30 డిసెంబర్ 2015

భగవాన్ స్మృతిలో..

ఇంగ్లీషు తేదీల ప్రకారం ఇవాళ భగవాన్ శ్రీ రమణమహర్షి పుట్టినరోజు (30.12.1879)

కాస్త సాహిత్యం చదువుకొని, సమాజంలోని అన్యాయాలపై ఆగ్రహంతో ఊగిపోతున్న, ఆదర్శాల కలలు కంటున్నఇరవైఏళ్ళ వయసులో, తెలియని అశాంతి ఏదో మనసంతా కమ్ముకొని, బయటపడే దారి కోసం వెదుక్కొంటున్నపుడు, సౌందర్యస్పృహని బలంగా మేల్కొల్పిన, సమాజంలోని కపట విలువల పట్ల ధిక్కారాన్నినేర్పిన చలమే మళ్ళీ, ఇదిగో నీ గమ్యం ఇక్కడుందేమో చూడు అన్నట్టు ఒక దైవాన్నిజీవితంలో ప్రవేశపెట్టారు. ఆ దైవం పేరు భగవాన్ శ్రీ రమణమహర్షి. ఆయన గురించి  చలం రాయగా చదివిన ఆ పుస్తకం 'భగవాన్ స్మృతులు'.

'ఆధ్యాత్మిక గురువులంటే నిన్నుకండిషన్ చేసేవారు. నీ మనస్సునీ, ఎమోషన్స్ నీ, రీజనింగ్ నీ సహానుభూతితో గమనించకుండా ఆదర్శాలని నీపై మోపుతారు.' అని తెలిసీ, తెలియని భయాలతో, ఊహలతో - మనశ్శాంతికోసం వారివంక చూడటానికైనా తటపటాయించే రోజులలో- చలం రాసారు గనుక, ఆశ్రయించారు గనుక, ఈయనను గురించి తెలుసుకోవాలి అనుకొంటూ తెరిచిన పుస్తకం అది.

పుస్తకం చదువుతున్నపుడు భగవాన్ జీవితఘటనలూ, జ్ఞానం గురించిన ఆయన బోధనలూ, తనచుట్టూ ఉన్న సమస్త జీవులపట్లా ఆయన సహజ కరుణాపూర్ణ స్పందనలూ, అత్యంత సరళమైన జీవనవిధానమూ  తెలుస్తున్నకొద్దీ, ఈయన గురించే కదా వెదుక్కొన్నది అనే భావంతో గొప్ప ఆనందమో, దుఃఖమో మనస్సు నిండా.

బయటి జీవితపు లక్ష్యాలు, తప్పులు, ఒప్పులు, ఆనంద, విషాదాలకన్నా లోతుగా, వాటికన్నా విలువగా,  బాధ్యతగా చేయవలసినది ఉంది, అది తనను తాను తెలుసుకోవటం. ప్రాచీనులు జ్ఞానమనీ, మోక్షమనీ చెప్పింది దీని గురించే. పుస్తకం పూర్తయే సమయానికి అంకురించిన ఇలాంటి నిర్ణయమేదో, తరువాతి జీవితాని కంతటికీ అంతస్సూత్రంగా ఉందనుకొంటాను. 

17 ఏళ్ళ యువకుడొకరు అకస్మాత్తుగా, అకారణంగా మృత్యుభయానికి లోనై, సరే ఈ మృత్యువేమిటో చూద్దామని, శరీరాన్నీ, శ్వాసనీ, మనస్సునీ స్తంభింపచేసి, శరీరం కాలిపోయినా మిగిలే దొకటుందని, అదే తన నిజస్వరూపమని, 'తా'నని అంత సులువుగా గ్రహించిన విషయం, మనం గ్రహించవలసివస్తే, మనతో మనం ఎంత తగాదా పడాలో, మనల్ని ఎన్నివిధాల శుభ్రం చేసుకొంటూ, చేసుకొంటూ వెళ్ళాలో, లోలోతుల్లో కంటా ఎంత నిజాయితీ, ఓర్పూ, సాహసం ఉండాలో.. ఎంత కోమలత్వమూ, కాఠిన్యమూ సమకూడాలో..

'భగవాన్ స్మృతుల' కి చలం రాసిన ముందుమాట ఒక కాలేజీ ఎఫ్ఎం రేడియో కోసం చదివింది ఈ సందర్భంగా మరోసారి మిత్రులతో పంచుకొంటున్నాను.

సుమారు ఇరవై నిమిషాలుండే ఈ ఆడియో రికార్డింగ్ వినదలిస్తే ఇక్కడ క్లిక్ చేయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి