14 ఫిబ్రవరి 2021

కవిత : కడపటి ఖాళీ నుండి..

వెన్న కరిగి నేయి అయినట్లు
అంధకారం కరిగి కాంతి అయినట్లు
నీ ఉనికి కరిగి జీవిత మౌతావు
దుఃఖం కరిగి ఆనందానివీ
భయం కరిగి ప్రేమవీ
తెలియనిది కరిగి జ్ఞానానివీ అవుతావు

పక్షి ఎగిరిపోయిన ఖాళీలో
పక్షిని కలగన్న ఆకాశం మిగిలే వుంటుంది
పూవు రాలిపోయిన కొమ్మ చివర
పూవుని కలగన్న గాలి వలయాలు తిరుగుతుంది
కల మాయమైన కారు చీకటిని
కలగనేవాడు కౌగలించుకుని నిద్రిస్తాడు

ప్రపంచం చెరిగిపోయిన కడపటిఖాళీని
ఎప్పుడూ, ఎక్కడా లేనిది
ఎన్నడూ విడువక పట్టుకుంటుంది

లేనిదానిని ఉన్నది ప్రేమించినట్లే
ఉన్నదానిని లేనిది పొదువుకొని వుంటుంది
వెలుగూ, చీకటీ అనే పేర్లు తప్ప
ఛాయలు మార్చుకొంటున్న ఆకాశం ఒకటే

ఏవో కాలాల లోపల తడిశాక
ఏవో దేశాల వెంబడి తడుముకొన్నాక
వెర్రిగా ఏడ్చాక, నవ్వాక, ఎదురుచూసాక
నిన్ను నువ్వే లాలనగా ఓదార్చుకొన్నాక
అకస్మాత్తుగా తెలుస్తుంది
ఎప్పుడూ, ఇక్కడే ఇలానే నిండుగా ఉన్నావని


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి