03 సెప్టెంబర్ 2011

గాయపడినప్పుడు

అకస్మాత్తుగా గాయపడతాము
మన ప్రాణం నింపి విడిచిన మాటని ఎవరో తేలిక నవ్వుతో చెరిపేస్తారు
పగటి కలలో గాలిపటంలా తేలుతున్నపుడు ఎవరిదో అరుపు దారమై లాగేస్తుంది
కోనేటిలో నిదానంగా ఈదే చందమామకి రాయి తగిలి వేయి ముక్కలౌతుంది
మన ముఖాన్ని కలగంటున్న అద్దం పగిలి మనల్ని అన్నివేపులా విసిరేస్తుంది

అప్పుడు ఎవరో మనల్ని చెరిపేసి మన స్థానంలో గాయాన్ని నిలబెడతారు
అప్పటి నుండి ఒక గాయం మన బదులు మాట్లాడుతుంది, తింటుంది, నిద్రపోతుంది
మనం నవ్వాల్సివస్తే మన బదులు ఒక గాయం నవ్వుతుంది

గాయం గదిలో చేరి చిరునవ్వు కాంతినైనా, ఆర్ద్రవాక్యం వంటి శీతల పవనాన్నైనా
తనలోనికి రానీయకుండా తలుపులు మూసేస్తుంది
స్వాతి చినుకులాంటి గాయాన్ని స్వీకరించి ఆల్చిప్పలు మూసుకొంటాయి
జీవితం గది చుట్టూ దయగా, ఆత్రుతగా పచార్లు చేస్తూ ఉంటుంది

గాయం తపస్సు చేస్తున్నంత శ్రద్దగా, తనతో తాను యుద్ధం చేస్తుంది
పరీక్ష రాస్తున్నంత ఏకాగ్రతగా తనని తాను వ్యక్తం చేసుకొంటుంది
కాంతినిండిన ఒక ఉదయం ఆల్చిప్పలూ, తలుపులూ తెరుచుకొంటాయి
చినుకుతో పోరాడిన జీవి ఏదో
చందమామలా బైటికి వచ్చి జీవితాన్ని కౌగలించుకొంటుంది


__________________
'ఆకాశం' సంపుటి నుండి 

2 కామెంట్‌లు: