31 జనవరి 2017

గేదెలు

పొలంలో కట్టుతాడు విప్పగానే గేదెలు
నిధి ఏదో దొరికినట్టు గంతులేస్తూ పరుగు తీసాయి
వాటి పట్టరాని సంతోషం చూస్తే 
దేవుడు కాసేపు వాటికి రెక్కలిస్తే బావుండుననిపించింది

ఎందుకంత గెంతుతున్నాయి అని మిత్రుడినడిగితే 
అవి స్వేచ్చ దొరికిందని సంబరపడుతున్నాయి 
తీరా ఇంటికి వెళ్ళాక మళ్ళీ కట్రాళ్ళ దగ్గర నిలబడతాయని చెప్పాడు 

కొంచెం దూరం పోయాక వాటిని చూస్తే గంతులాపి 
వెనక్కి నడుస్తున్నట్టుగా ముందుకి నడుస్తున్నాయి 
మళ్ళీ స్వేచ్చ హరించుకుపోయే సమయం ముందుందని  
ఆపాటికి జ్ఞానోదయం కలిగినట్టుంది 

ఈ మాత్రానికి తొందరెందుకని 
స్వేచ్చాసమయాన్ని ఒక్కొక్క అడుగేస్తూ నెమరేస్తున్నాయి

గేదెలని చూస్తే నవ్వూ, జాలీ పుట్టాయి కాని 
మనల్ని చూసుకొంటే అవి కూడా రావు 

ఇక కానివ్వమని కట్రాళ్ళ దగ్గర నిలబడితే 
ఎవరో ఒకరు వాటిని కట్టాలి 

మనం తెలివైన వాళ్ళం గనుక మనల్నెవరూ కట్టనక్కరలేదు 
మనల్ని మనమే శ్రద్ధగా, జాగ్రత్తగా బంధించుకొంటాం 


23.3.2011
_______
'ఆకాశం' నుండి   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి