28 సెప్టెంబర్ 2014

స్వభావం

ఒకే స్వభావంతో ఎప్పుడూ జీవించటం కష్టంగా వుంటుంది

ఈ పూలు బావున్నాయన్నావు కదా ,
ఇవాళ ఎందుకు చూడవు అంటారు మిత్రులు
నిన్న ఆ మాటన్న మనిషి ఇప్పుడు లేడు
ఆ పూలని చూస్తే అదే విస్మయం ఎలా కలుగుతుంది

ఎంత త్వరగా మారిపోతావోనని ఆశ్చర్యపోతారు

మారకుండా నిన్నటి స్థలంలోనే నిలిచి
నిన్నటి జీవితాన్నే మరోసారి జీవించటం  
ఎలా సాధ్యమవుతుందని నీకూ ఆశ్చర్యం

జీవితం లోలోపలికి ప్రవేశిస్తున్నపుడల్లా
మునుపటి నిర్వచనాలూ, కలలూ, సంతోషాలూ వెలిసిపోతాయి
బాల్యంలోని ఆటబొమ్మలై మిగులుతాయి

జీవితమంటే ఏమిటో తెలియటంలేదు కాని
ఆ ప్రశ్న తరువాత మేలుకొనే ఆశ్చర్యపు లోతుల్లో
జీవితం మరింత కొత్తగా మెరుస్తూనే వుంది

ఇక మునుపటి చూపు మిగలదు, స్పర్శ మిగలదు
మాటకందని అనంతమేదో
ఏ స్వభావంలోనూ నిలబడనీయక తనతో తీసుకుపోతుంది

బహుశా, జీవించటమొకటే నీ స్వభావంగా తీర్చిదిద్దుతుంది

25 సెప్టెంబర్ 2014

అదేంకాదు కానీ..

అదేంకాదు కానీ, కొంచెం నిర్లక్ష్యంగా బతికి చూడాలి

దిగంబరా లేచిరా అంటే దిగ్గున నిలబడ్డ బైరాగిలా
ఆకాశం తప్ప మరేమీ అక్కర్లేని అవధూతలా
గాలిపడవ తెరచాపై ఎగిరే ఎండుటాకులా నిర్మోహంగా నిలవాలి  

దేనిలోంచీ దేనిలోకీ నాటుకోని
అలలమీది ఆకాశబింబాల్లా కాస్త తేలికగా చలించాలి  

ఏముందిక్కడ మరీ అంత బాధపెట్టేది
మరీ అంత లోతుగా ఆలోచించవలసింది

మర్యాదలన్నీ గాలికొదిలేసి చూడాలి
భుజమ్మీద వ్రేలాడే బాణాల్నీ, లక్ష్యాల్నీ  
కాసేపు మరపు మైదానంలో వదిలేసి రావాలి

వేటినీ మోసేందుకు మనం రాలేదనీ
జీవనమహాకావ్యం మననే ఓ కలలా మోస్తోందనీ
నీటిబుడగ చిట్లినట్లు చటుక్కున స్ఫురించాలి

అదేంకాదు కానీ, జీవితాన్ని జీవితంలా ప్రేమిస్తూ బతకాలి
అవమానాలూ, ఆందోళనలూ అట్లా ఓ పక్కకి విసిరేసి
లోకం నిండా నాటుకుపోయిన నాటకవిలువల్ని చూసి
జాలిజాలిగా, సరదాగా నవ్వాలి

ఏముందిక్కడ మరీ అంత పొంది తీరవలసింది
పోగొట్టుకుని గుండెచెదిరి రోదించవలసింది

దిగులు సాలెగూళ్ళన్నిటినీ
చిరునవ్వు కుంచెతో శుభ్రంచేసి
విశాలమైన ఆకాశాన్ని చిత్రించి చూడాలి

చూడాలి మనం చిత్రించిన ఆకాశం నిండా
ధగధగలాడుతోన్న ఎండ సంరంభం
వానబృందం ప్రదర్శించే సంగీతనృత్యరూపకం
చలిరాత్రుల వికసించే గోర్వెచ్చని ఊహల పరీమళోత్సవం

అదేంకాదు కానీ
జీవితం లోపలి దృశ్యాలన్నీ బరువెక్కినప్పుడైనా
జీవితమే ఒక ప్రతిబింబం కావటంలోకి కనులు తెరవాలి

____________________
ప్రచురణ:  సారంగ 18.9.14

10 సెప్టెంబర్ 2014

వానాకాలంలో

వానాకాలం జీవితానికి ఉత్సవ సమయమైనట్టు
ఎక్కడెక్కడినుండో పుట్టుకొస్తాయి రకరకాల జీవులు

అప్పటివరకూ
ఏ నేలపొరల్లో లేదా గాలితెరల్లో దాగాయో,
ఆకాశంలో తేలే పలు స్వప్నలోకాల సంచరించాయో కాని

ఆకాశం జలదేహం దాల్చి భూమిని హత్తుకొన్నాక 
అప్పుడే విచ్చుకొన్న కళ్ళల్లో ఆకాశాన్ని దాల్చి 
గాలికి రాగాలు అద్దుతూ భూమ్మీద తెరుస్తాయి మరికొన్ని కొత్త కచేరీలు

నిన్నటివరకూ పొడిగా, శుభ్రంగా ఉన్న నేలపైనా, గోడలపైనా
ఒకటే జీవుల సందడి
ఏమరుపాటున నడిస్తే కాలికింద ఏ ప్రాణం పోతుందోనని
తెల్లనిమేఘాల వెంట గాలిపటంలా పరిగెత్తే చూపుల్ని
బలవంతంగా నేలకి లాగుతావు నువ్వు

ఒక చీమలబారో, గొంగళిపురుగో, కప్ప అరుపో
నీ చైతన్యాన్ని తాకిన ప్రతిసారీ
నువ్వు ఒంటరివాడివి కావని
జీవితం నీ చెవిలో గుసగుసలాడినట్లనిపిస్తుంది

____________________

04 సెప్టెంబర్ 2014

సీతాకోకా!

ఈ సిమెంటు మెట్లపైన నీకేం పని సీతాకోకా

పూలని సృష్టించుకొన్న జీవితం
తృప్తిలేక ఎగిరే పూవుల్లా మిమ్మల్నీ కలగంటోంది సరే
మాలోపలి మోటుదనంతో సరిపెట్టుకోక
సిమెంటుతో కట్టుకొన్న మా కవచాలతో నీకేం పని

ఊరికే ఎందుకలా గాలికి రంగులద్దుతూ ఎగురుతావు
ఆకాశాన్ని నీ సుతిమెత్తని రెక్కల్తో నిమురుతావు
విచ్చుకొన్న నవ్వులాంటి ఎండ పెదవుల పైన 
ప్రేమ నిండిన పదంలా సంచరిస్తావు

మరింత ఇరుకుదారులు వెదుక్కొంటూ
నన్ను నేను గొంగళిపురుగుగా మార్చుకొంటున్నపుడు
కాలం మీటుతున్న నిశ్శబ్దగీతాన్ని కళ్ళముందు పరుస్తూ
నాదారికి అడ్డుపడతావెందుకు నా ప్రియమైన సీతాకోకా  

సూర్యుడువాలే ఏ దిగంతాలరేఖమీదనో
ఇటునించి నేను చీకటిలానూ
అటునుంచి నువ్వు ఆకాశపుష్పం రాల్చే రంగుల్లానూ
కలిసే వరకూ నన్ను ఇలా ఉండనీయవా సీతాకోకా

________________
నవ్య వారపత్రిక 10.9.14  

03 సెప్టెంబర్ 2014

సాయంత్రపు నడక

నువ్వు నడవక తప్పదని వైద్యులు చెప్పినపుడు
రోజువారీ పనుల్నీ అటూఇటూ సర్ది
ఖాళీ సాయంత్రాలని సృష్టించడం కష్టంగా తోచింది కానీ,
రోగాలూ మేలుచేస్తాయని నడక మొదలయ్యాక తెలిసింది   

కాలేజీస్థలంలోని వలయాకారపు నడకదారిలోకి
గడియారమ్ముల్లులా చొరబడినప్పుడు  
విస్మృత ప్రపంచమొకటి నీ వెలుపలా, లోపలా కన్ను తెరుస్తుంది

చుట్టూ మూగిన చిక్కటి చెట్లు
వేల ఆకుపచ్చని ఛాయల్ని     
వెలుగుకీ, చీకటికీ మధ్య మెట్లుకట్టి చూపిస్తాయి

అడుగుకొక రూపం దాల్చుతూ చెట్లు
రహస్యసంజ్ఞలతో పిలిచే అదృశ్యలోకాల్లోకి
ఆశ్చర్యంగా దారితప్పుతావు కాసేపు 

లోపల ముసురుకొన్న చిక్కుల్లోంచి
అకాశాపు మైదానంలో ఆడుకొనే పిల్లగాలుల్లోకీ  
సాయంత్రపు కిరణాల జారుడుబల్లల మీదికీ వాలిపోతావు     

దారినీ, మనస్సునీ ఇరుకుచేసే సహపాదచారుల సంభాషణల్లోంచి
విశాలత్వంలోకి ఎగిరేందుకు చూపుని ఆకాశం వైపు మళ్ళిస్తావా
'వచ్చావా' అంటుంది ఆకాశం

'నీ అనారోగ్యం పంపిస్తే నువు ఇక్కడికి రాలేదు,
నేను రప్పించుకొంటే వచ్చా' వన్నట్లు నిర్మలంగా నవ్వుతుంది

అనాది ఆకాశం క్రింద అనాది హృదయ స్పందన ఒకటి
మౌనంగా ప్రేమ వృత్తాలు చుడుతుండగా
చిక్కబడుతున్న చీకటిలోపల నీడలూ, చెట్లూ, నువ్వూ
నిశ్శబ్దంలో ప్రవేశించే చివరి శబ్దాలలా కరిగిపోతారు

_____________
వాకిలి సెప్టెంబర్ 14