిలువలపైనా తిరుగుబాటుదారులు అని కూడా అనిపిస్తుంది నాకైతే. ఒకరన్నట్టు మతం ముగిసిన చోట ఆధ్యాత్మికత లేదా తాత్విక అన్వేషణ మొదలవుతుంది.

ఒక జనకుని (సీతాదేవి తండ్రి కావచ్చు, మరొకరు కావచ్చు)కి సత్యం తెలుసుకోవాలనే కోరిక పుడుతుంది. గుర్రపు రికాబులో ఒక కాలు ఉంచి, రెండోవైపు రెండో కాలు వేసేలోగా జ్ఞానం పొందవచ్చును అనే రుషి వాక్యం సభలో ప్రస్తావనకి వస్తే, నిరూపిస్తారా అంటాడాయన పండితుల్ని. కొంత కథ తరువాత, అష్టావక్రమహర్షి ప్రవేశించి తాను నిరూపిస్తానంటారు. రాజు గుర్రపు రికాబులో కాలుంచి నిలబడతాడు, అప్పుడు, మహర్షి జ్ఞానం ఇస్తున్నాను గనుక గురుదక్షిణ ఇమ్మంటాడు. ఏమి కావాలంటే, 'నేను' 'నాది' అనుకొనే సమస్తాన్నీ తనకి అర్పించమంటాడు. భౌతికమైనవే కాక, మనస్సుతో, సంకల్పంతో సహా అర్పిస్తాడు జనకుడు. సంకల్ప రాహిత్యమే జ్ఞానం గనుక, జనకుడు జ్ఞానంతో నిండిపోతాడు. తరువాత గురు, శిష్యులిరువురికీ జరిగిన సంభాషణే ఈ పుస్తకం.

శ్రీ చిన్మయానంద వ్యాఖ్యని పెద్దగా చదివిన గుర్తులేదు. శ్లోకార్థం వరకే చదువుకొన్నాను. ప్రతి శ్లోకమూ అద్భుతమైన కవితలా తోచింది అప్పుడు. జ్ఞానికి ఈ జీవితం ఎట్లా అనుభవమౌతూ ఉంటుందో వివరంగా చర్చిస్తారు వారిరువురూ ఈ పుస్తకంలో. 
లోతైన ఏ రచన చదవటానికైనా ఆకలి లాంటి ఆర్తి కలిగి ఉండటం ముఖ్యం. జ్ఞానమనేది ఉందని నమ్మకపోయినా కూడా, ఇంతకన్నా సారవంతమైన జీవితానుభవం ఉంటుందా అనుకొంటూ వేసట చెందిన హృదయాలైనా ఈ పుస్తకాన్ని సమీపిస్తే, వారికి ప్రగాఢ మైన శాంతి కలుగుతుందని అనిపిస్తుంది నాకు.




పద్మినీ జ్యూయలర్స్, భీమవరం వారి వద్ద ఈ పుస్తకం లభిస్తుంది. 

ఏడు పుస్తకాలు : 4. ద పవర్ ఆఫ్ నౌ - ఎకార్ట్ టోలీ

జ్ఞానం, మరీ గంభీర పదమైతే, 'మెలకువ' అందాం, ఎవరికి ఎలా ప్రాప్తిస్తుందో తెలియదు. ఎకార్ట్ టోలీ తీవ్రమైన నిస్పృహలో నెలల తరబడి జీవించాడు. 29 వ యేట ఒకరాత్రి చాలా రాత్రుల్లాగే సరిగా పట్టని నిద్రనుండి తటాలున మేలుకొన్నాడు. ఇక నన్ను నేను ఎంతమాత్రమూ భరించలేననిపించింది ఆయనకి. అంతలో ఒక ప్రశ్న. నన్ను నేను భరించలేను అంటున్నానేమిటి, అంటే భరించే నేనూ, భరించబడే నేనూ రెండున్నాయా అనుకొంటాడు. అది కేవలం మేధో పరమైన ప్రశ్న కాదు, తన మౌలిక చేతనలోకి తొలుచుకుపోతున్న ఒక చూపు. అకస్మాత్తుగా ఏదో శక్తి తనని సంపూర్ణంగా లొంగదీసుకొంటున్నట్టు అనుభవమవుతూ వచ్చింది. నిద్రపట్టింది. లేచాడు. తను చూస్తున్నది తాజా ప్రపంచం. కిటికీలోంచి పక్షికూత వినిపించింది. ఆ కూత ఒక వజ్రంలా అనిపించింది. కొన్ని నెలలు ఆలోచనలూ, భయాలూ, వేదనలూ తాకలేని ఆనందంలో మునిగిపోయాడు. తరువాత తన అవగాహనని ప్రపంచంతో పంచుకోనారంభించాడు. ఆయన రాసిన పుస్తకం ఈ పవర్ ఆఫ్ నౌ. కొద్దిగా అంతరిక అన్వేషణలో ప్రవేశం ఉన్నవారికి ఈ టైటిల్ చాలా చెబుతుంది.

మిత్రుల దగ్గరనుండి సంపాదించిన పుస్తకాన్ని జిరాక్స్ తీసుకొన్నాను. పూర్తిగా చదవలేదు ఈ నాటికీ. అక్కడక్కడ చదివే సరికి ఆయన దేనిని సూచిస్తున్నారో అర్థమైంది. అది సరిపోయిందనిపించింది. అంతరిక అన్వేషణకి సంబంధించిన మౌలిక సూత్రాలు చాలా సరళమైనవి. సంక్లిష్టమైన మనసు పొరల్ని తొలగించుకోవటంలోనే ఉంది కష్టమంతా. ఆయన చెబుతున్నది అంతా టైటిల్ లోనే వచ్చింది. ఈ క్షణపు శక్తి.

గతం, భవిష్యత్తూ మానసికమని మనకి తెలుస్తూనే ఉంటుంది. వర్తమానానికి మాత్రమే భౌతికత ఉంటుంది. ఈ వర్తమానపు వాస్తవికతలో కూడా పంచ భూతా (ఫైవ్ ఎలిమెంట్స్)త్మక ప్రపంచానికి ఆధారంగా, స్థిరంగా మరొక వర్తమానం ఎప్పుడూ ఉంది. దీనినే అనంత వర్తమానం అంటారు రమణ మహర్షి. సత్యం ఇప్పుడే, ఇక్కడే ఉంది అంటారు నిసర్గదత్త. ఇంకా సులువుగా అర్థం కావాలని, ఇప్పటి లోపల ఇప్పుడు అంటారు ఆయన. మొదటి ఇప్పుడు మానసికం, ఇంద్రియ సంవేదనాత్మకం. రెండవ ఇప్పుడు ఏమీలేని లేదా అంతా తానే అయిన ఇప్పుడు. దానినే ఎకార్ట్ టోలీ ప్రధానంగా ప్రతిపాదిస్తూ వచ్చారు. కాస్త చూపు సూక్ష్మమైతే తెలుస్తుంది ఆ ఇప్పుడు, దాని అనంత శక్తి, కాంతి. కానీ, మనస్సు బూడిదై అది మాత్రమే మిగలటం అంత తేలికేమీ కాదు. ఆ దివ్యమైన వర్తమానానికి మేలుకోవటానికి ఎకార్ట్ టోలీ సూచనలు ఎంతగానో ఉపకరిస్తాయి.




ఈ పుస్తకం ఆన్ లైన్ సైట్లలో లభిస్తుంది.

ఏడు పుస్తకాలు : 3. క్రాంతి బీజాలు - ఓషో

 ఓషో రచనలలో నేను చదివిన మొదటిపుస్తకం ఇది. ఓషో జీవిత విధానమూ, ఆయన బోధ గురించి జరిగిన దుష్ప్రచారాల వలన చాలా కాలం ఆయన్ను దూరంగానే పెట్టినా, మిర్దాద్ కు ముందు కనిపించిన ఆయన నాలుగుమాటలూ, భిన్నంగా ఆలోచించేలా చేసాయి. ఒక మిత్రుడి దగ్గర ఈ పుస్తకం చూసి, చదువుకొని, ఏ పుస్తకమూ రెండోసారి చదివే అలవాటు లేకపోయినా, స్వంతంగా ఒక పుస్తకం ఉండాలని కొనుక్కొన్న కాపీ ఇది.

తన శిష్యురాలు ఆనందమయికి ఓషో రాసిన ఉత్తరాలు ఈ పుస్తకం. చాలా మృదువుగా, ప్రేమగా జీవితం పట్ల ఎరుకని బోధిస్తారు ఈ ఉత్తరాల్లో. మేథ తో కాక, హృదయంతో ఓషో భావాలని సమీపించినపుడు, మన జీవితాల్లో అంతకుముందు లేని తాజా వెలుతురు ప్రసరిస్తుంది.

నా వరకూ అన్ని రకాల కండిషనింగ్ ల నుండీ విముక్తం కావటానికి, కాగల ధైర్యం తెచ్చుకోవటానికి చలం తరువాత ఓషో మహోపకారం చేసారని భావిస్తాను.



ఓషో రచనలు ఇప్పుడు తెలుగులో కూడా విరివిగా లభిస్తున్నాయి. ఆన్ లైన్ లో వెదకవచ్చును.

ఏడు పుస్తకాలు : 2. మిర్దాద్ - మైకేల్ నేమీ

మైకేల్ నేమీ అనే రచయిత (కవి?) రాసిన నవల ఇది. జిబ్రాన్ ప్రాఫెట్ ని పోలిన ప్రబోధాత్మక రచన. ఒక మనిషి జీవితాన్ని, దానిలో తోచే అన్నిదోషాలతో సహా ఇంతగా ప్రేమించవచ్చా అని ఆశ్చర్యం కలిగింది చదువుతుంటే. ఇది ఒక పవిత్రమైన రచన అనిపిస్తుంది. కవరు మీది మాటలు ఓషో అన్నవి అనుకొంటాను. అప్పటికి ఓషోని చదవలేదు గనుక చదివే ముందు పట్టించుకోలేదు. చదివాక వాటినీ, ఓషోనీ కూడా పట్టించుకొన్నాను.


ఈ పుస్తకం తెలుగు అనువాదం పిరమిడ్ ప్రచురణగా లభిస్తోంది.
ఇంగ్లీషు పుస్తకం ఆన్ లైన్ సైట్లలో  లభిస్తుంది.


ఏడు పుస్తకాలు : 1. భగవాన్ స్మృతులు - చలం

 శ్రీ రమణమహర్షి సన్నిధిలో జీవించినవారి అనుభవాలని చలం రికార్డు చేసిన పుస్తకం ఇది. ఇది చదివేనాటికి జీవితం గురించీ, మనుషుల గురించి తీవ్రమైన అయోమయంలో ఉన్నాను. ఇది చదివాక, జీవితానికి ఒక అద్భుతమైన లక్ష్యం ఉందనీ, భూమ్మీద దురదృష్టకరమైన మానవజాతిలో నూరుశాతం ప్రేమించదగిన, నమ్మదగిన మనిషి ఒకరైనా జీవించి వెళ్ళారనీ అర్థమైంది.



ఈ పుస్తకం ఇప్పుడు ప్రియదర్శిని ప్రచురణలు, హైదరాబాద్ వారివద్ద లభిస్తోంది. 
శ్రీ రమణాశ్రమం,  తిరువణ్ణామలై వారి వద్ద కూడా లభిస్తుంది.

పుస్తకాలూ - నేనూ

శరత్ బాబు రచనలతో మొదలైన సీరియస్ సాహిత్య పఠనం దాదాపు రెండు దశాబ్దాలు సాగింది. తరువాత ఒక దశాబ్దం ఎంపిక చేసుకొన్న పుస్తకాలు మాత్రమే చదవగలిగాను. చివరగా ఇష్టంగా చదువుకొన్నది నిసర్గదత్త మహరాజ్ సంభాషణల పుస్తకాలు. సుమారు ఏడెనిమిదేళ్ళుగా చదవటం ఆగిపోయింది. ఇప్పుడు చదవమంటే, బడి పుస్తకాలు చదవమన్నంత బాధ.

చదవటం కన్నా చూడటం, స్పందించటం ముఖ్యం. వాటికన్నా లోనికి చూసుకోవటం ముఖ్యం. లోచూపు చిక్కితే, తనకి కావలసినవి చాలాసార్లు తనకే తెలుస్తాయి. దానిని సహజ జ్ఞానం (intuition) అనవచ్చునేమో. ఇదేమీ ప్రత్యేక విద్యా / ప్రతిభా కాదు. అది ఎప్పుడూ ఉన్నదే. లోపలి దుమ్మునీ, గట్టిపడిన భావజాలాలనీ, ఉద్వేగాలనీ, వాటి వెనుక అంతకన్నా బిగుసుకుపోయిన అహంభావాన్నీ ఎంత వదులుకోగలిగితే, అంతగా ఆ స్ఫురణ ప్రకాశిస్తుంది.

కానీ, బహుశా, చదవటంలో ఏమీ లేదు అని తెలిసే వరకైనా, చదవటం మంచిది. దాని వలన మేథ వికసిస్తుంది. చూపు విస్తృతమౌతుంది, అనేక తలాలని తాకుతుంది. అనుభవశక్తీ, వ్యక్తీకరణశక్తీ సున్నితమౌతాయి. పదును దేరుతాయి. తరువాత, వాటితోనే ఆగిపోకుండా, జీవితానుభవంలోకి ప్రయాణించాలి.

ఫేస్ బుక్ లో సునీతా రత్నాకరం గారు ఏడు పుస్తకాల ఆటకి (చాలెంజ్ పదం బాగోలేదు నాకు) టాగ్ చేసినప్పుడు, జీవితంలో ఆయా దశల్లో బాగా లోతుగా తీసుకొన్న రచనలేవా అని చూసుకొంటే, సుమారు ఇరవై పుస్తకాలు గుర్తొచ్చాయి. మరికాస్త జ్ఞాపకంలోకి వెళితే మరో ఇరవై కూడా ఉండవచ్చును. కొన్నిసార్లు పుస్తకం అంటే రచయిత / కవి అని కూడా అర్థం. :) చివరి ప్రభావాలకి సంబంధించిన ఏడు పుస్తకాల గురించి చెప్పదలిచాను గనుక, మిగిలిన లిస్టు ముందుగా రాస్తున్నాను.

బాగా చదివిన రోజుల్లో ఇంగ్లీషు అంతగా రాకపోవటమూ, కొద్దిగా ఇంగ్లీషు వచ్చాక, చదివే ఆసక్తి పోవటమూ జరగకపోతే ప్రపంచ సాహిత్యం బాగా చదువుకొందును కదా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ, దానికేమీ దిగుల్లేదు.

ఇంతకన్నా రాయటం చాతకాకనో, ఇది రాయటం చాతనయో కవిత్వం రాసుకొంటున్నాను కాని, వ్యక్తిగతంగా రచనా ప్రక్రియల్లో నవలకి అభిమానిని. అంత ఊహ ఎలా చేస్తారా అని ఆశ్చర్యం ఏ టాల్ స్టాయో, చండీ దాసో గుర్తుకు వస్తే. తరువాత వ్యాసం, కథ. ఆ తరువాతనే కవిత్వం. ఈ లిస్టు కూడా ఆ విషయాన్నే ధ్రువ పరుస్తుంది. :)

శరత్ శ్రీకాంత్, ఇతర నవలలు, కథలు  
విశ్వనాథ నవలలు, కథలు  
ప్రేంచంద్ నవలలు 

శ్రీశ్రీ మహాప్రస్థానం
చలం మ్యూజింగ్స్, స్త్రీ, ప్రేమలేఖలు, బిడ్డల శిక్షణ
సంజీవదేవ్ దీప్తిధార, ఇతర వ్యాసాలూ
గోపీచంద్ పోస్టు చెయ్యని ఉత్తరాలు 
నండూరి రామమోహనరావు విశ్వదర్శనం 

వడ్డెర చండీదాస్ అనుక్షణికం
విక్టర్ హ్యూగో బీదలపాట్లు
టాల్ స్టాయ్ యుద్ధమూ శాంతి
అలెగ్జాండర్ కుప్రిన్ యమకూపం
అలెక్స్ హేలీ ఏడుతరాలు
అలెగ్జాండర్ డ్యూమా కౌంట్ ఆఫ్ మాంట్ క్రిష్టో

ఖలీల్ జిబ్రాన్ ప్రాఫెట్, ఇతర కవిత్వం  
టాగోర్ గీతాంజలి, మిగతా కవిత్వం 
చలం వెలుగురవ్వలు
మసనోబు ఫుకువోకా గడ్డిపరకతో విప్లవం
జిడ్డు కృష్ణమూర్తి కామెంటరీస్ ఆన్ లివింగ్ 
మహేష్ భట్  యూజీ కృష్ణమూర్తి 
రిచర్డ్ బాక్ నవలలు
పాలో కోయిలో నవలలు 

30 డిసెంబర్ 2017

మరోసారి చలంగారు..

పదిహేడేళ్ళ వయసులో చలం పరిచయం. కవిత్వం ఇంకా బాగా రాయాలనుకొంటూ, మహాప్రస్థానం పుస్తకం తెరిచినపుడు ముందుమాటలో పరిచయమయ్యాడు. ఎవరీయన, ఈ వేగమేమిటి, మాటల్లో తొణికిసలాడుతున్న నిజాయితీ ఏమిటి, ఆలోచనలో నైశిత్యమేమిటి.. ఇలా అనుకోగల స్పష్టత అప్పటికి లేకపోయినా, ఇలా అనిపించే విభ్రాంతి కలిగింది.
తరువాత చాలాకాలం చలం, శ్రీశ్రీలు జోడుగుర్రాల్లా హృదయంలో దౌడుతీసారు. వారి రచనలు దొరికినవల్లా ఆతృతగా చదువుకొనేవాడిని. ఎందుకు చదువుతాం అలా. అక్కడ కనిపించే వాక్యాల్లో మన ఆత్మ ఏదో ప్రతిఫలించినపుడు అలా వెదుక్కొంటాం మాటలకి.
ముప్పై ఏళ్ళు పైగా గడిచింది. ఇపుడు శ్రీశ్రీ పై ఏమీ ఆసక్తిలేదు, చలం కూడా. ఆ మధ్య మ్యూజింగ్స్ తెరిచి చదవబోతే, పేలవంగా తోచింది. ఇలా అంటే చలం మతస్తులకి కోపం రావచ్చు, చలం ఉంటే మాత్రం తప్పక సంతోషిస్తాడు. ఏ భావజాలమైనా రిజిడ్ గా మారటం నుండే మతం లేదా ఫాసిజం పుట్టుకొస్తుంది. జీవితం ప్రవాహ సదృశం. దాని వేగాన్ని, ఇప్పటికైతే, మనిషి అందుకోలేదనే నాకనిపిస్తుంది. చలం వల్ల నాకు కలిగిన ప్రయోజనాలన్నిటినీ ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం పట్ల నాదైన మెలకువ తెచ్చుకోగల ధైర్యాన్ని పొందానని చెప్పాలి.
వివరంగా చెప్పాలంటే ఒక్క చలం లో అనేక చలాలున్నారు. వాళ్ళు ఇవాల్టి హిపోక్రాట్స్ లో ఉండే బహుముఖాల మనుషులుకాదు. తనలోని బహుముఖాల్తో విశ్రాంతి లేకుండా పోరాడిన చలం, చలంలోని ముఖ్యమైన చలం. తనలోని అసత్యానికీ, సత్యానికీ, సౌందర్యానికీ, వికారానికీ, మంచికీ, చెడుకీ మధ్య జీవితమంతా ఘర్షణ పడ్డాడు. ఎంత బాధ కలగనీ బయటివాళ్ళవల్లా, తనవల్లా తనకి. విలువలనే గెలిపించుకోవాలని తపన పడ్డాడు. విలువలంటే మంచీ, సౌందర్యమూ, సత్యమూ. ఆ ఘర్షణలోంచి దొరిలిన ముత్యాలే చలం మాటలు, చాలా సందర్భాల్లో. చాలా సందర్భాల్లో తానేమి రాయనక్కర్లేదో అవికూడా రాసాడాయన. కీర్తిలో సింహభాగం ఆయనకి వాటివల్లే దక్కింది.
ఇక, నాకు నచ్చిన చలాలు ముగ్గురు. 1. మ్యూజింగ్స్ చలం (తక్కిన వ్యాసాల పుస్తకాలు ప్రేమలేఖలు, స్త్రీ, బిడ్డలశిక్షణ కూడా) ఈయనను ముఖ్యంగా మేథావి చలం అనవచ్చు. 2. గీతాంజలి చలం (టాగోర్ తో పాటు ఉమర్ఖయ్యాం అనువాదాలు కూడా) ఈయన కవి చలం. 3. అరుణాచల చలం (భగవాన్ స్మృతులు, వెలుగురవ్వలు మొదలు అరుణాచలం నుండి రాసిన రచనలు) ఈయన అన్వేషకుడు చలం. ఈ ముగ్గురు చలాలూ ఆయా తరుణాల్లో వరుసగా నాకు పరిచయమై నాకిక వేరే తోచకుండా చేసారు. ఇక వివరంగా రాయాలనిపించట్లేదు.. చాలేమో.
చలమే లేకపోతే.. అనిపిస్తుంది ఒక్కోసారి. అరుణాచలంలో చలం సమాధి ముందు నిలుచున్నపుడు ఆగకుండా ఒకటే కన్నీరు. ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు.

13 ఫిబ్రవరి 2017

మనస్సుకీ, హృదయానికీ భేదమేమిటి?

వేర్పాటు భావమే మనస్సు, ఏకత్వ భావమే హృదయం.
మనస్సు భయాన్నీ, కోరికనీ పుట్టిస్తుంది,
హృదయంనుండి ప్రేమా, పంచుకోవటం వికసిస్తాయి.
హృదయం ఆనందాన్ని మిగిల్చే బాధ కలిగిస్తే,
మనస్సు బాధని మిగిల్చే సంతోషాన్నిస్తుంది.
నువ్వు కదిలినపుడు మనస్సువి, నిశ్చలంగా ఉన్నపుడు హృదయానివి.
నేను అది, నేను ఇది అనే భావాలే మనస్సు, 
'నేను' అనే స్వచ్చమైన స్పురణయే హృదయం.

పరిశీలించుకొని చూస్తే 
మనస్సుగా ఉన్నపుడు భారంగా, యాంత్రికంగా, నిద్రాణంగా ఉంటాం.
మనపట్లా, లోకం పట్లా మన చూపు నకారాత్మకంగా, వినిర్మాణంతో ఉంటుంది. 
మనం హృదయంగా ఉన్నపుడు అందంగా, తేలికగా, సృజనాత్మకంగా ఉంటాం.
మన చూపు గుణాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉంటుంది.

మనస్సు నుండి వ్యాఖ్యానిస్తే,
మన జీవితం, మనస్సుకీ, హృదయానికీ నడుమ జరిగే యుద్ధం, 
హృదయం నుండి వ్యాఖ్యానిస్తే,
పోలికేలేని ఒక శ్రావ్య జీవన గీతం.


What is the difference between mind and heart?

A sense of separation is mind, 
Sense of oneness is heart.
Mind generates fear and desire, 
Heart flowers with love and sharing. 
Heart produces joyful pain and mind produces painful joy. 
You are mind, when you move; heart, when you are still.
I am that or this is mind, Pure sense of 'I' is heart.

If we observe ourselves,
When we are mind,
we feel heaviness, boredom, sleepy.
We remain negative and destructive towards ourselves and others.

When we are heart,
we feel lighter, creative and beauty.
We remain positive and constructive.

And all our life is, 
continues battle between our mind and heart,
when we comment from mind.
an unique melodious song of life
when we comment from heart.

21 జూన్ 2016

నువ్వు ప్రత్యేకం..

నిన్ను గౌరవించు, ప్రేమించు.
కారణం,
నీ వంటి మనిషి ఇంతకుముందు లేడు, ఇకముందు రాడు.

~ ఓషో

ప్రతిమనిషీ ఈ చైతన్యంలో తనదైన ప్రత్యేకతతో వ్యక్తమైనవాడే. ఈ విశ్వచైతన్యపు ప్రత్యేక అభివ్యక్తిగా వచ్చినవాడే. ఆ మాటకి వస్తే, ఈ చేతనావరణమంతా నిత్యనూతనమే, ఎప్పటికపుడు ప్రత్యేకమే.

తానెంత ప్రత్యేకమో గుర్తించటం అంటే, మిగిలిన మనుషులూ, చైతన్యమూ ప్రత్యేకం కాదని అనుకోవటంకాదు. అట్లా అనుకోవటం, తనని కూడా ప్రత్యేకం కాదనుకోవటమే.

వాళ్ళూ, అవీ, అన్నీ తనలాగే, తమదైన ప్రత్యేకతతో వెలుగుతున్నాయని గుర్తించినపుడే, మన ప్రత్యేకత పట్లకూడా మనకొక సహజమైన, సజీవమైన ఎరుక కలుగుతుంది.

జీవితంలోని, చైతన్యంలోని ఈ వైవిధ్యాన్నంతా ఎప్పటికప్పుడు గుర్తించటం అంటే, ఎప్పుడూ తాజాచూపుతో తాజాగా జీవించటం.

మన పదాలూ, భావజాలాలూ, బంధాలూ, వ్యవస్థలూ మనల్ని మూసగా మిగిలే నిర్జీవ ప్రపంచంలోకి నెడుతూనే ఉంటాయి. ఈ మూసలో మనమొక ప్రత్యేకమైన మూసగా నిలవడానికి తపన పడుతుంటాము.

మనకు కూడా ఎరుక లేకుండా, మనలో జరిగే నిజమైన ఘర్షణ అదేనేమో. మన లోపలి జీవితానికీ, మృత్యువుకీ; మనలోని మెలకువకీ, నిద్రకీ; ప్రేమకీ, భయానికీ; ఆశ్చర్యానికీ, అలవాటుకీ నడుమ జరిగే ఘర్షణనే మన నిజమైన యుద్ధక్షేత్రం అనుకొంటాను.

మనమొక వీరుడిగా నిలబడవలసిన స్థలం మన అంతరంగమే అయి ఉంటుంది. మెక్సికన్ జ్ఞాని డాన్ జువాన్ అందుకనే వారియర్ అనే మాట ఉపయోగిస్తూ ఉండేవారు.

అక్కడ కన్ను తెరిస్తే ఎంత అందం, కన్నుమూస్తే ఎంత దుఃఖం!

~ బివివి ప్రసాద్

20 జూన్ 2016

అష్టావక్రగీత కథ

అష్టావక్రగీత కథ

అమెరికాలో కెరీర్ లో మంచిస్థితిలో ఉన్న మిత్రుడొకరు నిన్న ఫోన్ చేసి ఈ భగవద్గీతా, ఉపనిషత్తులూ ఒకసారి చదవాలనుకొంటున్నాను, తెలుగులో ఎక్కడ దొరుకుతాయి అన్నపుడు, కాస్త నవ్వూ, విచారమూ కలిగాయి.

కొన్ని చదవటం అంటే ఊరికే సరదా కాదు. కొన్ని వృధా చర్చల కోసం సమాచారం ప్రోవు చేసుకోవటంకాదు. నాకు ఎంత తెలుసో చూడు అని చెప్పుకోవటానికీ, నీ నమ్మకాలనీ, వాటి వెనుక ఉన్న నీ ఇగో నీ ఇతర్లపై బలవంతంగా రుద్దటానికీ కాదు.

కొన్ని చదవటం అంటే, ఇప్పటి వరకూ నువ్వు అనుకొంటున్న నిన్ను వదులుకోవటానికి సిద్ధపడటం, మరణించి మళ్ళీ కొత్తగా పుట్టటానికి సాహసించటం. అలా చదవగలిగినపుడే కొన్ని చదవాలి. లేదంటే రాళ్ళని తాకే సెలయేటి పరుగులా, అవి ఏ మంత్రమయలోకాలకీ తీసుకుపోకుండానే, నిన్ను విడిచివెళ్ళిపోతాయి. అందుకే కొన్ని ప్రాచీన గ్రంధాలు 'ఇప్పుడు' అని మొదలుపెడతారు. అంటే, నువ్వు సిద్ధపడి ఉన్నావు గనుక, ఇప్పుడు మాట్లాడుకొందాం అని.

నిజంగా, అలా చదవగలిగితే, 'ఇప్పటికైనా నువ్వు ఏమిటో, నీ జీవితం ఎందుకో తెలుసుకోవాలన్న జ్వరం కనుక పుడితే, మరింత సూటిగా నిన్ను తాకే వేరే గ్రంధాలు కూడా ఉన్నాయి' అని చెప్పాలనిపించింది కాని, అందరిలానే ఆ మిత్రుడూ కేవలం పైపైన బ్రతకటానికే ప్రాధాన్యత ఇస్తాడని తెలుసు గనుక, నాకు తెలిసిన సమాచారం ఏదో చెప్పి ఊరుకొన్నాను.

అట్లా అత్యంత శక్తివంతంగా, నువ్వు అనుకొంటున్న నిన్ను దగ్ధం చేసి, నిజమైన జీవితానుభవంలోకి, నిరపేక్షసత్యంలోకి మేల్కొలిపే గ్రంధాలని స్వరూపవర్ణన గ్రంధాలుగా చెబుతారు. స్వరూపవర్ణన అంటే 'ఆత్మ' లేదా 'తాను' లేదా 'నేను' అంటే ఏమిటో, దానిని ఎలా తెలుసుకోవాలో తెలియచేసే గ్రంధాలు.

వాటిలో నేను చూసినవి ( చదివినవనీ, అధ్యయనం చేసినవనీ అనటంలేదు) అష్టావక్రగీత, ఋభుగీత, అవధూతగీత, యోగవాసిష్టం, త్రిపురారహస్యం ఇత్యాదులు. వీటిలో చాలా వరకూ గురు,శిష్య సంవాద రూపంలో ఉంటాయి. శ్రీ రమణమహర్షి తరచూ వీటిని ప్రస్తావించేవారు. అంతేకాక వాటికి సంబంధించిన కథలు కూడా చెప్పేవారు.

వాటిలోకి ప్రవేశించటానికి యోగ్యత ఎలా, ఎంతగా ఉండాలో ఆ కథలు చెబుతాయి. వాటిలో ఈ రచయితకి అత్యంత ప్రేమాస్పదమైన ఒక కథ ఇక్కడ చెబుతున్నాడు.

ఒకానొక జనకుడి కొలువులో వేదాంతసభ జరుగుతూ వుంటుంది. చర్చలో భాగంగా ఒకరు ప్రాచీనులు చెప్పిన శాస్త్రవాక్యం ఒకటి చెబుతారు. 'ఆత్మజ్ఞానం పొందటానికి ఏమంత సమయంపట్టదు. గుర్రపు రికాబులో ఒక కాలు ఉంచి, రెండవ ప్రక్క రెండవ కాలు వేసేలోగా ఆ జ్ఞానం పొందవచ్చును' అని ఆ వాక్యానికి అర్థం.

అప్పుడా జనకుడు ఈ శాస్త్రవాక్యం నిజమేనా అని అడుగుతాడు. వాళ్ళు నిజమే అంటే, నిరూపించగలరా అంటాడు. మేము అంత శక్తిగలవాళ్ళం కాదంటారు. జనకుడు దండోరావేయిస్తాడు, ఈ శాస్త్రవాక్యం నిజమని నిరూపించగలవారికి తగిన బహుమానం ఇస్తానని. ఆ మాట, అరణ్యంలో ఉన్న అష్టావక్రమహర్షిని చేరుతుంది. ఆయన రాజసభకి వస్తారు,, తాను నిరూపిస్తానని చెబుతారు.

జనకుడు సరేనన్నాక, బయట గుర్రం నిలబెడతారు. రాజు ఒక పాదం రికాబులో ఉంచుతాడు. అప్పుడు, మహర్షి నీకు జ్ఞానం బోధిస్తున్నాను గనుక, నాకు గురుదక్షిణ ఇవ్వాలి అంటారు. బోధన అయ్యాక కదా దక్షిణ ఇవ్వాల్సింది, కానీ, ముందుగా అడగటానికి కారణం ఉంది. జ్ఞానం పొందినవాడికి ఇక అన్యత్వభావం (తన కంటే వేరుగా ప్రపంచం ఉంది అనే భావం) నశిస్తుంది. తనకి అన్యంగా ఏదీ లేదు గనుక, గురువూ ఉండడు, దక్షిణా, ఇవ్వటమూ కూడా ఉండవు.

జనకుడు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో చెప్పమంటాడు. మహర్షి 'నేను, నాది అనుకొంటున్న సమస్తాన్నీ నాకు ఇవ్వ'మంటాడు. జనకుడు 'ఇచ్చాను' అంటాడు. అంతే. ఇక జనకుడు శిలాప్రతిమలా నిలబడిపోతాడు. నేను, నాది అనేభావాలతో కూడిన సమస్తాన్నీ, అంటే, నాది అనిపించే దేహంతో సహా, మనస్సుతో సహా మహర్షికి ఇచ్చేసాడు జనకుడు. ఇక తనపై తనకి ఏ ఆధిపత్యమూ లేదు. అసలు తానే లేడు. నేను అనుకొంటున్నది అంతా గురువుకి ఇవ్వగానే, ఇక ఏదీ, ఎవరిదీ కాని శుద్ధమైన ఎరుక మాత్రమే మిగిలింది.

కాలం గడుస్తున్నా స్థాణువులానే నిలబడిపోయిన రాజుని చూసి, పరివారం ఆందోళన పడ్డారు. ఈ ఋషి రాజుగారిని ఏదో చేసాడని భయపడ్డారు, మళ్ళీ ఆయన్నే ప్రార్ధించారు, మా రాజుగారిని మాకు ఇవ్వమని. మహర్షి 'నాయనా, ఇక కదులు' అన్నారు. గురుస్వాధీనమైన ఆ దేహం, మనస్సూ గురువాజ్ఞతో కదిలాయి.

ఇప్పుడు నీస్థితి ఎలా ఉందో చెప్పమంటారు అష్టావక్రుడు. జనకుడు పరమానందంతో, ఆశ్చర్యపోతూ చెబుతాడు. ఇట్లా, ఆ గురుశిష్యుల పరమస్వచ్ఛమైన సంభాషణతో అష్టావక్రగీత మొదలవుతుంది. స్వరూపం అంటే ఏమిటో, ఈ దృశ్యమాన ప్రపంచం ఏమిటో, వీటి వింతవింత లేమిటో ఎంతో కవితాత్మకంగా మాట్లాడుకొంటూ వారి సంభాషణ నడుస్తుంది.

వారికి నీడగానైనా నడిచేంత హృదయనైర్మల్యం సాధిస్తే, అలాంటివారికి అష్టావక్రగీత ఎనలేని మేలు చేస్తుంది.

~ బివివి ప్రసాద్