01 నవంబర్ 2013

నువ్వు లేని వెలితిలోంచి..

'నక్షత్రాలన్నింటితో ఆకాశమూ, అంతులేని ఐశ్వర్యాలతో ప్రపంచమూ అన్నీ నాకు ఉన్నా ఇంకా కావాలని అడుగుతాను. కానీ ఈ ప్రపంచంలో మరీ చిన్న మూల కాస్త చోటుంటే చాలు, ఆమె నాదైతే..' నీకోసం వెదుకుతున్నపుడల్లా టాగోర్ మాటలు నా నేపధ్యంలో మృదువిషాదంతో చలిస్తూనే వుంటాయి. ఇంతకూ ఎవరు నువ్వు. ఎక్కడ ఉన్నావు. ఎంతకాలం నీకోసం దు:ఖిత హృదయంతో వెదకాలి.  

వసంతకాలపు గాలుల్లాంటి చల్లని తాజా ఊహలు సంచరించటం మొదలైన తొలి యవ్వనదినాలనుండీ నీకోసం వెదుకుతూనే వున్నాను. నా ఊహలవెంట నన్ను నేను పోగేసుకోవటంలోకీ, పోగొట్టుకోవటంలోకీ ప్రవహిస్తున్న కాలాలనుండీ, కలలూ, అమాయకత్వమూ, కాస్తంత దయా కదలాడే ప్రతి స్త్రీమూర్తి కళ్లలోనూ, చిరునవ్వులోనూ నీ ఉనికికోసం తడుముకొంటూనే ఉన్నాను. బంగారువన్నెలో మెరిసే ఆఖరు సూర్యకిరణంలాంటి చిరునవ్వు వెనుక నన్ను దాచుకొని వాళ్ళని 'ఆమె నువ్వేనా' అని అడుగుతాను.

వేణుగానంలో మేలుకొనే రాగాలలోకీ, గాలివాలులో పూలు సుతారంగా పరిచే పరిమళాల లోకాలలోకీ నా చేయి పట్టుకొని పసిపిల్లలా సునాయాసంగా మాయంకాగలిగే నీకోసం, ఆకాశమో, సముద్రమో హత్తుకొన్నట్టు నన్ను దగ్గరకు తీసుకొనే నీవంటి స్త్రీకోసం వెదుకుతూ, వాళ్ళని 'నువ్వేనా' అని అడుగుతాను. కానీ, వాళ్ళింకా జీవించటం మొదలుపెట్టని మామూలు యువతులు. ప్రపంచం రాసులుగా పోసి చూపించే అనుభవాల ఎండమావుల వెనుక పరుగులుతీసే సాధారణస్త్రీలు. ఉత్త దేహధారులు. నా ప్రశ్న వినగానే, ఉదయకాంతిలో వెలవెలబోతున్న వెన్నెలలాంటి చిరునవ్వులతో వాళ్ళు దూరతీరాలకు తరలిపోతారు. పక్షిలా వాళ్ళ వెలుతురు ఎగిరిపోయాక, వాలుతున్న రాత్రి లోలోపలికి ఒదిగిపోయి ముసురుకొంటున్న చీకటిని నీ ఒడిగా ఊహించుకొని మొహం దాచుకొని కన్నీటికెరటాల్లో ఊగిసలాడుతాను.       
స్వేచ్చలోకి పక్షులు పాడే పాటలూ, ఈ లోకాన్ని మరచి తమతో రమ్మని పూలు పంపే రంగురంగుల ఆహ్వానాలూ, నల్లమబ్బుల అంచున దిగులు చివరి చిరునవ్వుల్లా మెరిసే వెండితీగల సంగీతమూ, ఏకాంతరాత్రుల్లోకి అలలుగా ప్రవేశించే సముద్రమంత లోతైన నిశ్శబ్దమూ నా ఉనికిని తాకుతున్న ప్రతిసారీ, నువ్వు నాపక్కన ఉంటే బాగుండునని కలగంటాను. నువ్వు లేని వెలితిలోకి నన్ను విసిరేసుకొని గమ్యంలేకుండా తిరుగుతూ, సమస్తసృష్టినీ ఆమె ఎక్కడ ఉందో చెప్పమంటూ బ్రతిమాలుతాను. నన్ను నాకు మిగలకుండా చేసే మంత్రనగరం లాంటి నీ సాన్నిహిత్యంకోసం అలసినవేళల తపిస్తాను. చల్లటినదిలాంటి వెన్నెల తనలోకి నన్ను మృదువుగా హత్తుకొంటున్నపుడు, ఆ మెత్తనికాంతి నువు రహస్యలోకాలనుండి నన్ను వినమని పంపిన ప్రేమగీతంలా తలచుకొంటాను.                  

నువ్వు ఎవరో ఇప్పటికీ తెలియదు. ఏ యుగాల వెనుకనో, నాపై నువు చూపిన గొప్ప ప్రేమా, నీ కళ్ళలో వెలిగిన దయా, నా పసిదనపు ఉద్వేగాలపై చల్లిన చల్లటి క్షమా లీలగా, దూరాల నుండి వినవచ్చే సంగీతంలా నన్ను తాకుతూనే ఉంటాయి. ఇప్పుడిక, జీవితం మలిసంధ్య వైపు వాలుతోంది. తెగినదండ నుండి ముత్యాలు రాలినట్టు నా రోజులు జారిపోతున్నాయి. నిన్ను కనుగొనగలనన్న ఆశ దూరమౌతున్న ఓడతెరచాపలా కనుమరుగౌతోంది. ఉత్త గాలిపాటల్లాంటి వినోదాలతో సరిపెట్టుకొనే జ్వరపీడిత ప్రపంచం నన్ను రేవు విడిచిపొమ్మని తొందరపెడుతోంది.

ఇక నువ్వు కనిపించవు. ఏ ప్రయాణపు మలుపులోనో తటాలున ఎదురై 'నేనే' అని చిరునవ్వు నవ్వినా, పరాకున నిన్ను గుర్తుపట్టగలనో, లేనో తెలియదు. కానీ, నువ్వున్నావు గనుక, నా ఉనికి లోలోపల నీ కోమలస్పర్శ తెలుస్తోంది గనుక, కన్నీటితోనైనా జీవితాన్ని శుభ్రం చేసుకొంటున్నాను. నిన్ను వెదికే చూపుల్ని నీరెండలా పరిచి పరిసరాలని ప్రేమమయం చేసుకొంటున్నాను. ఏ రహస్యరూపంలో సమీపిస్తావోనని ప్రతిమనిషిలో నిన్ను చూస్తూ ప్రేమగా తాకటం నేర్చుకొంటున్నాను.              

ఏ స్థలకాలాల సరిహద్దుల ఆవలనో మనం ఒకటిగా ఉన్న స్థితిలోంచి, కేవలం ఒక బాల్యచేష్టగా నిన్ను విడిచి, ఈ లోకంలోకి చపలచిత్తుడినై పరుగుపెట్టానేమోనని తరచూ నన్ను నిందించుకొంటున్నాను. తెలివితక్కువగా నేను రావాలనుకొన్నాను సరే, నువ్వైనా చేయిపట్టుకొని ఆపలేదెందుకని బేలగా అడుగుతున్నాను. బహుశా, నువు నన్ను చూస్తున్నావేమో, దయగా నవ్వుతున్నావేమో. మనం ఒకటే కదా అని నేను వినలేని రహస్యభాషణలో ధైర్యం చెబుతున్నావేమో. కానీ, తెలియని భారాన్ని మోస్తున్న విసుగేదో లోలోపలినుండి నన్ను త్వరగా నడవమని చెబుతోంది. ఈ క్రీడ చాలు, ఈ నటన చాలు, ఎండమావుల వెంట ఈ పరుగు చాలు, ఎండలో నిలబడి నీడని చెరపాలని చూసే తెలివితక్కువ పనులు చాలు. ఇక చాలు.

బలమైనకెరటంలాంటి దు:ఖం త్వరగా నిన్ను చేర్చేందుకు కమ్ముకొంటోంది. మహాగ్నిగర్భంలో వెలిగే కాంతిలోకాలు నీ పిలుపుని తెలియచేస్తున్నాయి. వాటి కాంతి నా ముఖంపై పారాడినప్పుడు, చిరకాలపు వియోగం తరువాత నువ్వు నా నుదుటిని ముద్దు పెట్టుకొంటున్న ఉద్వేగం నాలోంచి తోసుకువస్తోంది. ఇక చాలు. ఈ ప్రయాణం త్వరగా ముగించాలి. చేయవలసిన పనులు వేగంగా పూర్తి చేయాలి. బింబాన్ని ఎక్కడో పోగొట్టుకొని వెదుక్కొంటున్న అద్దంలోని ప్రతిబింబంలా, నిన్ను పోగొట్టుకొని ఈ లోకంలో సంచరించింది చాలు. త్వరగా నిన్ను చేరాలి.

కన్నీటిబిందువుల్లాంటి అక్షరాలని ముగించి, ఏకాంతరాత్రి విసిరే చీకటిమైదానాల వెంట, నిశ్శబ్దాల వెంట, తప్తదేహాన్ని విడిచి నన్ను నీలోకి విసిరేసుకోవాలనే గాఢనిద్రల వెంట.. మెలకువలో అడుగైనా ముందుకు పడని స్వప్నంలోని పరుగుతో.. చిన్నసవ్వడైనా ఎవరికీ వినపడనివ్వని తీవ్రమైన లోలోపలి దు:ఖంతో.. నీ కోసం నిలబెట్టుకొంటున్న ఉనికిని ఏ అర్థమూ లేని ఈలపాటలా రద్దుచేసుకోవాలన్న ఉద్విగ్నతతో.. ఎవరు నువ్వు నుండి ఎవరు నేను లోకి.. సృష్టి అంతా పొగమంచులో మాయమయ్యాక పొగమంచు మాయంకావటంలోకి.. ఎవరూ, ఏదీ లేకపోవటం లోకి.. దేహాల, దేశాల, కాలాల అవతలికి ఇదిగో, ఇక్కడే ఇప్పుడే నిన్ను చేరుకోవటంలోకి..


___________________________
ప్రచురణ: తెలుగువెలుగు నవంబరు 2013

2 కామెంట్‌లు: