22 మార్చి 2021

కవిత : తెలుసా


నీ భుజం మీది నుండి ఎగురుతూ వెళ్లిన సీతాకోక
ఎక్కడికి వెళుతోందో తెలుసా
నీలో దాని జ్ఞాపకం ఎగురుతోన్న ఈ క్షణంలో
అది యే పూల చుట్టూ తిరుగుతుందో ఊహించగలవా

నువు గదిలోకి వచ్చాక
బయట మొక్కలకుండీపై వాలిన ఎండ
ఆకులతో ఇంకా ఎంతసేపు సంభాషిస్తుందో తెలుసా
ఎండ సీతాకోకలా ఎగిరిపోయాక​, ​ఆకుల కింది నీడల్లో 
యే కానరాని లోకాలు తెరుచుకుంటాయో ఊహించగలవా

నీ కళ్ళముందు బడిపిల్లల్లా కుదురుగా
ఆకాశంలో కూర్చున్న నక్షత్రాలు
కనురెప్పలు మూసిన క్షణంలో
ఎంత అల్లరి చేసి వుంటాయో
గబగబా చెదిరి, మళ్లీ కుదురులోకి వచ్చి ఉంటాయో
తెలుసుకోగలవా, పోనీ, ఊహించగలవా

ఈ లోకంలోకి రాకముందు
కాలం నిన్ను తెరిచింది ఏ యుగంలోనో తెలుసుకోగలవా
దీనినుండి వెళ్ళిపోయాక
ఆకాశం నిన్ను దాచేది ఏ తలంలోనో​ ఊహించగలవా

అనంతమైన కొలతలతో
అలల్లా ఎగసిపడే సృష్టి ఇది
దీనిలోకి వెలుతురు పుట్టినట్టు పుట్టి
చీకటి పుట్టినట్టు వెళ్లిపోతావు
లేదా, నీలో ఇది చీకటి పుట్టినట్టు పుట్టి
వెలుతురు పుట్టినట్టు వెళ్ళిపోతుంది

వెలుగునీడల మసకచీకట్ల మాయాజాలంలో
నిజంగా ఉన్నదేమిటో, నిజంగా లేనిదేమిటో
నిజం కాకున్నా ఉండీ, లేనట్లున్నదేమిటో
ఎప్పటికైనా తెలుసుకోగలవా, ఊహించగలవా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి