23 ఏప్రిల్ 2016

నిలబడిన చోటు

మిత్రులం మాట్లాడుకొనేటపుడు ఒక్కోసారి, స్టాండ్ పాయింట్ అనే మాట వస్తుంది మా మధ్య. స్టాండ్ పాయింట్ అంటే ఏమిటండీ అన్నాడు ఒక కొత్తమిత్రుడు. మొత్తం జీవితాన్ని చూడటానికి మనలోపల మనం నిలబడివున్న చోటుని స్టాండ్ పాయింట్ గా అంటూ ఉంటాము.

కాస్త సులువుగా అర్థం కావాలంటే, సైకిల్ మీద తిరిగినప్పుడు, మోటారుసైకిళ్ళూ , కార్లూ ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అలాగే మోటార్ సైకిల్ మీదనో, కారులోనో తిరిగినప్పుడు మిగతావి రెండూ ఇబ్బంది పెడతాయి. మనమున్న స్థితిని బట్టి మనకు అసూయ కలిగించేవో, చులకనభావం కలిగించేవో కనిపిస్తాయి. ఇది కేవలం వాహనాల విషయంలోనేకాదు, మనమున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థితులని బట్టి, ఇంకా సూక్ష్మమైన తలంలో (ప్లేన్) చెప్పాలంటే మనకూ, ఇతరులకూ ఉన్న ఇచ్చా, క్రియా, జ్ఞాన శక్తులలోని పోలికలూ, వైరుధ్యాలని బట్టి మనకు తక్కిన మనుషుల పట్ల ఒక అభిప్రాయమూ, బంధమూ ఏర్పడతాయి.

అంటే మనం ఎక్కడ నిలబడి సమస్తాన్నీ అర్థం చేసుకొంటున్నామో, అనుభూతిస్తున్నామో, అనుభవిస్తున్నామో, ఏ భావాల, ఉద్వేగాల, ఆలోచనల సమూహాన్ని నేనుగా, నాదిగా అనుకొంటున్నామో దానిని స్టాండ్ పాయింట్ అంటాము.

నిరపేక్ష సత్యం అనుభవంలోకి రావాలంటే, అర్థంకావటమో, అనుభూతి చెందటమో, నిరపేక్షసత్యం తాను కావటమో జరగాలంటే స్టాండ్ పాయింట్ మారాలి అనుకొంటూ ఉంటాము.

మానసిక ప్రపంచంలో ఒకరినుండి మరొకరికి ఎన్ని వైరుధ్యాలున్నా, ఒకరి చూపు నుండి మరొకరిది ఎంత భిన్నంగా ఉన్నా చివరికి అవన్నీ మనసు నుండి బయలుదేరిన చూపులే గనుక అవన్నీ ఒకలాంటివే అవుతాయి. ఉదాహరణగా చెప్పాలంటే, ఒక విశాలమైన చెరసాలలో ఉన్నవారు, ఆ చెరసాలలో ఎక్కడ నిలబడి తక్కిన ఆవరణని చూసినా వారంతా చెరసాలలో నిలబడి చెరసాలని చూడటమే జరుగుతుంది. అట్లా కాక, ఎవరైనా ఒకరు, దానిగోడలు దాటివెళ్లి చెరసాలని చూడగలిగితే, వారి అవగాహన పూర్తిగా వేరుగా ఉంటుంది.

మనస్సు అత్యంతబలమైన, కానీ, అదృశ్యమైన గోడలతో నిర్మించిన చెరసాల వంటిది. దానిని దాటి మనస్సు కల్పించే జీవితాన్ని చూసినపుడు, అప్పటివరకూ బంధనామయంగా, దుఃఖపూరితంగా తోచిన ప్రపంచం స్వేచ్చామయంగా, దయపూర్ణంగా దర్శనమిస్తుంది.

కాస్త సూక్ష్మ బుద్ధి గలవారికి ఈ మాటలు అర్థంకాగానే అంతా తెలిసినట్టు అనిపిస్తుంది కాని, క్షణమాత్రంగా తెలియటం వేరు, అది అనుభూతిగా వికసించి, అనుభవంగా ఫలించి, చివరకు తానుగా స్థిరపడటంవేరు.

~ బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి