ఆమె రాయమంటుంది కొన్ని అక్షరాలు
ఎన్ని రాస్తే
సడిచేయని వెన్నెల పాదాలవుతాయి
వానచినుకు నేలపై తెరిచిన వృత్తాలవుతాయి
పోనీ, సీతాకోక ఎగిరిపోయిన ఖాళీలవుతాయి
అంటావు నువ్వు
2
పలకమంటుంది కొన్ని పదాలు
ఎన్ని పలికితే
జీవనసారంలోంచి వికసించే చిరునవ్వులవుతాయి
దుఃఖపుశిల చెమరించిన కన్నీరవుతాయి
స్పర్శలో మేలుకొనే దయాపూర్ణ లోకాలవుతాయి
అనుకొంటావు
3
ఊరికే కూర్చుందామా దగ్గరగా కాసేపు అంటుంది
ఎన్ని యుగాలు కూర్చుంటే తనివి తీరుతుంది
ఎంత సమీపిస్తే మనమధ్య వెలితి నిండుతుంది
ఏనాటి వేసవిగాడ్పు ఇక విడదీయక వెళ్ళిపోతుంది
అనిపిస్తుంది నీకు
4
ఆమె తన లోపలికి వెళుతూ
దయగా నన్ను నా లోపలికి వెళ్ళమంటుంది
పచ్చిక మైదానంపైన నక్షత్రాలు మెరుస్తున్నాయి
ఇద్దరమూ లేని ప్రశాంతి చలిగాలిలా సాంద్రమవుతోంది
ప్రచురణ : ఈమాట సెప్టెంబర్ 2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి