22 ఫిబ్రవరి 2021

కవితలు : ఊహ, అనంతంలోకి

ఊహ


ప్రతిదీ నీ ఊహ మాత్రమే అన్నాడు
ఈ నక్షత్రాలు..
అవును
గాలివలయంలాంటి జీవితం..
అవును
ఇక ఏం మాట్లాడాలి నీతో అన్నాను
ఏమీ మాట్లాడలేదు
..
తెల్లవార బోతోంది
మరొక రేయిని జారవిడిచిన లోకం
తేలికగా శూన్యంలో చరిస్తోంది
మాటల వెనుక మాయమైన జీవితం
పాపాయిలా కళ్ళు తెరుస్తోంది



అనంతంలోకి 
 
అనంతంలోకి ప్రవేశించాక
వెనుతిరిగే వీలు లేకుండా
తలుపులు మూసెయ్యాలి​​

అప్పుడుగానీ నీ కర్థం కాదు
తలుపు లనేవి ఎప్పుడూ లేవని
కనుక మూయటమూ లేదని
వెనుతిరగటానికి స్థలమే లేదని

ప్రవేశించటమే లేదు గనుక
అనంతమూ లేదని, అంతమూ లేదని

అవునూ, అర్థమంటే ఏమిటి
నువ్వంటే ఏమిటి


ప్రచురణ : సారంగ 15.2.2021

14 ఫిబ్రవరి 2021

కవిత : కడపటి ఖాళీ నుండి..

వెన్న కరిగి నేయి అయినట్లు
అంధకారం కరిగి కాంతి అయినట్లు
నీ ఉనికి కరిగి జీవిత మౌతావు
దుఃఖం కరిగి ఆనందానివీ
భయం కరిగి ప్రేమవీ
తెలియనిది కరిగి జ్ఞానానివీ అవుతావు

పక్షి ఎగిరిపోయిన ఖాళీలో
పక్షిని కలగన్న ఆకాశం మిగిలే వుంటుంది
పూవు రాలిపోయిన కొమ్మ చివర
పూవుని కలగన్న గాలి వలయాలు తిరుగుతుంది
కల మాయమైన కారు చీకటిని
కలగనేవాడు కౌగలించుకుని నిద్రిస్తాడు

ప్రపంచం చెరిగిపోయిన కడపటిఖాళీని
ఎప్పుడూ, ఎక్కడా లేనిది
ఎన్నడూ విడువక పట్టుకుంటుంది

లేనిదానిని ఉన్నది ప్రేమించినట్లే
ఉన్నదానిని లేనిది పొదువుకొని వుంటుంది
వెలుగూ, చీకటీ అనే పేర్లు తప్ప
ఛాయలు మార్చుకొంటున్న ఆకాశం ఒకటే

ఏవో కాలాల లోపల తడిశాక
ఏవో దేశాల వెంబడి తడుముకొన్నాక
వెర్రిగా ఏడ్చాక, నవ్వాక, ఎదురుచూసాక
నిన్ను నువ్వే లాలనగా ఓదార్చుకొన్నాక
అకస్మాత్తుగా తెలుస్తుంది
ఎప్పుడూ, ఇక్కడే ఇలానే నిండుగా ఉన్నావని


08 ఫిబ్రవరి 2021

కవిత : ఉన్నపళంగా ..

 


కవిత : మిగిలిపోతూ 

 



కవిత : కలువరేకులా..


ప్రచురణ : పున్నమి 7.2.2021

కవిత : చూసావా

నన్ను చూసావా లో ఇరుక్కోకు
జీవితం బావుంటుంది అన్నాడతను
పూవుని పూవుకన్నా కోమలంగా
తాకటానికి ప్రయత్నిస్తూ

నేను చూసాను లో కూడానా అన్నాను
గాలికి ఊగుతున్న
పూవు నీడలోకి తప్పిపోవటానికి చూస్తూ

రహస్యం తెలిసింది నీకు అన్నాడు
నీలాకాశపు తెర వెనుకకు తప్పుకొంటూ
ఎండ కాసేటపుడు అన్నీ తెరుచుకుంటాయి
చీకటితో సహా అన్నాను

కీచురాయి పాట ఎత్తుకుంది
కాలం దానిలోకి జలపాతంలా దూకింది