30 డిసెంబర్ 2017

మరోసారి చలంగారు..

పదిహేడేళ్ళ వయసులో చలం పరిచయం. కవిత్వం ఇంకా బాగా రాయాలనుకొంటూ, మహాప్రస్థానం పుస్తకం తెరిచినపుడు ముందుమాటలో పరిచయమయ్యాడు. ఎవరీయన, ఈ వేగమేమిటి, మాటల్లో తొణికిసలాడుతున్న నిజాయితీ ఏమిటి, ఆలోచనలో నైశిత్యమేమిటి.. ఇలా అనుకోగల స్పష్టత అప్పటికి లేకపోయినా, ఇలా అనిపించే విభ్రాంతి కలిగింది.
తరువాత చాలాకాలం చలం, శ్రీశ్రీలు జోడుగుర్రాల్లా హృదయంలో దౌడుతీసారు. వారి రచనలు దొరికినవల్లా ఆతృతగా చదువుకొనేవాడిని. ఎందుకు చదువుతాం అలా. అక్కడ కనిపించే వాక్యాల్లో మన ఆత్మ ఏదో ప్రతిఫలించినపుడు అలా వెదుక్కొంటాం మాటలకి.
ముప్పై ఏళ్ళు పైగా గడిచింది. ఇపుడు శ్రీశ్రీ పై ఏమీ ఆసక్తిలేదు, చలం కూడా. ఆ మధ్య మ్యూజింగ్స్ తెరిచి చదవబోతే, పేలవంగా తోచింది. ఇలా అంటే చలం మతస్తులకి కోపం రావచ్చు, చలం ఉంటే మాత్రం తప్పక సంతోషిస్తాడు. ఏ భావజాలమైనా రిజిడ్ గా మారటం నుండే మతం లేదా ఫాసిజం పుట్టుకొస్తుంది. జీవితం ప్రవాహ సదృశం. దాని వేగాన్ని, ఇప్పటికైతే, మనిషి అందుకోలేదనే నాకనిపిస్తుంది. చలం వల్ల నాకు కలిగిన ప్రయోజనాలన్నిటినీ ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం పట్ల నాదైన మెలకువ తెచ్చుకోగల ధైర్యాన్ని పొందానని చెప్పాలి.
వివరంగా చెప్పాలంటే ఒక్క చలం లో అనేక చలాలున్నారు. వాళ్ళు ఇవాల్టి హిపోక్రాట్స్ లో ఉండే బహుముఖాల మనుషులుకాదు. తనలోని బహుముఖాల్తో విశ్రాంతి లేకుండా పోరాడిన చలం, చలంలోని ముఖ్యమైన చలం. తనలోని అసత్యానికీ, సత్యానికీ, సౌందర్యానికీ, వికారానికీ, మంచికీ, చెడుకీ మధ్య జీవితమంతా ఘర్షణ పడ్డాడు. ఎంత బాధ కలగనీ బయటివాళ్ళవల్లా, తనవల్లా తనకి. విలువలనే గెలిపించుకోవాలని తపన పడ్డాడు. విలువలంటే మంచీ, సౌందర్యమూ, సత్యమూ. ఆ ఘర్షణలోంచి దొరిలిన ముత్యాలే చలం మాటలు, చాలా సందర్భాల్లో. చాలా సందర్భాల్లో తానేమి రాయనక్కర్లేదో అవికూడా రాసాడాయన. కీర్తిలో సింహభాగం ఆయనకి వాటివల్లే దక్కింది.
ఇక, నాకు నచ్చిన చలాలు ముగ్గురు. 1. మ్యూజింగ్స్ చలం (తక్కిన వ్యాసాల పుస్తకాలు ప్రేమలేఖలు, స్త్రీ, బిడ్డలశిక్షణ కూడా) ఈయనను ముఖ్యంగా మేథావి చలం అనవచ్చు. 2. గీతాంజలి చలం (టాగోర్ తో పాటు ఉమర్ఖయ్యాం అనువాదాలు కూడా) ఈయన కవి చలం. 3. అరుణాచల చలం (భగవాన్ స్మృతులు, వెలుగురవ్వలు మొదలు అరుణాచలం నుండి రాసిన రచనలు) ఈయన అన్వేషకుడు చలం. ఈ ముగ్గురు చలాలూ ఆయా తరుణాల్లో వరుసగా నాకు పరిచయమై నాకిక వేరే తోచకుండా చేసారు. ఇక వివరంగా రాయాలనిపించట్లేదు.. చాలేమో.
చలమే లేకపోతే.. అనిపిస్తుంది ఒక్కోసారి. అరుణాచలంలో చలం సమాధి ముందు నిలుచున్నపుడు ఆగకుండా ఒకటే కన్నీరు. ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి