19 సెప్టెంబర్ 2012

ఒక్కొక్క కొత్తమనిషి

ఒక్కొక్క కొత్తమనిషి నా జీవితాన్ని దర్శించినప్పుడల్లా
నేను మరికొంత సంపన్నుడినయినట్లూ,
మరికొంత వెలుతురు నాలో పసిపాపలా పారాడుతున్నట్లూ ఉంటుంది
నా స్వప్న ప్రపంచంలో కొత్త రంగులు ప్రవేశిస్తాయి
ఇంతకు ముందు విని ఎరుగని పిట్టలూ, చూడని పూలూ
తెర ఏదో తొలిగినట్లయి దర్శనమిస్తాయి

ఒక్కొక్క కొత్తమనిషి నా కాంతిలోకి ప్రవేశించినపుడల్లా
అపుడే జీవించటాన్ని మొదలుపెట్టినట్లుంటుంది
నా పదాలు కొత్త అర్థాలలోకి మేలుకొంటాయి
ఒక చిరునవ్వు గాలిలో గిరికీలు కొట్టి వచ్చి నా భుజం మీద వాలుతుంది

జీవితమంటే ఇదీ అని ఇప్పటికింకా నిర్వచించుకోలేకపోయాను కానీ
నాముందు మసలే ప్రతి కొత్తమనిషీ దాని రహస్యమేదో చెప్పబోతున్నట్లనిపిస్తుంది

అయినా ఒక విషాదం సాయంత్రపు నీడలాగా నన్ను వెంటాడుతూ ఉంటుంది
ఒక్కొక్క కొత్తమనిషీ చూస్తూ ఉండగానే ఒక ప్రాచీన జ్ఞాపకంలా మారిపోతాడు
అతనిపై నాకై నేను పరిచిన సంతోషపు వెలుతురు పరదా జారిపోయాక
అతనొక చీకటిలో తడుస్తున్న దేవాలయం లా కనిపిస్తాడు

ఊరి నుండి ఊరికి తిరుగుతున్న విశ్రాంతిలేని బాటసారిలా
మనిషి నుండి మనిషికి ప్రయాణిస్తూనే ఉంటాను

బహుశా నేను కూడా ప్రతి మనిషిలోనూ
కొంత వెలుతురునీ, కొంత చీకటినీ ప్రవేశపెట్టి వెళతాననుకొంటా
నేను వెళుతున్నపుడు నా వెనుక ఏవో ప్రపంచాలని మోసుకొంటూ
కొన్ని చూపులు సీతాకోకల్లా అనుసరిస్తున్న చప్పుడేదో వినిపిస్తూ ఉంటుంది

బహుశా, చరమాంకంలో ఒకమనిషి వస్తాడు
జీవితమంటే ఏమిటి అని నేను అడిగినప్పుడు
అతను ఒక అద్దం తెచ్చి నాముందు ఉంచుతాడు
దానిలో నేను జీవితమంతా దర్శించిన వేలమంది మానవులు
దయగా నన్నుచూసి నవ్వుతారు

అప్పుడు
వారినవ్వులతో చెమ్మగిలిన శబ్దమొకటి
తాను వచ్చిన దారిని కనుకొని నిశ్శబ్దంలోకి మరలిపోతుంది


____________________________
నవ్య వీక్లీ ప్రచురణ: 26 సెప్టెంబరు 12

7 కామెంట్‌లు:

  1. తరచి చూస్తే కొత్త మనిషి మనలో మనకు కనిపిస్తాడు.
    ముందున్న అద్దం లాంటి లోకం నుంచి మనలో కి తొంగి చూస్తాడు..
    మనం చేయని పని, చేస్తే బాగుండుననుకున్న వాటిని ఎవరైనా చేస్తే
    మనచేత బాగుంది అనిపిస్తాడు.
    అర చేతిలో నిమిడే కలం నుంచో, కీ బోర్డ్ పై ఆడే వేళ్ళ నుంచో కాగితాల మధ్య నుంచో
    జీవిత పరమార్థాన్ని చవిచూపిస్తాడు.

    ఒక్కొక్క కొత్తమనిషి చాల చక్కనివాడు.:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సతీష్‌జీ.. కవిత్వం లోపలి కవిత్వాన్ని దర్శింపచేసారు.. :) ధన్యవాదాలు..

      తొలగించండి
  2. బహుశా నేను కూడా ప్రతి మనిషిలోనూ
    కొంత వెలుతురునీ, కొంత చీకటినీ ప్రవేశపెట్టి వెళతాననుకొంటా,
    వారు నాలో ప్రవేశపెట్టినట్లు, చక్కగా రాశారండి.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. ధన్యవాదాలు.. హైదరాబాద్ పాలపిట్ట బుక్స్ లో, నవోదయలో నా కొత్త సంపుటి ఆకాశం దొరుకుతుంది.
      కినిగే వెబ్ సైట్ వారు కూడా పంపిస్తారు..
      ఈ లింక్ చూడండి: http://kinige.com/kbook.php?id=571&name=Aakaasam

      తొలగించండి