08 ఏప్రిల్ 2023

ఊరికే జీవితమై.. Dr LK సుధాకర్



తాత్విక చింతన తనకు తానుగా ఈ కవిని ఆలింగనం చేసుకుందా....లేక ఈయనే తాత్వికతను నేననే వెదుకులాట లో భాగంగా తన సహచర మిత్రుడి గానో మిత్రురాలిగానో మార్చేసుకుని, మనలాంటి సహజ మానవుడికి మల్లే మన మధ్య మామూలుగా తిరిగేస్తున్నాడా!!??....

మొత్తం కవిత్వమంతా నేను లోంచి పుట్టిన అన్వేషణ. ఏ ఖండిక కి ఆ ఖండిక, జీవిత వాచకం లో దాచుకున్న నె మలీక. ఇదిగో ఇన్నేళ్ళ వయసొచ్చాక....ఇల్లు సద్దుకుంటుంటే, దొరికిన చిన్నప్పటి వాచకాన్ని చాచుకున్న కాళ్ళమీద పెట్టుకుని మురిసిపోతూ చూసుకుంటున్నాడీ కవి.

'తోచిన మాటలేవో వడబోత లేకుండా మాట్లాడుతున్నాడు' అదొక అపురూపమైన కవిత్వ శకల మై మన చుట్టూ విరబూసిన శూన్యం లా పరుచుకుంటూంది.

మాట్లాడుకోవడం చేత కాక యుధ్ధాలు చేసుకునే మనుషుల గురించిన మెలకువ ఉన్నవాడు....కనుకనే ఆకాశం నుంచి ఆకాశాన్ని తీసేసినా ఆకాశమే మిగులుతుందని గుర్తు చేయగలుగుతున్నాడు. ఇదీ మళ్ళీ తనకు తానే గుర్తు చేసుకునే ఒకానొక భావన. కానీ అది విశ్వజనీన భావోద్వేగం కావడం తో నువ్వూ నేనూ సైతం పాలుపంచుకుంటాం.

మోయాల్సిన సంపదలు లేక కావచ్చు... వాళ్ళ తీరిక నిండా తేలిక దనం. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం కవిత్వపు పదును తెలుసుకోవడానికి.

గొప్ప వాక్యం ముందు మోకరిల్లే మనుషులు గా పాఠకుల్ని , వారిలోని తాత్విక ప్రపంచాన్ని తట్టి లేపే శుభ్రమైన వాక్యాల కవితా సంపుటి ఈ....ఊరికే జీవితమై....

"దూడని నాకే తల్లి"....ప్రతీక రెండు సార్లు వేర్వేరు కవితల్లో ఉండడం తప్ప....పలుకు రాళ్ళు లేని స్వచ్ఛమైన కవిత్వ పుస్తకం ఇది

'మనుషులు కాలవలో నీటిలా వెళ్లిపోతూ ఉంటారు
ఈ కవి మాత్రం ఒడ్డున నిలబడి
నీటిపైకి నీడని పరుచిన చెట్టుకి మల్లే'
తన కవిత్వ పలవరింతలతో....

జీవితాన్ని తాత్విక దర్పణం లో ఎప్పటికప్పుడు నూతనం గా దర్శిస్తూ ఉంటాడు.....రండి ...మనమూ అందులో కి తొంగి చూసుకుందాం.....మన జీవితం మనకి మళ్ళీ పరిచయం అవుతుంది.

ప్రచురించిన 'ప్రేమలేఖ'కి మరోసారి కృతజ్ఞతలు....

Dr LK Sudhakar 

ప్రచురణ : కవితా 72. ఏప్రిల్ 2023

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి