27 అక్టోబర్ 2013

నిద్రరాని రాత్రి

1
నిద్రరాని రాత్రి, గది తలుపులు తెరిచి 
చలితో నింపిన గాలిబుడగ వంటి ఆరుబయట నిలబడ్డాను
చుట్టూ చల్లదనం జీవితం తాకినట్టు తాకి వెళుతోంది
తల ఎత్తి చూస్తే చీకటిపుష్పం వెల్తురు పుప్పొడి రాల్చుతోంది 
నాకూ, లోలోపలి కాంక్షల్లా మెరిసే నక్షత్రాలకీ మధ్య సముద్రంలా పొంగుతోంది నిశ్శబ్దం   
ఆకాశమూ, నేనూ దూరమైన తల్లీబిడ్డల్లా ఒకరినొకరం చూసుకొన్నాము 

2
నాలో దాచుకొన్న వజ్రాల్లా మెరిసే ప్రశ్నలని 
మళ్ళీ బయటకు తీసి చూసుకొన్నాను 
సృష్టి అంటే ఏమిటి, నేను అంటే ఏమిటి
జీవితమంటే ఏమిటి, మృత్యువంటే ఏమిటి 
   
జవాబు ఉందా వాటికి, నిజంగా అవసరమా 
ప్రశ్నల తరువాత నాలో మేలుకొనే నిశ్శబ్దమే జవాబా 
నిశ్శబ్దం నాలో ఉందా, నిశ్శబ్దంలో నేనున్నానా   

3
చలికి ఒణికిన గాలితెర ఒకటి మళ్ళీ జీవితం తాకినట్టు తాకివెళ్ళింది
అద్దంలాంటి ఆకాశంలోకి ప్రశ్నలన్నీ పక్షుల్లాగా ఎగిరిపోయాయి 

ఈ రాత్రి ఎంత బావుంది
ఈ చల్లదనమూ, ఆకాశమూ ఎంత బావున్నాయి 
నక్షత్రాలూ, వాటి నడుమ ప్రవహించే నల్లనినదీ ఎంత బాగున్నాయి  
వీటన్నిటినీ చూడటమెంత బాగుంది 
చూడటమనే అనుభవాన్ని పంచుతోన్న జీవితమెంత బాగుంది

4
నిదురిస్తే మళ్ళీ మేలుకొంటానా, మరణిస్తే మళ్ళీ పుడతానా  
ఇపుడే చూడగలిగినంత చూసుకోవాలి
నా మెలకువ నీటిబుడగని చాతనైనంత నింపుకోవాలి 
ఈ విశాలమైన ఆకాశంతో, నక్షత్రాలతో, చలిగాలులతో 
అన్నిటి వెనుకనుండీ దాగుడుమూతలు ఆడుతోన్న పసిపాపలాంటి జీవితంతో


______________________________

ప్రచురణ:
ఆదివారం ఆంధ్రజ్యోతి 27.10.2013

4 కామెంట్‌లు:

  1. దాదాపు మూడు నెలల తరువాతా...చాలా చాలా బాగుందండీ..!
    మీ కవిత్వం గురించి నిన్న ఒక స్నేహితురాలితో మాట్లాడుతూ అన్నాను, "ఆయన కవిత్వంలో, మాటల్లో...ఇంకెక్కడా చూడని, వినని ఓ ప్రత్యేకమైన లక్షణమేదో ఉంటుందీ..అదేంటో మొదట్లో అర్థం అయ్యేది కాదు కానీ చదువుతూ, మాట్లాడుతూ ఉండగా అర్థమయింది" అని.

    "ఆకాశమూ నేనూ దూరమైన తల్లీ బిడ్డల్లా ఒకరినొకరం చూసుకుంటూ ఉంటాము" - What a thought !
    I might just fail to put it in words but I want you to know that I love reading everything that you write. Be it poetry, essay or just any random thought.
    Thank you very much.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ ప్రత్యేకత ప్రసాద్ ది కాదేమో.. వారివారి లోతుల్లో అందరిలో ఆ ప్రత్యేకత ఉంటుందేమో.. దానినే అతను పునః పరిచయం చేసే ప్రయత్నమేదో చేస్తున్నట్టున్నాడు కవి. :) ధన్యవాదాలు మానసా.. మీ స్పందన ఎప్పటిలాగే ప్రత్యేకం. :)

      తొలగించండి
    2. నక్షత్రాలూ, వాటి నడుమ ప్రవహించే నల్లనినదీ ఎంత బాగున్నాయి
      వీటన్నిటినీ చూడటమెంత బాగుంది .
      చూడటమనే అనుభవాన్ని పంచుతోన్న జీవితమెంత బాగుంది.

      andamaina nee kavithvam entho fresh gaa baagunddi.

      తొలగించండి
    3. ధన్యవాదాలు వెంకటరావు గారూ..

      తొలగించండి