12 సెప్టెంబర్ 2012

'ఆకాశం' అందిన క్షణాలు: మానస చామర్తి


మంచి కవిత్వాన్ని ప్రేమించే ఒక పాఠకురాలు మానస చామర్తి.
ఆమె ఆకాశం కవిత్వాన్ని తన బ్లాగు లో ఇలా పలవరించారు.
ఇటువంటి సున్నితమూ, సునిశితమూ అయిన పరామర్శలే కవుల్ని మరింత సృజన చేసేలా కవిత్వోన్ముఖుల్ని చేస్తాయి.
ఒక మంచి అవార్డుతో సమానంగా కవి భావిస్తున్న వారి మాటల్ని చదవండి.


"పంచమహాభూతాలను తోచినట్లు కలిపి, తోచినట్లు విడదీసే ఆటలలో
నిన్ను నువ్వూ నన్ను నేనూ మరిచిపోవడం కవిత్వం " 

- అని కవిత్వాన్ని నిర్వచించిన వ్యక్తి, అక్షరాలలో మహత్తును నింపి మునుపెరుగని మనోజ్ఞ ప్రపంచాన్ని మనకు పరిచయం చేయని మామూలు కవి ఎందుకవుతాడు? సున్నితమైన భావ పరంపరతో, ఆర్ద్రతతో, ఆశావహ దృక్పథంతో సృజింపబడి, "అపారమైన జీవితానుభవం లేనిదే, జీవించే కవిత్వం వ్రాయలేరు" అన్న ఒక సాహితీవేత్త సత్య ప్రవచనాన్ని పదే పదే గుర్తు చేసిన కవిత్వం, బి.వి.వి ప్రసాద్ గారి "ఆకాశం".

"ఆకాశం" చదివాక, అలతి పదాలతో, లోతైన భావాలను పలికించడం ఇంత తేలికా అని అనిపిస్తే, ఆ తప్పు మీది కాదు. కానీ, జీవితపు లోతులు తెలియకుండా, ఈ కవిలా ప్రగాఢమైన తాత్వికతను నరనరాల్లో నింపుకునే ఆలోచనేదీ లేకుండా, అవే పదాలను ఇటుకలు పేర్చినట్లు పక్కపక్కన పేరిస్తే అదీ కవిత్వమే అవుతుందనుకోవడం మాత్రం అపరాథమే అవుతుంది. అందుకే, ఈ సంపుటిని చదివే ముందు, ప్రసాద్ గారి సాహితీ నేపథ్యం కొంత తెలిసి ఉండటం లాభించే విషయమవుతుంది.

(జనవరి - మార్చి 2012 జయంతి త్రైమాసిక సాహిత్య పత్రికలో బి.వి.వి గారి నుండి సాహిథ్య నేపథ్యాన్ని, "ఆకాశం" రచన వెనుకనున్న ఆలోచనలను రాబట్టిన చర్చలో భాగం - )

"వచన కవిత్వం రాస్తున్నపుడు, హైకూల ద్వారా ఏ ధ్యానానుభవాన్ని, ప్రగాఢమైన నిశ్శబ్దాన్ని, నిర్మల హృదయ స్పందననీ ఇవ్వటానికి ప్రయత్నించానో, దానినే వచన కవిత్వంలో కూడా వ్యక్తీకరించాలనుకొన్నాను. హైకూలకు భిన్నంగా, కొంత భూమికనీ, కొంత వాతావరణాన్నీ సృష్టించటం వచనకవిత్వంలో సాధ్యమౌతుంది గనుక, అలాంటి వాతావరణాన్ని ఆవిష్కరించటానికి ప్రయత్నించాను. కవిత్వం రాస్తున్నపుడు, నాకు నేను కొన్ని నియమాలు లేదా గైడ్‌లైన్స్ పెట్టుకొన్నాను. పాఠకుడికి మరింత తేలికగా కమ్యూనికేట్ కావాలి. పాఠకుడు మొదలుపెడితే చాలు, చివరివరకూ చదివించటానికి తగిన వేగం ఉండాలి. ఏ భావాలు చెప్పినా, ఎప్పుడూ ఉండే సున్నితత్వంతో పాటు, ప్రగాఢమైన దయ అంతర్లీనంగా ఉండాలి. తాత్వికానుభవాన్ని మరింత స్పష్టంగా అందించాలి.  కవిత్వం పూర్తిగా గొంతువిప్పి మాట్లాడుతున్నట్లుండాలి.. ఇలాగ. నేను పెట్టుకొన్న నియమాలన్నిటినీ చాలా వరకూ పాటించగలిగాననే సంతృప్తి కలిగింది.

నా కవిత్వంద్వారా నేను వ్యక్తీకరించిన భావాలపై ఎవరి ప్రభావమూ లేదు. కొంతవరకూ టాగోర్, ఖలీల్‌జిబ్రాన్‌ల ప్రభావం ఉందనుకొంటాను. అయితే ఈ సాంద్రమైన భావాలకు మూలాలు ఎక్కడ ఉన్నాయంటే, నేను చదువుకొన్న తత్వచింతనలో ఉన్నాయనుకొంటాను.  - - బి.వి.వి.ప్రసాద్"

"అడవిలో వికసించి రాలిన అనామక పుష్పంలా
ఎవరూ చూడనప్పుడు ఎగురుతూ వెళ్ళిపోయిన పేరు తెలియని పిట్టలా
నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి? నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి"             

-అని ఈ తాత్వికుడు ప్రశ్నిస్తాడొక సందర్భంలో. ఆయన ఈ పంక్తులు రాసినంత అలవోకగా, మనము ఆ ప్రశ్నలకు జవాబులు సాధించడం సాధ్యపడుతుందని నేననుకోను. పునఃపరిశీలిస్తే, కవి చెప్పదలచింది కేవలం బ్రతుకులోని నిర్మలత్వం, నిరాడంబరతలోని సౌందర్యం మాత్రమే కాదనీ, వీటికి భిన్నంగా జీవించదలచినవారికి, కనీసం వారి వారి లక్ష్యాల పట్ల, చేరాల్సిన గమ్యాల పట్ల ఉండవలసిన స్పష్టతను గుర్తు చేయడం కూడానేమో అనిపించింది. ప్రశ్నలు తెలిశాయి. జవాబులు జీవితంలో నుండి వెదుక్కోవాలిక, ఏకాంతాన్ని ఆలింగనం చేసుకున్న క్షణాల్లో!

ఈ రోజు ఎక్కడో ఏ పత్రికలోనో లేవయసు పిల్లవాడొకడు జీవితాంతం పోరాటం సాగించలేక మృత్యువు ఒడిని వెదుక్కుంటూ వెళ్ళాడని తెలిసి వగచి ఆ ఆవేశంలో, మనకే అర్థం కాని ఆరాటంతో కవితను రాయడం, మన దుఃఖానికి ఒక వారధిని నిర్మించుకుని ప్రపంచం మీదకు నెట్టడం. అలా కాక, అటువంటి వారెందరి జీవితాలనో పఠించి, ఆలోచనలను మధించి, నిరాశనో నిస్పృహనో కాక ఆశనూ, బ్రతకలాన్న బలీయమైన కాంక్షను కవితలో చూపెట్టదలిస్తే, అది ఈ సంపుటిలోని "వెళ్ళిపోవాలనుందా" కవితలా కదిలించే కవిత్వానికి నిర్వచనమవుతుంది.

"గెలుపు జ్వరం తగిలిన లోకంలో పరాజితుడవై ఆరోగ్యంగా జీవించు
మర్యాదల ప్రాకారాల ఊపిరాడని మనుషుల్ని దయతో పరిహసించు
సమర్థుల్ని ఈతల్లో కొట్టుకుపోనిచ్చి జీవితం గట్టున ప్రశాంతంగా నిలబడి చూపించు
బ్రతికేందుకు వచ్చావు కనుక బలంగా ఒక బ్రతుకు బ్రతికి చూపించు

కనీసం ఈ గంట బ్రతుకు, కనీసం ఈ రోజు బ్రతుకు
మళ్ళీరాని ఈ లోకంలో, ఇక మనకేమీ కాని లోకంలో
మరణిస్తే మరి ఉంటుందో లేదో తెలీని లోకంలో
చావు ధైర్యంతో ఎప్పటికీ బ్రతికి చూపించు, నిజమైన బ్రతుకు బ్రతికి చూపించు"

పైన ఉదహరించిన పాదాలు మాత్రమే కాక, మొత్తం కవితలో నన్ను ఆకర్షించినదేమిటంటే, కవి ఎవ్వరినీ ద్వేషించమనడు, ఎవ్వరినీ నిందించమనడు. కోపమో బాధో కాదు, కన్నీళ్ళు - కుంటి సాకులూ కాదు, బ్రతకడం నీ కర్తవ్యమంటాడు. నీ కోసం నువ్వు కాలపు కౌగిళ్ళలో నుండి మరొక్క రోజును దొంగిలించుకు దొరలా బ్రతికి చూడమంటాడు. శక్తికి మించిన లక్ష్యాలు, పరుగుపందాలుగా మారిన ఎడారి జీవితాల్లో గుర్రప్పందాలు కాసేపైనా మర్చిపోయి, ఇలా సేదతీరమని చెప్పే కవిత్వం ఈ రోజు మనకు చాలా అవసరం. లోలోపలి సామర్థ్యాన్ని మరొక్కసారి తరచి చూసుకోవటానికి, కనీసం వెళ్తున్న దారి మనమెంచుకున్న గమ్యాలకు చేరవేస్తుందో లేదో చూసుకోవడానికైనా మనిషికి విశ్రాంతి అవసరం. మనసుకు సాంత్వన అవసరం. బ్రతకాలన్న కాంక్ష అన్నింటికన్నా బలంగా అవసరం. ఇవేమీ లేని నాడు రేకులుగా విడివడుతున్న స్వాంతసరోజాన్ని ఒక్కటి చేయలేని అసమర్థతతో జీవితాన్ని ఛిద్రం చేసుకునే మనుష్యులను ఆపడమెవ్వరి తరమూ కాబోదు.

ప్రసాద్ గారు వచన కవిత్వంలోనే కాక, హైకూ రచనల్లోనూ నిష్ణాతులు. హైకూల మీద సాధికారంగా అనేకానేక వ్యాసాలు రాసి, దృశ్యాదృశ్యం, పూలు రాలాయి మొదలైన సంపుటాలు కూడా ప్రచురించారు. హైకూ తత్వమంతా మనిషిని ఈ క్షణంలో నిలబెట్టడంలోనే ఉంటుంది. మౌనాన్నీ, ధ్యాన స్థితినీ, దైవత్వం నిండిన అనుభూతులనీ అవి పరిచయం చేస్తాయి. ఆ ప్రక్రియలో ఆరితేరిన వారవడం వల్లా, ఆ సిద్ధాంతాలను మనస్ఫూర్తిగా నమ్మి నిజజీవితంలోనూ ఆచరించదలచిన పట్టుదల వల్లా, "ఆకాశం"లోనూ ఆ ధోరణిని కొనసాగిస్తారు..

"నీటి నడుముపై నీరెండ మునివ్రేళ్ళు చక్కిలిగిలి పెడుతున్న నవ్వులు" 
"చిత్రకారుని రేఖల వెంట తెల్లకాగితంపై తేలుతున్న బొమ్మలా / సర్దుకునే అలల వెంట కొలనులో తేరుకుంటున్న ప్రతిబింబంలా.."  
"ఉదయాస్తమయాల ఒడ్డుల్ని ఒరుసుకుని / ఒక వెలుతురు నది ప్రవహిస్తుంది"

వంటి బలమైన పదచిత్రాలు కవిత్వంలో కనపడ్డప్పుడల్లా ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి, ఆ చిత్రాల్లో మమేకమైన అనుభూతికి లోనయ్యాను. ఆ హైకూ క్షణాల్లోని దివ్యత్వాన్ని అనుభవించి కళ్ళు తెరిచాను. "అక్షరాల తీగెల్లో విద్యుత్తై విభ్రాంతినిస్తూ, మాట వెళ్ళిపోయాక మన మధ్య కాంతులీనే మౌనమై మిగులుతూ" పరవశింపజేసిన ఈ కవిత్వం నుండి త్వరగా బయటపడడం అసాధ్యం.

రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఖలీల్ జీబ్రాల్ తదితరుల ప్రభావం తన కవిత్వం పైనా, జీవితం పైనా ఉందని సగర్వంగా చెప్పుకునే ఈ కవి, "ఆకాశం"లోనూ ఆ తాత్వికతను నింపే ప్రయత్నాలు చేశారు. కవితాత్మక ధోరణిలో సాగిపోయే ఈ చింతన, ఆలోచనలు రేకెత్తించడంలో ఎక్కడా విఫలమవలేదు.

"అర్థరాత్రి చంద్రుని చుట్టూ అనేక ధ్యానాలు సృజించవచ్చు
అనేక ప్రార్థనల వెన్నెలలు చంద్రునికి అర్పించవచ్చు
అయినా చంద్రుడు చంద్రుడిలాగే ఉండిపోతాడు"

ఏది ఉందో అదే ఉంటుందనీ, ఈ క్షణాన్ని దొరకబుచ్చుకోవడంలోనే మనిషి మనుగడను రసరమ్యంగా మార్చగల రహస్యమేదో ఇమిడి ఉందనీ చాటే ఈ కవిత్వం మలి పఠనల్లో మరింతగా మనసుల్లో ముద్ర వేసుకుంటుంది.

"ఆకాశం"లోని ప్రతి కవితా, కొన్ని మౌలిక సిద్ధాంతాల చుట్టూ పరిభ్రమిస్తుంది. క్షమ, దయ, ఆర్ద్రత, స్నేహ భావం, మూర్తీభవించిన శాంతం ప్రతి కవితనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. కవి తత్వాన్నీ, సాహిత్య నేపథ్యాన్ని, ముందు మాటనూ చదవకుండా, కవిత్వాన్ని కవిత్వంలా కాక పుస్తకంలా చదివే అలవాటున్న పాఠకులకు ఈ సంపుటి పునరుక్తి దోషాలతో నిండి ఉందనే భ్రమ కలుగవచ్చు. కవిత్వమంటే అక్షరమక్షరానా మార్మికత ఉండాలనీ, సంక్లిష్ట పదాడంబరం ప్రతి పుటలోనూ తాండవమాడాలనీ, అలా కానిది కవిత్వం కాదనీ అపోహల్లో బ్రతికే వారికి ఈ పుస్తకం పట్ల చిన్న చూపు కలుగుతుందేమో, - ఆ అభిప్రాయం తప్పనీ, ఒక్కో కవితా చదవగానే నీ హృదిలో నెలకొనే ప్రశాంతతా, కొన్ని సందర్భాల్లో పొడజూపే పశ్చాత్తాపమూ, లోలోపల కరిగిన అహానికి ప్రతీకగా జారే కన్నీరు, ఈ కవిత్వపు విలువని నిశ్చయంగా బలపరుస్తాయనీ చెప్పాలని ఉంది.

సరళతే ఆకాశానికి పట్టుకొమ్మ. ఈ ప్రాథమిక సత్యాన్ని అవగతం చేసుకోవడం, అనిర్వచనీయమైన అనుభూతులను అందుకోవాలనుకునే పాఠకులకు అవసరం. మొత్తం వంద కవితలు ఉన్న ఈ సంపుటిలో ఐదారింటిని మినహాయిస్తే, మిగిలినవన్నీ అగాధమంత లోతైనవీ, ఆకాశమంత విశాలమైన భావ పరిథిని కలవి. 86 మొదలుకుని ఒక పది కవితలు జీవితంలో వివిథ రకాలుగా తనను ప్రభావితం చేసిన పూజ్యులకో, మిత్రులకో కవి ప్రేమతో, సభక్తితో సమర్పించిన నివాళులున్నాయి. అవన్నీ వ్యక్తిగతాలే అయినా కూడా ఎంత బాగున్నాయంటే, వారందరి సత్సంగత్వంతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్న తీరు చూసి అసూయపడేంతలా..!

సంఘంలోని ఆలోచనాపరులను ఆత్మావలోకనం చేసుకునే దిశగా అడుగులు వేయించగలిగితే, అంతకు మించి కవిత్వం సాధించగల పరమార్థం వేరొకటి ఉంటుందనుకోను. మానవ జీవితాలు వికాసోన్ముఖంగా సాగాలన్న అవగాహనతోనూ, తాత్విక వివేచనతోనూ కవితాత్మను పట్టుకునే ప్రయత్నంలో, బి.వి.వి గారు నూటికి నూరుపాళ్ళూ సఫలీకృతులైనారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

"నిరవధికమైన సమాజంలో నివాతదీపమై కాపడవలసింది మానవత్వమనీ దానికి ఏ రూపంలో కేతనాలెత్తినా అని మంచి కవిత్వమ"నీ ప్రతిపాదించిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి మాటల సాక్షిగా, "ఆకాశం" ఈ తరం తప్పక చదవాల్సిన కవిత్వం. పది మంది చేత చదివించబడవలసిన సున్నితమైన, సమున్నతమైన కవిత్వం.

శతవిధాల ప్రయత్నించినా, అచ్చుతప్పులు కనపడని మంచి ముద్రణతో వెలువడ్డ "ఆకాశం" వెల - 70/- ;
ప్రతులకు - పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్, ఫోన్- 040-27678430.
Kinige Link :  http://kinige.com/kbrowse.php?via=author&name=BVV+Prasad&id=125

2 కామెంట్‌లు: