19 మార్చి 2021

కవిత : ఉత్సాహానికి దూరంగా..

ఉన్నట్లుండి నీ ఉత్సాహం జారిపోతుంది
పూలలోని రంగులు జారిపోయినట్టు
ఇంద్రధనువులోని కాంతి మాయమైనట్లు
మధురమైన భావనేదో మరపులోకి కృంగినట్లు

ఉన్నట్లుండి లోకం చేతులు విడిచి
ఏకాంతంలోకి వెళ్లిపోవాలనిపిస్తుంది
మెలకువలోనే నిద్రపోతున్నంత
ఖాళీగా ఉండిపోవాలనిపిస్తుంది

వాన చివరి చెమ్మగాలివంటి నిర్వేదం
మిణుగురు చుట్టూ ముసిరిన రాత్రిలాంటి నిరాశ
దేనినీ మొదలు పెట్టనీయని, ముగించనీయని
వెలిగీ వెలగని దీపం లాంటి ఒంటరితనం
నిన్ను నీ ప్రక్క లాలనగా కూర్చోబెడతాయి

నీకు నువ్వే స్నేహితుడివి, ప్రియురాలివి అప్పుడు
రేకుల మీది ఉదయపు కాంతిలా, గాలిలా
లాలనగా నిన్ను తాకబోతున్న
ప్రపంచానికి ఎడంగా జరుగుతుంటావు

బహుశా, అప్పుడు
బిడ్డ కోపగించిన తల్లిని దూరం నుండి చూస్తున్నట్టు
జీవితం దూరంగా నిలిచి నిన్ను చూస్తూ వుంటుంది.

2 కామెంట్‌లు:

  1. పూలలోని రంగులు జారిపోయినట్టు...

    మెలకువలోనే నిద్రపోతున్నంత కాళీగా ఉండిపోవాలనిపిస్తుంది

    ప్రపంచానికి ఎడంగా జరుగుతుంటావు...

    ప్రియమైన ప్రసాద్ గారూ

    ఆకాశంలో అప్పుడప్పుడు వింత సోయగాలు ఎప్పటికప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి...

    అలాగే మీ ఒక్కో కవిత ఒక్కో అనుభూతికి, సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూంటాయి..

    మీ భావ పరంపరకు నేను దాసోహం 🙏

    - గోపాలకృష్ణ ఎస్ తంగిరాల
    gopitangirala@gmail.com

    రిప్లయితొలగించండి