04 అక్టోబర్ 2021

నచ్చేలా..


జీవితం ఉక్కగా ఉంది
అందరికీ నచ్చేలా బ్రతకటంలో పడి
నాకు నచ్చేలా బ్రతకటం మర్చిపోయాను అంది
ఆ అమ్మాయి
బహుశా, అందరూ అంతే అనుకున్నావు నువ్వు

తనకి నచ్చేలా బ్రతికేవాళ్ళలో బాల్యం వుంటుంది
సరస్సు మీంచి వీచే ఉదయపు గాలీ
కొమ్మల్లోంచి వాలే బంగారు కాంతీ
వాళ్ళ కోసమే ఈ లోకంలోకి వచ్చినట్టు వుంటుంది
జీవితం వాళ్ళచుట్టూ ఉత్సవభరితమై
పసిపిల్లల్లా గంతులేస్తున్నట్టు వుంటుంది

ఆకాశాన్ని విప్పుకొన్న పక్షిలానో
అడవిని చుట్టుకొన్న జంతువులానో
రేపటి దిగుల్లేని జీవితం గడిపేవాళ్ళని చూస్తే
సమూహానికెప్పుడూ ప్రశ్నగానే ఉంటుంది

వాళ్ళని చూస్తే
కొండ అంచున నడిచేవాళ్ళని చూసినట్టూ
మృత్యువుతో దోబూచులాడే
జీవితాన్ని చూసినట్టూ వుంటుంది
కాస్త ఆకర్షణగా, మరికాస్త భయంగా
జ్వలిస్తున్న దేనినో దగ్గరగా చూస్తున్నట్టుంటుంది

చెట్టులాగా ఉన్నచోటనే ఉనికిలోనికి మునిగి
తనలోనుండే తేలుతూ ఉండేవాళ్ళని చూస్తే
వాళ్ళని అచ్చుపోసిన జీవితంలోకి ఒంపేవరకూ
మనకి ఆందోళనగానే వుంటుంది

చెట్టు ఎలా ఎదగాలో, కొమ్మలు చాపాలో
ఏయే ఋతువుల నెట్లా గానం చేయాలో
ఏయే ఎండల్లోకి నీడల వలలెట్లా విసరాలో
విత్తనంలోనే దాగి వున్నట్టు

ఎలా బ్రతకాల్సి వుందో పుట్టుకలోనే వుంది గనుక
నిన్ను నువ్వూ, వాళ్ళని వాళ్ళూ
చల్లగా బ్రతకనివ్వాలి అంతే కదా అమ్మాయీ


ప్రచురణ : ఆదివారం ఆంధ్రజ్యోతి 3.10.2021

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి