11 డిసెంబర్ 2019

కవిత : కోరుకొని చూడు


కోరుకొని‌ చూడు ఏదైనా ఒక కోరిక

తామరాకుపై నీటిబిందువు తొణికినట్లు
వెన్నెలలో దూరంగా వేణువు వినవచ్చినట్లు
కలలోంచి పసిపాప ఇలలోకి నవ్వినట్లు
ఉండివుండీ వేడి నిట్టూర్పు విడిచినట్లు
మొలకెత్తనీ ఒక కోరిక నీ ఉనికి నుండి

వికసించనీ కోరికని
విశ్వమంతా తానై నిండునట్లు
జీవన కలశాన్ని తనలోకి ఒంపు కొనునట్లు
గుండె చెమరింపులో పలువర్ణాల మెరయునట్లు

కోరుకొని చూడు
వానధారల జగతి అంతా తనివిదీరా తడవాలని
ఎండ కన్నుల నిండుగా పండుగై వెలగాలని
మంచురేకులు విచ్చుకొనగా లోకమర్మం తెలియాలని

కోరుకొని‌ చూడు
ప్రాణులన్నీ శాంతిలోనికి ఒదగాలని
ప్రేమతో ద్రవించు జీవితం
మృతిని సైతం మనసు తీరా హత్తుకోవాలని

కోరుకొని‌ చూడు
చిన్ని కోరికనైనా మొలకెత్తనీయని
అంతు తెలియని ఆనంద గగనాన
విశ్వమంతా గుర్తుతెలియక కరిగిపోవాలని

6.4.18 6.10 PM
కవిసంధ్య సెప్టెంబర్ 2019

2 కామెంట్‌లు:

  1. కలలోంచి పసిపాప ఇలలోకి నవ్వినట్లు...

    వానధారల జగతి అంతా తనివితీరా తడవాలని...

    మీ పద ప్రయోగాలకు, భావ వ్యక్తీకరణ శైలికీ ఏ గుండె అయినా తలుపు తెరవాల్సిందే ప్రసాద్ గారూ...

    రిప్లయితొలగించండి