26 మే 2016

'బ్రహ్మోత్సవం' సినిమా గురించి..


‘బ్రహ్మోత్సవం’ మంచి సినిమాలు కోరుకొనేవాళ్ళు తప్పక చూడవలసిన సినిమా. సినిమా రెండవసారి చూసినపుడు మరింత బాగా అనిపించింది. కొన్ని సీన్లు ఎడిట్ చేయటం వలన అనుకొంటాను, మొదటిసారి చూసినపుడు మొదటిభాగంలో కలిగిన విసుగు కలగలేదు. సినిమాని మరింత బాగా ఆస్వాదించదలిస్తే, కథ ముందుగా తెలుసుకొని వెళ్తే బావుంటుంది. సన్నివేశాలలోని వేగమూ, సంభాషణలలోని లోతూ గ్రహించటానికి కథ ముందుగా తెలియటం ఉపయోగపడుతుంది. 

మనం అన్నీ నోటి దగ్గరకి అందిస్తే తినటానికి అలవాటుపడ్డవాళ్ళం. Flat గా ఉండే పాత్రలు, సన్నివేశాలు, ఏమంత ఆలోచించాల్సిన, అనుభూతించాల్సిన అవసరం లేకుండా, సినిమానే మనకి ఆలోచనల్నీ, అనుభూతుల్నీ బాగా అర్థమయ్యేలా వివరిస్తే మరబొమ్మల్లా వాటిని ఆస్వాదించి వస్తాం. మన ఆలోచనకి, అనుభూతికి, మనకి అలవాటైన ఉద్వేగాలకి పరీక్ష ఎదురైతే ఆందోళనలో పడతాము. మన మానసిక చైతన్యాన్ని మరికాస్త మెరుగుపరిచే ప్రయత్నాలని వెక్కిరింతలతో త్రిప్పికొడతాము.

శ్రీకాంత్ మనకున్న శక్తివంతులైన దర్శకులలో ఒకడు. మంచి అభిరుచి, భావపరిణతి ఉన్నవాడు. సినిమా సమాజానికి ఎంతోకొంత మంచి చేయాలి అనుకొనేవాడు. కమర్షియల్ సినిమాకి, కళాత్మక సినిమాకి మధ్య వారధి కట్టే వీలుందా అని ప్రయత్నిస్తున్నవాడు. అతని ప్రయత్నాలని సామాన్య ప్రేక్షకులు ఎలా ఉన్నా, మంచి సినిమాలు కోరుకొనేవారైనా సానుకూల దృక్పథంతో చూడటం అవసరం అనుకొంటాను.

సినిమాకి సూత్రప్రాయమైన కథ చాలు కానీ, కథనం చాలా ముఖ్యం అనుకొంటాను. కథనంలో చూపించగల పాత్రల రంగులు, వాటి ఉద్వేగాల వెలుగు నీడలు, వీటి లోతునీ, విస్తృతినీ బట్టి ఆ సినిమా ప్రేక్షకుడి పైన ముద్ర వేస్తుంది. చెప్పదలచిన కథ, అది చెప్పటానికి ఎన్నుకొన్న ఉద్వేగాలు, ఆ ఉద్వేగాల్ని ప్రతిఫలించే పాత్రలు, అవి మసలే సన్నివేశాలు, ఆ సన్నివేశాలలోని మాటలు, నిశ్శబ్దాలు. ఇవీ బలమైన సినిమాని నిర్మిస్తాయనుకొంటాను.

ఈ సినిమా కథ కూడా చాలా చిన్నది. తన కష్టంతో పైకి ఎదిగిన సత్యరాజ్ (నటుల పేర్లే రాస్తున్నాను) ఎప్పుడూ తనతో పదిమందీ ఉండాలనుకొంటాడు. అందరూ కలిసి ఉండాలి అనుకోవటమూ, ఎవరికైనా ఎంత ఇవ్వాలనిపిస్తే అంతా ఇవ్వటమూ అతనికి ఇష్టం. నలుగురు బావమరుదులు అతనితో పాటే ఉంటారు. ఈ అయిదు కుటుంబాలు, సత్యరాజ్ స్నేహితులు కలగలిసి మసలే జీవితంలో, అతను మాత్రమే కేంద్రంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్న ఒక బావమరిది, రావు రమేశ్ , తన కూతురిని సత్యరాజ్ కొడుకైన మహేష్ కి ఇస్తే తన హోదా పెరుగుతుంది అనుకొంటాడు.

విదేశాల నుండి వచ్చిన, సత్యరాజ్ స్నేహితుడి కూతురైన కాజల్, మహేష్ ప్రేమించుకొంటారు. కాజల్ స్థిరమైన ఆలోచనలు లేని, స్వేచ్చగా బ్రతకాలనుకొనే అమ్మాయి. వారి ప్రేమ కొంత దూరం నడిచాక, ఆ అమ్మాయి ఇంత పెద్ద కుటుంబంలో, తన స్వేచ్చని పోగొట్టుకొని ఉండలేనని చెప్పి వెళ్ళిపోతుంది. వీళ్ళ ప్రేమకథ తెలిసిన రావు రమేశ్, ఇక తాను సత్యరాజ్ తో కలిసి ఉండలేనని చెపుతాడు. అతనిలో దాగిన అసూయకి, ద్వేషానికి గాయపడిన సత్యరాజ్ కొడుకు మహేష్ తో తన బాధ పంచుకొంటూనే ప్రాణం వదిలేస్తాడు.

ఒంటరిగా మిగిలిన మహేష్ కుటుంబం లోకి , విదేశాలలో నివసిస్తున్న అతని చెల్లెలి స్నేహితురాలు, సమంత ప్రవేశిస్తుంది. ఆమె కూడా మహేష్ లానే నలుగురూ కావాలనుకొనే, జీవితాన్ని తేలికగా గడపాలనుకొనే మనిషి. మహేష్ కుటుంబం ఏటా జరుపుకొనే శ్రీనివాస కళ్యాణం సందర్భంలో ఏడుతరాల ప్రస్తావన వస్తుంది. మహేష్ ఏడుతరాలకి సంబంధించిన బంధువుల్నీ కలుసుకొందామని సమంత, మహేష్ బయలుదేరతారు. వాళ్ళని వెదుకుతూ, కలుస్తూ ఇద్దరూ తిరగటమూ, చివరిలో రావు రమేశ్ కూతురి పెళ్లిలో ఒక విషయం తెలియటం వల్ల అతనిలో వచ్చిన పరివర్తనతో కథ ముగుస్తుంది.

మొదట వచ్చే సమంత సీన్ మినహాయిస్తే, స్నేహితుడి కూతురి పెళ్లి తను జరిపించటంతో కథ మొదలవుతుంది. తరువాత జరిగే శ్రీనివాస కళ్యాణమూ, అందరూ కలిసి ప్రయాణం చెయ్యటమూ, వీటి మధ్యలోనే, మహేష్, కాజల్ ల ప్రేమ కథ, రావు రమేశ్ విడిపోవటం, సత్యరాజ్ మరణంతో మొదటి భాగం ముగుస్తుంది. రెండో భాగంలో సమంత ప్రవేశం, వాళ్ళు బంధువులని వెదుకుతూ, తిరగటం, రావు రమేశ్ కూతురి పెళ్లి ఉంటాయి.

పాతికకు పైగా పాత్రలు, వాటికి తగిన సమర్ధులైన నటులూ ఉన్న ఈ సినిమాలో, కొన్ని పాత్రలు నీడల్లాగానే మిగిపోతాయి. కథ ప్రధానంగా సత్యరాజ్, మహేష్, రావు రమేష్, కాజల్, సమంత ల చుట్టూ తిరుగుతుంది. రెండో ప్రాధాన్యతలో రేవతి, జయసుధ, మరి నలుగురైదుగురు కనిపిస్తారు. వీరిలో మహేష్, రావు రమేష్, సమంత బాగా చేసారనిపించింది. మిగిలినవారంతా తమ పరిధి మేరకు చేసారు. కాస్త సీరియస్ tone లో నడిచే కథలో రెండో భాగంలో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర రిలీఫ్ గా అనిపిస్తుంది.

కుటుంబసంబంధాల విలువని గుర్తుచేసుకోవటానికి ఈ సినిమా చూడాలి. ముఖ్యంగా శ్రీకాంత్ రాసుకొన్న సంభాషణలు కొన్ని ఆలోచించవలసినవి. నా వరకూ, సత్యరాజ్ కూతురి తో సంభాషణ, చివర రావు రమేశ్ సన్నివేశం కళ్ళు తడిచేలా చేసాయి. దర్శకుడు సన్నివేశాలని ఓపెన్ చేసే, క్లోజ్ చేసే పద్ధతి మనకు నలిగిన ఆలోచనా, అనుభూతీ ధోరణులనుండి మనల్ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తుంది. కొన్ని సంభాషణల్లో సాంద్రంగా పలకరించి వెళ్ళిపోయిన భావాలని, సన్నివేశాలుగా డీకోడ్ చేసి ఉంటే, మరో మాటలో, డ్రామా ఇంకా బాగా పండి ఉంటే, ఈ సినిమా మరింత గాఢంగా హృదయాలని తాకి ఉండేది. బహుశా, ఒక క్లాసిక్ గా కూడా మిగిలేది. మహేష్ పాత్రకి కొంత స్పేస్ తగ్గించి, మిగిలిన పాత్రల మధ్య మరికొన్ని సీన్లు వస్తే, కథనంలో మరింత కాంట్రాస్ట్, క్లారిటీ వచ్చేవి అనిపించింది.

కంటినిండా పరుచుకొనే సెట్టింగ్స్, కెమెరా పనితనం, సంగీతం ఈ సినిమాకి నిండుదనాన్ని తెచ్చాయి. కోరియోగ్రఫీ, రీ రికార్డింగ్, ఎడిటింగ్ పరవాలేదు. కారణమేమో కాని, కొన్ని సంభాషణలు సరిగా వినిపించలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన మధుర ఫలం, మరికాస్త పక్వం కావలసిందేమో అనిపించింది. అయినా, ఒక తాజా అనుభూతి కోసం, కాస్త జీవంతో ఉన్న ఆలోచనల కోసం ఈ సినిమా తప్పక చూడాలి.

18 మే 2016

నాలుగు మానసిక శక్తులు:

అనుభవాన్ని చూసే శక్తి, తీసుకొనే శక్తి, నిలుపుకొనే శక్తి, వ్యక్తీకరించే శక్తి అని నాలుగు ఉంటాయనిపిస్తుంది.

అనుభవాన్ని తీసుకొనే చూపు ఎంత విశాలమైతే, సూక్ష్మమైతే, లోతైనదైతే అంతగానూ అనుభవం నాణ్యత ఉంటుంది. ఆ చూపు వికసించటంపైనే దృష్టి నిలిపినవారు, జీవితమంతా పసిపిల్లల్లా నేర్చుకొంటూనే, వికసిస్తూనే ఉంటారు. వీళ్ళే మానవాళికి ముందు నడుస్తారు. పువ్వులో అరణ్యాన్నీ, ఇసుకరేణువులో ఎడారినీ చూడాలని ఒక కవి అంటాడు కదా.

ఇక, అనుభవాన్ని తీసుకోవాలంటే మనసులో తగినంత ఖాళీ ఉండాలి. ఆశ్చర్యపడే గుణం ఉండాలి. తాను అనుభవంలోకి ఇంకిపోయే అమాయకత్వం ఉండాలి. మనుషులు నిజాయితీ గలవారైనపుడు మాత్రమే, అనుభవాలు వాళ్ళపై సూటిగా పనిచేస్తాయి. ఇతరులతో నటించటం అలవాటై, ఇమేజ్ లో బతకటమే సహజమైపోయి, చివరికి తమతో తాము కూడా నటించటంలోనే మునిగిపోయినవాళ్ళు అనుభవాలకి మొద్దుబారిపోతారు. వాళ్ళ జీవితానుభవం మృతప్రాయమౌతుంది.

అనుభవాన్ని నిలుపుకోవాలంటే జీవికి తగినంత ఓపిక ఉండాలి, జీవించటం అంటే చాలా ఇష్టం ఉండాలి. తనతో తనలో తానే నిండిపోవటం తెలియాలి. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి బలమైన జీవులు ఉంటారు.. చాలామందికి అనుభవాన్ని తీసుకొనే వరకూ కంగారు, అనుభవం తాలూకు పరీమళాన్ని మళ్ళీ మాటల్లో ఒంపుకొనే వరకూ ఆరాటం. ఈ తొందర మరీ ఎక్కువ ఉన్నవాళ్ళనే సాధారణంగా అల్పజీవులుగా భావిస్తాము. ఇదేమీ చులకనగా చూడవలసిన విషయంకాదు కానీ, ఇలాంటివాళ్ళు తాము శాంతిగా ఉండరు, ఇతరుల్ని ఉండనివ్వరు.

అనుభవాన్నిదర్శించటమూ, తీసుకోవటమూ, నిలుపుకోవటమూ ఎంతగా చాతనయితే అంతగానూ అనుభవాన్ని వ్యక్తీకరించేశక్తి సహజంగా వికసిస్తుంది. ఆ వ్యక్తీకరణ జీవి నేపధ్యాన్నీ, ఆసక్తినీ, కొద్దిపాటి సాధననీ అనుసరించి మాటల్లో, చేతల్లో, కళల్లో ఏ రూపంలోనైనా ఉండవచ్చు.

మనుషుల చూపు ఎదగనంత కాలం, పరస్పరనిందలతో, హింసతో కాలం గడపటం తప్ప జీవితాలకి శాంతి ఉండదు. సమాజంలో సహజమైన లయ ఏర్పడదు.

~ బివివి ప్రసాద్