25 సెప్టెంబర్ 2014

అదేంకాదు కానీ..

అదేంకాదు కానీ, కొంచెం నిర్లక్ష్యంగా బతికి చూడాలి

దిగంబరా లేచిరా అంటే దిగ్గున నిలబడ్డ బైరాగిలా
ఆకాశం తప్ప మరేమీ అక్కర్లేని అవధూతలా
గాలిపడవ తెరచాపై ఎగిరే ఎండుటాకులా నిర్మోహంగా నిలవాలి  

దేనిలోంచీ దేనిలోకీ నాటుకోని
అలలమీది ఆకాశబింబాల్లా కాస్త తేలికగా చలించాలి  

ఏముందిక్కడ మరీ అంత బాధపెట్టేది
మరీ అంత లోతుగా ఆలోచించవలసింది

మర్యాదలన్నీ గాలికొదిలేసి చూడాలి
భుజమ్మీద వ్రేలాడే బాణాల్నీ, లక్ష్యాల్నీ  
కాసేపు మరపు మైదానంలో వదిలేసి రావాలి

వేటినీ మోసేందుకు మనం రాలేదనీ
జీవనమహాకావ్యం మననే ఓ కలలా మోస్తోందనీ
నీటిబుడగ చిట్లినట్లు చటుక్కున స్ఫురించాలి

అదేంకాదు కానీ, జీవితాన్ని జీవితంలా ప్రేమిస్తూ బతకాలి
అవమానాలూ, ఆందోళనలూ అట్లా ఓ పక్కకి విసిరేసి
లోకం నిండా నాటుకుపోయిన నాటకవిలువల్ని చూసి
జాలిజాలిగా, సరదాగా నవ్వాలి

ఏముందిక్కడ మరీ అంత పొంది తీరవలసింది
పోగొట్టుకుని గుండెచెదిరి రోదించవలసింది

దిగులు సాలెగూళ్ళన్నిటినీ
చిరునవ్వు కుంచెతో శుభ్రంచేసి
విశాలమైన ఆకాశాన్ని చిత్రించి చూడాలి

చూడాలి మనం చిత్రించిన ఆకాశం నిండా
ధగధగలాడుతోన్న ఎండ సంరంభం
వానబృందం ప్రదర్శించే సంగీతనృత్యరూపకం
చలిరాత్రుల వికసించే గోర్వెచ్చని ఊహల పరీమళోత్సవం

అదేంకాదు కానీ
జీవితం లోపలి దృశ్యాలన్నీ బరువెక్కినప్పుడైనా
జీవితమే ఒక ప్రతిబింబం కావటంలోకి కనులు తెరవాలి

____________________
ప్రచురణ:  సారంగ 18.9.14

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి